Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 34

    
    అప్పుడు టైమ్ రెండు గంటలైంది. చలికాలపు ఎండ శరీరాన్ని నులివెచ్చగా మెలితిప్పుతోంది. గాలి తన ఒంటినంతా ఆరబెట్టుకుంటున్నట్లు నిండుగా వీస్తోంది. అమ్మాయిలంతా పగలే వెన్నెల అనుకుంటూ వెళుతున్నట్లు మెల్లగా అడుగులు వేస్తున్నారు.
 
    ఊరు దాటుతుండగా ప్రవీణ తప్ప మిగిలిన అమ్మాయిలంతా చెంగమ్మ ఇంటి దగ్గర ఆగారు.

    "ఏమిటి ఇక్కడ ఆగారు?" అని అడిగింది ఆమె కళ్ళను సాగదీస్తూ.

    "రవి వస్తానన్నాడు ముగ్గుపిండికి. మనకు తోడుగా వుంటాడుగదా అని రమ్మన్నాం. లేకుంటే అందరం ఆడపిల్లలంకదా. అంతదూరం మగతోడు లేకుండా వెళ్ళగలమా?" అని చెప్పింది ఓ అమ్మాయి.

    అంతలో రవి బయటికి వచ్చాడు. పెద్ద అల్యూమినియం పాత్రను ఎత్తుకుని బయల్దేరాడు.

    అతనెవరో తెలుసుగానీ పరిశీలనగా చూడడం అదే మొదటిసారి ప్రవీణకు.

    అతనికి ఇరవై ఏళ్ళుంటాయి. గళ్ళలుంగీమీద పూలడిజైన్ వున్న చొక్కాను వేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే నలుపెక్కుతున్న మీసకట్టు.

    పెద్ద కళ్ళు, అందమైన ముక్కు, బాగా పొడవుగా వుండడంవల్ల మాన్లీగా అందంగా వున్నాడు.

    అతడ్ని ఓరకంటితో గమనిస్తోంది ఆమె.

    మగాడ్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడం ప్రవీణకు అదే మొదటి సారి. అందరూ అగ్రహారంవైపు నడవడం మొదలు పెట్టారు. ప్రవీణతప్ప మిగిలిన అమ్మాయిలంతా తమతోపాటు ఓ కుర్రాడు వస్తున్నాడన్న ధ్యాసైనా లేకుండా మాట్లాడుకుంటున్నారు. ఎంతో ఫ్రీగా మూవ్ అవుతున్నారు.

    అతను అప్పుడప్పుడూ తనని గమనిస్తున్నాడని కనిపెట్టింది ప్రవీణ. ఓ యువకుడు తనను చూస్తున్నాడో లేదోనని కనిపెట్టడం థ్రిల్లింగ్ గా వుంది మొదటిసారి శరీరం నుండి సంగీతం వినిపిస్తోంది.

    అతను అప్పుడప్పుడూ ధైర్యంచేసి తన చూపులతో పైటను గుచ్చుతున్నాడు. అలాంటప్పుడు పులకింతలాంటిది శరీరాన్ని కదుల్చుతోంది.

    ఆమెకేదో ఇబ్బందిగానూ, అదే సమయంలో థ్రిల్లింగ్ గానూ వుంది తన జీవితాన్ని పెద్ద కుదుపుకు లోనుచేసే సంఘటన జరుగుతుందని ఊహించని ప్రవీణ ప్రతిక్షణాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళతోపాటు నడుస్తోంది.

     ఊరు దాటగానే ఇసుక్కాలువ వస్తుంది. రవి ముందు దిగుతూంటే అమ్మాయిలంతా అతన్ని అనుసరిస్తున్నారు.

    "అందరూ పావళ్ళు ఎగ్గట్టుకోండి లేకపోతే తడిసిపోతాయి" అని అరిచింది కాలువలోకి ముందు దిగిన వసుందర.     అందరూ ఆమె చెప్పినట్లే చేశారు, కానీ ప్రవీణమాత్రం జంకుతోంది. మగాడి ముందు పాదాలు కనపడేటట్లు పావడను ఎలా ఎగ్గట్టడం?

    ఆమె కాలువలోకి దిగింది. చల్లటి నీళ్ళు కాళ్ళను లోపలికి గుంజుతున్నట్లనిపించింది.

    ఇదంతా గమనించిన రవి అక్కడే ఆగి, వెనక్కి రెండు అడుగులు వేసి, " అయ్యో!మీ పావడా తడిసిపోతోంది" అని ఆమెకే వినపడేటట్లు అన్నాడు.

    మిగిలిన అమ్మాయిలంతా నీళ్ళను కాళ్ళతో కొట్టుకుంటూ అవతలి గట్టుకు చేరుకున్నారు.

    "పావడా అలా ఎగదోపుకోవడం పాపం" అంది ఆమె అతనివేపు తిరిగి.

    ఆ మాటలు అతనికి వింతగా అనిపించాయి. ఆమె తల్లి దండ్రుల గురించి పూర్తిగా తెలిసినవాడవడంవల్ల పెద్దగా ఆస్చర్యపోలేదంతే.

    "పాపం అంటారేమిటండి! ఇదేదో హత్య అయినట్లు. పావడా తడిసిపోతే చలేస్తుంది. అదీగాక దుమ్మంతా అంటుకుపోయి ఇబ్బంది పడతారు. ముందు ఎగ్గట్టుకోండి" కమాండింగ్ గా అన్నాడు.

    ఇక తప్పలేదామెకు.

    కొద్దిగా పావడాను పైకి లాగి కుచ్చిళ్ళను బొడ్డుదగ్గర దోపుకుంది. నీలం రంగు నీళ్ళకు పాదాలు మరింత తెల్లగా మెరిసిపోతున్నాయి.

    "మీ పాదాలు ఎంత అందంగా వున్నాయో! జరాసంధుడిలాగా నాకూ రెండుగా చీలిపోయి మీ పాదాలకు వెండిగజ్జలైపోయి వేలాడాలనిపిస్తోంది" అన్నాడు చెవి దగ్గర రహస్యం చెబుతున్నట్లు.
 
    ఒక్కసారిగా రక్తం బుగ్గలోకి చిమ్మడంవల్ల అవి ఎరుపెక్కి తెల్లటి గులాబీలు ఠక్కున ఎర్రగులాబీలుగా మారిపోయినట్లు అయిపోయాయి.
   

 Previous Page Next Page