"పైసలెక్కడివిరా?" బేరర్ వెళ్ళిపోయాక అడిగారిద్దరు ఒక్కుమ్మడిగా.
"ఎవడితోనన్నా మనం ఫైటింగ్ చేసినా, మనకే ఉపయోగం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ హనీఫా కరాటే కిక్కివ్వడానికి వంగున్నాడా_ అప్పుడు వాడి జేబులోంచి కొట్టేసానన్నమాట..." అంటూ రెండువందల రూపాయల నోట్లు తీశాడు.
కాసేపయ్యాక ఆబగా ముగ్గురూ బిర్యానీ తింటున్న సమయంలో-
తమ వేపే వస్తున్న వ్యక్తిని చూసి పోతురాజు, సేతురాజుకి కన్నుగొట్టాడు.
ఆ వ్యక్తి సత్తిపండు.
౦ ౦ ౦
"మీ కండబలాన్ని, గుండెబలాన్నీ చూసొచ్చాను..." ఉపోద్ఘాతంగా, తనెక్కడ చూసాడో, తనకేం కావాలో చెప్పాడు సత్తిపండు.
ఆ హనీఫా ఎక్కువ డిమాండ్ చేశాడు కాబట్టి అంతకంటే తక్కువ ఎమౌంట్ కి పనైపోతుందన్న ఆశతో ఆ ముగ్గురు వెనకపడ్డాడు సత్తిపండు.
"మంత్స్ బేబీని కిడ్నాపా! కిడ్నాపులు మేమెప్పుడూ చెయ్యలేదు గదా!" గాంధీగారీ టైపులో సత్యాన్నే చెప్పబోయాడు సేతురాజు.
"నువ్వు నోర్ముయ్- సారీ సత్తిపండుగారూ- మేం అలాంటి ప్రోగ్రామ్స్ ని చాలా చేశాం. కానీ వాటిని ఇంగ్లీషులో కిడ్నాపింగులంటారని, వాడికి తెలీదులెండి. కొంచెం ఆంగ్లభాష ప్రాబ్లమ్స్__" చెప్పాడు వీర్రాజు.
"ఎంతిస్తారు?" టక్కున అడిగాడు పోతురాజు.
"అయిదు..." సీరియస్ గా చెప్పాడు సత్తిపండు.
పోతురాజు, సేతురాజు చెవిలో గుసగుసలాడాడు.
"అయిదంటే....వందలా...వేలా?"
"వేలే అయ్యుంటుంది- ఒప్పేసుకుందాం- ఈ టైమ్ లో మనకు డబ్బవసరం చాలా ఉంది." మెల్లగా అన్నాడు సేతురాజు.
ముగ్గురూ ఒకరికొకరు కన్నుగోట్టుకుని ముగ్గురూ ఏకాంగీకారాని కొచ్చాక__
"మీరు అయిదు ఇస్తారని నమ్మకం ఏవిటి?" తెలివిగా గూడచారి టైపులో ప్రశ్నించాడు పోతురాజు.
"ముందుగా యాభైవేలు ఎడ్వాన్సు ఇస్తా, మిగతా నాలుగున్నర పనైయ్యాక-"
"ఏంటేంటేంటీ- ముందు యాభై వేలు-" నోటమాట రాకుండా ఉండిపోయాడు వీర్రాజు.
అప్పటికే మిగతా ఇద్దరూ షాక్ తినేసారు.
"అంటే మీరంటున్న ఎమౌంట్ ఫైవ్ లాక్సా?!" దెయ్యం పట్టిన వాడిలా అయిపోతూ అన్నాడు సేతురాజు.
"ఏం- అలా అడుగుతున్నారు?"
"ఏంలేదు- బేరం అయిదువేల-" అని ఏదో చెప్పబోయిన సేతురాజు నోటిని చేత్తో నొక్కేసి__
"లాక్స్ బిజినెస్ టైమ్ లో జోక్స్ ఏమిట్రా? నువ్వు నోర్ముయ్ చెప్పండి, యాభై వేలు ఇప్పుడే, ఉన్నపళంగా, బేంక్ గట్రా వెళ్ళకుండానే ఇచ్చేస్తారా!" మరీ ఆశ్చర్యంగా అడిగాడు పోతురాజు.
"అవును." అంటూ సత్తిపండు నెత్తిమీద టోపీని తీసి గాల్లో ఊపాడు. ఆ సిగ్నల్ అందుకున్న కారు దగ్గరున్న భీమ్ భాయ్ చేతిలో సూట్కేసుతో వచ్చాడు.
ఆ సూట్ కేసుని తెరచి, నిగనిగలాడుతున్న కరెన్సీని చూపెట్టి మళ్ళీ క్లోజ్ చేసేసి వీర్రాజుకు అందించాడు సత్తిపండు.
"అంతా డ్రీమ్ లా ఉంది!" నోరెళ్ళబెడుతూ నెమ్మదిగా గొణిగాడు పోతురాజు.
"వాడెదురుగానే, నువ్వు ప్రతీదానికీ ఆశ్చర్యపోకూడదు- మనం ఇప్పుడు అసలు సిసలైన రౌడీలం-" గసిరాడు వీర్రాజు.
"చెప్పండి- మేం...ఇప్పుడు ఏం చెయ్యాలి?"
"నెలల పిల్లాడ్ని కిడ్నాప్ చెయ్యాలని చెప్పాను గదా."
"అవును- డబ్బును చూడగానే, ఆ విషయాన్ని మార్చేపోయాను- ఆ కిడ్నాప్ ఎప్పుడు చెయ్యాలి?" రౌడీలా నవ్వుతూ అన్నాడు పోతురాజు.
"ఎప్పుడు- ఎక్కడ, ఎలా చెయ్యాలనే విషయం నేను చెప్తాను. ఇంతకీ మీ డేన్ ఎక్కడ?" త్రిబుల్ ఫైవ్ సిగరెట వెలిగిస్తూ ప్రశ్నించాడు సత్తిపండు.
"డేన్ లేదు- డేన్ ఉంటే పోలీసులు, విజిల్స్ వేసుకుని రావడం, మేం పారిపోవడం- ఆ గొడవలేమీ లేకుండా ఉండడానికని- మాది మొబైల్ డేన్. అంటే మేమెక్కడ, ఏ రోడ్డుమీదుంటే అదే మా డేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడీ రెస్టారెంటే మా డేన్." చెప్పాడు వీర్రాజు.
"అందుకే మీరు, ఆ హనీఫాగాడ్ని చావుదెబ్బ కొట్టగలిగారు....మిమ్మల్ని నేనెక్కడ కల్సుకోవాలి?" అడిగాడు సత్తిపండు.
"పోలీస్ కంట్రోల్ రూమ్ లో!"
"పోలీస్ కంట్రోల్ రూమ్ లోనా?!" కంగారుగా అడిగాడు సత్తిపండు.
"రూమ్ లో అంటే, నిజంగా అక్కడెవరైనా కల్సుకుంటారయ్యా.. ఆ కంట్రోల్ రూమ్ చెట్టుకింద.... ప్రతిరోజూ ఈవెనింగ్ ఆరుగంటలకు అక్కడుంటాం."
"గుడ్... వారం రోజుల్లో మిమ్మల్ని నేను కలుస్తాను. సీయూ." అంటూ నెత్తిమీద టోపీ పెట్టుకుని రెస్టారెంట్ లోంచి బయటకు వెళ్ళిపోయి కారెక్కాడు సత్తిపండు.
"ఏంటండీ బాబూ- ఆ హనీఫాగాడ్ని వదిలేసి, ఈ జేబులుకొట్టే మొఖాల్ని పట్టారు?" భీంభాయ్ చిరాగ్గా అడిగాడు.
"ఒరే పిచ్చి సన్నాసీ__ మనకు పకడ్భందీగా పనిచేసేవాళ్ళు ముఖ్యం. ఆ హనీఫా గాడెంతడిగాడు? ట్వంటీ ఫైవ్ లాక్స్...ఈ ముగ్గురు ఎంతడిగారు? ఇస్తున్నాం__ఫైవ్... లాక్స్.... అంటే మనకు లాభవెంత? ఇరవై" తన తెలివితేటలకు తనే మురిసిపోతూ నవ్వాడతను.