"హు, పిల్లి కళ్ళుమూసుకు పాలు తాగుతూ ఎవరూ చూడలేదను కుంటుంది. ఎంతకాలం ఇలాంటి విషయాలు దాగుతాయనుకుంటారు. శారద నెలతప్పింది. చేసిందానికి కాక చేయవల్సింది ఆలోచించండి" గంభీరంగా అంది రాధ.
"ఎలా... ఎలా అయింది? అసంభవం.... పిల్స్ యిచ్చాను."
"అవును యిచ్చారు. అవి ఎందుకు వేసుకోవాలో మీరు చెప్పలేదు. తెలుసుకోగలిగే తెలివితేటలు ఆ అమ్మాయికిలేవు. కారణం చెప్పకుండా వేసుకోమంటే రెండుమూడు నెలలు వేసుకుని విసుగెత్తి మానేసిందా అమ్మాయి."
"మైగాడ్... వేసుకుంటున్నానని చెప్పిందే."
ఆ సిగ్గుచేటు విషయం అతనిముందు నిలబడి చర్చించడమే కంపరంగా వుంది రాధకి. అంత నిబ్బరంగా ఆ మనిషి కట్టుకున్న భార్యముందు చెపుతుంటే అతనితో మాట్లాడాలంటేనే అసహ్యం వేసింది. ఇది కేవలం అతని ఒక్కడి విషయం అయితే ఆమె పట్టించుకోకపోను. కాని శారద... ఏం తెలియని అమాయకురాలు. చూస్తూ ఎలా వూరుకోగలదు. "జరిగిందాన్ని గురించి యింక విచారణ అనవసరం. జరగబోయేది ఏమిటని అడుగుతున్నాను" రాధ రెట్టించింది.
మాధవ్ జవాబుకి తడుముకున్నాడు. "ఏముంది, డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళు."
ఆమె హేళనగా నవ్వింది. "ఎంత సుళువుగా చెప్పారు. నా భర్త ఎవరికో కడుపు చేస్తే నేను తీసుకెళ్ళి తీయించాలన్నమాట."
"నీవు కాకపోతే వాళ్ళమ్మని తీసికెళ్ళమను. చెల్లి, అక్కయ్య అనుకుంటారు కదా అందుకు అన్నాను" మొహం గంటుపెట్టుకుని అన్నాడు.
"గర్భం తీయించినంత మాత్రాన మీ బాధ్యత తీరిపోతుందా? యింక ఆ అమ్మాయి గతి ఏమిటి? ఆ అమ్మాయిని అవసరానికి వాడుకుని అలా వదిలేస్తారా?"
"అయితే ఏం చెయ్యమంటావు యింకా డబ్బిస్తాను డాక్టరు దగ్గరికి తీసికెళ్ళండి అంటున్నాను. అంతకంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు?" అసహనంగా అన్నాడు.
"ఎంత ఉదారులు? డబ్బన్నా యిస్తానంటున్నారు" వ్యంగ్యంగా అంది.
"రాధా! నీ వ్యంగ్యాలు, విసుర్లు కట్టిపెట్టు. ఇది నీకు సంబంధించని విషయం. ఆ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళవతలికి" రాధ హేళన భరించలేక కోపంగా అరిచాడు.
"నాకు సంబంధించని విషయమా యిది? నా భర్త విషయం నాకు సంబంధించనిదని నాకు తెలియదు. మీ విషయం నాకు సంబంధించక పోయినా, శారద నాతోటి స్త్రీ. నా తోబుట్టువులాంటిది. ఆమెకి అన్యాయం జరగడానికి వీలులేదు" నిష్కర్షగా అంది.
మాధవ్ కోపం మరోమెట్టు ఎక్కింది. "న్యాయం జరగాలంటే ఏం చెయ్యాలి" వ్యంగ్యంగా అన్నాడు.
"ఆమెని మీరు పెళ్ళాడాలి. మీరు చేసిన తప్పుకి పరిహారం అది."
"ఏమిటి! శారదని పెళ్ళాడాలా? ఆ పిచ్చిమొద్దుని పెళ్ళాడాలా?" ఆశ్చర్య పోయినట్లన్నాడు.
రాధ ఏహ్యంగా అతనివంక చూసింది. "హు, ఆ పిచ్చిమొద్దు దొంగ చాటుగా సుఖం అందించటానికి పనికివచ్చింది గాని పెళ్ళికి పనికిరాలేదా మిస్టర్ మాధవ్? శారదతో ఈ విధంగా ప్రవర్తించేముందే ఆలోచించవలసిన ఆలోచన అది. ఇప్పుడు టూలేట్. ఇప్పుడు శారదని పెళ్ళిచేసుకోవాలి మీరు" కఠినంగా అంది.
"మతిపోయిందా నీకు? భార్య వుండగా మరోపెళ్ళి ఎలా చెల్లుతుందను కుంటున్నావు?" వంక పెట్టాడు.
"భార్య! హు, నన్నింకా మీ భార్యగా చూస్తున్నారా! మనమధ్య ఆ బంధం ఏనాడో తెంపారు మీరు. లోకంకోసం కలిసివుంటూ, మనల్ని మనం మోసం చేసుకుంటూ, లోకాన్ని మోసం చేసుకునేకంటే ఎవరిదారి వారు చూసుకోవడం మంచిది. ఇన్నాళ్ళు మీరు నన్నెంత దూరంచేసినా, నన్ను ఎంత చీదరించుకున్నా, నన్నూ నా పిల్లవాడిని ఎంత హీనంగా చూసినా మిమ్మల్ని ప్రేమించిన నేరానికి, వివాహబంధానికి కట్టుబడి మీ దగ్గిర వున్నాను. కాని యిప్పుడు... నన్ను యింత మోసం చేసి, నా వెనక యింత నాటకం ఆడిన మిమ్మల్ని క్షమించలేను. మీరీపని చేశారని తెల్సిన క్షణంలోనే మీమీదవున్న కాస్త ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడింక మనమధ్య బంధానికింక అర్ధంలేదు. నేను ఎలాగూ నష్టపోయాను, శారదకి అన్యాయం జరగడానికి వీలులేదు. ఆమెకోసం నేను నా స్థానం వదులుకోవాలని నిర్ణయించుకున్నాను" ఆమె స్థిరంగా అంది.
"నీవు నిర్ణయించుకున్నా, ఆ స్థానంలోకి ఆ పిచ్చిదాన్ని ఆహ్వానించలేను. నీవు వెడితే నాకింక పెళ్ళేకాదనా దాన్ని పెళ్ళాడాలి? అసంభవం."
"మాధవ్! నీవిలా మాట్లాడడానికి సిగ్గుపడాలి. అమాయకురాలిని మోసంచేసి వలలో వేసుకుని పాడుచేసి యిప్పుడు పెళ్ళవగానే నీకు సరిపోలేదనడం అమానుషం.....శారదని నీవు పెళ్ళిచేసుకోకపోతే...."
"ఏం చేస్తావు?" ఆమె కంఠంలో బెదిరింపు మాధవ్ కి అవమానంగా అన్పించి సవాల్ చేశాడు.
"డైవోర్స్ కి కోర్టుకి ఎక్కుతాను" ఆమె నిశ్చలంగా అతని కళ్ళలోకి చూసింది.
మాధవ్ అదిరిపడ్డాడు. డైవోర్స్- కోర్టు... అతని శరీరం కోపంతో వణికింది. అమాయకంగా, తన మాటకి ఎదురు చెప్పని రాధ ఎంతలా బెదిరిస్తూంది? ఆమెముందు తగ్గిపోవడానికి అహం అడ్డువచ్చింది. "కోర్టుకెక్కితే నష్టపోయేది నీవే, నాకేం" బింకంగా అన్నాడు.
"నష్టపోవడానికి నాకేం మిగలలేదు మాధవ్. ఇప్పుడింక నష్టపోయేది నీవే. నేను విడాకులు కోరితే అంతా బయటకు వస్తుంది. అన్ని కారణాలు తెలుస్తాయి. నీవు శారద బిడ్డకి తండ్రివని, నా బిడ్డకి తండ్రి ఎవడో రౌడీ అని. దాంతో నీవు, మీవాళ్ళు కావాలనుకునే పరువు, ప్రతిష్టలు మంట గలుస్తాయి. నన్నన్యాయం చేసినందుకు కోర్టు నాకు నష్టపరిహారం యిమ్మంటుంది...."
"యూ... ఎంత ధైర్యం నీకు? నామీద కసి యిలా తీర్చుకుంటావా....నిన్ను... ఏం చేస్తానో... రాక్షసీ..."
"మాధవ్! ఆడదానికి మగాడినించి కావల్సింది పిసరంత ప్రేమ, రవ్వంత సానుభూతి. ఆ రెండూ పురుషుని దగ్గిర దొరకనినాడు ఆమె హృదయం కరుడు కడుతుంది. ప్రేమకి బానిస అవుతుంది కాని నిరసిస్తే రాక్షసే అవుతుంది. నేనిలా అవడానికి కారణం నీవే మాధవ్. నేను చేయని నేరానికి నన్ను శిక్షిస్తావా.