గదిలో సీలింగ్ ఫేన్ తిరుగుతుంది. మంచం మీద ఇద్దరూ తీరుబడిగా కూర్చున్నారు. సుబ్బారావు సిగరెట్టు టిన్ను శ్రీనివాసరావు ముందు పెట్టి -
"కాల్చారా !' అన్నాడు.
"నా బ్రాండు యిది కాదు. ఇది కాస్ట్లీ."
"ఫరవాలేదు లేవోయ్. తగలేట్టు! మావయ్య పని మీద ఉదయం వచ్చేనిక్కడికి . ఆఫ్ కోర్స్ - మా ఆఫీసుపనీ తోడూ తగిలించుకుని . ఆ పనులన్నీ పూర్తీ అయ్యేసరికి సాయంత్రమైంది. తిన్నాగా నీ యిల్లు. అక్కడ నీకోసం గంట కూచుని వచ్చేను. రేపుదయమే వెళ్ళిపోవాలి . ఆ....ఎల్లా వుంది జీవితం."
శ్రీనివాసరావు సిగరెట్టు ముట్టించి అన్నాడు.
"బ్రతుకుతున్నాను."
"అవునురా. నేనెన్ని ఉత్తరాలు రాసినా జవాబివ్వవు గదా. ఏమిటా తల తిక్క."
తోచక. అప్పుడప్పుడూ నేనూ రాస్తున్నానుగా."
"రాస్తున్నావ్ . ఏమిటి? నా మీద మండిపడుతూనేగా. ముగ్గురు పిల్లలా. వెరీగుడ్. నాకు యిద్దరు. ఇల్లాలి పోరు పళ్ళేక ప్లానింగ్ మొదలెట్టేను, ఇద్దరూ మగే."
"హైదరాబాద్ వదిలి యింతలో యిటు వేపు రావా సుబ్బారావ్."
"వద్దులేరా బాబూ! అక్కడే సుఖంగా వుంది. అందునా మామయ్య దగ్గిర్లో వుంటాడు. దూరమైతే వచ్చే ఇబ్బందులు చాలా వుంటాయి. మొన్న ఓ ప్రమోషన్ వచ్చింది. హైదరాబాద్ లోనే పోస్టింగు నూ. ఐ యామ్ హేపీ దేర్! అవును గానీ , నాటకలేమైనా వేస్తున్నావా?"
"మానేసి చాలాకలమయింది."
"మళ్ళా వేయాలని లేదూ."
"లేదు"
"అదేం కుదరదురా బాబూ! మొన్న ముకుందం నించి ఉత్తరం వచ్చింది. రేపు దిసంబరులో - ఓల్డ్ బోయిస్ మీటుంగట. మళ్ళా మనం 'దేవుడు ' నాటకమే వెయ్యల్ట. ఆరోజే ముకుందానికి సన్మానముంధనుకో, అది వేరే విషయం. పొతే, ఆనాటి నటులే ఈనాడునూ. శోభనాచలం ఆ కాలేజిలోనే లెక్చరర్ కదూ. అతనూ, మనం ముగ్గురమూనూ. ఆడవేషాలకేమో మదరాసు నించే ఆడవాళ్ళని తీసుకు వస్తున్నట్టు ముకుందం రాసేడు. టెక్నికల్ హంగులు కొన్ని అక్కణ్ణించే తెస్తాట్ట. ఏమిటో యిదంతా వాడి సరదా. కాదనకు.
"ఏమోరా, నా కిప్పుడు నాటకం వేయాలనిపించడం లేదు."
"ఎడిసేవులే - ఒప్పుకో. ఎన్నేళ్ళకో , తిరిగి మనమంతా కలిసి ...."
"అవునవును . ఈ చాన్స్ మళ్ళా నాకీ జన్మకి దొరకదు గూడాను."
"చాన్సేమిట్రా బాబూ! మనం ఫ్రెండ్స్ మీ. ఇవాళ కావాలనుకుంటే , మనమంతా కలిసి నాటకం వేసేయగలం. నువ్వేదో చాదస్తంలో పెరుగు తున్నావు గాని రావ్ మేమందరం నీ మనుషులమే."
"ఇంకా టైముందిగా, అలోచించి చెబుతానులే."
"వాయిదాలు వద్దు. మనం మళ్ళా మన కాలేజి ఆడిటోరియంలో కలుసుకునే పండగకి అన్యాయం చేయకురా బాబూ, బొత్తిగా సరదాలు చచ్చిపోయి బతుకుతున్నాను నేను."
"నీకు సరదాలు కరువయ్యేయంటే నేను నమ్మను."
"నిజం రా! ఏడువందల రూపాయల జీతగాడికి ఆ హోదాలో వున్న సరదాలో నిజమైన సరదాలంటే నేను ఒప్పుకోను. ఆ సరదాల్లో నటన ఎక్కువ. జీవం లేని సరదాలవి. పదిమంది కోసం ఆ సరదాలు ఏర్పాడ్డాయే తప్ప నాకొక్కడికీ సంతోషానిచ్చేవి కావు. నా సొసైటీ వేర్రా రావ్! కాని ఒరేయ్ , నీతో కలిసి కాసేపు మాటడటమే నిజమైన సరదా. ఆనాడు మనం మళ్ళా వేదిక యెక్కి నాటకం వేస్తె అదో మహత్తరమైన సరదా. నీకు నమస్కారం చేస్తాను కాదనకు.
శ్రీనివాసరావు కదిలిపోయేడు. అతను ఆనందంగా అన్నాడు.
"అయితే సరే. నేనూ మనందరి సరదా కోసం మనందరితో చేయి కలుపుతాను. ఒకే?"
"ఓ.కే?!"
పనిమనిషి లోపలికి వచ్చి ఓ విజిటింగ్ కార్డు ఇచ్చేడు. కార్డు చూచి 'రమ్మను' అన్నాడు.
బయటినించి అయన వచ్చేడు. వచ్చీ రావడంతోనే మొట్టమొదట శ్రీనివాసరావుని చూసేడు. శ్రీనివాసరావు ఆ మంచం మీద సుబ్బారావుకి అంత దగ్గిరగానూ కూచుని వుండటంతో ఆయనకు మతిపోయినంత పని అయింది.
"శ్రీనివాసరావు లేచి నించోబోయెడు గాని, సుబ్బారావు అతన్ని కూర్చోబెట్టి అన్నాడు '
"నా క్లాస్ మేట్ , నా ఫ్రెండ్, నా హార్ట్ . శ్రీనివాసరావు.!"
"వారు మా ఆఫీసులో ...." అన్నారాయన.
"మా అఫీసరీయన !" అన్నాడు శ్రీనివాసరావు బిక్కు బిక్కు మంటూ.
"అయితే నేను పరిచయం చేయడం వేస్ట్ మంచి సమయానికే వచ్చేరు నరసింహంగారూ! నేను మా వాడితో మా చిన్ననాటి సంగతులు ముచ్చటించుకుంటున్న....."
"సారీ డిస్టర్బ్ చేసేనేమో!" అన్నాడు నరసింహం.
"లేదనుకోండి, రైట్ . మంచి సమయంలో వచ్చేరు గనక, మీకూ మంచి వార్తనే చెబుతాను. మీ వ్యవహారం పండే అయింది. మామయ్య అలా అనే చెప్పమన్నారు. కొత్త సంవత్సరం ఆరంభమయ్యేవేళకి ,మీరు మీ వూరు బదిలీ మీద వెళ్ళిపోవడం ఖాయం. ప్రమోషన్ యస్. అది తరవాత కబురంపుతానన్నారు."
"థేంక్స్ అండీ."
"ఒకసారి వీలుంటే మావయ్యని కలుసుకోవడం మంచిదేమో!"
"అమ్మమ్మ. ఎంతమాట? తప్పనిసరిగా వస్తాను."
"మంచిదండి. నేను రేపు ఉదయమే వెళ్ళాలి. వెళ్ళగానే వుత్తరం రాస్తాను. ఓ.కే"
'అలాగేనండి. అయితే ....సేలవండి వస్తాను."
"ఏమీ అనుకోకండి. నే నెక్కువ సేపు మీతో గడపలేకపోయాను. ఈ తడవ వస్తే మీ యింట్లోనే భోజనం."
"తప్పకుండాను, వస్తానండి . వస్తాను రావ్ గారూ!"
శ్రీనివాసరావు చేతులు జోడించాడు.
సుబ్బారావు తల ఆడించేడు.
అయన వెళ్ళిపోయినా తరవాత మళ్ళీ తలుపులు మూసుకున్నాయి. ఈ తడవ సుబ్బారావు పనిమనిషిని హెచ్చరించాడు.
"ఇంకెవర్ని రానివ్వకు."
"సుబ్బారావుని కాసేపు ఎగాదిగా చూచి అడిగేడు శ్రీనివాసరావు.
"ఈయన మా ఆఫీసరని నీకు యింతకు ముందు తెలీదా?"
"తెలుసు"
"మరి...."
"కానీ, నాకు తెలిసినట్టుండకూడదు."
"నా గురించి ఈయనకేమైనా లోగడ చెప్పావా?"
"ఒరేయ్ . నేనంత ఫూల్ ని కాదురా! నీ విషయం ఆములాగ్రం తెలుసు నాకు లోపాయికారీ వ్యవహారమేధైనా కావలిస్తే నేనే నీకు స్వయంగా చేస్తాను గని, ఆ అదృష్టం పరాయివాడికి దక్కనిస్తానా? నా దగ్గిరే నీకు చచ్చేంత అభిమానం గదా, నరసింహం మాటలు ఎత్తుతే నన్ను బతకనిస్తావూ?"