"ఇంకో సారి ఆ అమ్మాయి దగ్గిరి నుంచి కంప్లయింట్ వొచ్చిందో జాగ్రత్త!" అని హెచ్చరించి లోపలి కెళ్ళిపోయారాయన , ఫోన్ వస్తే.
సరళ గిరుక్కున వెనక్కి తిరిగింది "థాంక్స్ చెప్పి.
పానకాలు కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి.
ఈ మధ్య కాలంలో ఎన్నడూ అతనికి కళ్ళు చెమర్చిన గుర్తు లేదు. ఎప్పుడో చిన్నతనంలో తప్ప, వెంటనే కళ్ళు తుడుచుకుని , బయటకి నడిచాడు.
"ఎక్కడికి వెళ్ళాలి? తనని తానె ప్రశ్నించుకున్నాడు . ఏమీ తోచలేదు. "ఈ విశాల ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరా?" అనుకున్నాడు ఒక్కసారి. కడుపులో నరాలు కర్రుమని చప్పుడు చేశాయి. అప్పటికి గని గుర్తు రాలేదు తను పొద్దుటి నుంచి ఏమీ రినలేదని. ఏదైనా తినాలనుకున్నాడు. ఎదురుగా మంచి ఉడిపి హోటలు కనిపించింది. గబగబా అటుకేసి నడిచాడు. హల్లో అన్నారెవరో వెనకనుంచి.
తిరిగి చూశాడు పానకాలు.
తన క్లాస్ మెట్ ఇంద్రసేన్ , అతని ప్రక్కనే అతని నానుకొని నుంచున్నట్టుగా నుంచుంది ఒక అందమైన అమ్మాయి!
'ఇక్కడి కెందుకొచ్చానా' అనుకుంటూ 'హల్లో' అన్నాడు మెల్లగా.
"కౌసల్య చనిపోయిందటగా?" అతడాడిగిన ప్రశ్నకు వొంటిమీద తేళ్ళు జెర్రులు పాకినట్టయింది పానకలుకి. 'ఎప్పుడో పొతే , ఇప్పుడేమిటి పరామర్శా?" అనుకుంటూనే "అవును, చాలా కాలమైంది" అన్నాడు మెల్లగా.
"పాపం! కౌసల్య చాలా మంచిది. బ్యూటీ ఫుల్ గర్ల్!" అని "మళ్ళీ పెళ్ళి చేసుకున్నావటగా?" అడిగాడు ఇంద్రసేన్.
పానకాలు కళ్ళు కోపంతో నెత్తురు కక్కాయి. గుడ్లు పెద్దవి చేసి మింగేసేలా చూశాడు అతణ్ణి.
"బైదిబై.......మీట్ మై వైఫ్ అలంకృత...ఇతడు నా క్లాస్ మేట్ పానకాలు" అన్నాడు ఒకరి నొకరికి పరిచయం చేస్తూ. పానకలుని చూస్తే అలంకృతకి నమస్కరించాలని గానీ, మాట్లాడించాలని గానీ అనిపించలేదు. పైగా అనవసరంగా అక్కడ నుంచొని ఇంద్రసేన్ అతడితో మాట్టాడ్డం చిరాకు పుట్టించింది. ముక్తసరిగా 'ఓ' అంది చిరునవ్వుతో. ఆమె అలంకృత అయినా, అప్సరసయినా ఒక 'స్రీ' అనుకోగానే పానకాలు కోపం మరీ ఎక్కువైంది. పైగా ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అందంలోనూ, ఆకర్షణలోనూ కనబడడం పానకాలు భరించలేకపోయాడు. కచ్చతో వాళ్ళ కేసి చూసి కాండ్రించి పక్కన ఉమ్మేశాడు. వాళ్ళు చూస్తుండగానే! వాళ్ళు చూస్తున్నారని తృప్తి పొంది, ఆ హోటల్ కి వెళ్ళడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనకు తెలీకుండానే తన కాళ్ళు మిర్చీ బజ్జీల బండి దగ్గర ఆగాయి. జేబులోంచి పది రూపాయల నోటు తీసి ఆలూ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు కొనేశాడు. బండివాడు తన సరుకంతా అంత త్వరగా అయిపోయినందుకు సంతోషంగా పొట్లాలు కట్టిచ్చి 'దండం దొరా' అనుకుంటూ బండి తోసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడే పక్కగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద కూర్చుని , ఒక్కొక్క బజ్జీ తిన్నాడు పానకాలు. కాస్త దూరం నడిచి ఒక షాపులోకి వెళ్ళి అతన్నడిగి రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగాడు. కడుపు చల్లబడ్డాక, కంటి మీదికి కునుకొచ్చింది. ఇంటికి వెళ్ళ బుద్ది కాలేదు. జగన్నాధరావు గారింటికి వెళ్ళ బుద్ది కాలేదు, అలా పబ్లిక్ గార్డెన్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పచ్చికలో పడకేశాడు.
కళ్ళు తెరచి చూసేసరికి చీకట్లు తెరలు తెరలుగా కమ్ముకుంటున్నాయి. వీధి దీపాలు కూడా వెలిగిపోతున్నాయి. ఆవలిస్తూ మెల్లగా లేచి పాంటు కంటుకున్న దుమ్ము దులుపుకున్నాడు.
"ఇప్పుడెక్కడికి వెళ్ళాలి?" ఆలోచించడం మొదలెట్టాడు . ఇంటికి వెళ్ళాలంటే భయంగా కూడా అనిపిస్తోంది. "ఝాన్సీ లక్ష్మి కౌసల్యలా పడుండడం లేదు " అనుకున్నాడు. కానీ మనసు ఓటమిని ఒప్పుకోవడం లేదు. ఝాన్సీ మీద ప్రేమ కన్నా కోపం కన్నా కసి ఎక్కువగా పెరిగిపోయింది. ఆమె నెలాగయినా ఎడిపించాలి! తన కాళ్ళ మీద పడి బతిమాలుకునేలా చెయ్యాలి! తనంత చాతకానివాడా? వేరే అమ్మాయిలతోటీ, ఆడవాళ్ళతోటీ తనకి ఏరకమైన సంబంధము లేకపోవచ్చు. కానీ తాళి కట్టిన తన సొంతం చేసుకున్న పెళ్ళాం మీద కూడా ఏ హక్కూ లేని చచ్చు పీనుగా తను? నో! నో! అలా ఎన్నటికీ కాదు. కౌసల్య తనంటే వొనికి చచ్చేదో, ఎలా అన్నింటికి ఊ..కొడుతూ చెప్పు కింద తెలులా పడుండేదో ఝాన్సీ కూడా అలాగే పడుండేలా చేసుకోవాలి. కౌసల్యకి తనని భరించే స్తోమత గల అన్నవోదినా అయినా ఉన్నారు. కానీ ఝాన్సీకో? తను తన్ని తగలేస్తే రిటైరయిన బడిపంతులు బతకలేక గుటుక్కుమంటాడు! ఇంకా పెళ్ళి కావలసిన చెల్లెలుంది. అందుకని నోరు మూసుకుని పడుంటుంది అనుకుంటూ నవ్వుకున్నాడు. ఆ ఆలోచన అతనికి అనందాన్నిచ్చింది. ప్రపంచాన్నంతా జయించినంతగా తతృప్తి పడ్డాడు. ఉషారుగా నడిచి ఇల్లు చేరుకున్నాడు.