Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 32

ఉరి!
తనకి!
నాలుక తడారిపోయింది.
శ్రీహర్షతో చెప్పెయ్యాలి. పొద్దునే, మొదటి పని అదే.
తెల్లారింది- మాములుగానే.ఆరయింది. ఏడయింది.
లావణ్య మంచం మీద నుంచి లేవలేకపోయింది. నీరసంగా- నిస్సత్తువగా అయిపొయింది వళ్ళు.
కాలింగ్ బజర్ కోసం, పోలిస్ బూట్ల చప్పుడు కోసం ఎదురుచూసింది.
ఉహు.
కాఫీ తెచ్చాడు నర్సయ్య. తాగింది. పేపర్ తెచ్చి పెట్టాడు.
హఠాత్తుగా గుర్తొచ్చినట్లు పేపరంతా తిరగేసి చూసింది. హత్యను గురించి వార్తేమి లేదు.
ఇదెలా సంభవం! అంత పెద్ద క్లబ్బులో హత్య జరిగిందంటే పెద్ద సెన్సేషనల్ గా వార్త ప్రకటిస్తారే.
పావుగంట తర్వాత రెండో పేపరు వచ్చింది. దానిలోనూ లేదు.
అంటే- హంతకుడు శవాన్ని ఎత్తుకుపోయాడన్నమాట- గుర్తులెం వదలకుండా మధ్యలో తనని మాత్రం ఇరికించాడు.
ఎందుకు?
ఇంకెందుకు? బ్లాక్ మెయిల్ చెయ్యడానికి.
వళ్ళంతా భయంతో చల్లబడిపోయింది.
కాని ఇందాకటి భయం వేరు.
అది ప్రాణ భయం. తనకి ఉరి శిక్ష పడిపోతుందనుకుంది.
ఇప్పుడీ భయం వేరు.
తనని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తాడో అని.
అంటే ఇప్పుడు తక్షణం ప్రమాదం లేదు తనకి.
నిస్సత్తువగా అలాగే పడుకుంది.
పోలీసులు రాకపోయినా పన్నెండు గంటల పోస్టులో ఒక కవరు వచ్చింది.
"లావణ్యా డార్లింగ్!
అందమైన ఆడపిల్లల హత్యలు చేసినా సొంపుగానే ఉంటుందనడానికి ఋజువు ఈ ఫొటోలే. లైటింగ్ సరిగా లేకపోయినా , అడ్జస్టుమెంటు సరిగా కుదరకపోయినా ఎంత అందంగా వచ్చాయి! అందులోనూ నీ భంగిమ మరీనూ! తామర తుడుల్లాంటి చేతుల్లో పదునైన బాకు! పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తూ- ఆశ్చర్యమెందుకు డియర్? రోసిని చంపింది నువ్వే.
నీ సన్నటి నడుమూ, ఒంగినప్పుడు చేతుల మీద నుంచి లావుగా పక్కకి పడుతున్న జడా-
ఓహ్! ఎంత అందంగా ఉన్నావు. ఎంత భయంకరంగా ఉంది శవం! ఎంత బావుంది ఫోటో!
దీన్ని బ్లో అప్ చేయించి నిలువెత్తు ఫ్రేం కట్టి ఫోటో స్టూడియోలో పెట్టించేయ్యనా? ఇంటర్ నేషనల్ ఫోటో కాంపిటిషన్ కి పంపనా? లేకపోతే నీ ప్రియుడు శ్రీహర్షకి కాపీలు తీసి పంపనా?
ఈ ఫొటోలతో లక్ష పనులు చెయ్యొచ్చు. అన్నీ ఒకదాన్ని మించి ఒకటి సరదాగా ఉంటాయి.
కానీ పాపం నా సరదా తిరితే , నీ బ్రతుకు జైలు పాలే కదా!
వద్దొద్దు. అంత పాపాత్ముడ్ని కాను నేను. మంచివాణ్ణీ.
కానీ నా మంచితనం ఖరీదు- లావణ్యా! ప్రస్తుతానికి పాతికవేలు. రేపటికల్లా రెడీగా ఉంచు. ఎలా అందజేయ్యాలో మళ్ళీ చెబుతాన    
                                                                                                            ఇట్లు
                                                                                                 ఒక ఫోటోగ్రఫి పిచ్చాడు.

కాళ్ళు బలహీనంగా అయిపోయాయి లావణ్యకి దిండులో మొహం దాచేసుకుంది.
పాతికవేలు! పాతికవేలివ్వడం తనకి కష్టం కాదు. తన సేవింగ్స్ అకౌంట్లోనే ముప్పయ్ వేలదాకా ఉంది.
కాని ఇది మొదలు. దీని కంతం ఎక్కడ?
మనిషి రక్తం రుచి మరిగిన పులి ఇంకో జంతువుని తాకడానికి ఇష్టపడదు.
బకాల్ మెయిలింగ్ లో డబ్బు సంపాదన మరిగినవాడు ఇంకో విధంగా సంపాదన గురించి ఆలోచించడు.     తనని పిండేస్తాడు.
ఎన్నాళ్ళు ఇవ్వగలదు తను?
ప్రస్తుతం జరిగిపోని తర్వాత తీరిగ్గా ఆలోచించుకోవచ్చు.
"భిజనం చెయ్యరా అమ్మా?" అన్నాడు నర్సయ్య. లావణ్య పొద్దుట్నించి పక్క వదల్లేదు.
"వద్దు కాస్త బూస్ట్ కలిపి తీసుకురా" అంది.
పదినిమిషాల్లో బూస్టు తెచ్చాడు నర్సయ్య.
తాగుతూ ఆలోచనలో పడింది.

 Previous Page Next Page