Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 32

 

    పెళ్ళి గురించి ఒక్క మాట మాట్లాడలేదు.

 

    మ్యారేజ్ గురించి అతను పాటించిన సైలెన్స్ తనకి ఎన్నో విషయాలని తేటతెల్లం చేసింది.

 

    ఉజ్వలా! నువ్వు స్వీట్ టీన్స్ లో లేవు.

 

    కనీసం టెంప్టింగ్ ట్వెంటీస్ లో కూడా లేవు నువ్వు.

 

    మేడమ్! యూ ఆర్ మిడిల్ ఏజ్ డ్ నౌ.

 

    యూ ఆర్ ధర్టి!

 

    ఏవేవి సాధిస్తే తనకి గొప్ప సంబంధాలు వస్తాయని భ్రమపడిందో , అవన్నీసాధించేసరికి పుణ్యకాలం దాటిపోయింది.

 

    ఇంకా దిగి వచ్చింది. ఎయిర్ లైన్స్ పైలేట్స్ - కంపెని ఎగ్జిక్యుటివ్స్.........

 

    తనకన్నా గొప్పవాళ్ళేమో తనని నిర్లక్ష్యం చేశారు.

 

    తనకంటే తక్కువ వాళ్ళు తన చదువుని చూసి భయపడ్డారు. ఇన్ ఫీరియారీటి కాంప్లెక్స్. ఇంత చదువులు చదివిన ఆడది ఇంటిపట్టున ఉంటుందా? మొగుడి మాట వింటుందా? అని.

 

    మిడిల్ క్లాస్ మొరాలిటీ! ఆత్మ న్యూనతా శంక వల్ల కలిగే భయాలు!

 

    ఎవరూ దొరక్కపోయేసరికి అప్పుడు తన దృష్టి ఈ శశికాంత్ మీదికి మళ్ళింది.

 

    అన్ని సాధించిన వాళ్ళని చేసుకోలేకపోతే ఏం? అన్ని సాధించగల సత్తా వున్నట్లు రుజువు చేసుకున్న ఈ శశికాంత్ ని చేసుకుంటుంది తను. తను కూడా కలిసిందంటే అతను సాధించలేనిది ఉండదు. ష్యూర్!

 

    అలా అనుకుని ఇంత దూరం వస్తే అది కుదరలేదు.

 

    శశికాంత్ ఈ టూబిట్ గర్ల్........వాట్స్ హర్ నేమ్..........సౌమ్య.......సౌమ్యని పెళ్ళి చేసుకున్నాడు.

 

    "ఏమిటా దీర్ఘాలోచన!" అన్నాడు శశికాంత్ నవ్వుతూ.

 

    ఉలికిపాటుతో ఆలోచనల్లోంచి బయటపడి చూసింది ఉజ్వల.

 

    శశికాంత్ అంటున్నాడు. "నేను బాంబే వెళుతున్నాను. అక్కడ కొన్ని బిజినెస్ డీల్స్ కుదుర్చుకోవాలి. నువ్వు కూడా నాతొ బాటు బాంబే వస్తున్నావు."

 

    అభ్యర్ధన కాదు అది! ఆర్డర్!

 

    పదునుగా అంది ఉజ్వల. "ఏమిటా ఆధారటి? నిన్న రాత్రి నీకు ఎక్కువ చనువు ఇచ్చేసి చులకనైపోయానా?"

 

    చిన్నగా నవ్వాడు శశికాంత్.

 

    "న్నో న్నో న్నో ! నిన్న గనక నువ్వు నా పక్కన లేకపోతే పిచ్చేక్కినట్లు అయిపోయేది నాకు."

 

    "ఎందుకనో?"

 

    "నిన్న నీకు చెప్పలేదు ఉజ్వలా! నిన్న మా శోభనం."

 

    నవ్వింది ఉజ్వల.

 

    "యూ ఆర్ జొకింగ్!"

 

    "నిజమే ఉజ్వలా! కానీ ముసలాయనే పోయాడు కదా! బ్లడీ ఫార్మాలిటీస్! ఇంట్లో కుదరదని హొటల్లో రూం బుక్ చేశాను. కానీ నా మిసెస్ రానంది. చాలా మూడ్ వున్నాను నిన్న. అది అర్ధం చేసుకోలేదు సౌమ్య.

 

    అతని మాటలు వింటుంటే ఏదో తెలియని జంకు కలిగింది ఉజ్వలకి.

 

    ఇతనిలో సున్నితమైన భావాలు ఏ కోశానా లేవు.

 

    ఫీలింగ్స్ లేవు ఇతనికి!

 

    ఇతనికి  ఉన్నవన్నీ ఇన్ స్టింక్గ్స్ ! జంతువులకి వున్నట్లు!

 

    జంతువులలో ప్రస్పుటంగా కనబడే లక్షణాలేమిటి?    ఇన్ స్టింక్గ్స్ ఫర్ హంగర్, ఇన్ స్టింక్గ్స్ ఫర్ ధర్డ్స్, ఇన్ స్టింక్గ్స్ ఫర్ సెక్స్, ఇన్ స్టింక్గ్స్ ఫర్ టేరిటరీ , ఇన్ స్టింక్గ్స్ ఫర్ సుప్రిమాసి-

 

    ఆకలేస్తే వేటాడి చంపి తినటం, దాహమేస్తే నీళ్ళు త్రాగడం, కామం ప్రకోపిస్తే అడ జంతువుకి చేరువ కావడం, తనకంటూ కొంత స్థలం సాధించుకోవడం కోసం తన పోరాటం, ఆధిక్యతని ప్రకటించడానికి ప్రత్యర్ధితో తలపడటం-

 

    అచ్చం జంతు స్వభావమే ఇతనిది. మంచి చెడ్డా అనే విచక్షణా , దయా దాక్షిణ్యం, ధర్మం, అధర్మం, అనే భావాలు , ఏవి లేవు ఇతనిలో. కల్తి లేని విలన్ ఇతను.యా ! దటీజ్ ద వర్డ్ ! విలన్!

 

    కానీ అతనిలో ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఏమిటంటే , తను విలన్ ని అన్న విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చెయ్యడు. దురహకాంరం వుంది అతనికి. అందుకని ఎదుటివాడు కనుక తెలివైన వాడు అయితే, శశికాంత్ కి దూరంగా వుండి అతని బారినుండి తప్పించుకోవచ్చు.

 

    కానీ,

 

    అన్ని తెలిసి ఇతనికి దగ్గరవుతోంది తను. వెన్ను జలదరించినట్లయింది వుజ్వలకి.

 

    కానీ తప్పదు. ఇతను తప్పితే మరొకడు దొరకడు తనకి, ఈ మాత్రం లెవెల్లో.

 

    హి ఈజ్ ద బెస్ట్ ఆ మాంగ్ ద వరెస్ట్!

 

    ఇతన్ని లొంగదీసుకుని , తనకి అనువుగా మార్చుకోగలననే ధైర్యం ఉంది తనకి. ఎందుకంటె ఇతనికి మొండి ధైర్యము, సాహసము, తప్ప గొప్ప తెలివితేటలు లేవు. తనకి వున్నట్టు! తనకి బ్రెయిన్స్ వున్నాయి. అది తనకి తెలుసు. టైం వుంటే ఇతన్ని తన అదుపులోకి తెచ్చుకుని ఆడిస్తుంది.

 Previous Page Next Page