Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 32


    
    సభికులని పరిశీలనగా చూసిన ప్రిన్సిపాల్ మళ్ళీ అన్నారు -
    
    "ఢిల్లీ ఫ్లయిట్ లో రావాల్సిన రామలింగంగారు బాత్ రూంలో జర్రున జారిపడి నడ్డి విరగడం వల్ల రాలేకపోయారు"
    
    ఏకధాటిగా చప్పట్లు.
    
    భూతపిల్లిగారు మళ్ళీ అన్నారు - "వరంగల్లు నుంచి రావాల్సిన తారాశశాంకగారు పనివత్తిడివల్ల......"
    
    ఆయన మాట పూర్తి కాకుండానే విపరీతంగా చప్పట్లు, ఈలలు, కేకలు, ఆనందం, ఉత్సాహం.
    
    "అలాగే రాజేశ్వర్రావుగారు....." చప్పట్లు!
    
    "విశాఖనుంచి ధనుర్భాణుడుగారు....."
    
    దారుణంగా చప్పట్లు.
    
    "అనకాపల్లి నుంచి అయితాబత్తుల అమరేశ్వరరావుగారు...."
    
    చప్పట్లు.....చప్పట్లు....చప్పట్లు.
    
    "గుడివాడనుంచి గోపీనాథంగారు....."
    
    చప్పట్లు! చప్పట్లోయ్ చప్పట్లు!
    
    ప్రిన్సిపాల్ గారు ఆగమని సైగచేసి "ఈసారి శ్రీ...." అనకముందే షామియానా కూలిపోయేటట్లు చప్పట్లు వినబడ్డాయి.
    
    ఇంకలాభం లేదని ప్రిన్సిపాల్ గారు
    
    "ప్రోగ్రాంలో నెక్స్ ట్ ఐటమ్ ఒకబ్బాయ్...... ముగ్గురమ్మాయిలూ" అని ప్రకటించేశారు - మిస్సింగు వక్తల లిస్టుని కోటుజేబులో పెట్టేసుకుంటూ.
    
    ఆయన అలా అన్న వెంటనే కర్టెన్ పడిపోయింది.
    
    అప్పటిదాకా వేదిక నలంకరించిన మనుషుల్ని హడావిడిగా తెరవెనక నుంచి తరిమేస్తున్నట్లూ, బల్లలూ, కుర్చీలూ ఎత్తి గిరాటేస్తున్నట్లూ రేఖామాత్రంగా తెలియచేస్తున్నాయి తెరమీద కదుల్తున్న నీడలు.
    
    అయిదునిమిషాల విరామం తర్వాత మళ్ళీ కర్టెన్ లేచింది.
        
    అచ్చం గ్రీకు దేవుడిలా మేకప్ చేసుకున్న జెయ్ చంద్ర దేనిమీదో నిలబడి మృదువుగా జారుతున్నట్లు స్టేజీమీదికి వచ్చాడు.
    
    వెంటనే చప్పట్లు వినబడ్డాయి.
    
    అవి యిందాక వినబడిన చప్పట్లలాంటి ఎగతాళి చప్పట్లే. అవి రైవల్ జనక్ రాజ్ గ్యాంగు వాళ్ళు కొడుతున్న చప్పట్లు.
    
    కానీ ఆ చప్పట్లు కాసినే!
    
    వాటిని వినబడనివ్వకుండా మింగేస్తూ మిగతా సభ్యులందరూ కొడుతున్న నిజం చప్పట్లు వినబడుతున్నాయి.
    
    ఎగ్జయిట్ మెంట్.....ఎగ్జయిట్ మెంట్ ఆల్ అరౌండ్.
    
    మరుక్షణంలో.....
    
    ఇంగ్లీషు, తెలుగూ, ఉర్దూ, హిందీలలో కలిసిన ఓ సంకరజాతి పాట హుషారుగా మొదలయింది.
    
    దానికితోడు ఉద్వేగంతో కూడిన మ్యూజిక్కు.
    
    అక్కడ కూర్చున్న పిల్లమూక అందరూ కూడా అడుగులు కదుపుతూ ఆ పాటలో, ఆటలో లీనమైపోయారు.
    
    జెయ్ చంద్రకి జోడీగా నిమ్మీకపూర్ కూడా వచ్చింది స్టేజి మీదికి. తాను అపర అప్సరస గెటప్ లో వుంది.
    
    మళ్ళీ ఈలలు, చప్పట్లు వినబడ్డాయి.
    
    పాట ఓ చరణం పూర్తయ్యాక ఠక్కున లైట్లు ఆర్పేశారు.
    
    ఆ చీకట్లోనే నిమ్మీకపూర్ స్టేజిమీంచి మెల్లగా వెళ్ళిపోయింది. అంటే ఆ అమ్మాయి పార్టు అంతటితో అయిపోయిందన్నమాట.
    
    తక్షణం షీలానాయర్ వచ్చేసింది స్టేజిమీదికి.
    
    పాట తాలూకూ రెండో చరణం మొదలయ్యింది.
    
    ఆ చరణం కూడా పూర్తికాగానే మళ్ళీ లైట్లు ఆరిపోయాయి.
    
    కొద్దిసెకండ్ల తర్వాత లైట్లు వెలిగాయి మళ్ళీ.
    
    అయితే ఈసారి మూడో మూర్ఖిణి రచన స్టేజి మీద కనబడలేదు. న్యాయంగా అయితే తను రావాలి ఈసారి స్టేజిమీదికి.
    
    ఏం చెయ్యాలో తోచక అలాగే నిలబడ్డాడు జెయ్. కొద్దిక్షణాలు అలాఆక్వార్డ్ గా ఫీలవుతూ అతనలా నిలబడిపోయాక....
    
    ఎవరో మెల్లిగా పిల్చారు -
    
    "రచనా....రచనా.....రచన స్టేజిమీదికి రావాలి. అర్జెంట్!
    
    అందరూ అసహనంగా అటూఇటూ చూస్తున్నారు రచన రాక కోసం.
    
    రచన రాలేదు.
    
    ఈ సారి యింకా పెద్దగా వినబడింది పిలుపు.
    
    "రచనా! యూ ఆర్ హోల్డింగ్ ఆఫ్ ద షో!"
    
    ఆ పిలుపులో అర్జెన్సీ, అసహనం.
    
    అయినా రచన రాలేదు.
    
    ఏమయింది?
    
    ఏమయింది??
    
    ఏమయింది???
    
    అందరి మనసులో అదే ఆలోచన.
    
    ఇంతలోనే మళ్ళీ ఠప్పుమని లైట్లు పోయాయి.
    
    తక్షణం అర్ధమైపోయింది జెయ్ చంద్రకి - జరగరానిది ఏదో జరిగిపోతోందని.
    
    వెంటనే స్టేజి దిగి, వెనకవైపుకి పరిగెత్తాడు అతను.
    
    చిక్కటి చీకట్లోకి అతడు పరిగెత్తగానే అతని నెత్తిన గట్టిగా ఓ దెబ్బపడింది.
    
    "రబ్బరు సైకిల్ చైన్లూ, ప్లాస్టిక్ కత్తుల్తో మమ్మల్ని భయపెట్టాలని చూస్తావట్రా?" అన్నాడు జనకరాజ్ దుస్సాసనుడిలా.
    
    "రచన ఏదీ? ఏమయింది?" అన్నాడు జెయ్ చంద్ర.
    
    "దానికివాళ శోభనం! పెళ్ళికొడుకునినేనే!" అన్నాడు దుశ్శాసన్ ఉరఫ్ జనకరాజ్.
    
    ఒక్క వుదుటున లేచి నిల్చున్నాడు జెయ్.
    
    వెంటనే అతని రెండుచేతులూ రెండు వైపులా కదిలాయి.

 Previous Page Next Page