ఆ తర్వాత జెయ్ చంద్ర తన అనుచరులకి పనులు పురమాయించడంలో మునిగిపోయాడు.
చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది.
ఆ లోగానే ఇంటికెళ్ళి, స్నానం గీనం చేసి ఫ్రెష్ గా వచ్చేశాడు అతను.
అందరూ షామియానా కింద చేరారు. చిరుచీకటి.
హాయిగా వుంది వాతావరణం. చల్లటిగాలి వీస్తోంది.
అపోజిషను గ్రూపు వాళ్ళు చచ్చినపిల్లుల్నీ, కుళ్ళిన టమాటాల్నీ టోకునతెచ్చి అల్లరి చెయ్యడానికి రెడీగా వున్నారని వేగుల వాళ్ళు వార్తలు తెచ్చారు.
కర్రలూ, కత్తులూ, కఠార్లూ ఓసారి సరిచూసుకున్నారు జెయ్ చంద్ర బృందం. వాళ్ళలో ఒకడు సైకిల్ చెయిన్ పట్టుకుని స్టయిల్ గా వూపుతున్నాడు.
దూరంనుంచి జనక్ రాజ్ గ్రూపు వీళ్ళ చర్యలని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తోంది. ఎక్కడ లొసుగు దొరికుతుందా, ఎలా దెబ్బ తీద్దామా అని చూస్తున్నారు వాళ్ళు.
భూతపిల్లిగారు స్టేజి ఎక్కారు. ఆ తర్వాత పురప్రముఖులు ఒక్కొక్కళ్ళనీ వేదికమీదికి ఆహ్వానించారు. ఆహ్వానితుల్లో విద్యాశాఖమంత్రిగారు కూడా వున్నారు. పొట్టకోస్తే అక్షరం ముక్కరాని విద్యామంత్రిగారు అసలు చదువులెలా వుండొచ్చో, చదువులెందుకో, ఏం చదువులో, ఎంతచదవాలో.....అలా చెప్పిందే గంటసేపు చెప్పి, తన అజ్ఞానాన్ని మరోసారి బాహాటంగా చాటుకున్నారు.
తర్వాత ఠక్కుమని ఇంకొకాయన అకారణంగా లేచి, మైకుని దొరకబుచ్చు కున్నాడు. ఆయనకి మైకు చూస్తే చాలు మైకం వచ్చేస్తుందట. మైకు కనబడితేచాలు, మాట్లాడేయకుండా ఉండలేట్ట.
ఇలాంటి రకాలు తరచుగా సభల్లో సాక్షాత్కరిస్తూ వుంటారు. పిలవని పేరంటానికి వచ్చిన ముత్తయిదువుల్లా సభల్లో దూరిపోయి అవాకులూ, చెవాకులూ వాగేస్తుంటారు.
ఆయనింక మొదలెట్టాడు.
వాళ్ళ ఊళ్ళో ఒక కాలవవుందట.
ఆ కాలవగట్టున తోట వుండేదట.
అందులో ఆయన కోతికొమ్మచ్చి ఆడేవాడట.
ఆయనకి చదువంటే గిట్టదట.
తాలింఖానాలో చేరాడట.
వస్తాదయ్యాడట.
ఆ తర్వాత ఆయనకి లంకపొగాకు చుట్టలు తాగడం అలవాటయ్యిందట. చిన్న వయసులోనే పెళ్ళి చేసుకున్నాడట. భార్య పోయిందట. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడట. మళ్ళీ ఆవిడా పోయిందట. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడట. ఆవిడా పోయిందట. మళ్ళీ.....
అప్పుడు భూతపిల్లిగారు భయపడుతూలేచి, ఏదో కాయితంముక్కమీద నాలుగు ముక్కలు బరబరాగీసి, మైకు పట్టుకు మాట్లాడుతున్న పెద్దమనిషికి అందించాడు.
ఆయన ఆగి, ఆ కాయితం చదువుకున్నాడు.
"ఇహ మాట్లాడ్డం మానేస్తారా?" అని కాయితం మీద రాసి వుంటుందని సభికులందరూ గ్రహించి, ఇహ ఆయన మాట్లాడ్డం మానేస్తాడని సంతోషంగా ఎదురుచూస్తున్నారు.
మైకు పట్టుకుని వున్నారాయన "ఈ చీటీ నాకు లెక్కా!" అన్నట్లు వేదాంతంగా నవ్వి, ఆ కాయితాన్ని వుండచుట్టి భూతపిల్లిగారి మీద పడేట్లు గిరవాటేసి, మళ్ళీ మాట్లాడ్డం మొదలెట్టాడు.
......మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడట. మళ్ళీ పెళ్ళాం చచ్చిపోయిందట. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడట. మళ్ళీ పెళ్ళాం చచ్చిపోయిందట. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడట. మళ్ళీ పెళ్ళాం చచ్చిపోయిందట. మళ్ళీ......
అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా ఆయన అదే అదే, పదే పదే చెప్తుంటే, ఈలోగా పిశాచపిల్లి ఏడుస్తున్నట్లు సైరన్ వినబడింది.
అందరూ తలలు తిప్పిచూశారు.
పిచ్కాసుపత్రి తాలూకు వ్యాన్ అక్కడ నిలబడి వుంది. అందులో నుంచి నలుగురు దిగి మైకు పట్టుకు వేళ్ళాడుతున్న మనిషిని మైకుతో సహా ఎత్తేసుకుని తీసుకెళ్ళి వ్యాన్ లో కుదేశారు. వ్యాన్ కదిలి వెళ్ళిపోయింది.
"ఎర్రగడ్డనుంచి తప్పించుకుపారిపోయొచ్చేశాడట" అన్నారెవరో జనాంతికంగా.
తర్వాత ఇంకొకాయన లేచి, ఖాళీ అయిన మైకు దగ్గర గబుక్కున సెటిలయిపోయి తను ఎక్కడెక్కడ వుద్యోగం చేసిందీ, ట్రాన్స్ ఫర్లు ఎన్ని వచ్చిందీ, తనకి డిఏ ఎప్పుడెప్పుడు పెరిగిందీ, వాటి తాలూకు ఆఫీసు ఆర్డర్ల నెంబర్లూ, డేట్లూ, రేట్లూ, స్థలాలూ, ఆఫీసర్ల పేర్లూ, అప్పటి ఫ్యూన్ల కుటుంబసభ్యుల వివరాలూ.....ఇంకా అలాంటివేవో అనవసరంగా అనేకం చెప్పి "అందుకని మీరందరూ బాగా చదువుకుని వృద్దిలోకి రావాలి" అని చెప్పి ముగించాడు.
అలా ఇంకొందరు మైకులు లకించుకుని మాట్లాడేసరికి రాత్రి తొమ్మిదిన్నరయి పోయింది.
కల్చరల్ ప్రోగ్రాం యింకా స్టార్టు కానేలేదు. ఆ ప్రోగ్రాం అసలు ప్రోగ్రాం ప్రకారమయితే ఆరున్నరకే స్టార్ట్ కావాలి. కాని రాత్రి తొమ్మిదిన్నర అయింది. మాట్లాడాల్సిన వాళ్ళ లిస్టు యింకా చాంతాడంత వుంది.
అప్పుడు ప్రిన్సిపాల్ భూతపిల్లిగారు మళ్ళీ లేచారు.
మైకు దగ్గరికి వచ్చి గొంతు సవరించుకున్నారు.
ఏదో సంతాపవార్తని చదువుతున్న టి.వి. న్యూస్ రీడర్లా మొహం, గొంతూ అరేంజ్ చేసుకుని, ఆ తర్వాత విషాదంగా ప్రకటించాడాయన.
"సభికులకు చాలా నిరాశ కలిగించే వార్త ఒకటి చెప్పడానికి విచారిస్తున్నానని తెలపడానికి చింతిస్తున్నానని చెప్పడానికి విచారిస్తున్నాను. ఇవాల్టి ఈ గానసభకు అలంకారంగా వుండవలసిన వసపోసిన ఓంకారేశ్వర్రావువారి రెండో భార్యకి మూడో కాన్పు కావడం వల్ల ఇవాళ్టి ఈ గానసభకు రాలేకపోతున్నారని చెప్పడానికి విచారిస్తున్నాని తెలపడానికి చింతిస్తున్నాను. శ్రీ వసపోసిన....."
ప్రిన్సిపాల్ భూతపిల్లిగారు అలా అనగానే హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. కొందరి కళ్ళలో ఆనందభాష్పాలు నిలిచాయి కూడా. వక్తల్లో కనీసం ఒక్కడు తగ్గాడని వాళ్ళకి ఆనందం.
చప్పట్లు ఆగేదాకా ఆగి, ప్రిన్సిపాల్ భూతపిల్లిగారు మళ్ళీ చెప్పారు -
"కోటపల్లి నుంచి కార్లో రావాల్సిన కోటేశ్వరరావుగారు దార్లో కారు చెడిపోవడంవల్ల రాలేక పోతున్నానని ఫోన్ చేసి చెప్పారని చెప్పడానికి విచారిస్తున్నాని తెలపడానికి చింతిస్తున్నాను."
ఈసారి మిన్ను విరిగి మీద పడేట్లు ఈలలు, కేకలు, చప్పట్లు సభికుల సంతోషం సముద్రంలా ఉప్పొంగింది.
సభికులని ఆగమన్నట్లు చెయ్యెత్తిచూపిస్తూ అన్నాడు ప్రిన్సిపాల్ భూతపిల్లిగారు.
"మెడ్రాసు నుంచి ఫ్లయిట్ లో రావాల్సిన మరో మంత్రి మహేశ్వరర్రావుగారు ప్లేన్ హైజాక్ కావడం వల్ల రాలేకపోతున్నారని చెప్పడానికి చింతిస్తున్నానని తెలపడానికి విచారిస్తున్నాను."
ఈసారి సభికుల ఆనందానికి హద్దు లేకపోయింది. ముందు వరసల్లో కూర్చున్న పెద్ద తలకాయలు కూడా రుమాళ్ళుతీసి రిలీఫ్ గా బట్టతలలని తుడుచుకున్నాయి. మూడో వరసలో కూర్చున్న ఓ కుర్రాడు సంతోషం పట్టలేక గాల్లోకి ఎగిరి మళ్ళీ కుర్చీలో ఠపీమని పడ్డాడు.