"అయితే ఏమంటావు ఇప్పుడు?" అతను కరకుగా అడిగాడు.
"నీతి నియమాలు, శీలం, పవిత్రత భర్తతో కాపురం నేను చెయ్యలేను. నేను ఏదన్నా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను. నాకు కొన్ని నియమాలు వున్నాయి. నేను నిజాయితిగా వుండడాన్ని నేను కోరతాను. ఇన్నాళ్ళు నీ వేలాంటివాడివో తెలియక నిన్ను పెళ్ళి చేసుకుని కాపురం చెయ్యడం నా వల్లగాదు."
అనుపమ ఇంత దూరం వేడ్తుందని సురేష్ అశించలేదు. తిడ్తుంది, అరుస్తుంది. కోపంతో మాటలు మానేస్తుంది. అలుగుతుంది అదంతా తెలిసి అనుకున్నాడు కాని కాపురం వదులుకుని పోయేటంత దూరం ఆలోచిస్తుందని అతను ఎదురుచూడలేదేమో ఆ మాటలకి నివ్వెరపోయాడు. లోపల్నించి చమటలు ఆరంభించాయి.
"అది....అది.....ఆ రూప....ఆ రాక్షసి.....ఆ బిచ్ నాకు చేసింది ఇంకా చాలక నన్ను కోర్టు కిడ్పించి , నా పరువు మంటగల్పినా కసితీరక, ఇలా నీకు అన్నీ కల్లబొల్లి మాటలు చెప్పి మన ఇద్దర్ని విడదీసి కసి తీర్చుకోవాలని చూస్తుంది. దాని మతాల వలలో పడిపోయి ఇలా నన్నే కాదంటావా? ఐ విల్ కిల్ దట్ బిచ్. ఏదో వంకని ఆ ముండని జైలుకి పంపిస్తాను." సురేష్ ఒళ్ళుమరిచి ఆవేశంతో వణుకుతూ అరిచాడు.
"సురేష్! మరొక్కమాట ఆమె గురించి చెడుగా మాట్లాడావంటే నేనూరుకోను.
నేనూ స్త్రీని. ఒక స్త్రీని ఇలా అమర్యాదగా, కుసంస్కారిడిగా మాట్లాడుతుంటే నేను ఎంతమాత్రం సహించను. ఐ విల్ టిచ్ యూ ఎ లెసన్" కర్కశంగా అంది అనుపమ.
"నీకేదో మందు పెట్టింది. దాని వలలో పడిపోయావు. ఇంతలా నిన్ను మార్చేసింది. అదేలాంటిదో నీకు తెలియదు. ముందు చెప్పకపోవడం తప్పే! ఇప్పుడు విను. విన్నాకే నీకే తెలుస్తుంది."
"అవసరం లేదు . అంతా ఆమె నోట విన్నాను. ఆమె చెప్పింది నిజమని నమ్మాను. అనవసరంగా కంఠశోషపడి మళ్ళి చెప్పకు. ఇంక మనం ఇద్దరం కల్సి వుండడం అసంభవం. నేను నీ నించి విడిపోతాను. కోర్టులో డైవోర్స్ కి అప్లయి చేస్తాను." స్థిర నిశ్చయంగా అంది అనుపమ.
సురేష్ మొహం తెల్లగా పాలిపోయింది.
అనుపమ వెళ్ళిపోతుంది. విడిపోవాలి. కోర్టు.....డైవోర్స్....తన పరువు ప్రతిష్ట....లోకుల హేళనలు జీవితంలో రెండోసారి పరువు నడిబజారు కేక్కబోతుంది. సురేష్ కి చెమటలు పట్టాయి. ఎంత నిలదొక్కుకుందామన్నా కాళ్ళలో వణుకు పుట్టింది.
"అయితే నీ దృష్టిలో నాకున్న విలువ యింతేనన్నమాట? ప్రేమించుకున్నాం, పెళ్ళి చేసుకున్నాం, సంసారం చేశాం. పిల్లల్ని కన్నాం ఆ వివాహ బంధానికి నివిచ్చే విలువ యింతేనన్నమాట? ఎప్పుడో జరిగినదాని కోసం దాని మాటలు నమ్మి విడిపోతాను అని బెదిరిస్తావా. హు.....నీవు ఉద్యోగస్తురాలివికదూ ఆ గర్వం? అందుకే కాదు అంత తెగింపు. నీవిలా బెదిరిస్తే నీ కాళ్ళు , దాని కాళ్ళు పట్టుకుంటాననా నీ ఉద్దేశం. వెళ్ళు వెళ్ళు సంసారం వదులుకుని లేచిపోతే నష్టపోయేది ఆడదే. నాకేం పోయేది లేదు. మగాడ్ని" అహంకారంతో అన్నాడు.
అనుపమ తిర్కస్కారంగా చూసింది. "పెళ్ళి మానుకునే రూప బతకగల్గింది. కాపురం వదులుకుని నేను బతకలేనంటావా? మాగాడ్నిన్న అహంకారంతో ఇన్నాళ్ళు మీ జులుం సాగించారు. ఇప్పుడు ఈ కష్ట నష్టాలని ఎదుర్కొనే మన స్థేర్యం ఆడవాళ్ళకి అబ్బుతుంది. నిజమే నేనూ ఉద్యోగస్తురాలీని. నీతో సరిసమానంగా సంపాదిస్తున్నాను. నా బతుకు నేను బతకగలను. అందుకే వేడ్తున్నాను ఆడదానికి ఇన్నాళ్ళు ఆర్ధిక స్వాతంత్రం లేకపోబట్టే ఆమెని గుప్పిట్లో బిగించి ఆటలాడారు. ఇప్పుడింకా మీ ఆటలు సాగవు. ఇన్ని మాటలనవసరం. రేపు ఉదయమే నేను వూరికేడుతున్నాను.
ఇంకా ఏదన్నా మాట్లాడాలని ఉంటే కోర్టులో మాట్లాడుకుందాం. గుడ్ నైట్" అనుపమ విసురుగా లోపలి గదిలోకి వెళ్ళిపోయింది.
సురేష్ స్థాణువులా నిలబడిపోయాడు. ఇదేదో హాస్యంగాదు అనుపమ సీరియస్ గా మాట్లాడింది. అని అతనికర్ధమైంది. అతనేం చెయ్యాలో తోచనట్టు నిర్జీవంగా కుర్చీలో కూలబడ్డాడు. అనుపమతో రాజీ మినహా మరో దారి లేదన్నది అతనికి అర్ధమైంది. తన హోదా, పరువు, గౌరవం, నిల్పుకోవాలంటే అనుపమని నిలుపుకోవాలి. లేదంటే మరోసారి తన బ్రతుకు నవ్వులపాలవుతుంది.
అనుపమతో 'సారీ! గతంలో జరిగింది పొరపాటే. నీతో ఎలా చెప్పగలను అంచేత చెప్పలేకపోయాను క్షమించు అనాలి. ఎలా అనడం? మగ అహం అడ్డువచ్చింది.
మరో అరగంటకి మగ అహాన్ని అవతలికి నెట్టి నిస్సయహంగా లేచి గదిలోకి వెళ్ళాడు. అనుపమ పక్కమీద కూర్చుని ఐదేళ్ళు కూతురికి ఏదో కధల పుస్తకం చూసి చెపుతోంది. అనూ! సారీ అనూ! జరిగింది మర్చిపో. ఐయామ్ రియల్లీ సారీ ఫర్ ది పాస్. చెప్పి నిన్ను వదులుకోలేక నీనించి దాచాను. ప్లీజ్ మరిచిపో. నా కోసం కాకపోయినా మన నిరూ కోసం. అందరికంటే ఎక్కువగా "నిరూ'కి మన ఇద్దరి ఆసరా కావాలి. అది నీకు తెల్సు. సారీ చెప్పానుగా, ఇంకా నన్ను శిక్షించకు" అన్నాడు మంచంమీద కూర్చుని అనుపమ వంక చూసి. ఆమె అతని కళ్ళలోకి చూసింది. "క్షమాపణ చెప్పవలసింది ముందు రూపకి. ఆ తరువాత నాకు. ముందువెళ్ళి ఆమెకి చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పండి. ఆమె మిమ్మల్ని క్షమిస్తే నేను క్షమించగలను" అనుపమ అంది.
సురేష్ మొహంలో మళ్ళి ఆవేశం ఉబికింది.
"ఇంపాసిబుల్- దానికి నేను క్షమాపణ చెప్పడమా!? నీవు నా భార్యవి నిజం దాచి నిన్ను వివాహం ఆడాను కనక నీకు సంజాయిషీ యిస్తున్నాను. దానికి నేనెందుకు చెప్పాలి. షి యిజ్ నో బడి టు మి . నాకంత అవమానం చేసిన దాన్ని ఈ జన్మలో క్షమించను. అనూ? నీ దగ్గర సారీ అనడానికి నేను సిగ్గుపడను. ఒకసారి కాదు వందసార్లు చెబుతా, కాని రూపకి మాత్రం చచ్చినా చెప్పను." అన్నాడు నిష్కర్షగా.
"అయితే సరే మీ అహం దాచుకోండి నన్ను వదులుకోండి" అంటూ మళ్ళి కూతురితో మాటలు మొదలుపెట్టింది. రెండు నిమిషాలు చూసి పొంగే ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ- నీ ఉద్దేశం ఏమిటసలు? రూప దగ్గరికి నన్ను పంపి, ఆమెకి క్షమాపణలు చెప్పించి కించపరచి, అవమానపరిస్తే, నీ కోపం చల్లారుతుందా? నీ కసి అప్పటికి తీరుతుందా?'
"కసి కాదు....అది మీ కనీస ధర్మం. ఆమెకి జరిగిన అన్యాయానికి మానవత్వం వున్న ఎవరన్నా చేసిన తప్పుకి, పాపానికి ఆమెకి క్షమాపణ చెప్పి ఆ పాపం కడుక్కోవాలి. చూడండి దేవుడు ఎప్పుడో ఎక్కడో శిక్షించడు. మనం చేసిన పనులకి యీ జన్మలోనే అనుభవించాలి. ఇదిగో మీరు రూపకి చేసిన ద్రోహానికి, ఆమె బిడ్డకి జరిగిన అన్యాయానికి శిక్షగా 'నిరూ' రూపంలో భగవంతుడు మిమ్మల్ని శిక్షించాడు. ఈ అవిటిపిల్లనిచ్చి జన్మంతా ఎడవమని శిక్షించాడు. మీరు చేసిన తప్పు నా బిడ్డని బలిగొంది. ఇంకా మీరు రూపని క్షమాపణ అడగడానికి సిగ్గుపడ్తారా.....? అనుపమ కంఠం రుద్ధమయింది.
సురేష్ మొహం వివర్ణమయింది. నిరూ వంక చూస్తుంటే అతని మనసంతా కలచివేసింది. నిజమా! ఇది రూపకి ద్రోహం చేసినందుకు. ఆమె బిడ్డకి అన్యాయం చేసినందుకు దేవుడు తన బిడ్డనిలా అవిటిదాన్ని చేసి తనని శిక్షించాడా?.....తన పాపం నిరూని బలిగొందా?
సురేష్, అనుపమలకి వివాహమయ్యాక ఆలస్యంగా మూడేళ్ళ తరువాత కాన్పు వచ్చింది అనుపమకి. బిడ్డ పుట్టిన సంతోషం మూడు క్షణాలు నిలువలేదు. ఆ పిల్ల పుట్టడమే నడుం దగ్గర 'ఓపెన్ వుండ్' తో పుట్టింది. డాక్టర్లు చూడగానే చెప్పేశారు.
"ఈ పిల్లకి నడుంకింది భాగంకి నరాలు వెళ్ళలేదు. ఆ నరాలన్నీ వుండచుట్టుకుని నడుందగ్గర వుండగా వుండిపోయాయి. అంచేత నడుంకింద భాగం పనిచెయ్యదు. స్పర్శ జ్ఞానం వుండదు. జన్మంతా అలా అవిటిదాని మాదిరిగానే వుండాలి. ఏ డాక్టరు చెయ్యగల్గింది ఏమిలేదు. ఆ బిడ్డ ఎంత త్వరగా చనిపోతే అంత అదృష్టవంతులవుతారు" అన్నారు.