అనుపమ ఆ మాటలు విని తెలివి తప్పింది. సురేష్ అవస్థ వర్ణనాతీతం! బిడ్డ బతికి బాగుండాలని ఏ తల్లితండ్రిలయినా కోరడం సహజం. దానికి విరుద్దంగా అనుపమ, సురేష్ అటు యిటు అందరు ఆ బిడ్డ బతికితే ఆ బిడ్డకి నరకం, కన్న తల్లికి నరకం ఆ బిడ్డ పొతే చాలన్నట్టుగా దేముడ్ని ప్రార్ధించారు. మీరు చేసిన పాపం అనుభవించాలి అన్నట్టుగా ఆ బిడ్డ బతుకుతూనే వుంది. ఎన్నెన్ని మందులు, డాక్టర్లు, ఎన్ని పూజలు, ముడుపులు ఏం చేసినా ఆ బిడ్డ బతుకంతే.
కాళ్ళులేక , నడవలేక జీవితం అంతా అలా అవిటిదానిలా బతకవలసిన కూతుర్ని చూసి అనుపమ, సురేష్ జీవితంలో ఆనందమే లోపించింది. ఆ యింట నవ్వులే కరువయ్యాయి. బిడ్డ పెరుగుతున్నకొద్దీ మిగతా పిల్లలతో పోల్చుకునే ఆ తల్లితండ్రులు పడే బాధా వర్ణానాతీతం. దానికి తగ్గట్టు తరువాత అయిదేళ్ళయినా మరో కాన్పు రాలేదు అనుపమకి. మరో బిడ్డ అయినా వుంటే కాస్త దుఃఖం తగ్గేదేమో, అది లేకపోవడంతో, వారి జీవితంలో సారం చచ్చిపోయింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న అనందం మూడునాళ్ళ ముచ్చటయింది.
అనుపమ మాటలు వినగానే మానిన గాయం రేగినట్లయింది సురేష్ కి. అతని మొహంలో బాధ చూసి"సురేష్ ప్లీజ్! ఆమె దగ్గరకి వెళ్ళు, ఒక్కసారి క్షమాపణ కోరు, నీకన్న బిడ్డని చూసుకో ఆ బాబే నీ పెద్దకొడుకు అనుకో! రూపకి జరిగిన అన్యాయం సరిదిద్దలేనిది. కాని సుమిత్ కి అన్యాయం జరగకుండా చూడడం నీ విధి. ఆ బిడ్డకి తండ్రి ప్రేమ కొంతయినా దక్కనీ! కన్నముకు తండ్రిగా నీ చేతనయింది చెయ్యి. మనకి వాడు మగబిడ్డ అనుకో. నీ మొదటి బిడ్డ వాడు. నాకు ఇంకా పిల్లలు పుట్టినా వాడే నీకు పెద్దకొడుకు. మన పిల్లలతో పాటు ఆ పిల్లాడికి ఆస్థి హక్కు ఇవ్వు. నీ కనీస బాధ్యత అది. ఈ విధంగా చేస్తే ఆ దేముడు నిన్ను క్షమించవచ్చు. మనకు ఓ బిడ్డ పుట్టవచ్చు. మన ఈ దిగులు, దుఃఖం కాస్తయినా తిరచ్చు. వెళ్ళు సురేష్. వెళ్ళు, ప్లీజ్! నిన్నభ్యర్దిస్తున్నాను" అనుపమ చేతులు జోడించి గద్గిదికంగా అంది.
సురేష్ ఇంక ఆపుకోలేకపోయాడు. ఆమె భుజానికి తల ఆన్చి చంటిపిల్లడిలా ఏడ్చేశాడు.
రాత్రి తొమ్మిది గంటల వేళ కారులో వచ్చిన సురేష్, అనుపమ, నీరూని చూసి ఆశ్చర్యపడిందిరూప. అనుపమ సురేష్ ని మందలించి క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చి వుండవచ్చు అనుకుంది రూప. తలువు తీసిన రూప వంక సూటిగా చూడలేక కళ్ళు వాల్చుకున్నాడు సురేష్.
"ఏమిటలా చూస్తున్నారు- మమ్మల్ని లోపలికి పిలవరా? అంది అనుపమ నవ్వి, తెల్లపోయి నిల్చున్న రూప తేరుకుని....."రండి....రండి....." అంది....లోపలికి వెళ్ళి లైటు ఫాను వేసింది.
"రూపా! సురేష్ నీకు చేసిన ద్రోహానికి క్షమాపణ కోరాలని వచ్చాడు" అంది అనుపమ ఉపోద్ఘాతంగా.
"రాలేదు. మీరు తీసుకోచ్చారు." రూప అదోలా నవ్విఅంది.
"సురేష్ మాటలు కుడదిసుకుంటూ , "నిజమే రూపా! అనుపమ నా కళ్ళు తెరిపించింది. రూప ఐయామ్ సారీ! నన్ను క్షమించు" సిగ్గుపడుతూ అన్నాడు. "ఇన్నాళ్ళ తరువాత ఆ క్షమాపణలకీ అర్ధము లేదు, ప్రయోజనమూ లేదు, ప్లీజ్! దయచేసి నా మానాన నన్ను బతకని! నీతో మాట్లాడితే నా నోరు నా అదుపులో ఉండదు. అనవసరంగా అన్ ప్లెజెంట్ సీన్స్ నా కిష్టంలేదు. దయచేసి వెళ్ళిపోండి" రూప కటువుగా అంది.
సురేష్ ఇబ్బందిగా అనుపమ వంక చూశాడు. అనుపమ సురేష్ వంక 'ఆమెని సమాధానపరచడం నీ వంతు' అన్నట్టు చూసింది.
"రూపా! నేను చేసింది తప్పే. తెలిసి తెలియని వయసులో వ్యామోహాన్ని ప్రేమ అనుకుని నీతో ఆటలాడాను. బాధ్యత మీద వేసుకునే శక్తి లేక నిన్ను వదుల్చుకోవాలని అవమానించాను. దానికి నీవు తగిన ప్రతీకారం చేశావు. ఇద్దరం తప్పు చేశాం."
"కాని శిక్ష నేను అనుభవిస్తున్నాను. జీవితంలో ఇరవై ఏళ్ళకే అన్ని అనుభవాలు కోల్పోయి మోడులా బతుకుతున్నాను. నీకేం నిక్షేపంలా బతుకుతున్నావు. మరో అందమైన యువతిని పెళ్ళాడావు. ఉద్యోగం, వ్యాపారం, గౌరవం, పరపతి, సంసారం, పిల్లలు....ఇన్నింటి మధ్య హాయిగా వున్నావు పెద్దమనిషిలా, నేను అవహేళనలు, తిరస్కారాలు, అవమానాలు, భాద్యత నెత్తినవేసుకుని ఒంటరి జీవితంలో పోరాడుతున్నాను. ఇప్పుడు చెప్పు. నీ కారణంగా యింత నష్టపోయిన నేను నిన్ను ఎలా క్షమించాలో, అసలు ఎవరైనా క్షమించగలరేమో చెప్పు. నేను మాములు మనిషిని. అందులో ఒక ఆడదాన్ని. అంత ఔదార్యం, క్షమ చూపడానికి నేనేం దేవతని కాను" కటువుగా చూస్తూ అంది.
"ఇంతకీ యిన్నేళ్ళ తరువాత నా క్షమాపణ నీకు దేనికి, నేను క్షమించకపోతే నీకు జరిగే నష్టం ఏమిటి?" వ్యంగ్యంగా అంది రూప."
"నాకు చేసిన అన్యాయానికి దేవుడే అంటూ వుంటే నిన్ను క్షమించి వుండేవాడు ఆ దేవుడే నిన్ను క్షమించి, నీకు అన్ని సుఖాలు అందించి సుఖంగా ఉండమన్నప్పుడు ఇంక నా క్షమాపణ దేనికి?"
"కాదు రూపా! ఆ దేవుడు నన్ను క్షమించలేదు. నీకు, నీ బిడ్డకు నేను చేసిన అన్యాయానికి ఇదిగో చూడు, నా కూతురిని అవిటిదాన్ని చేసి జన్మంతా ఏడవమని నన్ను శిక్షించాడు" నీరూని చూపుతూ అన్నాడు.
రూప ఆశ్చర్యంగా నీరువంక చూసింది.
"ఏమిటి? ఎమిటైంది. ఎందుకలా...." అనుపమని చూస్తూ ఆమెకి తెలియకుండానే అడిగింది . అనుపమ క్లుప్తంగా సంగతి వివరించింది.
రూప సానుభూతిగా చూసింది. "రూపా! ఇన్నాళ్ళు నీ మీద కోపంతో, కసితో నీవు నన్ను కోర్టు కెక్కించి అవమానపరిచావని నిన్ను అసహ్యించుకుని కసి పెంచుకున్నాను. కాని అనుపమ.....ఆమె మూలంగా నా తప్పు తెలుసుకున్నాను. నీవూ నన్ను క్షమించకపోతే ఆమె నన్ను క్షమించదు. మా నీరు కోసమన్నా మేమిద్దరం కలిసి వుండాలి. అసహయురాలైనా మా బిడ్డకి తల్లి తండ్రి ప్రేమ కావాలి" సురేష్ కంఠం పట్టుకుంది. రూపలో ఏదో గాయం రేగింది. చురుకుగా చూసింది.
"సురేష్! నా బిడ్డ తండ్రి ప్రేమకి నోచుకోకుండా పదేళ్ళనించి బతుకుతున్నాడు" అంది. సురేష్ మొహం మ్లానమయింది.
"ఈనాడు అనుపమ నిన్ను క్షమించదని , ఆమె ఈ కారణంగా ఇల్లు విడిచి వెళ్ళిపోతే నీ పరువు-ప్రతిష్ట మంట గలుస్తాయని ఆమె కోసం క్షమాపణ అడుగుతున్నావు" కటువుగా అంది.
"రూపా!" అనుపమ కల్పించుకుంటూ జరిగిపోయినది తిరిగి తేలేం. తప్పులు చేయడం మానవ లక్షణం. తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపపడే వాళ్ళని క్షమించడంలో మానవత్వం కనిపించాలి. నీ బాధ, ఆవేదన అర్ధం అయింది. నీకు అతనేం చెయ్యలేకపోయినా నీ బిడ్డకి చేతనయింది చెయ్యాలనే ఇప్పుడు వచ్చాం" అనుపమ సౌమ్యంగా అంది.
"రూపా! సుమిత్ నా బిడ్డ. వాడు నా మొదటి బిడ్డ. ఈరోజునించి వాడి బరువు బాధ్యత నీతోపాటు నేను పంచుకుంటాను. నా 'నీరూ'కి వాడు అన్నయ్య. నాకింక ఎంతమంది పుట్టినా వాడు నా మొదటిబిడ్డ. వాడికి నా ఆస్థిపాస్తులలో ఒక భాగం వుంది."
"నీ దయ ధర్మాలు వాడికి అవసరం లేదు. మీరు జాలిపడి ఇచ్చే దానాలు వాడికి అవసరం లేదు. నా బిడ్డని నేను పెంచుకోగలను." గాయపడిన మనసుతో తీవ్రంగా అంది రూప.
"దయ, ధర్మం కాదు. అది వాడి హక్కు. తండ్రి ఆస్తికి హక్కుదారుడు వాడు. వాడికి సంక్రమించాల్సింది దానం చేసే హక్కు నాకేం లేదు. అది వాడి హక్కు. రూపా! నీ కోపం నా కర్ధమయింది. నా మీద కోపంతో వాడి హక్కుని కాదనకు. రూపా! సుమిత్ ని చుస్తే నాకు చాలా గర్వంగా , ఆనందంగా వుంది. నీ పెంపకంలో వాడ్ని, చక్కగా తీర్చిదిద్దావు. నీలాంటి తల్లి అండన వాడు సంస్కారవంతుడిగా పెరుగుతాడు.వాడు నీ పేరుతొ పాటు నా పేరు నిలిపే అవకాశం నా కియ్యమని అభ్యర్ధిస్తున్నాను. నిన్ను నేను నా జీవితంలోకి ఆహ్వానించలేను గాని సుమిత్ ని సంతోషంగా ఆదరిస్తాను. వాడికేం అవసరమయినా వాడి తండ్రి ఉన్నడన్నది నీవు గుర్తుంచుకో" సురేష్ ఎమోషనల్ గా చమర్చిన కళ్ళతో రూపాని అభ్యర్దిస్తూ అన్నాడు.