"నిజంగా" అంది సీత.
ఇప్పుడు సీత ముఖంలో సతీ సావిత్రి, అహల్య, అరుంధతి సుమతి లాంటి మహాపతివ్రతలు కనిపించి గబుక్కున మాయమయ్యారు సుందరమూర్తికి.
"నువ్వెంత మంచిదానివి సీతా!" అంటూ చటుక్కున సీత చెయ్యి పుచ్చుకున్నాడు సుందరమూర్తి.
"మిమ్మల్ని ప్రేమించినందుకా?' అనలేదు సీత. నెమ్మదిగా చెయ్యి విదిపించుకోబోయింది.
"లైటార్పేస్తాను." అన్నాడు సుందరమూర్తి.
సీత మాట్లాడలేదు.
సుందరమూర్తి పెద్దలైటార్పేశాడు.
19
సీత కాపురానికి వచ్చింది.
రాఘవకి నాలుగు రోజులు తప్ప శలవు లేక పోవటంవల్ల శాంత సరిగ నాలుగు రోజులే వుండి తమ్ముడికి మరదలికి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది.
సీత, సుందరమూర్తి మిగిలిపోయారు.
సీత భర్త విషయం గ్రహించింది. ప్రతి చిన్న విషయానికి భయపడతాడని, అమయాకంగా అర్ధంపర్ధం లేని ప్రశ్నలు వేస్తాడని, కొన్ని మాటలకి అల్ప సంతోషం వ్యక్తం చేస్తాడనిను మరో విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది. కొందరు ఏడుకొండల వాడిని రాముడిని కొలిస్తే మరికొందరు స్వమిజిలను బాబాలను నమ్ముతారు. తన భర్త అలాకాదు. ఓ అమ్మని మొక్కుతాడు. ఆ అమ్మపేరు "మాతా మహేశ్వరీ" ఇంటి గోడల నిండా "మాతా మహేశ్వరీ" ఫోటోలు రంగు రంగులవి రకరకాలవి వేలాడుతున్నాయి. మాతామహేశ్వరీ ప్రతి ఫోటోలో పట్టుచీర వెయ్యి రూపాయిల ఖరిదుది కట్టుకుని వుంది. వంటినిండా నగలు దిగేసుకుంది. వలిస్తే పెద్ద పెట్టెడు వుంటాయి. మరి రూపాయంత చిన్నది కాకుండా పదిరూపాయల బిళ్ళ అంత బొట్టు ముఖాన పెట్టుకునివుంది. ఆ పెద్ద నుదుటిమీద ఆ బుల్లిబొట్టు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలా వుంది. మహాలావే ఆరోగ్యమనుకుంటే, ఆవిడ బొద్దుగాబొద్దుమల్లెలా వుంది. ఒక్క ఫోటోలో కూడా ఆవిడ మామూలుగా లేదు. మార్పులేని చిరునవ్వుతో వుంది. ఎన్నిసార్లయినా చూడతగ్గ రూపం మాతా మహేశ్వరిది.
సీతతో సుందరమూర్తిఈ యింట్లో అడుగు పెట్టంగానే " మాతామహేశ్వరీ" అని ఓ పిల్లి కూత లాంటిది పెట్టి ఆమె ఫోటోకి గట్టిగా దండంపెట్టి "అమ్మకి నీవూ నమస్కారం చెయ్యి సీతా" అన్నాడు.
మొగుడు చెప్పాడు కదా అని నమస్కారం పెట్టింది సీత.
బోలెడు సంతోషించాడు సుందరమూర్తి.
తన తమ్ముడుకి "మాతా మహేశ్వరీ" నమ్మిన దేవుడని....(దేవుడంటే పుల్లింగమని తెలియని శాంత మాతామహేశ్వరిని మగాడిని చేసింది. దేవతందామా అంటే దానికి మరో అర్ధం కూడా వుందాయే. ఈ ద్వందార్ధం గోలెందుకని దేవుడనేసింది. అడదేవుడనుకుంటే సరిపోయే) ఆ దేవుడు ఆ మాతా చాలా గోప్పవిడని (మనిషే అన్నమాట) ఆవిడ వద్ద చాలా మహాత్యలున్నాయని.....మాతా పట్టుకుంటే మట్టి బంగారమౌతుందని.....మాతా తల్చుకుంటే ఆకాశం కిందికొచ్చి భూమి మీద వాలుతుందని.....మాతా కోపగించుకుంటే మనుషుల్ని నల్లుల్లా మార్చగలదని.....(పశువులు, పక్షులు, చెట్లు, చేమలు అమ్మ తల్చుకుంటే మాడి మనవుతాయో లేదో శాంత చెప్పలేదు) ఇంకా చాలాచాలా చెప్పింది మాతామహేశ్వరి గురించి.
విన్న సీత "ఓహో" అనలేదు ఫోటో వేపు దీర్ఘంగా చూసి "ఊ" అంది.
ప్రతిరోజూ ఉదయం పూట టవలంత పట్టుబట్ట చుట్టుకుని సుందరమూర్తి "మతామహేశ్వారి" ఫోటో ముందు అరగంటపైనే కూచుంటాడు. మాతా శ్లోకాలు, మహేశ్వరి దండకంలాంటివి బిగ్గరగా చదువుతాడు. చివరికి భక్తిగా చెంపలు వాయించుకుంటాడు.
"ఓ ముక్క పట్టుబట్ట నీవు చుట్టుకుని నా పక్కనే కూచుని పూజించు" అని సీత చెంపలు మాత్రం రాలగొట్టలేదు. ఈ దేశంలో కొందరు భక్తిగల భార్తల్లాగా, ఈ విషయంలో సీతకి కొంతలోకొంత సంతోషం కలిగింది. "వారి నమ్మకం వారిది ఇతరుల స్వేచ్చకి అడ్డు తగిలి బానిసగా చేయకుంటే చాలు." అనుకుంది.
మాటల సందర్భంలో "చిన్నప్పటినుంచి మీకు ఈ అమ్మే దేవుడా?" అనడిగింది సీత.
"ఉహూ నాకు ఆదేవుడు ఈదేవుడని లేదు. మా వాళ్ళు ఏడుకొండలవాడిని కొలిచేవారు. నేనెంతో ప్రార్ధించాను. నా కష్టాలు ఆ దేవుడు తొలగించలేదు. మా బావకి వినాయకుడు దేవుడు ఆయన్ని కొలిచినా కష్టాలు పోలేదు. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, విని ఆంజనేయస్వామిని అప్పికొండస్వామిని, అన్నవరం సత్యనారాయుణ్ణి, సింహద్రిఅప్పడిని, ఎందరినో కొలిచాను. ఉహూ నా మొర ఎవరూ అలకించలేదు. ఓ స్నేహితుడు చల్లని తల్లి దయగల అమ్మ అయిన మతామహేశ్వారి అమ్మవారి వద్దకు తీసుకెళ్ళాడు. అమ్మ కళ్ళు తెరుస్తూనే నన్ను చూసి చల్లని నవ్వులు చిందించి "నా దర్శనాని కొచ్చావు బిడ్డా! ఈరోజు నుండి నీకష్టాలు తీరాయి." అంటూ దివించింది అప్పటి నుంచి పరిక్షలు పాసయాను...."