Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 32

 

    సుందరమూర్తి దేన్నీ గురించి ఆలోచిస్తున్నాడో సీతకి అర్ధం కాలేదు. బొమ్మలా వుండిపోయింది.

 

    "సీతేం చిన్నపిల్ల కాదుగా! ఆ మాత్రం తెలియదూ, వాళ్ళమ్మ ఉంటే చెప్పి పంపెదేమో! మొగుడి కళ్ళకి నమస్కరించటం మంచిదని, తప్పక చేయలనిను అక్కయ్య అయినా చెప్పి పంపాల్సింది. సీతకి తెలిసుంటుందని అనుకుందో ఏమిటో ఇప్పుడేం చెయ్యాలి? కాళ్ళమీద చేతులుంచి కళ్ళకద్దుకోమంటే! ఛి తను చెప్పటం ఏం బాగుంటుంది? నవ్వుతుందేమో తన మాటలకి, నవ్వినా నవ్వొచ్చు. తెలినప్పుడు ఏం చెయ్యాలి? తనే సర్దుకుపోతే సరి" ఈ విషయంలో మనసు నిబ్బర పర్చుకున్నాడు కాళ్ళ విషయం యింక ఆలోచించదల్చలేదు సుందరమూర్తి.

 

    మొగుడి కాళ్ళ మీద పెళ్ళాం పడటం ధర్మం అనే ఆలోచన సీత కొచ్చివుంటే సుందరమూర్తి కళ్ళని జలగలా పట్టుకునేదేమో సీత అసలా ఆలోచనే రాలేదు.

 

    సుందరమూర్తి మొదటినుంచి తను వేరుగా ఓ రకమైనా స్థబ్దుగా  వుండే వాతావరణంలో పెరిగినవాడు ఇలా పెరిగిన వాళ్లు కొన్ని ప్రిన్స్ పుల్స్  పెట్టుకుని వాటిని పట్టుకునే వేళ్ళాడుతూ బతుకుతుంటారు తమ పరిధి దాటి ఓ అడుగు కూడా ముందు కెయ్యారు. ఓ పక్కనుంచే ఆలోచిస్తుంటారు పిరికితనం, ఒంటరితనం, భయం భయంగా బతకటం వీటికి కారణాలు. నూతిలో కప్ప వేరే ప్రపంచం లేదనుకుంటుంది. శరీరం ఎదగదు కొందరికి, మనసేరగదు మరికొందరికి. సుందరమూర్తి ఈ జాతిలో వాడు. అందుకే పెళ్ళాం తన కాళ్లు పట్టుకోలేదని బాధపడి ఎలాగో చివరికి సర్దుకున్నాడు. కాని కొన్ని అనుమానాలు తీరలేదు.

 

    "భారత రామాయణాలు తెలుసా?" అన్నాడు సుందరమూర్తి.

 

    "ఊ" అంది సీత. వాటవసరం ఈ సమయంలో ఎందుకో తెలియక.

 

    కధలు నవల్స్ చదువుతుంటావా?" మరో ప్రశ్న వేశాడు.

 

    "ఆ..." అంది ఈసారి సీత, తన అభిరుచులు భర్త తెలుసుకుంటున్నాడనుకుంది.

 

    "సినిమాలు చూస్తావా సీతా?"

 

    "అప్పుడప్పుడు..."

 

    మళ్ళి సుందరమూర్తికి కాళ్లు గుర్తుకువచ్చాయి. "సీతకి భారత రామాయణాలు తెలుసు, కధలు చదువుతుంది, సినిమాలు చూస్తుంది. భర్త పాదాలకు నమస్కారం చేయాలని తెలియలేదేమిటి?" అని కాస్త దీర్ఘంగా అలోచించి "అన్ని తెలిసి ఈ చిన్న విషయం ముఖ్యమైనది తెలుసుకోలేదంటే ఉత్త అమాయకురలయి వుంటుంది." అనుకుని తృప్తి పడ్డాడు. సీత అమాయకురాలయినందుకు ఆవిషయం తను కనుగొన్నందుకు చాలా సంతోషించాడు. ఓ మగాడిగా ఓ ఆడదాని భర్తగా అతని హృదయం ఉప్పొంగిపోయింది. గర్వంగా ఫీలయ్యాడు.

 

    కాసేపు లోతుగా అలోచించి "నేవ్వేవరిని ప్రేమించాలేదా సీతా?'

 

    సీత నిర్ఘాంతపోయింది వెంటనే తలెత్తి సుందరమూర్తి వేపు అలా చూస్తుండి పోయింది కళ్ళప్పగించి.

 

    సుందరమూర్తి రెండు గుటకలు మింగి "నేను....నేను.... మంచి ఉద్దేశ్యంతోనే అడిగాను. మాటలని ఒకరిని బాధించటం నాకసలు యిష్టం వుండదు. మీ అన్నయ్య ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడుటగా? నీ పెళ్ళి గాకముందే మీ చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుందికదా? మీ వంశంలో ప్రేమించి పెళ్ళాడటం మామూలుగా జరుగుతున్నట్లుంది. నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించావేమోనని..... కొందరు ప్రేమించినా పెళ్లికాదులే, అందుకని అడిగాను. అడుగుతున్నానని ఏమనుకోకు. సర్ధా, ఊరికే తెలుసుకుందామని అంతే....అంతే....నువ్వేరినైనా ప్రేమించావా?' మళ్ళి అదే ప్రశ్న వేశాడు.

 

    భర్త అలా భయపడుతూ అడుగుతుంటే సీతకి నవ్వొచ్చింది. "ప్రేమించాను" అంటూ చిలిపిగా నవ్వింది.

 

    "ఆ..."అని ఈసారి సుందరమూర్తి నిర్ఘాంతపోయాడు.

    
    "ఎవరినీ అని అడగరేం?' పసిపిల్లాడి తంతుగావున్న భర్త తీరు సీతకి తమాషాగా వుంది. కవ్విస్తున్నట్టు అడిగింది.

 

    సుందరమూర్తికి మతిపోయినట్లయింది. "అడగటం దేనికి? ఏ పుల్లయ్యనో అయివుంటుంది. మరెందుకు పెళ్ళి చేసుకోలేదు?" హీన స్వరంతో ఎడ్వటానికి సిద్ధంగా ముఖం పెట్టి అడిగాడు.

 

    "అలాకాదు, అడగండి చెపుతాను." అంది సీత.

 

    తప్పనిసరి తద్దినం అయినట్టు "ఎవరినీ?" అన్నాడు సుందరమూర్తి.

 

    "మిమ్మల్నే!" అంటూ కొద్దిగా సిగ్గుపడింది సీత.

 

    "నన్నా!" సుందరమూర్తికి వణుకు పుట్టింది.

 

    "ఊ.....పెళ్ళికి ముందు ప్రేమించడం నాకిష్టంలేదు. నా ప్రేమ రాబోయే భర్త కోసం దాచుకున్నాడు. పెళ్ళి తర్వాత ప్రేమలో అర్ధముంటుంది. అనందముంటుంది. పెళ్ళయింది. అప్పటి నుంచి ప్రేమించాను....మీ...మ్మ...ల్ని" అంటూ తలొంచుకుంది సీత.

 

    సుందరమూర్తి వళ్లు వణకటం తగ్గి బురెల్లా పొంగటం మొదలుపెట్టింది. తనని మనస్పూర్తిగా ప్రేమించే మనిషి. తనకోసమే ఇన్నాళ్ళు తన ప్రేమ దాచుకున్న వ్యక్తీ తన భార్య, తనని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఇంతకన్నా ఇంకేంకావాలి.

 

    కాళ్ళ సంగతి మర్చిపోయాడు. సీత అన్న చెల్లెలు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారన్న సంగతి అంతకన్నా మర్చిపోయాడు. కొత్తగా వచ్చిన అనుమానం ఇంకా తీరక "నిజంగా!" అనడిగాడు సుందరమూర్తి.   

 Previous Page Next Page