కొద్దిసేపు వాళ్ళిద్దరిమధ్యా పొడి పొడిగా మాటలు జరిగాయి. తర్వాత లోపలికి వెళ్ళారు.
"ఏదో జరిగింది అంతవరకూ ఖాయం." అనుకుంది వైజయంతి.
"అమ్మయ్య గండం గడిచింది. నా కంగారు పాడుగానూ," అనుకుంటూ తన్నితానే తిట్టుకుంది త్రిలోకసుందరి.
13
"చెప్పండి చెప్పండి. మీరు చెప్పేవన్నీ తమాషాగా వున్నాయ్." అంది వైజయంతి.
"నాకూ అలాగే వుంది. మదన్ గోపాల్ చటుక్కున అని ఆ తర్వాత ఎందుకన్నానా అని బాధపడ్డాడు. కావాలని అన్నానని ఈ పిల్లది అనుకున్నా అనుకోవచ్చు" అనుకుంటూ తల ఎత్తి చూశాడు.
వైజయంతి కొరకొరా చూసింది.
ఆ ఇంట్లోవాళ్ళు అద్దె కొంపల్లో వాళ్ళలాగా ఎవరు మానాన వాళ్ళు వుండక అంతా ఒకే కుటుంబం వాళ్ళులా అప్పుడప్పుడూ సాయ్మత్రం వేళల లేక రాత్రి పదిగంటల సమయంలో తీరుబడిగా కల్సికూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. ఇప్పుడు చేస్తున్నది వాళ్ళాపనే.
రామదూత లోకంలోని వింతలువిడ్డూరాలు తమాషాలు చెపుతుంటే అందరూ వింటూ కూర్చున్నారు.
"మదన్ గోపాల్ గారిని విడిచి చక్రవర్తిగారు వుండలేక ఎక్కడికి పరుగెత్తుకొస్తున్నారేమో, పైగా బాబాయిగారి మనుష్యులుకూడా అయ్యారాయె."
"అయితేమాత్రం, చక్రవర్తి యింటికి మదన్ గోపాల్ వెళ్ళవచ్చుకదా!"
"కనుక్కుని చెపుతాలే."
"నీకంత ధైర్యంకూడానా, వీళ్ళిద్దరూ ఇక్కడే ఎందుకు కల్సుకుంటున్నారంటే..." ఆగింది వైజయంతి.
"కారణం ఏమిటే?" ఆతృతగా అడిగింది త్రిలోక సుందరి.
ఈ ఇంట్లో రెండు సీతాకోక చిలుకలున్నాయ్. అవి...
వీళ్ళ గుసగుసలు రామదూత పసిగట్టాడు. "అమ్మాయిలూ! మీరు నామాటలు వింటంలేదు" అన్నాడు గట్టిగా.
"అబ్బే వింటున్నాం. బాబాయిగారు బాగా చెపుతున్నారు కదూ అని నేనంటే చాలా బాగా చెపుతున్నారని సుందరి అంటున్నది. అంతే అంతే యింక మీరు కానీండి." అంది వైజయంతి.
"సరి సరి. తొండ ముదిరితే ఏమవుతుందో సరీగ చెప్పిన వారికి ఏదో వక బిరుదిస్తారు. ఇంక చెప్పండి. తొండ ముదిరితే ఏమవుతుంది?" రామదూత అడిగాడు.
"ఊసరవెల్లి" అందరూ కూడబలుక్కున్నట్లు ఏక కంఠంతో గబుక్కున అన్నారు.
"కాదు." రామదూత గంభీర్యంగా అన్నాడు.
తొండముదిరితే ఊసరవెల్లిగాక ఏ పక్షిలాగానో మారి నట్లు వాళ్ళలో ఎవరూ వినలేదు. తొండముదిరి మరో జీవిలా ఏదో వూళ్ళోనో ఏదో దేశంలోనో అయి వుంటుంది. వింతలు విడ్డూరాల్లో ఇలాంటివి బోలెడు రాస్తారు. అలాంటి వింత ఏదో రామదూతకి తెలిసి వుంటుంది అనుకున్నారు.