"తొండ ముదిరితే ఏమవుతుందో నాకు తెలుసు." అన్నాడు మదన్ గోపాల్.
"తెలుసా! ఏమవుతుందో చెప్పు!" రామదూత అడిగాడు...
"రంగులు మారుస్తుంది."
"కాదు."
మదన్ గోపాల్ ముఖం చిన్నబోయింది.
"కరెక్ట్ గా చెప్పగల తెలివిగల వాళ్ళు యిక్కడెవరూ లేరుగానీండి మీరే చెప్పండి బాబాయిగారూ!" అంది వైజయంతి.
"తొండ ముదిరితే ముసలిదవుతుంది." అన్నాడు రామదూత.
"ఏ జీవి అయినా అంతేకదా? ఎల్ల కాలం పడుచుపిల్లలా మిసమిసలాడుతూ వుంటామేమిటి, తొండ ముదిరినా బల్లి ముదిరినా ముసలిదే అవుతుంది. ఇందులో వింతేముంది! ఈ మాత్రం నాకూ తెలుసు." మదన్ గోపాల్ ఉక్రోశం పట్టలేక అన్నాడు.
"అదే విచిత్రం. తెలిసిన విషయం చెప్పలేకపోయావ్?" అన్నాడు రామదూత.
"మా బాగా చెప్పారు." అంది వైజయంతి. ఓ చూపు మదన్ గోపాల్ మీద ప్రసరించి.
"కిందపడటం అంటే ఎత్తునుంచి పల్లంలోకి పడిందా, బ్రిడ్జీ మీదనుంచి నీళ్ళలో పడిందా గట్టుమీద నుండి పల్లంలోకి పడిందా, చిన్నక్లూ అన్నా ఇవ్వంది ఎలా చెపుతాను?" రామదూత అన్నాడు.
"అవును యిలా అర్ధం పర్ధం లేనివి చెబితే ఎలా?" వైజయంతి అంది.
"మీకు తెలియదని చెప్పండి నేను చెప్పేస్తాను." మదన్ గోపాల్ అన్నాడు.
అందరూ తెలియదంటే తెలియదు అన్న తర్వాత మదన్ గోపాల్ చెప్పాడు. "బండికింద పడింది ఏదైనాకావచ్చు. ఎందుకంటే బండికింద పిల్ల వాడుపడొచ్చు. కుక్కపిల్ల పడొచ్చు. పడింది అనాలి. ఇదే కరెక్ట్ సమాధానం. అంతేగాని బండికింద పడింది అనగానే దానికి యాక్సిడెంట్ అయినట్లు కాదు బండి.... కింద.... పడింది....అంతే."
"నాముఖం లాగుంది." అంది వైజయంతి.
"థాంక్స్, నా ట్రిక్ ని మెచ్చుకున్నారు. నాకదేచాలు." అన్నాడు చక్రవర్తి.
"నేనెక్కడ మెచ్చుకున్నాను! నాముఖం లాగుంది అన్నాను." చిరచిరలాడుతూ అంది వైజయంతి.
"నా ముఖం లాగుందీ అన్నారు. అంటే మీ ఫేస్ లా బాగుందనేకదా! కాదు అంటారా! మీ యిష్టం ఆపై...." అన్నాడు మదన్ గోపాల్ నాన్చుతూ.
ఇంకేం మాట్లాడాలో తెలియలేదు వైజయంతికి మౌనం వహించింది.
"అమ్ముడు దెబ్బకి దెబ్బ తీయకుండా వూరుకోదు. అగ్నిపర్వతం పేలకాతప్పదు. ఏదో సమయంలో నానెత్తినా పడక తప్పదు." భయపడుతూ అనుకున్నాడు మదన్ గోపాల్.
ఆ తర్వాత ప్రసంగం మారటంతో అక్కడ వాదోపవాదాలు జరగలేదు.
ఆఫ్రికన్ అడవుల్లో జరిగిన ఒక భయంకర యదార్ధగాధ రామదూత చిత్ర విచిత్రంగా చెపుతుంటే అంతా వింటూ కూర్చున్నారు.
14
"ఏమిటే సుందరీ! ఈ మధ్య ఆఫీసునుంచి గంట లేటుగా వస్తున్నావ్! కథాకమామీషూ ఏంటంట?" త్రిలోకసుందరిని గుమ్మంలోనే నిలేసి కళ్ళెగరేస్తూ అడిగింది వైజయంతి.
"ఆఫీసులో పని ఎక్కువగా వుంది." డల్ గా సమాధానం చెప్పింది త్రిలోకసుందరి.


