Previous Page Next Page 
మధుమాసవేళలో ... పేజి 32


    
    "ఎప్పుడు చూసినా మీకు మేమే లోకువగా వున్నాము. మమ్మల్ని చూడంగానే పెళ్ళి గుర్తొస్తుంది" అంది వైజయంతి బుంగమూతిపెట్టి.
    
    "పెళ్ళికాని పిల్లలుకదామీరు అందుకు!" గడుసుగా అంది బామ్మగారు.
    
                                                    12
    
    వైజయంతి వాళ్ళ అమ్మా వాళ్ళతోకలిసి పదిరోజులు వూరికి వెళ్ళింది.
    
    దగ్గర దగ్గర వూళ్ళల్లో ముగ్గురు చుట్టాలు పిలిచారు పెళ్ళిళ్ళకి. ఎగేస్తే మూడు పెళ్ళిళ్ళూ ఎగేయాలి. వెళితే ముగ్గురిళ్ళకీ వెళ్ళాలి. ఒకింటికి వెళ్ళి మరో ఇంటికి వెళ్ళకపోతే వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది.
    
    వైజయంతికి పెళ్ళిళ్ళ కెళ్ళటం మహా ఎలర్జీ.
    
    సౌభాగ్యమ్మకి పెళ్ళిళ్ళ కెళ్ళటం మహాయిష్టం.
    
    "నా బదులు నీ బదులు అందరిబదులు నువ్వెళ్ళు" అంది వైజయంతి.
    "సంబడం బాగానే వుంది. నీవిప్పుడు వాళ్ళపెళ్ళిళ్ళకి రాకపోతే వాళ్ళెవరూ నీ పెళ్ళికి రారు" అంది సౌభాగ్యమ్మ.
    
    "రాకపోతే మరీమంచిది. బియ్యం మిగిలేను. కూరలు మిగిలేను. పిండివంటలు మిగిలేను. దెప్పుళ్ళు మిగిలేను..." అంటూ వైజయంతి దండకం చదివింది.
    
    సౌభాగ్యమ్మ వెంటనే పైటుచెరుగుతో కళ్ళు వత్తుకుని గొణగటం మొదలుపెట్టింది. తిరుగులేని అస్త్రం యిది.
    
    తల్లి ఎంత భోళామనిషో వైజయంతికి బాగా తెలుసు. అలాగే ఇప్పుడు ఈ అస్త్రం సంగతికూడా మహాబాగా తెలుసు. తనకి పెళ్ళయి నలుగురు పిల్లలు పుట్టగా కూడా ఈ విషయం మర్చిపోక జీవితాంతం సణుగుతూనే వుంటుంది. కనుక నాలుగురోజులు కళ్ళుమూసుకుని ఆ పెళ్ళిళ్ళ కెళ్ళొస్తే సరిపోతుంది అని తలచి"ఉత్తిత్తిగా అన్నాను రానని అంతే" అంది అక్కడితో ఆగక "పెళ్ళిళ్ళకెళితే ఎంత కాలక్షేపమో! బోలెడు ముచ్చటలాడుకోవచ్చు. డాల్డాతో చేసిన అరిశలు తినొచ్చు పామాలివ్ తో చేసినలడ్లు తినొచ్చు. అదీ యిదీ..." అనికూడా అంది.
    
    "అంతా పసిపిల్లల తంతు. దానికి మాత్రం పెళ్ళిళ్ళకి రావాలని వుండదా ఏమిటి? నన్ను ఆటలు పట్టించటం కాకపోతే" అనుకొంది సౌభాగ్యమ్మ.
    
    వైజయంతి పెళ్ళికి వెళ్ళక తప్పలేదు. వెళ్ళింది.
    
    సరిగా పదిరోజుల తర్వాత...
    
    వైజయంతీవాళ్ళు తిరిగి వచ్చారు.
    
    వైజయంతికి గుమ్మంలోనే ఎదురయింది త్రిలోకసుందరి.
    
    వైజయంతిని చూస్తూనే "అమ్మయ్య వచ్చావా! తోచక చస్తున్నాననుకో" అనలేదు త్రిలోకసుందరి టకీమని కళ్ళు వాల్చుకుని బిడియంగా వుండిపోయింది.
        
    "దీనికేమొచ్చింది చెప్మా!" అనుకుంది వైజయంతి. "ఈ పదిరోజులూ ఎలా వున్నావ్! మనింట్లో అందరూ మామూలుగానే వున్నారా?" అడిగింది.
    
    "బా....బాగానే వున్నాను. మామూలే మామూలు గానే వున్నారు. ఉహూ బామ్మగారూ మనవడుగారూ అటు మొన్న వూరికివెళ్ళి రాత్రే వచ్చారు. అంతే జరిగింది. ఆపై అసలేం జరగాలా" కంగారు కంగారుగా చెప్పింది త్రిలోకసుందరి.
    
    "సరే ఆ కంగారేమిటీ?"
    
    "కంగారా! కంగారు దేనికి! ఏం జరగందే" మరింత కంగారుగా అంది త్రిలోకసుందరి.
    
    "నే లేనప్పుడు ఏదో జరిగింది. ఏదీ జరక్కపోతే దీనికింత గాభరా దేనికట! నేవచ్చాగా. "ఒక్కరోజులో లాగనూ!" అనుకుంది వైజయంతి. మాట మారుస్తూ "ఏంటి చిక్కిపోయావ్, నామీద దిగులా!" అంటూ నవ్వేసింది.    

    
    "నేను చిక్కానా! అబ్బే అదేం లేదు. కాస్త లావైనట్లు అనిపిస్తుంటే నాసంగతి అలావుంచు, నీవేంటి యిలా పీక్కుపోయావ్!"

 Previous Page Next Page