Previous Page Next Page 
సంకల్పం పేజి 32

 

       "నాకు మరో అమ్మాయిని చూపిస్తానన్నారు.... ఆ అమ్మాయెలా వుంటుందో, ఎక్కడుంటుందో, ఎలా కలవాలో చెప్తానన్నారు...."
   
    "తూచా తప్పకుండా జ్ఞాపకం వుంచుకున్నారే- ఓ.కే. ఆ అమ్మాయి గురించి చెప్తాను. మీరు కలుస్తారా..... కలవగానే మీరు ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలి."
   
    "ఎవరో, ఏవిటో తెలియకుండానే ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా.... జోడు తీసి కొడుతుంది."
   
    "ముద్దు పెట్టుకుంటే ఆ అమ్మాయి మీతో మాట్లాడుతుంది..... లేకపోతే మాయమైపోతుంది."
   
    "ఇంతకీ మీరు నన్ను పంపించేది అందమైన అమ్మాయి దగ్గరకా? దెయ్యం దగ్గరకా?" అని ఒక్కక్షణం తిరిగి నవ్వుతూ అన్నాడు వికాస్ "అయితే ఆ అమ్మాయి పేరూ, ఎడ్రస్సూ చెప్పండి" అని.
   
    దూరంగా గ్రీన్ లైట్ వెలిగింది. రైలు కదలడానికి ఇంకా రెండు నిమిషాలే టైముంది.
   
    లిఖిత నోట్లోంచి ఏదో మాట రాబోయింది-
   
    అదే సమయంలో-
   
    "హలో..." పిలుపు.
   
    గబగబా వస్తూ ఆనంది.
   
    "డాడీ ఈ లెటర్ మీకిమ్మన్నారు.... బొంబాయిలో అరవింద నాయర్ గారికి దీన్ని ఇవ్వమన్నారు..." చెప్పి నిల్చుంది ఆనంది.
   
    రైలు కదులుతున్న చప్పుడు.
   
    ఆనందివేపు చూసింది లిఖిత అసహనంగా.
   
    ఆనంది వికాస్ వేపు చూస్తూ చెయ్యూపుతోంది.
   
    వికాస్ నవ్వుతూ టాటా చెప్తున్నాడు.
   
    లిఖిత నవ్వలేదు, టాటా చెప్పలేదు, చరచర నడుచుకుంటూ బయటి కొచ్చేసింది.
   
    ప్రక్కకు చూసిన ఆనంది, లిఖిత అక్కడ లేకపోవడంతో ఆశ్చర్యపోయింది.
   
                                 *    *    *    *    *

   
    బొంబాయిలో-
   
    నారీమన్ పాయింట్ దగ్గర-
   
    సీగల్ ఎపార్ట్ మెంట్స్ లో, సెకండ్ ఫ్లోర్లో, 212 ఫ్లాట్లో -
   
    డ్రాయింగ్ రూంలో కూర్చున్నాడు వికాస్.
   
    వికాస్ ఎదురుగా సోఫా మీద యాభై ఏళ్ళ అరవింద్ నాయర్. అరవింద్ నాయర్... ఆజన్మ బ్రహ్మచారి...
   
    కార్లమధ్య పుట్టాడు. కార్లమధ్య పెరిగాడు. డన్ లప్ కంపెనీకి టెక్నికల్ ఎడ్వైజర్ ఆయన.
   
    "ఇంధనం అవసరం లేకుండా కారు తయారుచేస్తావా..." ప్రశ్నించాడు నాయర్ ఆశ్చర్యంగా.
   
    "ఎస్ సర్..."
   
    "ప్రయోగాలు చేస్తే నీ ప్రొడక్ట్ మ్యూజియంలకే పరిమితమై పోతుంది. బిజినెస్ చెయ్యాలనుకున్నావనుకో..... నలుగురూ వెళ్ళే దారిలోనే వెళ్ళు......అదే నా సలహా..."
   
    "కానీ నా కారు సక్సెస్ అవుతుందని నా నమ్మకం...."
   
    "నమ్మకం లేనిదెవడికయ్యా..... కుర్రాడా....
   
    ట్రాన్స్ మిషన్ సిస్టమ్ లోగానీ, ఎక్సిలరేషన్, పిక్ అప్ 'మెటీరియల్ ని తక్కువగా వాడటంలో తీసుకునే జాగ్రత్తలు.... ఇవన్నీ క్రొత్తగా ఈ బిజినెస్ లోకొచ్చే ప్రతి వ్యక్తీ గుర్తుంచుకోవాలి..... Nohing is constant but change..... ఆ మార్పుల్ని మనం జాగ్రత్తగా ఆడాప్ట్ చేసుకోగలగాలి.... అప్పుడే సక్సెస్..." చెప్పడం ఆపాడు నాయర్ ఒకింతసేపు.
   
    "నీ కారుకి పేరేం పెట్టావ్?" అడిగాడు నాయర్ తిరిగి.
   
    "స్ట్రీట్ రైడర్...."
   
    "బాగానే వుంది... కానీ ఆంద్రప్రదేశ్ లోని కారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నావ్.... తెలుగు పేరు పెట్టుకోవచ్చుగా.... ఉదాహరణకు మారుతీని తీసుకో... It's a catchy name...."
   
    "నా టార్గెట్ యూత్... ఒకచోట లైట్ మ్యూజిక్ కన్ సర్ట్ జరుగుతోంది... వేరొకచోట పాప మ్యూజిక్ కన్ సర్ట్ జరుగుతోంది. అదీ మ్యూజిక్కే... ఇదీ మ్యూజిక్కే..... కానీ యూత్ ని ఎట్రాక్ట్ చేసేది పాప మ్యూజిక్కే. అవునంటారా? కాదంటారా? అందుకే స్ట్రీట్ రైడర్ పేరుని సెలక్ట్ చేశాను" చెప్పాడు వికాస్.
   
    "నీ రీజనింగ్ బాగానే వుంది.... నీ కారు బ్లూ ప్రింట్ తెచ్చావా?"
   
    సూట్ కేసు తెరచి, అందులోంచి ఓ ఫైలు తీసిచ్చాడు వికాస్.
   
    ప్యూన్ లైమ్ జ్యూస్ తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు.
   
    "ప్లీజ్... హేవిట్..." అని ఆ ఫైలులోని కాగితాలను సీరియస్ గా పరిశీలించడం మొదలుపెట్టాడు అరవింద్ నాయర్.
   
    జ్యూస్ సిప్ చేస్తున్నాడు వికాస్.
   
    తను గతంలో ప్రొఫెసర్ అప్పన్నదొర డిజైన్ ని తీసుకుని అదే బొంబాయి వచ్చి, సక్సెస్ ఫుల్ గా బ్యాటరీని తయారుచేయించుకు వెళ్ళినట్లు గాని- అలాంటివే మరో వెయ్యి బ్యాటరీలు అదే బొంబాయిలో ఓ లాబ్ లో ప్రస్తుతం తయారవుతున్నట్లుగాని వికాస్ ఆయనకు చేపప్లేదు- అలా చెప్పకపోవటం అన్నది అరవింద్ నాయర్ ని నమ్మక కాదు- తన మేనమామ చయనులు చెప్పిణ వ్యాపార సూత్రం తన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించటం మూలంగా.           
    అదే సమయంలో నాయర్ కో ఫోన్ వచ్చింది.
   
    "హలో.... మిస్టర్ భార్గవ.... హౌ ఆర్యూ.... ఎలా వున్నావ్.... ఆ.... ఆహా.... సాయంత్రం వెళ్ళిపోతావా.... ఓ.కే." ఫోన్ పెట్టేశాడు నాయర్.
   
    "చూడు మిస్టర్ వికాస్.... భార్గవని నా ఫ్రెండ్.... ఆయనెవరో తెల్సా..... మారుతీ ఉద్యోగ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్... ఏదో పనిమీద ఇక్కడకొచ్చారు. ఒక్క గంటలో ఆయన దగ్గరకు నే వెళ్ళాలి.... నువ్వొస్తేరా... వస్తేనే బాగుంటుంది...."
   
    "ఇట్స్ ఏ గుడ్ ఆపర్చూనిటీ సార్.... వస్తాను..." అన్నాడు వికాస్ ఎగ్జయిటింగ్ గా.
   
                                     *    *    *    *    *
   
    జుహూ ప్రాంతంలోని-
   
    హాలీడే ఇన్ ఇంటర్నేషనల్ హోటల్లో-
   
    డీలక్స్ సూట్-
   
    ఆర్.సి. భార్గావికి యాభై ఆరేళ్ళుంటాయి. అతి తక్కువ సమయంలో, అతి ఎక్కువ ప్రాచుర్యం పొందిన 'మారుతి' కంపెనీని అభివృద్ధి పధంలో పెట్టిన మేధావి. టెక్నాలజీ జపాన్ దే అయినప్పటికీ "THE BEST RUN PUBLIC SECTOR COMPANY' గా మారుతీకి గుర్తింపు రావడానికి ఆయన చేసిన సేవలు అత్యద్భుతం.
   
    మారుతీలో వహ్చిన ఇటీవలి గొడవలు.... రాజకీయాలు.... ప్రభుత్వాల మార్పు.... నాయర్, భార్గవ అరగంటసేపు ముచ్చటించుకున్నారు.
   
    ఆ తర్వాత-
   
    వికాస్ ని పిలిచి భార్గవకు పరిచయం చేశాడు నాయర్.
   
    వికాస్ 'యాంబినేషన్' గురించి చెప్పాడు సంక్షిప్తంగా.
   
    "నువ్వు చేస్తున్నది పెద్ద సాహసమే.... అంబాసిడర్, ఫియట్, చివరకు మా కంపెనీ సయితం మీమీద అసూయపడి అడ్డంకులు సృష్టించే ప్రమాదం పొంచి ఉంటుంది. నీ బ్యాటరీ కారు నిజంగానే సక్సెస్ అయితే, పెట్రోలు, డీజిల్ తో నడిచే కార్లను తయారు చేసే కంపెనీలు దివాళా తీస్తాయి. ప్రస్తుతం ఉన్న ఉత్పాదక యంత్రాల్ని పాత ఇనుప సామాను క్రింద అమ్మేసుకోవాలి. ఏది ఏమైనప్పటికి మీలాంటి యువ పారిశ్రామికవేత్తలు ప్రత్యామ్నాయాల్ని అన్వేషిస్తూ దేశాన్ని అభివృద్ధి పధంవేపు నడిపించే ప్రయత్నాలు అత్యంత అభిలషణీయం. మీ విజయం, మీ బ్యాటరీ శక్తి సామర్ద్యాలమీదే ఆధారపడి ఉంటుందని విస్మరించవద్దు. Any car that aould aappeal ti customers had to have three main features : great styling, strong performence, and a low price. Developing a new model battery car will all three would not be easy...." అంతర్లీనంగా వికాస్ కి ఉత్తేజాన్నిస్తూ చెప్పాడు భార్గవ.
       
    ఆయనతో మాట్లాడుతున్నంతసేపు ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టుగా అనుభూతి చెందాడు వికాస్.
   
    "ఎప్పుడైనా ఢిల్లీ వస్తే రండి.... ఇవ్వాళ ఆటోమోబైల్ ఇండస్ట్రీ మీలాంటి యువకులు చేతుల్లోనే మార్పు చెందాలి. కాలానికి ఈ పరిశ్రమ అద్దం లాంటిదని నా నమ్మకం.... అందుకే మార్పు అనివార్యం.... ఫలితం వచ్చేదాకా కష్టపడటం, ప్రధానం.... ఐ విష్ యూ ఆల్.... ది సక్సెస్..." నవ్వుతూ అన్నాడాయన.
   
    "థాంక్యూ సర్...." నాయర్ తో లేచి నిలబడ్డాడు వికాస్.
   
    "బ్రిలియెంట్ బాయ్..." మెచ్చుకోలుగా అన్నాడు భార్గవ.
       
    అక్కడనుంచి వచ్చేశారు. అక్కడ నుంచి నాయర్ వికాస్ ని డన్ లప్ కంపెనీకి తీసుకెళ్ళాడు.   
   
    ఆరోజు మూడుగంటలు అక్కడ గడిచిపోయాయి.
   
    మర్నాడు-

 Previous Page Next Page