Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 32


    అక్కడ జనసమ్మర్ధంగా వుంది.

    ఇప్పుడు త్రినాధ్ కి మరికాస్త దగ్గరగా వెళ్ళినా తనను చూడలేడనిపించి ప్రియాంక మరికాస్త ముందుకు వెళ్ళింది.

    ఇక్కడ త్రినాధ్ కేం పని?

    ఇక్కడ అతని ఫ్యాక్టరీ లేదు. కంపెనీ బ్రాంచ్ అయినా లేదు. ఈ మురికివాడలో అతను నిర్దేశించుకున్న లక్ష్యమేమిటి? ఆమెకంతా అయోమయంగా వుంది. త్రినాధ్ అక్కడెవరితోనో మాట్లాడుతున్నాడు. ప్రియాంక జనాల మధ్య నుంచి నిశ్శబ్దంగా గమనిస్తోంది.

    త్రినాధ్ ఎదురుగా వున్న మనిషి ఆ వేపు చేయి చూపిస్తూ ఏదో చెబుతున్నాడు.

    అతను త్రినాధ్ ముందు నుంచి తప్పుకుని కల్లుపాకలోకి వెళ్ళిపోయాడు.

    త్రినాధ్ కల్లుపాకకు కొంచెం ముందుగా వున్న చిన్న కాకాహోటల్ ముందు రోడ్ వారగా వేసి వున్న బల్లమీద కూర్చున్నాడు.

    క్షణాలు... నిమిషాలు... గడిచిపోతున్నాయి.

    అంతలో ఏదో అలజడి- జనాలు ఒకింత భయంతో ప్రక్కకు తప్పుకుంటున్నారు.

    సడన్ గా వారిలో ఆ మార్పు ఎందుకు వచ్చిందో అర్ధంకాక ప్రియాంక ఓ ప్రక్కకు ఒదిగి నించుంది.

    ఉదయం ఏడుగంటలు కావస్తోంది.

    సడన్ గా ఆ వీధిలోకి ఒక డాడ్జ్ వ్యాన్ ప్రవేశించింది. చూస్తుండగానే అది స్లో అవడం, అందులోంచి నలుగురు వ్యక్తులు దిగడం, వారు సరాసరి షాప్స్ దగ్గరకు వెళ్లడం జరిగింది.

    వ్యాన్ నడిరోడ్డుమీద ఆగిపోయి వుంది.

    ప్రతి ఒక్కరూ భయంగా వ్యాన్ కేసి చూసి సలాంకొట్టి సాగిపోతున్నారు.

    అంతలో అంతక్రితం త్రినాధ్ లో మాట్లాడిన వ్యక్తి కల్లుపాకలోంచి పరుగెత్తుకు వచ్చి త్రినాధ్ కేదో చెప్పి వెంటనే ప్రక్కకు తప్పుకున్నాడు.

    త్రినాధ్ బెంచి మీంచి లేచి నిలబడ్డాడు.

    ఓసారి ఒళ్ళు విరుచుకుని షాప్స్ వెంట నడుస్తూ వస్తూన్న నలుగురు వ్యక్తులకు ఎదురుగా వెళ్ళసాగాడు.

    ఇప్పుడిక త్రినాధ్ దృష్టి వెనక్కు మరలదని నిశ్చయించుకుని మరికొంత ముందుకు నడిచింది ప్రియాంక.

    ఇప్పుడు మరింత స్పష్టంగా త్రినాధ్ కనిపించడమే కాక, మాటలు కూడా వినిపిస్తున్నాయి.

    "మీతోటే పనుండి వచ్చాను..." త్రినాధ్ ఆ నలుగురు వ్యక్తుల్ని వుద్దేశించి అన్నాడు.

    ప్రియాంక మరింత ముందుకు నడిచి ఓ షాప్ లోకి వెళ్ళి కౌంటర్ ప్రక్కనే నుంచుంది.

    "మాతో ఏం పని బే...." ఆ నలుగురిలో ఒకడు అడిగాడు కర్కశంగా.

    "నేను వసుంధరా ఆటోమోబైల్ కంపెనీలో వర్కర్ ని..." ప్రశాంతంగా అన్నాడు త్రినాధ్.

    యుద్ధానికి ముందు ప్రశాంతత అది.

    ఎదురుగా వున్న నలుగుర్నీ మొదటి చూపులోనే అంచనా వేసుకున్న త్రినాధ్ అలవోకగా వ్యాన్ వైపు చూసి అందులో వున్న ఇద్దర్నీ కూడా అంచనా వేశాడు.

    ఇప్పుడు సరీగ్గా ప్రియాంక వున్న షాప్ కి కేవలం పదడుగుల దూరంలోనే వున్నారు వాళ్ళు.

    "ఈ రోజే కదా మీకు జీతాలు? సాయంత్రం జీతాలిచ్చే టైమ్ కి వస్తాం. మీ జీతాల్లో పదిశాతం మా బాస్ కు మామూళ్ళుగా ఇవ్వాలని రాత్రే వెళ్ళి గుర్తుచేశాం. దాని గురించి చెప్పడానికే వచ్చాం..." మరొకడు నిర్లక్ష్యంగా అన్నాడు.

    అప్పటికే ఆ చుట్టుప్రక్కల నిశ్శబ్దం పరుచుకుంది. అక్కడేదో ఉపద్రవం ఉద్భవించనున్నదని ప్రతి ఒక్కరూ టెన్షన్ తో చూస్తున్నారు.

    ప్రియాంకకు విషయం పూర్తిగా అర్ధమైపోయింది. ఈ ఎత్తుకు ఎదిగాడు త్రినాధ్ అని అంచనా వేసుకునేలోపే మరెంతో ఎత్తుకు ఎదిగి వున్నాడని అనిపిస్తున్నాడు ఒక్కో సంఘటన ఎదురయినప్పుడల్లా.

    ఏం జరగనున్నదోనని ఆమె వేగిరపడుతోంది. "ఆ రౌడీలకు ఎదురుబడి మాట్లాడుతున్నాడు. బ్రతకాలని లేదా ఇతనికి పాపం...?" షాపతను మెల్లగా అన్నాడు తనలో తాను అనుకుంటున్నట్టుగా.

    ఆ మాటలు ప్రియాంకకు వినిపించి, ఓ క్షణం వులిక్కిపడింది.

    "అవును. దాని గురించే చెప్పడానికి వచ్చాను. మీ మామూళ్ళు ఇస్తామని కాదు, ఎందుకివ్వాలని ప్రశ్నించడానికి..." త్రినాధ్ కంఠంలో తీవ్రత చోటు చేసుకుంది.

    ప్రియాంక చురుగ్గా ఆలోచిస్తోంది.

    తనెవరో తెలీకుండా తన ఫ్యాక్టరీ కార్మికులకు రౌడీల బెడద వదిలించాలనుకున్నాడు. దానికి పోలీసులున్నారు గదా? వారికి కంప్లయింట్ ఇస్తే సరిపోతుందిగా?! మరెందుకు తనే మొండిగా ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాడు?!

    అర్ధంకాదా? లేక అర్ధం చేసుకునే స్థాయి తనకు లేదా?

    ఒకవేళ ఇప్పుడు ఆ నలుగురూ త్రినాధ్ పై కలబడితే?

    ఆ నలుగురికీ తోడు వ్యాన్ లో వున్న వ్యక్తులు దిగితే? అందర్నీ త్రినాధ్ ఒక్కడూ ఎదుర్కోగలడా? ఆమెకు తెలీకుండానే త్రినాధ్ సెక్యూరిటీ పట్ల భయపడింది.

    ఎలా...? ఎలా ఈ ప్రమాదం నుంచి త్రినాధ్ ను కాపాడుకోవడం? త్రినాధ్ ఇంత మొండివాడేం? ఆమెకు అతనిమీద కోపం కూడా వుంది. ఒకవేళ తనే ఆ సమస్యను పరిష్కరించాలనుకున్నా, బోస్ లాంటి వ్యక్తిని అండగా తీసుకురావచ్చుగదా?

    అంతే.... ఆమె ఇంతసేపూ పడిన ఆందోళన బోస్ స్పురణకు రాగానే తగ్గిపోయింది.

    ఆమె వెంటనే ఫోన్ ఎత్తింది.

    ఆమెకు బోస్ నెంబర్ తెలీదు.

    197కి ఫోన్ చేసి వసుంధరా ఇండస్ట్రీస్ హెడ్డాఫీస్ ఫోన్ నెంబర్ కనుక్కోవాలనుకుంది ముందు.

    ఆమె నెంబర్ డైల్ చేస్తూ మధ్య మధ్యలో రోడ్ మీదకు చూస్తోంది.

    "ఎందుకివ్వాలా...?" అంటూ ఒకడు విసురుగా చేతిని త్రినాధ్ మీదకు విసిరాడు.

    అప్పటికే అప్రమత్తంగా వున్న త్రినాధ్ ఆ దెబ్బ నుంచి తప్పించుకున్నాడు ఒకడుగు సడన్ గా వెనక్కి వేసి.

    తను వేయబోయిన దెబ్బ మిస్ అయిందే అని అతను వుగ్రుడయ్యాడు.

    "రౌడీ మామూళ్ళు ఎందుకివ్వాలా? అదేం ప్రశ్న? ఇవ్వాలంతే! దానికి లాజిక్ లేదు... వుండదు" అంటూ మరొకడు మరికొంచెం ముందుకొచ్చాడు.

    "ఏమిట్రా వీడికి సమాధానం చెప్పేది? నాలుగు బాదిపడెయ్యక" అంటూ మరొకడు ఎగిరి త్రినాధ్ మీదకు జంప్ చేశాడు.

    అప్పటికిగాని త్రినాధ్ యుద్ధం అనివార్యం అనే నిర్ణయానికి రాలేదు.

    త్రినాధ్ క్రింద నుంచి లేస్తూ ఫాంట్ కి అంటిన దుమ్మును దులుపుకుంటూ నలువేపులకు చూశాడు. చుట్టూ జనం. ఇసుకవేస్తే రాలనంతగా జనం. అందర్నీ ప్రక్కకు జరగమని కళ్ళతో సైగచేస్తూ షర్ట్ చేతులు పైకి మడుచుకున్నాడు.

    అంతలో వ్యాన్ లో వున్నవాళ్ళకు అనుమానం వచ్చింది. తమ మనుష్యులు ఎందుకో ఓచోట ఆగిపోయినట్లు వాళ్ళు గ్రహించారు. ఏం జరుగుతుందో చూద్దామంటే చుట్టూ జనం గుమికూడి గోడలా అడ్డుపడ్డారు.

    వ్యాన్ లోంచి ఓ వ్యక్తి దిగి గుంపుకేసి రానారంభించాడు.

    "హలో... ఈజిట్ వసుంధరా ఇండస్ట్రీస్...?" ప్రియాంక ఫోన్ లో అడిగింది.

    "ఎస్..." ఆవైపు నుంచి సమాధానం వచ్చింది.

    "హెచ్.బి.ల్యూబ్ ఇన్ ఛార్జ్ ఫోన్ నెంబరిస్తారా?"

    "యూ మీన్ డైరెక్టర్ బోస్...?"

    "ఎస్... ప్లీజ్..." ప్రియాంక తన జీవితంలో ప్లీజ్ అనే మాటను వుపయోగించింది అదే తొలిసారి.

    "జస్ట్ ఎ మినిట్- బికాజ్ ఐయామ్ న్యూ దిస్ బోర్డ్-"

    యుద్ధం మొదలైపోయింది.

    నలుగుర్ని ఒక్కసారి ఎదుర్కోవడం త్రినాధ్ కంత కష్టం కాలేదు.

    హోరాహోరి- నలువేపుల నుంచి కమ్ముకు వస్తూన్న నరహంతకుల్ని అప్రమత్తతతో కాచుకుంటూ, వీలు చూసుకుని వడుపుగా దెబ్బ తీస్తున్నాడు త్రినాధ్.

    అక్కడున్న అందరిలో త్రినాధ్ పట్ల సానుభూతి, అభిమానం ఏర్పడ్డాయి.

    కొందరైతే త్రినాధ్ ని తమ కష్టనష్టాల్ని ఆపడానికి వచ్చిన భగవంతుడిలా భావిస్తున్నారు.

    ఈలోపు వ్యాన్ లోని వ్యక్తి జరుగుతున్న యుద్ధకాండను కనిపెట్టేసి చటుక్కున వ్యాన్ కేసి పరుగెడుతూ "మనవాళ్ళను ఎవడో ఉతికేస్తున్నాడు" అంటూ పొలికేక పెట్టాడు.

    అంతే- యాదవ్ చటుక్కున వ్యాన్ లోంచి దిగి గుంపుకేసి దూసుకురాసాగాడు.

    "అర్జంట్ ప్లీజ్-" ప్రియాంక నుదురంతా స్వేదంతో నిండిపోయింది.

    "ఎస్ ప్లీజ్... హౌస్ నెంబర్ 223344" ఆవేపు నుండి మాటలిమ్కా పూర్తి కాకముందే లైన్ ని కట్ చేసి బోస్ ఇంటికి డైల్ చేసింది.

    ఒకడు చాటు నుంచి వేసిన దెబ్బకు త్రినాధ్ భుజం సర్రున చీల్చుకుపోయింది.

    చివ్వున చిమ్మిన రక్తం అతని ఖాకీ బట్టల్ని వరదలా తడిపేసింది.

    అప్పటివరకు అవతలివాళ్ళూ మనుష్యులే అన్న భావనలో వున్న తిమ్మడు ఒక్కసారి దెబ్బతిన్న పులిలా పొలికేక పెడుతూ గాల్లో డైవ్ చేసి ఎదురుగా దూసుకు వస్తున్న వ్యక్తి గుండెలమీద తన్నాడు.

    అంతే... అతను చావుకేక పెడుతూ మొదలు తెగిన చెట్టులా విరుచుకుపడిపోయాడు.

    అది చూడ్డంతో మిగతా ముగ్గురిలో ఒకింత జంకు ప్రవేశించింది.

    వారి ముఖాల్లో మారిన భావాన్ని తేలిగ్గా చదివేసి నడుంచుట్టూ వున్న బెల్టుని సర్రున బయటకు లాగాడు.

    ఎంతో కాలంగా తన సిబ్బంది రక్తాన్ని పీల్చుకు తాగుతున్న ఆ రౌడీలే ఇప్పుడతని లక్ష్యం....

    చూసేశాడు- గోవింద్ యాదవ్ త్రినాధ్ ని అల్లంత దూరంనుంచే చూసేసి షాక్ తిన్నాడు.

    అతనికి కొద్దిక్షణాలు కర్తవ్యం గోచరించలేదు. ఇప్పుడు... ఇక్కడెవరూ తన మనుష్యులు అతని చేతిలో చావుదెబ్బలు తినకుండా రక్షించలేరు.

    గోవింద్ యాదవ్ ని ఇంకా త్రినాధ్ చూడలేదు.

    రక్తంతో తడిసిపోయిన బట్టలతో మూడో నేత్రాన్ని తెరిచిన శివుడిలా మండిపోతున్నట్టున్నాడు త్రినాధ్.

    నిశ్శబ్దం... అంతటా శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకుంది.

    ఎవరి గుండె చప్పుడు వారికే స్పష్టంగా వినిపిస్తోంది.

    అన్ని వందలమంది అక్కడున్నా ఏ ఒక్కరూ నోరు తెరిచేందుకు, అంగుళం మేర కదిలేందుకు వాళ్ళు రావడం లేదు. సాహసించడం లేదు.

    "హలో ఈజిట్ 223344?" ప్రియాంక కంఠంలో ఆందోళన.

    "ఎస్... మే ఐ నో హు ఈజ్ స్పీకింగ్?" ఎవరిదో మగగొంతే వినిపించింది ప్రియాంకకు ఆ వేపునుంచి.

    "ఐ వాంట్ మిస్టర్ బోస్..." ప్రియాంక మాటలు తడబడుతున్నాయి.

    "వాటీజ్ ది మేటర్?" ఆవైపు నుంచి చాలా తాపీగా వచ్చిన ప్రశ్నకు ప్రియాంక ఒక్కసారి ఫైరైపోయింది.

    "యూ స్టుపిడ్ రాస్కెల్... త్రినాధ్ పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు..." ప్రియాంక మాటలింకా పూర్తికాకముందే ఆ వైపు నుంచి నవ్వు వినిపించింది.

    "ది గ్రేట్ త్రినాధ్ కి ప్రమాదమా? ఆర్ యూ జోకింగ్?" తిరిగి ఆ వైపు నుంచి హేళనతో కూడిన నవ్వు వినిపించింది.

    ఆ వెంటనే ఫోన్ పెట్టేసిన శబ్దం.

 Previous Page Next Page