"ఎక్కణ్ణుంచొచ్చేరు మీ రిద్దరూ. ఆ పిల్లని ఎక్కడ కొట్టుకొచ్చారు" అని రాజ్యాంగాతీతమైన భాషలో అడిగాడు.
"ఒరేయ్ సత్యం.....వాళ్ళిద్దర్నీ ఏవయినా అన్నావంటే నీ కళ్ళు పోతాయ్ నువ్వు జైలుకెళ్ళిపోతావ్. వాళ్ళెవరనుకున్నావ్ కలెక్టరూ, గవర్నరూ"
"గర్భగుడిలో పూజారుల్లా వున్నారు. వీళ్ళిద్దరూ కలెక్టరూ, గవర్నరూనా బాగానే వుంది బుద్ధిలేకపోతేగానీ, కలెక్టరు, గవర్నరూ నీ దగ్గరకు రావడానికి వాళ్ళకేం పనులేవీ వుండవా......"
"అదికాదురా......వాళ్ళ అమ్మాయిని మన నారాయణకి ఇవ్వడానికొచ్చార్రా?"
"ఆహా.....మనోడు భూలోక రంభడని.....ఈ ఊర్వశిని యివ్వడానికొచ్చారు. ఈళ్ళిద్దరూ కలెక్టరూ కాదు, గవర్నరూ కాదు. వీళ్ళని చూస్తుంటే నాకు సినిమా హాళ్ళదగ్గర బ్లాక్ టిక్కెట్లు అమ్మేవాళ్ళలా కన్పిస్తున్నారంతే ....వీళ్ళంతా డ్రామాలాడి, నీ దగ్గరున్న డబ్బు కొట్టీడానికి వచ్చారంతే-ఈ పిల్లకూడా ఈ నాటకంలో ఒక భాగమే-ఇక్కడిలా జరుగుతున్నదని తెలియగానే ముందు పోలీస్ రిపోర్టిచ్చి తర్వాత తీరుబడిగా ఎడ్లబండిమీద వచ్చాను. ఇంకా పావుగంటలోనో, అరగంటలోనో పోలీసులొస్తారు. అప్పుడే తెలుస్తుంది వీళ్ళ అసలు భాగోతం" గుక్క తిప్పుకోకుండా చెప్పి, తీరుబడిగా చుట్ట వెలిగించుకున్నాడు.
"పోలీసులు" అనే పేరు వినబడగానే దాదా గుండె ఠారుమంది- నెమ్మది నెమ్మదిగా వెనక్కి నడవడం ప్రారంభించాడు.
పోలీసులొస్తే అసలు కథంతా చెప్పాల్సి వస్తుంది. అంచేత ఇక్కడనుంచి తప్పించుకుని పారిపోతేనే బెటరని మనసులో నిర్ణయించుకున్నవాడయి జానకివేపు చూసి కన్నుగొట్టాడు సరదాపటేల్.
"ఒరేయ్ సత్యనారాయణా, నువ్విలా రారా" అని అనగానే సత్యనారాయణ ముందుకెళ్ళి నిలబడ్డాడు.
"ఒరేయ్ నువ్వెన్ని గొడవలు తెచ్చినా రహస్యపు గూఢచారుల్ని పెట్టినా, కిందా మీదాపడి తపస్సు చేసినా, నీ కూతుర్ని నా మనవాడికి నేను చేసుకోనుగాక చేసుకోను. అధి చెప్పడానికే దగ్గరగా రమ్మని పిల్చిందీ......దూరంగా..... వెళ్ళిపో.....పో.... ...."అని గసిరేసింది కాంతమ్మ.
"చూస్తాను నేను చూస్తాను. మంచిగా చెప్పి చూసాను. ఒకటో సారి, రెండోసారి నువ్వు వినలేదు. మరి మూడోసారి ట్రై చేస్తాను. అప్పుడు గట్టిగా ట్రై చేస్తాను. అప్పుడుకూడా నువ్వు వినలేదనుకో రక్తపాతాలు జరిగిపోతాయంతె...." మీసం మెలివేసాడాయన.
"నీకు అందుబాటులో వున్నవన్నీ మెలేసుకో. నాకేం నష్టవా చెప్పు. నీ కసలు పిల్లాడిమీద ప్రేముందట్రా అసలు. నా ఆస్థిమీద తప్ప.....చూడు నేను అనాధ పిల్లయిన ఈ జానకిని, నారాయణరావు కిచ్చి పెళ్ళి చెయ్యడానికి నిర్ణయించాను. రేపో నేడో నారాయణరావు రాగానే ముహూర్తాలు పెట్టించేస్తానంతే" అంటూ తల పక్కకు తిప్పి చూసింది.
తన పక్కన కూర్చున్న జానకి కనపడలేదు.
స్తంభాలవేపు చూసింది.
కలెక్టర్ గానీ, గవర్నర్గానీ ఇద్దరూ కనిపించలేదు. వాకిలివేపు చూసింది. రెండు కార్లుకూడా కనబడలేదు.
"అందరూ ఏవైపోయార్రా?" ఉగ్రంగా అరిచిందావిడ.
"ఒకరివెనుక ఒకరు నెమ్మదిగా జారుకున్నారమ్మగారూ" పాలేరు చెప్పాడు.
"కార్లేవైపోయాయి. కనీసం సౌండ్కూడా చెయ్యలేదే" మరీ విస్తుపోతూ అడిగిందావిడ.
"సౌండ్ నీకు వినిపించకుండా, కార్లను తోసుకుంటూ వెళ్ళి పోయారు" సత్యనారాయణ అన్నాడు.
"అకస్మాత్తుగా వాళ్ళెందుకలా వెళ్ళిపోయారు. ఒరేయ్ సత్యం, నిన్నూ నీ మాటల్నీ చూసి జడిసిపోయి వాళ్ళలా వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ కడుపు నిండింది కదా .....వెళ్ళు"
"వాళ్ళు నా కారణంగా వెళ్ళిపోలేదు. పోలీసులకు జడిసిపోయి వెళ్ళిపోయారు.
"వాళ్ళెవరనుకున్నావ్ కలెక్టర్, గవర్నరూ"
"నోరుముయ్యవే.....కలెక్టరట.....గవర్నరట.....గవర్నరూ.....నీ డబ్బుకోసం నాటకాలాడిన దొంగలు వాళ్ళు.....అందులో కలెక్టర్ వేషం వేసిన సూటువాలా వున్నాడు చూసావూ-
"వాడు పెద్ద కేడీ" చెప్పాడు సత్యనారాయణ.
కేడీలు, దొంగలు గజదొంగల ఊసులంటే చాలా యిష్టం బామ్మకు.
"అదికాదురా సత్యం....వాడు కేడీగాడని నీకెలా తెల్సిందిరా....చెప్పరా......సస్పెన్స్ విడిపోకపోతే నాకు నిద్ర పట్టదురా" బతిమాలింది సత్యనారాయణను.
"నేను విశాఖపట్నం ఎన్నిసార్లు వెళ్లుంటాను"
"చాలాసార్లు"
"వూళ్ళోకి వెళ్ళగానే రైలుస్టేషన్ వస్తుందిలే.....ఆ స్టేషన్ లో వీళ్ళ ఫోటోలు ఫ్రేములో కట్టిపెడతారు. సరిగ్గా టైముకి నేను రాబట్టి సరిపోయింది"
కాంతమ్మకు ఒక్కసారి గుండె గుభేలుమంది.
"మరయితే ఆ రెండోవాడెవరంటావ్"
"వీడి శిష్యుడు వాడు....వాడి ఫోటో ఏ బస్టాండ్ లోనో వుండి వుంటుంది. నేనీసారి వైజాగ్ వెళ్ళినప్పుడు.....అక్కడ ఫోటో వుందో లేదో చూసొచ్చి చెప్తాలే_సరేనా" జానకి గొడవ తప్పినందుకు కొంచెం హాయిగా వుంది సత్యం మనసుకు.
అంతలో లోపలనుంచి సుబ్బారావు వచ్చాడు. వచ్చీ రాగానే పక్కన కూర్చుని-
"ఏదో నీ ఆస్తిని, నేను చిన్నప్పుడు జ్యోతిలక్ష్మి, రాజసులోచన సినిమాలకు తగలెట్టేసానని నామీద నీకు కోపం వుండొచ్చు....నా మీద కోపాన్ని సురభిమీద చూపెట్టడం ఏం న్యాయం. మన నారాయణ్రావ్ అంటే సురభికి పంచ ప్రాణాలు నీకు తెలుసుకదా"
"ఒరేయ్ సుబ్బారావ్! నేను సత్తానికి ఎనిమీని కావచ్చుగానీ.....సురభికి కాదుగదరా..... నారాయణరావు ఇష్టపడితే అంతకన్నా నాకు ఆనందం కలిగించే విషయం ఏవుందిరా"
ఆ మాటలకు వడదెబ్బకొట్టిన వాడిలా అయిపోయాడు సత్యనారాయణ.
"బామ్మా! మావయ్యకు నేనంటే___యిష్టమేనే.....అల్లరి మొగుడు సినిమాకు అయిదేళ్ళక్రితం తీసికెళ్ళినప్పుడు మావయ్య నాకు చెప్పాడు" సురభి వాళ్ళ బామ్మతో చెప్పింది.
"యిష్టమయితే వాడిచేత చెప్పించండి.....వాడు ఎవడి మెడలో మూడుముళ్ళు వేస్తాడో, ఆ పిల్లకే నా ఆస్థి రాస్తాను....ఆ మాటమీదే నేనుంటాను" తల్లి మాటతో ఉత్సాహభరితుడై పోయాడు సుబ్బారావ్.
"వచ్చిన పనయి పోయింది పదవే పిల్లా.....నేను రేపే వైజాగ్ వెళ్ళి.....నారాయణరావు నోటెంటే చెప్పిస్తాను__సురభిని తప్ప నేను మరెవర్నీ చేసుకోనని సరేనా" ఉత్సాహంగా ముందుకు నడిచి ఎడ్లబండి ఎక్కాడు సత్యనారాయణ. ఆ వెనక అంతకన్నా ఉత్సాహంగా ఎక్కి, గూడులో కూర్చుంది సురభి.
నారాయణరావు మావయ్య కనక తనను పెళ్ళి చేసుకుంటే, యిద్దరూ హాయిగా ఎంచక్కా ఎడ్లబండిలో ఎక్కి, పాటలు పాడుకుంటూ తిరగొచ్చును అనే ఊహ ఆమె మదిలో మెదిలేసరికి-
అప్రయత్నంగా ఆమె నోటివెంట, ఆమె యిష్టంగా ఎప్పుడూ పాడుకునే పాట వచ్చేసింది.
"బావాబావా బంతీపూవా పండక్కి నా బండెక్కవా"
కూతురు సంతోషాన్ని చూసి తండ్రి మరింతగా సంతోషించాడు.
* * * *