Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 31

                                     18


    ఉదయం ఎనిమిది గంటలవేళ గంగారత్నం ఆమె ముద్దుల ముప్పై ఏళ్ళ పుత్రరత్నం దిగారు.

    భుజంగరావుకి అక్క వరస అవుతుంది గంగారత్నం. సరీగ చెప్పాలంటే బీరకాయపీచు దూరం చుట్టం. భుజంగరావు మంచితనం వల్ల అప్పుడప్పుడూ వచ్చి నెలో రెండునెలలో మకాం జేసి వెళుతుంటుంది.

    గంగారత్నం కాషాయ రంగులో వున్న చీర జాకెట్టు ధరిస్తుంది. మనిషి లావు. మనిషిని మించి వున్నట్లుంటుంది ఆమె తల. అంత పెద్ద తలకి వేలుముడి చిన్న నిమ్మకాయ అంతది వేస్తుంది. పెద్ద రాళ్ళగొలుసు చేతికి బంగారు గాజులు ఓ వుంగరం నిత్యం ధరిస్తుంది. అవిగాక లావుపాటి పొగడాలదండ హర్నిసెలూ మెడలో వుండాల్సిందే. పెద్ద నుదురు చట్టిముక్కు గీకిరికళ్ళు విచిత్రంగా కానవస్తుంది. వీబూధి బొట్టు దాని మధ్యలో తిరుచూర్ణం బొట్టు పెట్టుకుంటుంది. వున్న వికారాలు చాలకన్నట్లు మాటకుముందు "నాకేం కావాలి, నెత్తిన గొడుగు లేనివాదాన్ని?" అంటూ తాను విడోనన్న విషయం గుర్తుచేస్తుంటుంది. "వెధవ పాడుపొట్టకి ఎంత కావాలి గుప్పెడు మెతుకులు ఎక్కీ తొక్కా!" అంటుంది. అవలీలగా అర్ధసేరు బియ్యం అన్నం లాగేస్తూ.

    గంగారత్నం విషయం అలా వుంటే ఆమె పుత్రరత్నం త్రయంబకరావు సంగతి సరేసరి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమ్మ కొడుకు, వళ్ళు లావు తలలావు వగైరా వగైరా గంగారత్నం ఆడది త్రమంబకరావు మగవాడు. వాళ్ళ వేషధారణ బట్టి ఆడ మగ తెలుస్తుంది అంతే. అంత పోలికలు వాళ్ళిద్దరివీ.

    గంగారత్నం త్రమంబకరావు వాళ్ళ సామానులు వాళ్ళే మోస్తూ హాలుదాకా వచ్చి సామానులు అక్కడ దించారు. ఒక రేకు పెట్టె, హోల్డాలు, మరో తోలుపెట్టె ఒక బ్యాగ్. పెద్దపొట్ట వున్న గుండు మరచెంబు. ఎల్.జి. ఇంగువవారి చేతిసంచి, యివీ సామానులు.

    చుట్టాలు వచ్చారన్న వార్త లోపలికి వెళ్లగా భుజంగరావు అమల బైటికి వచ్చారు.

    విచిత్ర విడ్డూర వింత కొత్త ముఖాలను చూసి అమల గుమ్మం దగ్గరే ఆగిపోయింది.

    "నేనే రా తమ్ముడూ! నీ అక్కని గంగారత్నాన్ని. తెల్లవారుఝామున అనగా తగలడాల్సిన బండి యింతకు ముందు వచ్చి చచ్చింది. దిక్కుమాలిన స్టేషనులో అద్ధాన్నంగా వున్న ఆ కాఫీనీళ్ళెం తాగుతాను చెప్పు? పాడు నీళ్ళు తెల్లారుతూనే ఆ నల్లనీళ్ళు కడుపులోకి జారకపోతే తల తిరుగుడెంటి తలనొప్పి ఏంటి!" అంటూ తల నొక్కుకుంది గంగారత్నం.

    "అందుకేగా తాగమన్నాను. తాగనంటే తాగనంటివి అది కాఫీకాదు. చూరునీళ్ళు అంటివి. చూరునీళ్ళో చారునీళ్ళో ఏదో ఒకటి ఏమంటావు మామయ్యా!" త్రయంబకరావు అడిగాడు.

    "నీ తెలివే వేరు. అమ్మ అంటే పెద్దది." నవ్వుతూ అన్నాడు భుజంగరావు.

    "నేనెంత పెద్దదాన్ని తమ్ముడూ! నెత్తిమీద గొడుగుపోవటం. అలంకారాలు త్యజించటంతో సన్యాసినిలా కాస్త పెద్దదానిలా వున్నాను అంతే. త్రయకన్నా పదేళ్లు పెద్ద దానిని. అంతే, నాకిలా పదోఏడు నిండిందో లేదో వాడలా కడుపునపడ్డాడు అంతే. వాడికీ నాకూ పదేళ్లు తేడా. త్రయానికి యిప్పుడు పాతికఏళ్లు. అంటే నాకు ముప్పై అయిదు......

    "ఈ గంగారత్తమ్మ పెదవి కదిపిందంటే చాలు వాక్ ప్రవాహం ఉరకలెత్తి ఉప్పొంగి పోర్లిపోతుంది" అనుకుంది అమల.

    ఆ తల్లీ కొడుకుల ఫార్స్ చూస్తూ అమల తాను పిచ్చి వేషాలు వేయాలన్న మాటే మర్చిపోయింది.

    "పదేళ్ళకే పిల్లలు పుడతారటే అమ్మా!" త్రయంబకరావు అడిగాడు.

    "ఓరి పిచ్చి సన్యాసీ, ఆరేళ్ళకే పెళ్ళి చేస్తే పదేళ్ళకి పిల్లలు పుట్టరా!" అంది గంగారత్నం.   

 Previous Page Next Page