Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 31

    
    శశి కూడా వాళ్ళతోపాటు నడవడం మొదలుపెట్టింది. "నాకు ఈ మధ్య తరచూ ఓ కల వస్తోందక్కా" అంది చిన్నగా ఆమె.

    "కలా? ఏమిటది?"

    "నా శరీరాన్ని ఏదో గుచ్చుకున్న అనుభూతి. అది అప్పుడప్పుడూ మొత్తం శరీరంలో బిగుసుకుపోయిన భావన. అది ఒక్కోసారి కదులుతున్నట్లు అనిపిస్తుంటుంది" చెప్పింది శశి.

    అదేమిటో వివరించలేకపోయినా చంద్రరేఖకి అర్ధమైంది. భర్తతో సుఖంలేని స్త్రీకి ఇలాంటి కల రావడంలో ఆశ్చర్యం లేదు. కలలో కన్పించే ప్రతి వస్తువుకి ప్రతి మాటకి ఏదో సంబంధం వుంటుంది. ఏదీ వూరకనే కలలోకి రాదు.

    "ఇంకేమైనా వస్తుంటాయా."

    "లేదక్కా. కానీ అప్పుడప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది"

    ఆమె మాట విని ఆగింది చంద్రరేఖ. ఏదో తెలియని బాధ గుండెను కలుక్కుమనిపించింది. శశిలాంటి అందమైన పిల్లకి, డబ్బున్న అమ్మాయికి అలా అనిపించటం ఎంత బాధాకరం?"

    "ఎందుకలా అనిపిస్తుంది?"

    "ఏమో తెలియదక్కా"

    నిజమే! మామూలుగా ఆలోచిస్తే మనకేం తెలియదు. మనసు అనేది మహాసముద్రం లాంటిది. అందులో ఏం వున్నాయో ఎవరికి తెలుసు?

    "అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అంతా బాగవుతుందిలే" అని ధైర్యం చెప్పింది. ఎవరో బిగ్గరగా మాట్లాడుతుంటే చంద్రరేఖ పక్కకి తిరిగి వెనక్కి తిరిగి చూసింది. భూపతిరెడ్డి వస్తున్నాడు. అతనిచుట్టూ పాతికమందిదాకా వున్నారు.

    " ఏమీ కారణం లేకుండానే ఇళ్ళు కాలిపోవు కదా! మనం వూహించని కారణం కూడా వుంటుంది. నాకయితే ఇధి ఎవరో బాణామతి ప్రయోగించినట్టు అనిపిస్తోంది" అన్నాడాయన.

    ఆయనవెంట వస్తున్న పాతికమందీ ఒక్కక్షణం ఆగారు. ఏదో భయం గుండెల్లో జరజరా పాకినట్లు హడలిపోయారు. అంతలోనే సర్దుకున్నారు.

    "నాకూ అదే అనిపిస్తోంది" వెంకట్రామిరెడ్డి అనే మరో రైతు భూపతిరెడ్డికి వంత పాడాడు.

    ఆ విధంగా భూపతిరెడ్డి ఊరి జనంలో ఓ విషపు బీజం నాటాడు. అది పెరిగి పెద్ద భూతమై ఎవర్నో ఒకరిని తినేస్తుందని ఆయనకి బాగా తెలుసు.

    ఆయనకి కావల్సింది కూడా అదే!

    ఈ మాటలన్నీ చంద్రరేఖ విన్నది. బాణామతిలాంటివి లేవని అరిచి చెప్పాలనిపించింది ఆమెకి. కానీ తన మాట ఎవరూ వినరు. ఏదో చిన్న జబ్బుచేస్తే డాక్టర్ కన్నా ముందు మంత్రగాళ్ళని సంప్రదించి తాయెత్తులు కట్టుకుని, విభూదిని నోట్లో వేసుకునే ఈ జనాన్ని బాగుచేయాలంటే కష్టపడాలి.

    "ఏవిటక్కా ఆలోచిస్తున్నావ్?" శశి అడగడంతో ఆమె ఆలోచనలు అటు నుంచి ఇటు తిరిగాయి.

    "ఏమీ లేదు" అంది చిన్నగా.

    అంతలో ప్రవీణ ఇల్లు వచ్చింది. "మరి నే వస్తాను" అని ప్రవీణ ఇంట్లోకి వెళ్లిపోయింది.

    "ఒక్కదానివే వెళ్ళగలవా? చిట్టిని మీ ఇంటివరకు తోడు పంపించనా?" చంద్రరేఖ శశిని అడిగింది.
 
    "వద్దులే అక్కా వెళ్ళగలను" అని నడక పెంచింది.

    అందరి సమస్యల్ని చప్పరిస్తూ చంద్రరేఖ తన ఇంటికి చేరుకుంది.

    పడుకుందిగానీ నిద్ర రావడంలేదు. ప్రవీణ గురించి ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లారగట్ట నిద్రపోయింది.

    ఆ రెండో రోజు ఫ్యాక్టరీనుంచి ఇంటి కొస్తుండగా ప్రవీణ తల్లి కనిపించింది.

    "నీ కోసం ఇంటికి రావాలనుకున్నాను. అదృష్టంకొద్దీ నువ్వే కనిపించావ్. ఫ్యాక్టరీనుంచా?" అంది.

    "అవునొదినా - ఏమిటి విషయం?"

    "రహస్యంగా చెప్పాలి. ఇక్కడొద్దు. మనింటికి వెళదాం పద" అని తన ఇంటివైపు దారితీసింది ఆమె.
 
    చంద్రరేఖ ఆమెను అనుసరించింది.

    ఇద్దరూ ఇంటికి వెళ్ళారు.

    కాఫీ తాగాక ఇంటి వెనుకనున్న పెరట్లో నులక మంచంవేసి, దాని మీద కూర్చున్నారు.
   

 Previous Page Next Page