"ఇక్కడ రౌడీలు పోలీసు వేషంలో ఉంటారా- చిత్రంగా ఉందే!" ఆశ్చర్యపడ్డాడు పోతురాజు.
"ఇంతకీ ఆ డ్రగ్ డీలర్ పేరేంటన్నావ్?"
"వాడికి రకరకాల పేర్లుంటాయ్! లాస్ట్ టైమ్, నేను వాడ్ని కల్సినపుడు వాడి పేరు జాకీస్రాఫ్!"
"అదేదో, సినిమా యాక్టర్ పేరులా ఉందే!"
"వాటిని నిక్ నేమ్స్ అంటార్లే!"
-గల్లీల్లోంచి బయటకొచ్చిన వారికి, పాడుబడ్డ బంగ్లా కనిపించింది.
"ఏంటిది?"
"ఇదే డేన్!"
వీళ్ళను చూడగానే, డేన్ ముందు మచ్చల చొక్కాలేసుకుని నిలబడ్డ ఒక వ్యక్తి వచ్చి రెండుసార్లు కుడిచెయ్యిపై కెగరేసాడు.
"స్వీట్ సాల్ట్..." అని వీర్రాజు కోడ్ వర్డ్ చెప్పాక, అతను ముందుకు నడిచాడు.
"డేన్ అంటే, సినిమా సెట్టింగ్ లా వుంటుందనుకున్నాను..." మెల్లగా అన్నాడు సేతురాజు.
సరిగ్గా అదే సమయంలో, ఓ రూమ్ ముందు బయట సేతురాజు, పోతురాజు నిలబడి వుండగా-
వీర్రాజు లోపలికెళ్ళి బాస్ తో మాట్లాడి వచ్చాడు.
రెండు నిమిషాల తర్వాత, పీల గొంతుతో, ఠీవిగా మాట్లాడుతూ వచ్చిన ఆ బాస్ ని చూసి ఖంగు తినేసారు సేతురాజు, పోతురాజులు.
ఆ వ్యక్తిని చూడగానే తెల్సిపోయింది - జూబ్లీ హిల్స్ బ్యాంక్ దగ్గర, వాడ్ని మోసం చేసి, ఆ సూట్కేసును కొట్టేసామనే విషయం!
"బాబ్బూబూ! మమ్మల్ని క్షమించు_సిటీలోకెల్లా పెద్ద రౌడీ బాసుననీ, డ్రగ్ డీలర్ వనీ తెలీక, ఈ పాడుపనిచేసాం. ఇదిగో నీ సూట్కేసు మమ్మల్ని వదిలెయ్!" సేతురాజు, పోతురాజు వాడి కాళ్ళమీద పడి వేడుకున్నారు.
అసలు పాయింట్ తెలీక ఆ బిగ్ బాస్ హనీఫావేపు, ఇద్దరు మిత్రుల వేపూ చూస్తున్నాడు.
"మీరు నన్నే మస్కా కొడతార్రా- అయినా దేవుడున్నాడ్రా....అందుకే నా బ్రౌన్ షుగర్ నా దగ్గరికి వచ్చేసింది. ఒరేయ్! వీళ్ళని కట్టి పడేసి, నాలుగు ఉతకండ్రా!" ఆజ్ఞ జారీచేసి, ముందుకు వెళ్తున్న హనీఫాని పట్టుకుని_
"మా ముగ్గురి మీద ఈగ వాలిందో- నీ డేన్ గురించి పోలీసులకు చెప్పేస్తాను. మర్యాదగా నీ బ్రౌన్ షుగర్ నువ్వు తీసుకుని, మమ్మల్ని వదిలిపెట్టేయ్!" వీర్రాజు బెదిరించాడు.
"పోలీసులకు చెప్పేస్తావా- చెప్పుకో పో! పోలీస్ స్టేషన్ ఎక్కడుందో తెల్సా? ఈ డేన్ ఎదురుగానే వుంది, చెప్పుకో ఫో!" అంటూ ఫడేల్మని ఒక్కటిచ్చాడు వీర్రాజు ముఖమ్మీద.
ఆ దెబ్బకు వీర్రాజు వెనక్కి పడిపోయాడు.
"నిన్ను బ్రౌన్ షుగర్ లా పొడి, పొడి చేసేస్తాం!" అంటూ పక్కనున్న రౌడీల పొట్టల మీద ఒక్కటి తన్ని, ముందుకురికారు సేతురాజు, పోతురాజులు- వాళ్ళని గట్టి దెబ్బ కొట్టేందుకు.
హనీఫాని, మిగతా ఆరుగురు రౌడీల్ని చితకగొట్టేస్తున్న సమయమలో అక్కడకో వ్యక్తి వచ్చి, ఆ ముగ్గురి ఫైటింగ్ నీ అబ్బురంగా చూస్తున్నాడు.
"ఒరేయ్! నీలాంటి చోటా, మోటా బ్రౌన్ షుగర్ డీలర్స్ నే కాదురా- బడా, బడా రియల్ షుగర్ డీలర్స్ నే కచ్చుకి తినిపించి, మూడు చెరువుల నీళ్ళు తాగించిన ముగ్గురు మరాఠీలం! జాగ్రత్త- మాతో పెట్టుకోకు. నీ డేన్ ధ్వంసమైపోద్ది!" అంటూ హనీఫా జుత్తు పట్టుకున్నాడు సేతురాజు.
"నన్నొదిలెయ్....మీకేం కావాలి?" భయపడుతూ అడిగాడు హనీఫా.
"ఏవక్కర్లేదు....ఇక్కడనుంచి బయటకు ఎలా వెళ్ళాలో చెప్పు." గాభరాగా అడిగాడు పోతురాజు.
చేత్తో దారి చూపించాడు హనీఫా. వెంటనే వీర్రాజు విజిల్ వేశాడు.
ముగ్గురూ, కిందపడిపోయి, లేవడానికి ప్రయత్నిస్తున్న రౌడీల్ని తన్నుకుంటూ, ఆ డేన్ లోంచి బయటకు పరుగెత్తసాగారు.
ఆ ముగ్గురి ఫైటింగును, సాహస పరాక్రమాల్నీ, వాళ్ళ చేతుల్లో బిగ్ బాస్ హనీఫా పూర్తిగా డౌన్ అయిపోవడాన్నీ చూసిన ఆ వ్యక్తి__సత్తిపండు!
సత్తిపండు అప్పటికప్పుడు ఒక నిర్ణయానికొచ్చేసాడు.
"తనక్కావలసిన రియల్ విలను హనీఫాగాడు కాదు" ఆ ముగ్గురూ- తనకవసరమైన వ్యక్తులు వాళ్ళే..."
అనుకుంటూ, ఆ డేన్ లోంచి బయటకొచ్చి కారెక్కాడు సత్తిపండు.
౦ ౦ ౦
చాదర్ ఘాట్ బ్రిడ్జీకి ఎడమవేపునున్న రెస్టారెంట్లో కూర్చున్నారు ముగ్గురు.
"ఆ దొంగల ముఠాతో ఫైటింగ్ చేయడంవల్ల బాగా ఆకలేస్తోందిరా....సమోసాలు, పకోడీలు వేడిగా ఉన్నట్టున్నాయ్. తింటే బాగుంటుందేమో-" నాలికను, పెదాలకు రాసుకుంటూ, పెనమ్మీద వేగుతున్న పకోడీల్ని చూస్తూ అన్నాడు పోతురాజు.
"సమోసాలు, పకోడీలేం ఖర్మ...బిర్యానీ కూడా తింటే బావుంటుంది. తిన్నాక, ముగ్గుర్నీ తీసికెళ్ళి పిండి రుబ్బిస్తాడు. మంచినీళ్ళు చల్లగా ఉన్నాయ్. తాగు" గసిరాడు సేతురాజు.
సరిగ్గా అదే టైమ్ లో బేరర్ వచ్చాడు.
"బోలియే సాబ్...." అన్నాడు మర్యాదగా.
"తీన్ చికెను బిర్యానీ....తీన్ చికెన్ కర్రీ..." గబగబా చెప్పేస్తున్న సేతురాజువేపు దేభ్యం మొహం వేసుకుని చూస్తున్నారు మిగతా ఇద్దరూ.