Previous Page Next Page 
శుభోదయం పేజి 31


    "శారద ఏమంది?" ఆరాటంగా అడిగింది రాధ.
    "దానికంత తెలివివుంటే దాని బతుకు ఎందుకలా తగలడుతుంది. బయటున్నావే అంటే నవ్వుతుందే, తిండి తినవేమే అంటే వికారం అంటుందే, రెండు గట్టిగా తగలనిచ్చి ఏం చేశావే పాడు మొహమా... ఏం జరిగిందే అంటూ తలమొత్తుకుంటే'
    "నన్నుడుతావేం మాధవ్ గారి నడుగు" అందే అది."
    "ఆవిడ తలపట్టుకుని చెప్పింది "రాధమ్మా... నీ యింట్లో పిల్లలా తిరిగింది. ఆ అబ్బాయి యింత పని చేస్తాడనుకోలేదమ్మా. అభంశుభం తెలియని యీ పిల్లని లొంగదీసుకున్నాడు... యింట్లోవుండి నీకళ్ళు మూసుకుపోయాయి. యింటిపక్కనుండి నా కళ్ళకీ గంతలు కట్టాడమ్మా."
    రాధ దిమ్మెరపోయినట్లుండి పోయింది. శారద నెల తప్పింది. మాధవ్ ఆమె బిడ్డకు తండ్రి... యిప్పుడేం చెయ్యాలి తను... శారద గతేం అవుతుంది? మాధవ్ ఏం అంటాడు! తీసికెళ్ళి అబార్షన్ చేయించి చేతులు దులుపుకుంటాడా? ఒక్కక్షణంలో ఆమె మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి.
    పార్వతమ్మ ఏడుస్తూ ముక్కు చీదింది. ర"రాధమ్మా... యివి చేతులు కావు కాళ్ళనుకో, నలుగురికి తెలిసేముందే ఏదోచేసి పుణ్యం కట్టుకో, దిక్కుమొక్కు లేనిదాన్ని నేనేం చేస్తాను? అసలే దానికి పెళ్ళి కాలేదని బెంగెట్టుకు చస్తూ గుండెలమీద కుంపటిని భరిస్తున్నాను. యిదిలా నా గుండెల్లోనే మంట పెడుతుందనుకోలేదమ్మా. అయినా నాది బుద్ధిపొరపాటు. యీడొచ్చిన పిల్లని అలా వదిలాను" ఆవిడ నెత్తిమొత్తుకుంది.
    అప్పటికే రాధ తేరుకుంది. చటుక్కున ఆవిడ పక్కన కూర్చుని "పిన్నిగారూ మీరూరుకోండి, మాధవ్ రాగానే విషయం కనుక్కుంటాను. ఎందుకిలా చేశాడో అడుగుతాను. ఏం చెప్తాడో విందాం, వుండండి. ముందు నన్ను శారదతో మాట్లాడనీయండి."
    గంటసేపు శారదని మంచి మాటలాడి, లాలించి, బుజ్జగీస్తూ ఒక్కో విషయం ఏం తెలీనట్టు లాగింది. అంతా విని "శారదా... నీవు నాకు తెలియకుండా యిలాంటి పని చెయ్యచ్చా? మాధవ్ అలా నిన్ను అడిగినప్పుడు నాకెందుకు చెప్పలేదు? అక్కయ్యా అంటూ స్వంతచెల్లెలిలా తిరిగావు. నానించి ఇదంతా దాస్తావా" అంది రాధ బాధగా.
    "బావగారు నీకు ఏమీ చెప్పద్దన్నారక్కయ్యా! ఒట్టు వేయించుకున్నారు" అంది అమాయకంగా.
    ఇంత జరిగినా తనకు జరిగిన అన్యాయం తెలుసుకోలేని అమాయకస్థితిలో వున్న శారదని చూసి జాలిపడాలో, కోపగించుకోవాలో అర్థంకాలేదు రాధకి.
    "శారదా! ఏడు ఎనిమిది నెలలనించి నా కళ్ళు కప్పి ఎంతపని చేశావు శారదా, యిది తప్పని దీనివల్ల నష్టపోయేది నువ్వని తెలియదా శారదా! పుస్తకాలు చదువుతున్నావు. సినిమాలు చూస్తున్నావు. ఇలా కాలుజారిన ఆడపిల్లల గతి ఏమవుతుందో అర్థంకాలేదా?" అంది.
    ఇప్పుడిప్పుడే శారదకి మాధవ్ తనని ఎవరికీ చెప్పవద్దనడం, తన వికారం వాంతులు చూసి తల్లి తిట్టి ఏడవడం, రాధ మందలించి బాధపడడం అన్నీ చూశాక తను తప్పుపని చేసిందని అర్థం అయింది. బేలగా చూస్తూ "అక్కయ్యా! నామీద కోపం వచ్చిందా నీకు చెప్పలేదని" అంది అమాయకంగా.
    "శారదా నీకెలా చెప్పను... యిప్పటికన్నా నీకు అర్థంకాలేదా? శారదా నీకు పాప పుడ్తుంది తెలుసా? పెళ్ళికాకుండా పాపని కనకూడదమ్మా. నీకు పెళ్ళి కాలేదు. నీ భర్త ఎవరని చెప్తావు? నీ పాపకి తండ్రి ఎవరు అని అందరూ అడిగితే? ఈ దేశంలో పెళ్ళికాని తల్లిని లోకులు కాకులు పొడిచినట్టు పొడుస్తారమ్మా!"
    "మాధవ్ అని చెప్తాను" శారద చటుక్కున అంది.
    రాధ విషాదంగా నవ్వింది. "అలా చెప్పలేవమ్మా! చెపితే నిన్నే అందరూ తిడ్తారు. మాధవ్ నా భర్త, నీకు భర్త కాడు. సాధ్యమైనంత విపులంగా శారదకి తను చేసిన పనివల్ల జరిగిన అనర్ధం చెప్పింది అరగంట కూర్చుని.
    అంతా విన్నాక శారద మొహంలో భయం పొడచూపింది. "మరి యిప్పుడెలా అక్కయ్యా, పోనీ మాధవ్ ని పెళ్ళాడమనేయ్" అంది.
    ఆమె అమాయకంగా అన్న మాటలే తన కర్తవ్యం అని తట్టింది రాధకి. శారదకి జరిగిన అన్యాయం సరిదిద్దాలంటే అదొకటే మార్గం. లేకపోతే అబార్షన్ చేయించి చేతులు కడుక్కోవాలా? ఆ తర్వాత ఇక శారద గతేమిటి? ఆమెని వాడుకుని వదిలేసేటంత నీచానికి దిగజారాడా మాధవ్. అంతకంటే ఏం చెయ్యాలి? శారదన్నట్టు మాధవ్ ని పెళ్ళాడమంటే... మాధవ్ తన భర్త. శారదను ఎలా చేసుకుంటాడు తనుండగా? హు! మా యిద్దరిమధ్య భార్యాభర్తల సంబంధం ఏం మిగిలింది? లోకం కోసం కల్సి కాపురం చేస్తూ నటించేకంటే శారదకి న్యాయం చేకూర్చటం న్యాయంకాదా... ఆలోచనలతో మాధవ్ వచ్చేవరకు సతమతమయింది రాధ. మాధవ్ తో మాట్లాడి ఏదో చెప్తానని పార్వతమ్మకి చెప్పింది.


                           19


    రాత్రి పదిగంటలకి యిల్లు చేరాడు మాధవ్. రాధని తప్పించుకోవడానికని తిన్నగా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోబోయాడు. రాధ చటుక్కున గదిలోకి వచ్చింది. "మీతో మాట్లాడాలి" అంది సూటిగా.
    మాధవ్ మొహం చిట్లించి "మనమధ్య యింకా ఏం మాటలున్నాయి" అన్నాడు.
    "మన మధ్య లేవు. శారదకి మీకు మధ్య వున్నాయి. శారద నెలతప్పింది. యిప్పుడామెని ఏం చేయదలచారు? ఆ అమాయకురాలి తరుపున నేనడుగుతున్నాను. జవాబు చెప్పండి" తీవ్రంగా అంది.
    మాధవ్ ఒక్కక్షణం తెల్లబోయాడు. అతని కళ్ళలో బెదురు స్పష్టంగా కన్పించింది. అతని మొహంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది. "అబద్ధం. నన్ను... నామీద కోపంతో యిది పుట్టించావు నీవు నన్ను అందరిలో అల్లరిపెట్టి నీకోపం తీర్చుకోవాలని..."
    రాధ తిరస్కారంగా చూసింది. "అబద్ధం అయితే పార్వతమ్మగారినే పంపిస్తాను మాట్లాడటానికి" అంది.
    ఆ మాటవిని మాధవ్ "ఆవిడకెలా తెల్సింది? నీవు చెప్పావు అవునా?" అన్నాడు తీక్షణంగా.

 Previous Page Next Page