"మీరెంత తొందరగా బిల్లు పాస్ చేసినా, వాళ్ళకది కొంప మునిగిపోయెంత లేటుగానే వుంటుంది లెండి. ఎంచేతంటే వాళ్ళ వ్యాపారం అలాంటిది. అదే అన్నాడాయన. మనం అలాంటి వాళ్ళని కనిపెట్టుకుని వుంటే -- ఏమిటో లెండి , నా బోడి సలహా మీకు నచ్చుతుందో లేదో గాని సార్ , వందలు చూడచ్చు. రాత్రి సినిమా డ్రింక్, రిక్షా ఖర్చులు అన్నీ వారే భరించేరు."
శ్రీనివాసరావు కొత్త గుమస్తా వేపు మింగేస్తూన్నట్టే చూసేడు. అనక అన్నాడు -
"థాంక్స్ సంగతేమిటో చెప్పేరు. రేపటి నించి మీరు చెక్కులు రాయకండి."
"అయ్యో.....అదేమీటండోయ్ బాబూ?"
"అది అంతేనండి మీరు రాయవద్దు."
"గురూగారికి కోపం వచ్చేసింది."
"కోపం కాదు మిస్టర్. నువ్వు చేసిందానికి సిగ్గుపడుతున్నాను. ఇక్కడ మనం గుమస్తా వెధవలమైతే కావచ్చు. మనకీ మానాభిమానాలున్నాయన్నమాట మరిచి పొతే ఏం లాభం? ఆఫీసులో ఆఫీసరుకి లొంగి వుండటం వృత్తి ధర్మమేమో గాని, బయట జనాభాకి వాళ్ళ తొత్తులుగా ఏజెంట్లుగా బతకడం నాకిష్టం లేదు. ఇవాళ వాళ్ళ పని పూర్తీ అయ్యే నిమిత్తం పాతిక పరకా పుచ్చుకుని వాళ్ళందరి ముందూ 'యస్ , చిత్తం ' అని చెప్పి తలవంచడం మీరు చేయగలరా? నేను చేయలేను. నా ఒంట్లో ప్రవహిస్తున్న నెత్తురందుకు ఒప్పుకోదు. నిండా మీకు ఇరవై సంవత్సరాలున్నాయేమో , నిన్న గాక మొన్ననే గుమాస్తా అయ్యేరవునా? మీరు చదువుకున్న రోజుల్లో వంటబట్టని ఈ లౌక్యం ఈ కొన్ని రోజుల్లో ఎలా నేర్చుకున్నారు? ఈ వయస్సులో మీరెలా వుండాలి? ధీమాగా దర్జాగా తల యెత్తుకు తిరగాలి. మీరు కాలేజిలో ఎలా వుండేవారో సరిగ్గా అలా వుండాలి. తప్పుడు పనులు చేసే మనిషి యెప్పుడూ తల ఎత్తుకు తిరగలేడు. ఆ శిక్ష మీకు వద్దు. నేనీ ఆఫీసులో వుండగా మీరీ వ్యాపారం నా ముందు చెప్పకండి. మిమ్మల్ని శాసించే అధికారం నాకే గనక వుంటే , ఈ క్షణంలోనే మిమ్మల్ని సరిదిద్దగలిగేవాడిని . ఆ అధికారం నాకు లేదు గనక తప్పదు పనులకి దూరంగా ఉండండని ప్రాధేయపడుతున్నాను. ఇటీజ్ మై రిక్వస్ట్."
కుర్రగుమస్తా సిగ్గుతో తలవంచుకుని అన్నాడు.
"క్షమించండి గురూ'గారూ!
అంతే, ఆరోజు లాగాయతూ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోయేరు. ఈ కుర్ర గుమస్తా పేరు ప్రసాదం. బి.ఏ. పాసయ్యేడు పెళ్ళి కాలేదు.
ప్రసాదంతో స్నేహం పెరిగేందుకు అట్టే రోజులు పట్టలేదు. ప్రసాదానికి శ్రీనివాసరావు తనలోని ఒకప్పటి రావ్ ది గ్రేట్ ని గురించి చెబుతుండేవాడు. రావ్ ది గ్రేట్ ఉదంతం కలిసినప్పుడు ప్రసాదం చెవులప్పగించి వినేవాడు. కళ్ళింతవి చేసుకుని కూచునేవాడు. శ్రీనివాసరావుని నిలువెల్లా పరీక్షించి "ఎంత మార్పు సార్" అనేవాడు.
ఇంత వినయంగల శ్రోత దొరికినందుకు శ్రీనివాసరావు మురుసి పోయేవాడు.
ఒకరోజతను ప్రసాదంతో పార్కులో కబుర్లు చెప్పి యింటికి కొంచెం లేటుగా వస్తుండగా -- తన యింటి ముందాగిన కారు అప్పుడే కదిలి ముందుకు వెళ్ళిపోతున్నట్టు చూచేడు వచ్చిందేవరో వెంటనే పోల్చుకోలేక పోయేడు.
ఇంటికి కారు మీద వచ్చే పెద్ద మనిషి ఎవరై వుంటారు?
అతను గబగబా యింట్లోకి వెళ్ళేడు.
"నాన్నా......మామ వచ్చేడు " అన్నాడు బుజ్జి.
"మామ ఎవడ్రా?"
"ఆపిల్ మామ తేలేదూ? భలే " అన్నాడు చిన్న. వాడి చేతిలో ఆపిల్ పండున్నది. "సీతా ఎవరే వచ్చింది."
గదిలోని తల్లి జవాబు చెప్పింది.
"సుబ్బారావురా! ఏదో పని మీద ఇక్కడికి వచ్చాట్ట. ఇవాళ రాత్రి ఇక్కడ ఉండి, రేపు ఉదయమే వెళ్ళి పోతాట్ట."
"ఇక్కడ అంటే? ఈ ఇంట్లోనా , మీర్మన్నారు . ఉండమన్నారా?"
సీత టవలుతో తడి చేతులు తుడుచుకుంటూ అన్నది -
'అంత గొప్పవారు ఈ యింట్లో ఎలా వుండగలరు. అయన ఉంటానన్న మీరు ఒప్పుకుంటారా? టీవీలో వుంటారట. వీలైతే మిమ్మల్నే అక్కడికి రమ్మన్నారు."
"నేను వెళ్ళేదా....వెళ్ళను"
"అది మీ యిష్టం"
తల్లి అన్నది.
"నీతో చదువు కుంటున్న రోజుల్లో బక్కగా ఉండేవాడు. ఇప్పుడతను బాగా మరిపోయేడు . నేను పోల్చుకోలేకపోయాను. అతనే నన్ను పలకరించి చెప్పేడు. మాటా మనిషి - ఎంత మారిపోయేడని."
"అవునమ్మా! వాడికేం లోటు చెప్పు లోకనాధం గారి అల్లుడు. రాజకీయాల్లో అయన మహామేధావి ,అయన నీడని బతికే సుబ్బారావు సామాన్యుడా మరి? ఖర్మం కాలి కారు మీద వచ్చేడు గానమ్మా! లేకపోతే ప్లయిన్ లో రావలసినవాడు. ఏం తెచ్చేడెం. పిల్లందరి చేతుల్లోనూ ఆపిల్సు న్నాయి.
"ఎవరో లోకనాధం గారి కోపాన్ని నీ స్నేహితుడిపై రుద్దుతావేం రా శ్రీనూ. అతనికి నువ్వంటే అభిమానం చావకే గదా నిన్ను చూచిపోదామని వచ్చేడు.'
'అభిమానం చవక కాదు. నన్ను ఏడిపించేందుకు వస్తున్నారు వీళ్ళు."
"సర్లెండి స్నానం చేయండి ముందు" అన్నది సీత.
అతను - స్నానం చేస్తూ , భోజనం చేస్తూ సుబ్బారావుని గురించే చెప్పేడు సీతకి. కాలేజిలో వాళ్ళ స్నేహం, అల్లర్లూ, పంతాలూ, నాటకాలూ -- ఒక్కటేమిటి - అన్ని సంవత్సరాల వైభవాన్ని సమీక్ష చేసేడు.
అంతా విని సీత అన్నది.
"మీరేదో పట్టుదల కొద్ది యిందాకా అలా అన్నారే గాని, మీకు మాత్రం అతని మీద స్నేహం లేదూ. ఆ స్నేహమే లేకపోతే, అతన్ని గురించి మీరిప్పుడు యింతగా చెప్పేవారేనా, వెళ్ళి రండి ఒకమాటు మీ స్నేహితుణ్ణి కలుసుకుని గతం భోంచేసి రండి. నాలుగు రోజులు ఉత్సాహంగా వుండగలరు "
శ్రీనివాసరావు కొత్త బట్టలు కట్టుకున్నాడు. శ్రద్దగా తల దువ్వుకున్నాడు. అప్పుడతనికి కంఠం దగ్గిర దయ్యం కనిపించడంతో ఉలిక్కిపడి బాగా మెడవరకూ గుండీలు బిగించి రోడ్డు మీదికి వచ్చేడు.
బంగాళా చేరుకున్నప్పుడు టైం ఎనిమిది దాటింది. సుబ్బారావు గది దగ్గిర నించున్న మనిషి శ్రీనివాసరావుని అపేడు.
"అయ్యగారు భోం చేస్తున్నారు , కొంచెం ఆగండి."
"రావ్ వచ్చేడని చెప్పు.....ఫరవాలేదు వెళ్ళి చెప్పు." అన్నాడు శ్రీనివాసరావు దర్జగా.
ఆ మనిషి లోపలికి వెళ్ళి మళ్ళా సుబ్బరావుతోనే తిరిగి వచ్చేడు. సుబ్బారావు ఎంగిలి చేతిని దాచుకుంటూ -
"రా రా బాబూ! రా, ఇప్పుడే నిన్ను తలుచుకుని భోజనానికి కూచున్నాను. కామిన్, రేయ్, ఏమిట్రా అవతారం? నువ్వసలు రావుగాడివేనా?"
"నువ్వు సుబ్బారావురావేనా?"
"నేనవును, నువ్వు కాదు ముందు లోపలికిరా."
ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయేరు. విస్తట్లో మిగిలిన అన్నాన్ని అవతలికి నెట్టి చేయి కడుకున్నాడు సుబ్బారావు. ఆ విస్తరిని బల్ల మీద నించి తొలగించేడు పనిమనిషి.
"కొంచెం తలుపు దగ్గిరకి వేసి వెళ్ళవోయ్ " అన్నాడు సుబ్బారావు.
తలుపు మూసుకుంది.