ఇంటికొచ్చి అప్లికేషన్ రాసి పోస్టు చేసోచ్చింది. తనతో తెచ్చుకున్న పుస్తకాలు దుమ్ము దులిపి పెట్టింది. ఆ రాత్రి నుంచి చదవడానికి.
ఏవో కొత్త ఆశలు ఆమెలో చిగురించాయి. ఆ రాత్రి పానకాలు భోంచేసి పిల్లిలా పడుకున్నాడు కిక్కురుమనకుండా.
బ్యాంకులో ఉద్యోగం వొచ్చిన రోజున ఝాన్సీ పొందిన అనందం అంతా ఇంతా కాదు. ఈ సమాజంలో తనకీ ఒక స్థానం ఉందనీ, ఒక వ్యక్తిత్వం ఉందనీ, ఒక గుర్తింపు ఉందనీ పొంగిపోయింది. 'నాదీ' అంటూ నెలకి రెండు వేలు సంపాదించడం ఎంతో తృప్తిగా అనిపించింది ఆమెకి.
పొద్దున్నే లేచి గబగబా వంటా, టిఫినూ పూర్తీ చేసి, భర్తకి టిఫిన్ పెట్టేసి, తను భోం చేసి టిఫిన్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం పానకాలు ఇంటికెళ్ళి భోం చేసి, మళ్ళీ జగన్నాధరావు గారింటికి వెళుతున్నాడు. రాత్రి ఒక్కోసారి ఇంటికొచ్చేసరికీ మరీ పొద్దుపోతోంది.
"నాకు మధ్యాహ్నం, సాయంత్రం రెండు పూటలా చల్లటి కూడే దొరుకుతుంది. వెధవ ఉద్యోగమూ నువ్వూనూ! కేకలేశాడు పానకాలు." "మీకంటే సిగ్గులేదు, ఒక వ్యక్తిత్వం లేదు. వాళ్ళింట్లో పడి ఒక నౌకరులాగా ఎవరే పని చెబితే అది చేస్తూ , ఇంత ముద్ద పడేస్తే మింగి పడుంటున్నారు. ఏదో గొప్పనుకుంటూ, కానీ నేను మీలాగా కాదు. ఇక ఉద్యోగిని. భాధ్యతలు గల వ్యక్తిగా ప్రవర్తిస్తాను. మీరు చేసే ఆ కొలువుకు ఈ తిండి చాల్లెండి. ఇదైనా నా సంపాదనతో దొరుకుతున్న భోజనం లేకపోతే ఏముంది? వాడి దగ్గరా వీడీ దగ్గర ఏదో పన్లు చేసి పెట్టడానికి చెయ్యి చాపి తెచ్చే డబ్బే కదూ మీది? ఛీ! ఛీ! అలా అడుక్కుతినడం కన్నా ఇదేం తక్కువ కాదు. బ్రోకర్ ఉద్యోగమూ మీరూనూ!" అంది ప్రతి అక్షరాన్ని నొక్కి చెబుతూ.
పానకాలుకి తల తిరిగిపోయింది. అక్కడికక్కడే పీక నులిమి చంపి పారేయ్యలన్నంత కోపం వచ్చింది. పళ్ళు కొరుకుతూ చెయ్యెత్తాడు కొట్టడానికి. పక్కకి జరిగి తప్పించుకుంది ఝాన్సీ. అవమానంతో ఉడికిపోతూ, పట్టలేని కోపంతో , టేబుల్ మీదున్న కాఫీ కప్పులని నేలకేసి కొట్టాడు ఆవేశంతో ఊగిపోతూ!
నిర్లక్ష్యంగా చూసింది ఝాన్సీ పగిలి ముక్కలయిన కప్పుల కేసి.
గబగబా చెప్పులేసుకుని బయటికెళ్ళిపోయాడు పానకాలు తినకుండానే.
పనిమనిషి చేత ఆ ముక్కలన్నీ ఎత్తి పారబోయించింది ఝాన్సీ. తను గబగబా ముస్తాబై భోంచేసి , మాములుగా బ్యాంక్ కి వెళ్ళిపోయింది.
ఝాన్సీని తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది పానకాలుకి. అందులోనూ ఉదయం ఆమె అన్న మాటలు సూదుల్లా పొడుస్తున్నాయి చెవుల్లో. "ఆమె సంపాదిస్తోంది. తనకి ఉద్యోగం లేదనేగా అమెకింత అహంకారం? బల్ల కింద చెయ్యి పెట్టో, బల్ల మీద చెయ్యి పెట్టో ఎంతో కొంత తనూ కొంత సంపాదిస్త్గున్నాడుగా! అది డబ్బు కాదా? ఆడది ఆడదానిలా పడుండక మొగాడిలా ప్రవర్తిస్తోంది! అసలీ అడజాతే అంత. ఆమె ఏదో పెద్ద అందగత్తెనని మురిసిపోతూ తనని తీసిపారేసేది కౌసల్య! ఆఫ్ కోర్స్- నోటితో ఎప్పుడూ ఒక్కమాట అనకపోయినా , అమె కళ్ళను చూస్తే అలా అనిపించేది తనకి! అందుకే ఆమెని చూసినప్పుడల్లా ఆమె కళ్ళు పోడిచేయ్యలనిపించేది. అసలు ఈ అడ ముం......లకి పొగరు! అడాదాన్ని ఆంబోతునీ కట్టి పడేనుంచాలి ఎప్పుడూ . లేకపోతే ప్రమాదమే!" అనుకుంటూ పిచ్చివాడిలా ఆలోచిస్తూ ఉన్నాడు ఆరోజంతా. ఆ కోపం అంతా ఆరోజు ఇల్లు చిమ్మే లక్ష్మి మీదా, టైపిస్ట్ సరళ మీదా చూపించాడు. మాములుగా అయితే ఏదో పిచ్చోడు, పోనీలే! అని ఊరుకునేవారు. ఇద్దరూ. కానీ ఆ రోజు ఏమయిందో ఏమో ముందు లక్ష్మి తిరగబడింది. తరువాత సరళ తిరగబడింది. మాటా మాటా పెరిగేసరికి, అలవాటు ప్రకారం చెయ్యెత్తాడు. సరళ మీద పానకాలు దాంతో కధ అడ్డం తిరిగింది!
సరళ సరాసరి వెళ్ళి జగన్నాధరావు గారికే ఫిర్యాదు చేసింది. 'ఇంతవరకూ నామీద నా కన్నతండ్రి కూడా చేయ్యత్తలేదు. అటువంటిది పరాయి స్త్రీ అని కూడా ఆలోచించకుండా ఇతడు' అంటూ వలవలా ఏడ్చేసింది సరళ. దానికి తోడు లక్ష్మి కూడా వెళ్ళి వంత పాడింది. ఆ అమ్మాయి కంట్లో నీళ్ళు చూసేసరికి , జగన్నాధరావు గారికి వొళ్ళు మండుకొచ్చింది. తన కన్నా కూతురు తనతో వొచ్చి ఫిర్యాదు చేసుకుంటున్నట్టుగా అనిపించింది. కోపంతో రేచ్చిపోయాడాయన.
"నువ్వు మనిషివా? పశువువా? ఒక ఆడపిల్లతో పోట్లాట పెట్టుకోవడం కాకుండా, కొట్టడానికి చెయ్యి లేపుతావా? అందులోనూ పరాయి ఆడపిల్ల అదీ నా యింట్లో ! ఇడియట్! ఇంత మూర్ఖుడి వనుకోలేదు" అంటూ నానా మాటలూ అన్నారు.
"మొగుడూ కొట్టాడన్న బాధ కన్నా తోటికోడలు నవ్విందని ఏడ్చినట్టు" అతడు తనని తిట్టాడన్న బాధ కంటే ఆ అమ్మాయి ముందే కేకలెయ్యడం పానకాలుకి నచ్చలేదు. కోపాన్నంతా దిగమింగుకుని దోషిలా ఆయన ముందు నుంచున్నాడు.