Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 31

మేరినాలో కూర్చుని ఉన్నాడు ముకుందరావ్.
అతనికి క్రమక్రమంగా తెలివి వస్తోంది.
తను......ఇక్కడ......కూర్చుని ఉన్నాడు..........ఇది .........సముద్రం.
తను.......ఎవరు? ఎవరు? ఎవరు?
తనద..........ఏ వూరు? ఏ వూరు? ఏ వూరు?
తను ఇక్కడ ఎందుకున్నాడు?
అలోచించి అలోచించి బుర్ర వేడెక్కిపోతోంది.
జేబులు తడిమి చూసుకున్నాడు. చిల్లర ఉంది.
చిల్లర పెట్టి ఇంగ్లీషు పేపరు కొన్నాడు.
"చైనా ఇన్వెడ్స్ కంపూచియా"
"ఈజిప్టు సైన్సు ట్రిటి"
ఓహో! అయితే తనకి ఇంగ్లీషు వచ్చాన్నమాట!
తెలుగులో ఆలోచిస్తున్నాడు. కాబట్టి తెలుగువాడేనన్నమాట.
కానీ ఎవరు నేను? ఎవరు నేను?
కానీ అతని దురదృష్టవశాత్తూ , ఆ క్రితం రోజుదాకా ప్రతిరోజూ పేపర్లో ప్రకటనలు వేయించిన శ్రీహర్ష ఆరోజునుంచే మానేశాడు- నిరాశ చేసుకుని.
ఎవరు నేను? ఎవరు నేను?
ఆకలేసింది. పైప్ దగ్గర నీళ్ళు తాగాడు. మళ్ళీ జేబులు తడుముకున్నాడు. జేబులో పైస కూడా లేదు.
లాటరీ టిక్కెట్టుంది. బ్రాకెట్ చీటి ఉంది.
ఇవెలా వచ్చాయి తనకి? కొన్నాడా?
ఈ టిక్కెట్టు బదులు ఒక రూపాయి ఉంటె ఎంత బావుండు! షాపు వాడికి వెనక్కి తిరిగి ఇచ్చేస్తే తీసుకుంటాడా?
లాటరి టిక్కెట్టు మీద షాప్ పేరుంది.
ఎవర్నో అడిగితే దగ్గరలోనే ఆ షాపు అని చెప్పారు.
నిదానంగా నడుస్తూవెళ్ళాడు.
"ఈ టిక్కెట్టు....."
"దాని రిజల్టుదా ఇంకా రాలేదు సార్. అవునా! మీరే గదా ఆరోజు డబుల్ జీరో రాయించినారు. మీకు పదివేలు వచ్చాయి సార్" అన్నాడు షాపతను.
"ఏమిటి?"
"పదివేలు వచ్చినాయి సార్? బ్రాకెట్లో"
అనుమానంగా తన దగ్గర ఉన్న చీటి తీసి చూసుకున్నాడు ముకుందరావు.
రెండు రోజుల్లో అతనికి పదివేలు ముట్టేలా ఏర్పాటు చేశాడు షాపతను. అతనికి రెండొందలిచ్చాడు ముకుందరావు.

                                                 * * *

"నాన్నగారూ, నాన్నగారూ!" అంది లావణ్య దాదాపు ఏడుస్తూ ఇంటికొచ్చేసి,
సమాధానం లేదు.
"నాన్నగారూ! అమ్మా!"
నర్సయ్య పరిగెత్తుకుని వచ్చాడు.
"అమ్మా!"
"నన్నగారేరి"
"ఇప్పటిదాకా ఎదురు చూసి అయ్యగారూ, అమ్మగారూ ట్రెయిన్ కెళ్ళిపోయారమ్మా, మీరు ఎనిమిదిన్నర లోపల వస్తే స్టేషన్ కి రమ్మన్నారు. మీరు స్టేషన్ కి వస్తానని చెప్పారుట కదా"
"ఓహ్! మర్చిపోయింది తను. ఇవాళే కదూ వాళ్ళు మెడ్రాస్ వెళ్ళేది. అక్కడినుంచి సింగపూర్ వెళతారు ఏదో డెలిగేషన్ తో పాటు."
అదెలా మర్చిపోయింది! శ్రీహర్ష తగువు! తర్వాత క్లబ్బులో ఇది!
టైం చూసుకుంది.
పదవుతోంది.
గుండెలు దడదడలాడుతున్నాయి.
ఇంకెవరితో చెప్పుకోవాలి.
శ్రీహర్ష.
చెప్పులో కాళ్ళు దూర్చి కాసేపు ఆలోచించింది.
తర్వాత కారులో వెళ్ళి శ్రీహర్ష ఇంటిముందు ఆగింది.
ఎందుకో అతనితో మాట్లాడటానికి మనసొప్పలేదు. కారు వెనక్కి తిప్పేసి ఇంటికొచ్చింది. తన స్వభావం అంతే! ప్రాణాలయినా పోగొట్టుకుంటుంది గానీ పంతం వదులుకోదు.
రాత్రి ఒక్క క్షణం కూడా నిద్రపట్టలేదు.
భయం!భయం! భయం!
పొద్దునే పోలీసులు వస్తారు. ఈ చేతులకు సంకెళ్ళు. తర్వాత కేసు. సాక్ష్యాలు శిక్ష. ఉరి!

 Previous Page Next Page