అది వినగానే తనలో వచ్చిన మొదటి రియాక్షన్.
అపుకోలేనంత నవ్వు.
తనని శశికాంత్ పెళ్ళి చేసుకుంటాడా? ఫన్ని ప్రపోజల్!
అఫ్టరాల్ శశికాంత్! కేవలం ఒకే ఒక్క మాస్టర్స్ డిగ్రి ఉన్న సింపుల్ టన్ శశికాంత్, రెండు డాక్టరేట్స్ ఉన్న ఈ ఉజ్వలని పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాడా?
అతను విశ్వప్రయత్నం చేసి, జీవితంలో ఏ స్థాయి
కి చేరుకోగలడో ఆ స్థాయి దగ్గర జీవితం మొదలెడుతుంది తను. అలాంటిది-
"వకుళ పిన్ని! ఇవాళ మోర్నింగే ఒక షిప్ కెప్టెన్ వచ్చాడు. మర్చెంట్ నేవిలో పని చేస్తాడుట. నన్ను పెళ్ళి చేసుకుంటాడుట. అడ్డమైన ప్రతివాడూ నా దగ్గరికి వచ్చి పెళ్ళి ప్రస్తావన ఎలా తీసుకురాగలడో అర్ధం కాదు పిన్ని! నేను గనక పెళ్ళి చేసుకుంటే ఓ షిప్పు ఒనర్నే పెళ్ళి చేసుకుంటా పిన్ని! అంతేగాని షిప్పు కెప్టన్ని కాదు. ఒనాసిస్ లాంటి ఏ టైకూన్ నో పెళ్ళి చేసుకుని అతని మిలినియన్లని పొదిగి పిల్లలు పెట్టించి, అతని బిజినెస్ ఎంపైర్ ని పెంచి పెద్దది చేస్తాను.
దిస్ పూర్ చాప్, ఈ శశికాంత్, ఎంబీయే చదివాడన్నావుగా , ఏ కంపెనీలోనో మూడు వేల రూపాయల జీతగాడుగా కుదురుకుంటాడు. అది తప్పితే ఇంకేం చెయ్యగలడు పిన్ని> నేను పెళ్ళి చేసుకుంటే తప్పకుండా ఇన్విటేషన్ పంపుతాను పిన్ని - కానీ ఈ శశికాంత్ కి కాదు. అతని కంపెని ఓనర్ కి కద పిన్ని! అడ్డమైన వాళ్ళందరిని పెళ్ళికి పిలవలేము కదా! అవునా?
కానీ ఈ ఇన్సట్టు నంతా మళ్ళీ తూ.చ. తప్పకుండా శశికాంత్ కి చేరవేసి వుండదు పిన్ని. తమ కుటుంబంలో కలతలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అంటి ముట్టకుండా చెప్పి ఉంటుంది. "ఆ అమ్మాయి పై చదువులకి స్టేట్స్ వెళుతుంది. ఆ అమ్మాయికి ఇప్పుడిప్పుడే పెళ్ళీ చేసే ఉద్దేశం లేదుట వాళ్ళ వాళ్ళకి" అని బహుశా.
అప్పుడు పిన్ని అలా చెయ్యడమే మంచిదయింది. అలా కాకుండా , తను అన్న మాటలన్నీ గనక చెప్పినట్లయిటే , పగబట్టినట్లు ప్రవర్తించేవాడు ఈ శశికాంత్.
ఇతని తత్త్వం తనకి బాగా తెలుసు. ఇతను తనకి జరిగిన అవమానలని క్షమించడు. మర్చిపోడు, హీ ఈజ్ ఏ పిగ్ హెడెడ్ ఫెలో. అల్ రైట్!
కానీ మళ్ళీ ఇతన్నే పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన ఎందుకు కలిగింది తనకి?
ఎందుకంటె జీవితంలో తన అంచనాలు, ఉహాలు తారుమారయ్యాయి కాబట్టి!
చిన్నప్పుడు శశికాంత్ ఎలా ఉండేవాడో తనకి ఇంకా గుర్తు . వాళ్ళ నాన్నగారికి ఎప్పుడూ ట్రాన్స్ ఫర్లు ఉండేవి. సంవత్సరం మధ్యలో ట్రాన్స్ ఫర్ రావడం కొత్త ఉరికి వెళ్ళిపోవడం.
అక్కడ శశికాంత్ కి స్కూల్లో సీటు దొరక్కపోవడం , ఓ ఏడాది చదువు వృధా కావడం.
అలా చదువులో మూడు, నాలుగేళ్ళు వెనకబడ్డాడు శశికాంత్. అందుకని ఏ క్లాసులో చేరినా, అందరికంటే తనే పెద్దవాడిగా ఉండేవాడు. "మొద్దబ్బాయి" అని పిలిచేవాళ్ళు చాల మంది అతన్ని.
అతను చదువులో ఎందుకు వెనకబడ్డాడో తనకి తెలిసినా, తన మనసులో కూడా అతను మొద్దబ్బాయి అనే ముద్ర పడిపోయాడు ఎందుకో.
అతను పైకి వస్తాడని, రాగలడని, అనుకోలేదు తను ఎప్పుడూ కూడా!
ఏ కంపెనీలో జీతగాడుగా కుదురుకోలేదు శశికాంత్. అడ్వెంచరస్ గా తనే ఒక ఇండస్ట్రి పెట్టాడు. లోన్స్ తీసుకుని త్వరలోనే నిలదొక్కు కున్నాడు. ప్రత్యర్ధిని పడగొట్టడానికి కొమ్ములు, కబళించడానికి నోరూ తప్ప మరే అవయవము లేని చిత్రమైన క్రూరమృగంలాగా, తన పోటిదార్లను ఒకళ్ళ తరువాత ఒకళ్ళుగా నాశనం చేసేస్తూ తను నిర్మిస్తున్న వ్యాపార సామ్రాజ్యపు పునాదుల్లో వాళ్ళని పాతిపెడుతూ పైపైకి వచ్చేస్తున్నాడు శశికాంత్.
అప్పుడు మొదటిసారిగా గమనించింది తను అతని ప్రతిభని! అతన్ని పెళ్ళి చేసుకోవడానికి మానసికంగా సిద్దమై తిరిగి వచ్చింది. కానీ తను వచ్చేసరికి అతను ఆ సౌమ్యతో తన ఎంగేజ్ మెంట్ డిక్లేర్ చేసేశాడు. ఆ తరవాత వెంటనే తాళి కట్టేశాడు కూడా.
అది కాక-
తను వ్యాపారంలో దివాలా ఎత్తాడని ప్రకటించాడు.
అందరితో బాటు తనూ ఫూల్యి పోయింది. మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయింది. కానీ అతను నిజంగా దివాలా తీయ్యలేదని , అదొక బిజినెస్ స్ట్రాటజీ అని తెలిశాక నాలిక కరుచుకుని మళ్ళీ తిరిగి వచ్చింది- తను చేజేతులా దూరం చేసుకున్న ఒక అవకాశాన్ని ఈసారి రెండు చేతులతో ఒడిసిపట్టుకుని వినియోగించుకోవాలన్న దృడసంకల్పంతో.
తనలో వచ్చిన ఆ మార్పుకి కారణం కేవలం శశికాంత్ వృద్దిలోకి రావడమే కాదు. అది ఒక కారణం. రెండో కారణం ఏమిటంటే -
పెళ్ళిళ్ళ మార్కెట్ లో తన వాల్యు తగ్గిపోవడం.
ఒకప్పుడు చాలా అహంభావం ఉండేది తనకి. పెళ్ళంటూ చేసుకుంటే ఏ మినీ మహారాజానో చేసుకోవాలని. అలా కుదరకపోతే ఆ జన్మాంతం అవివాహితగానే ఉండిపోవాలని!
కానీ అనుభవం అహంభావాన్ని అణగ్గోట్టెసింది.
ఇప్పుడు అర్ధమయింది తనకి. ప్రతి ఆడదానికి ఒక మగతోడు ఉండితీరాలని.
నువ్వు చాలా లిబరేటేడ్ గా, బోహేమియస్ గా, విశ్రుంఖలంగా జీవించవచ్చు. పెళ్ళి చేసుకోకుండా సింగిల్ గర్ల్ గా నీ బతుకు నువ్వు బతకొచ్చు.
అది కాకపోతే-
యూకెన్ లీవ్ టూగెదర్ విత్ ఎ మాన్, వితౌట్ మారేజ్! పెళ్ళి పెటాకుల్లెకుండానే మనసుకు నచ్చిన ఓ మగాడితో రోజులు గడిపెయ్యోచ్చు.
ఈ పోకడలన్నీటిని చాలా విశాల హృదయంతో అంగికరించినట్లు నటిస్తుంది ఈనాటి లోకం.
నటిస్తుంది! అంతే! కానీ నిజంగా అంగీకరించదు! చచ్చినా కూడా!
ఇది నిశ్చలమైన నిజం. లండన్ లో అయినా, వాషింగ్ టన్ డిసి లో అయినా ఆఫ్రికాలోని టీంబుక్టూలో అయినా కూడా.....
అన్ని చూసి ఈ నిర్ణయానికి వచ్చింది తను.
ఎవ్విరి ఉమన్ నీడ్స్ ఏ మాన్ అండ్ మ్యారేజ్ అది తప్పదు!
చదువుల్లో అనుకున్నవన్నీ సాధించి , పెళ్ళి వైపు ధ్యాస మళ్ళించే సరికి భాగా లేటయిపోయింది.
అంత పెద్ద చదువులు చదివినా, తను కలలు కన్నట్లు ఏ మహారాజానో ,ఏ బిజినెస్ టైకూనో వచ్చి తనని పెళ్ళి చేసుకోలేదు. వాళ్ళకి తనకంటే వయసులో చిన్నవాళ్ళు చాలామంది దొరుకుతారు. దొరికారు. దొరుకుతున్నారు.
టాప్ లెవల్లో ఉన్న మగవాళ్ళు తనకి అందుబాటులో లేరని నిశ్చయించుకున్న తరువాత అంచేలంచలుగా దిగివచ్చింది తను. కంపెని డైరెక్టర్స్- ఆర్మీ మేజర్స్- ....
ఉహూ!
నో లక్!
ఆ తరువాత వెళ్ళింది ఇదివరకే తనే వద్దు పొమ్మన్న నేవీ కెప్టెన్ దగ్గరికి.
అతను మర్యాదగానే మాట్లాడాడు. సగౌరవంగా ఆహ్వానించాడు. తన షిప్ లోకి వచ్చి తనతో డిన్నర్ తీసుకోమని. ఆ ఆహ్వానంలో- ఆరాత్రికి 'టాంగో' డాన్స్ ఉంటుందని చిన్న సూచన. షిప్పుని షాంపేన్ లో తేల్చేస్తామని ప్రామిస్. సముద్రం తన గర్భంలో దాచుకోలేనన్ని అనుభూతులు దొరుకుతాయని హింట్!
అంతే!