జూబిలీ హిల్స్ లో ఉంది శ్రీరాం వాళ్ళ ఇల్లు. హోటల్ బంజారా నుంచి మలుపు తిరుగుతున్న రోడ్డులో వెళుతూంది కారు. అక్కడున్న నవాబు పాలెస్ దగ్గరికి వచ్చేసరికి నిర్జీవంగా అయిపోయింది రోడ్డు.
నల్లటి రోడ్డు తెల్లటి వెన్నెల్లో తడుస్తూంది.
విండ్ స్క్రీన్ లోనుంచి వెన్నెల ప్రతిమ మొహం మీద పడి, ఆ నునుపుదనానికి జారిపోయి ఆమె ఒడిలో పడుతూంది.
"ఈ రాత్రి రెండు చందమామలు కనబడుతున్నాయి. ఒకటి ఆకాశంలో, మరొకటి నా కారులో!" అన్నాడతను, ముకేష్ పాటని కాపీ కొట్టేస్తూ.
అందం!
మళ్ళీ అదే! చందమామలాంటి అందం!
అందమైన మొహం!
అందమైన తల!
అందమైన...
ఈ అందమైన తలలో తెలివిగా ఆలోచించే మెదడు కూడా ఒకటి ఉంటుందని ఎవరూ గుర్తించరా?
ఎత్తుగా ఉండే గుండె వెనక లోతైన మనసుంటుందన్న సంగతి ఎవరికీ పట్టదా?
నిస్పృహగా నుదుటి మీద చెయ్యి ఆనించి డాష్ బోర్డు మీద తల వాల్చేసింది ప్రతిమ.
అది చూసి కొంచెం కంగారుపడ్డాడు శ్రీరాం.
తెల్లటి వెన్నెల్లో మరీ నల్లగా కనబడుతూంది ఆమె జడ.
కారు ఆపాడు.
"ప్రతిమా! నా ప్రతిమా! అలా అప్ సెట్ అయిపోకు!"
ప్రతిమ మాట్లాడలేదు.
"ప్రతిమా! మై డియర్! మై లవ్!" అంటూ తల వంచి, ఆమె మెడ ఒంపులో ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఒత్తైన జుట్టు సహజమైన సువాసన వెదజల్లుతూంది. ఆ పరిమళం అతని నాడీమండలాన్ని ప్రేరేపించి, కోరిక పెరిగేటట్లు చేస్తూంది.
కోరిక పెరిగేకొద్దీ అతని పట్టుదల తరగడం మొదలెట్టింది.
"ప్రతిమా! మైడియరెస్ట్ ప్రతిమా! ఉద్యోగం చెయ్యాలని ఎందుకంత ఇష్టం నీకు?"
నెమ్మదిగా తల ఎత్తి అతని మొహంలోకి చూసింది ప్రతిమ.
"చెప్తే మీకు కోపం వస్తుంది." అంది సందేహంగా.
"ఉహుఁ! లేదు, లేదు! చెప్పు!"
"చిన్నప్పటినుంచీ నాకు చదువు మీద తప్ప వేరే దేనిమీదా అంత ఇష్టం ఉండేది కాదు. లిటరేచర్ చదువుకోవాలని ఎంతో కోరిక ఉండేది నాకు. అలాంటిది నన్ను బలవంతంగా మెడిసిన్ లో చేర్చేశారు నాన్నగారు."
"ఎందుకు?"
"మా అమ్మాయి డాక్టరు అని చెప్పుకోవడం కోసం! హోదా కోసం! ప్రిస్టేజి కోసం! నా మనసుకి కళ్ళెం వేసి ఇంకో దారిలోకి మళ్ళించేసినట్లు ఫీలయ్యాను నేను. కొన్నాళ్ళు అలా మధనపడినా తరవాత రాజీ పడిపోయాను. అప్పట్లో ఈ కోర్సుమీద పెద్ద ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు. కానీ ప్రయత్నపూర్వకంగా ఇష్టం పెంచుకున్నాను."చెప్పడం ఆపి, వూపిరి తీసుకుంది ప్రతిమ. ఆమె గొంతు సన్నగా కంపిస్తూంది.
"ఆ తరవాత క్రమంగా ఈ కోర్సులో ఉన్న గొప్పదనం నాకే అర్ధమయింది. ఇది ఎంత ఉదాత్తమైన చదువో తెలిసింది. డాక్టరయ్యాక మనుషులకి ఎంత అపారమైన సేవ చెయ్యవచ్చో బోధపడింది.
తరవాత అహర్నిశలూ అదే ధ్యాసతో చదివాను, శ్రీరాం! నేను గగొప్పలు చెప్పుకోవడం లేదు. మెడిసిన్ లో అగ్రెగేట్ గా నేను స్కోర్ చేసినన్ని మార్కులు ఈ యూనివర్శిటీలో ఇంతకు ముందు ఎవ్వరూ స్కోర్ చెయ్యలేదు - తెలుసా?"
శ్రీరాం ఆమెని పరీక్షగా చూస్తున్నాడు.
"అప్పటినుంచీ నాకు ఒకే ఒక్క కోరిక! అది ఉత్త కోరిక కాదు! ఫిక్సేషన్! ఫిక్సేషన్ అంటారు చూడండి - ఒకే ధ్యాస అన్నమాట! చాలా మంచి డాక్టర్ని కావాలని! నాకెప్పుడూ చీరెల మీదా, నగల మీదా మోజు ఉండేది కాదు! ఫ్రెండ్సుతో కలిసి తిరగాలనీ, సినిమాల కెళ్ళాలనీ అంతగా ఉండేది కాదు. నేను పుస్తకాల పురుగుననీ మగ పురుగుల వైపు కన్నెత్తి చూడని, పన్నెత్తి మాట్లాడని వింత జంతువుననీ, శృతీ, మోనికా వెక్కిరిస్తుండే వాళ్ళు."
ఆమె ఒక్కసారిగా అన్ని మాటలు మాట్లాడటం ఎప్పుడూ వినని శ్రీరాం ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
"ఇప్పుడు మీరు హఠాత్తుగా జాబ్ చెయ్యొద్దని చెబుతారని కలలో కూడా వూహించలేదు నేను. జాబ్ చెయ్యకపోతే ఇక నా చదువుకి సార్ధకత ఏముందీ?"
"పోనీ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు కదా ఇంట్లోనే!"
"అంత అనుభవం లేకుండా నేరుగా ప్రాక్టీసు పెట్టేస్తే ఏం బాగుంటుంది?"
"అనుభవానికేం! అదే వస్తుంది - ఇద్దరు పేషెంట్లని చంపాక! అసలు పదిమంది నన్నాచంపకుండా డాక్టర్లు కాలేరని ఒక జోక్!"
"ఆ జోక్ చాలాసార్లు విన్నాను కానీ ఎప్పుడూ నవ్వు రాలేదు నాకు. డాక్టర్ వృత్తి అంటే జోక్ చెయ్యాల్సిన విషయం కాదు. చాలా సీరియస్ గా తీసుకుంటాను నేను."
కొద్దిగా ఆవేశంగా మాట్లాడుతున్న ప్రతిమ, తన పమిట జారిపోయిన సంగతి గమనించలేదు.
శ్రీరాం తదేకంగా చూస్తున్నాడు. మంగళసూత్రాలు ఆమె రొమ్ముల ఒంపుతో బాటు వంకర తిరిగి, అందంగా కనబడుతున్నాయి.
"సరే! పొద్దున సీరియస్ గా ఆలోచిద్దాం! ఉద్యోగమంటే ఒప్పుకోను కానీ, ప్రైవేట్ ప్రాక్టీస్ అయితే ఆలోచించవచ్చు" అన్నాడు శ్రీరాం. అతనికింక ఈ డిస్కషన్ మానేసి త్వరగా ఇంటికెళ్ళిపోయి ప్రతిమతో పాటు స్వర్గంలో విహరించాలని ఉంది.
అతను ఇచ్చిన భరోసాతో మనసు తేలికై, నిద్రతో కనురెప్పలు బరువెక్కిపోతున్నా, బలవంతాన తెరిచి, ఆ రాత్రికి అతనికి అనాటమీలో కొత్త పాఠాలు నేర్పించింది ప్రతిమ.
* * * * *