మరునాడు ప్రతిమ నిద్ర లేచేసరికి బాగా పొద్దెక్కింది. రాత్రి అసలు నిద్ర సరిపోనేలేదు. తెల్లవారుఝామున మూడయింది పడుకునేసరికి.
రోజూ అయితే అయిదింటికే లేస్తుంది తను లేచినా చెయ్యవలసిన పనులేమీ పెద్దగా ఉండవు. వంట సుబ్రమణి చేస్తాడు. అంట్లు తోమడానికి పనిమనిషి ఉంది. బజారు పనులన్నీ మల్లయ్య చేస్తాడు. రెండ్రోజులకి ఒకసారి చాకలి వచ్చి బట్టలన్నీ ఇంట్లోనే ఉతికి వెళుతుంటాడు.
తన పని నతా ఒకటికి మూడుసార్లు కాఫీ తాగడమూ, రెండుసార్లు భోజనం చెయ్యడమూ, మధ్యాహ్నం టిఫిన్ తినడమూ అంతే! మిగతా సమయమంతా తీరిగ్గా చదువుకుంటూ కూర్చోవడమే!
ఒక్కోరోజు మాత్రం తను, అత్తగారూ కలిసి ఏదో కొత్త వంటకం ఎక్స్ పెరిమెంట్ చేసి చూస్తారు. తను పుస్తకాల్లో చదివి చెబుతుంటే ఆవిడ తయారు చేస్తుంది. పక్క ఇంటి బెంగాలీ వాళ్ళ, కన్నడం వాళ్ళ వంటలు కొన్ని తెలుసుకుంది ఆమె. అవి ప్రయత్నించి చూస్తారు.
ఒకరోజు కన్నడిగుల బిసిబేడహుళి, మరోరోజు తమిళుల అవియలు, ఇంకోరోజు బెంగాలీల శ్రీఖండ్, ఒకరోజు పుడ్డింగ్, ఒకరోజు వెనిల్లా ఐస్క్రీం-
అవి మారు వడ్డించుకుని తిని, తరవాత బాగులేవని జోక్ చేస్తాడు శ్రీరాం.
సరస్వతి వయసులో పెద్ద అయినా, కొత్త కొత్తవి నేర్చుకోవాలనే కుతూహలం చాలా ఉంది ఆమెలో.
ఎప్పుడూ నవ్వుతూ, కొంచెం హాస్యంగా, కొంచెం చమత్కారంగా మాట్లాడే అత్తగారిని చూస్తే చెప్పలేనంత అభిమానం ఏర్పడిపోయింది ప్రతిమకి.
కోడలికి, "పొద్దున్నే లేవద్దు. ఇంకాసేపు పడుకో!" అని సలహా ఇచ్చే అత్తగారు ఈ ప్రపంచంలో ఈవిడొక్కతే ఉంటుందేమో అనుకుని నవ్వుకునేది ప్రతిమ. "ఇంత పొద్దున్నే లేచి ఏం చేస్తావే? బద్దకంగా ఉంటే ఇంకాసేపు పడుకో!" అంటుందామె రోజూ.
ప్రతిమ ఆ ఇంటికొచ్చిన రెండో రోజునుంచే ఆమె తనని 'వే' అనెయ్యడం మొదలెట్టింది. అదేమి చిత్రమో! ఆమె తనని గురించి మాట్లాడుతూ "అది, దాన్ని" అని సంబోధించినా ఎబ్బెట్టుగా కనపడలేదు. పైగా ఆమె తనమీద చూపిస్తున్న అభిమానానికి ఇంకా చనువు తీసుకుంటే బావుండనిపిస్తుంది.
ఇంత ఆప్యాయంగా తనని అమ్మ కూడా ఎప్పుడూ పిలవలేదు.
అత్తగారు వద్దన్నా వినకుండా అయిదింటికే లేచేస్తుంది ప్రతిమ.
కానీ ఇవాళ ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. అయిదింటి కోసారి మగతగా కళ్ళు తెరిచి చూసి మళ్ళీ వెంటనే నిద్రలోకి జారిపోయింది.
నుదుటి మీద చల్లగా ఎవరిదో చెయ్యి తగిలినట్లనిపించి, భారంగా కళ్ళు తెరిచింది ప్రతిమ.
సరస్వతి కొద్దిగా వంగి, ప్రతిమ నుదుట మీద చెయ్యి పెట్టి చూస్తూంది. లేచి కూర్చోబోయి, తను చీరె కట్టుకోకుండా పరికిణీతోనే నిద్ర పోయిందన్న సంగతి హఠాత్తుగా గుర్తొచ్చి, దుప్పటి దగ్గరగా లాక్కుని పడుకుంది ప్రతిమ.
"ఏమ్మా! ఇంతసేపు పడుకుండి పోయావు? ఒంట్లో బాగుందా?" అంది ఆమె ఆప్యాయంగా.
"బాగానే ఉంది."
"లే! లేచి కాస్త కాఫీ తాగి మళ్ళీ పడుకో - పదవుతూంది టైమ్!"
"పదా?" అంది ప్రతిమ తెల్లబోతూ. "బాగా నిద్ర పట్టేసింది!"
"సుబ్రమణి మంచి ఇడ్లీ, కొబ్బరి చెట్నీ చేశాడు. రాత్రి అన్నం వూరికే కెలికి వదిలేస్తివి! రెండు ఇడ్లీలు తిని, కాఫీ తాగితే కానీ తేటబడవు! లే!"
"లేస్తాను" అంది ప్రతిమ లేవకుండానే! మంచం కింద ఉన్న తన బట్టలు చటుక్కున ఒంటిమీదకు వచ్చేసేలా ఏ దేవతన్నా అనుగ్రహిస్తే ఎంత బాగుండును!
"లే! నువ్వు లేచేలోపల బోర్డు చేయించుకొస్తానని వాడు బజార్లో కెళ్ళాడు."
"బోర్డా?" అంది ప్రతిమ ప్రశ్నార్ధకంగా.
"అదేనమ్మా! ప్రాక్టీసు పెడతానన్నావుట కదా? నేమ్ ప్లేటు చేయించుకు రావడానికి వెళ్ళాడు."
ఆయన నేమ్ ప్లేట్ చేయించుకు రావడానికెళ్ళారా! ఈ ఆలోచనే ఎంత మధురంగా ఉంది!
ఉత్సాహంగా లేచి కూర్చోబోయి, మళ్ళీ పడుకుంది ప్రతిమ. అప్పుడు అర్ధమయింది సరస్వతికి ఆమె ఇబ్బంది ఏమిటో! అయినా తనకేం అర్ధం కానట్లే మొహం పెట్టి, "లేమ్మా!" అంటూ తలుపు దగ్గరగా వేసి కిందికి వెళ్ళిపోయింది.
ప్రతిమ మనసు ఆర్ద్రంగా అయిపోయింది. అత్తగారు అసలెప్పుడూ మేడమెట్లు ఎక్కి పైకి రారు. ఇవాళ తను పొద్దెక్కే దాకా లేవకపోతే, తనకి ఒంట్లో బాగులేదన్న ఆదుర్దాతో పైకి వచ్చారన్నమాట!
సాటి మనిషి ఒకరు తనకోసం ఆదుర్దా పడుతున్నట్లు తెలిస్తే ఎందుకంత తృప్తి?
ఇలాంటి అనుభూతి తనకి పుట్టింట్లో కూడా ఎప్పుడూ కలగలేదు! నిజం!
రెండేళ్ళ క్రితం తనకి ఒళ్ళు మసలిపోయినంత జ్వరం వచ్చి పడుకుండిపోతే, ఆ సంగతి మరునాడు తను నోరు తెరిచి చెప్పినదాకా గ్రహించలేకపోయింది అమ్మ!
అమ్మ ఎలా ఉందో? తను లేకుండా పనులు ఎలా చేసుకుంటూందో!
వెంటనే తండ్రి పెట్టేసిన శ్రాద్ధం, కుండలు, పొగ గుర్తొచ్చాయి. పెదిమలు బిగుసుకున్నాయి.
లేచి కూర్చుని, వంగి మంచం కింది చీరె అందుకోబోయింది ప్రతిమ.
చటుక్కున తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు శ్రీరాం.
"ఉర్సులా ఆన్ డ్రెస్ గనక ఇలా అన్ డ్రెస్డ్ గా ఉన్న నిన్ను చూస్తే జెలసీతో నల్లబడిపోతుంది." అన్నాడు.
ఉలిక్కిపడిన ప్రతిమ, "మీరొక్కసారి బయటికి వెళ్ళండి! ప్లీజ్!" అంది ప్రాధేయపూర్వకంగా.
"ఉహుఁ! ఇది నా గది! నన్ను వెళ్ళిపొమ్మని అనడానికి ఎవరికీ అధికారం లేదు. కావాలంటే నువ్వే వెళ్ళిపో!" అంటూ చేతిలో ఉన్న పొడుగాటి ప్యాకెట్ బల్లమీద పెట్టి, తను కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సిగరెట్ అంటించాడు.
"అబ్బ!" అంది ప్రతిమ అలకగా.
ఆమెకి ఆ నేమ్ ప్లేట్ ఎలా ఉందో చూడాలని ఉంది కానీ లేవడానికి సిగ్గుగా ఉంది. కనీసం తెల్లవారుఝామునైనా చీరె కట్టుకోనివ్వని అతని అల్లరికి కోపంగానూ ఉంది. చివరికి అతికష్టం మీద దుప్పటి జారిపోకుండా చుట్టుకుని, లేచి మంచం కింద ఉన్న బట్టలు అందుకుని, త్వరత్వరగా బాత్ రూమ్ లోకి వెళ్ళింది.
నవ్వుతూ లేచి ప్యాకెట్ విప్పి, అందులోనుంచి నేమ్ ప్లేట్ తీశాడు శ్రీరాం. నల్లటి ప్లాస్టిక్ బోర్డు అది. దానిమీద తెల్లటి ప్లాస్టిక్ అక్షరాలు అతికించి ఉన్నాయి.
గోడకి ఉన్న మేకుకి తగిలించాడు దాన్ని.