Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 31

 

    ఆడది అనగానే సెక్సు తప్ప మరోటి గుర్తు రాదా ఆడవాళ్ళకీ మగవాళ్ళకీ కూడా?
    
    అందచందాలు తప్ప మరో ఐడెంటిటీ లేదా ఆడదానికి? కేవలం సెక్స్ సింబల్ గా నిలిచి పోతూందా?
    
    చిరాగ్గా అయిపోయింది ప్రతిమ మనసు.
    
    ఇంటికొచ్చేసరికి భరించలేనంత తలనొప్పి వచ్చేసింది.
    
                                                           * * * * *
    
    మరునాడు బలవంతం చేసి క్లబ్బుకి తీసుకెళ్ళాడు శ్రీరాం.
    
    రేస్ కోర్స్ చూసిన తరవాత ఇంక ప్రపంచంలో ఏ ప్రదేశమైనా దానికంటే ప్రశాంతంగానే ఉంటుందేమో అనిపించింది ప్రతిమకి.
    
    ఈ క్లబ్బు వాతావరణం అంత హడావిడిగా లేదు. రెండు ఎకరాల మేర ఆక్రమించుకుని ఉన్న పెద్ద పెద్ద వృక్షాల మధ్య ఉంది ఆ భవనం.
    
    చాలో పెద్దవాళ్ళు, చాలా హోదా గలవాళ్ళు - మాత్రమే దానిలో మెంబర్ షిప్ సంపాదించగలరు.
    
    అది సంపాదించగలిగినందుకు తన భుజం తానే చరుచుకుంటూ ఉంటాడు శ్రీరాం.
    
    అతను పేకాటలో కూర్చునే ముందు ప్రతిమని అందరికీ ఇంట్రడ్యూస్ చేశాడు. "నా వైఫ్! డాక్టర్ ప్రతిమ" అంటూ.
    
    మగవాళ్ళు కార్డ్స్ ఆడుతూ ఉంటే ఆడవాళ్ళు గాసిప్ మొదలెట్టారు.
    
    తమ భర్తల హోదాలని గురించిన గొప్పలు - కట్టించబోయే కొత్త బంగళాలు, మార్చబోయే కార్లు, చెయ్యబోయే ఫారిన్ ప్రయాణాలు.
    
    'వ్యర్ధమైన సంభాషణ!' అనిపించింది ప్రతిమకి. సంభాషణ చీరెల మీదికీ, మేకప్ సామాగ్రి మీదికీ మళ్ళింది.
    
    ఆ తరవాత పాడెడ్ బ్రాస్ ఎక్కడ మంచివి దొరుకుతాయి, ఏ బ్యూటీ పార్లర్ లో కనుబొమలు బాగా సెట్ చేస్తారు అన్నదాని మీద పదిహేను నిమిషాలు చర్చ!
    
    ఇంకాసేపు అక్కడ కూర్చుంటే తనకి పిచ్చెక్కుతుందేమో అని భయమేసింది ప్రతిమకి.
    
    అందం! అందం! దాన్ని ఎక్కువ చేసుకోవడం ఎలా? మగాణ్ణి ఆకర్షించడం ఎలా? అబ్బ! ఇది తప్ప వేరే ధ్యాస లేదా వీళ్ళకి?
    
    అప్పుడు ఆమెని రక్షించడానికి వచ్చిన దేవదూతలా వచ్చింది మెహజబీన్. పక్కనే కూర్చుంది.
    
    ఆమె హైదరాబాద్ నవాబు వంశానికి చెందినది. ఆక్స్ ఫర్డ్ లో చదువుకుంది.
    
    మృదువుగా ఆమె ఎవరితోనో మాట్లాడుతుంటే అప్రయత్నంగా వినసాగింది ప్రతిమ.
    
    ఇంట రెస్టింగ్ గా చెబుతూంది ఆమె. హైదరాబాద్ పాత చరిత్ర, అక్కడున్న పాలెస్ లూ - పురానా హవేలీ - ఫలక్ నామా - మాల్వాలా ప్యాలెస్ - వాటి చరిత్ర!
    
    విజ్ఞానం ఎక్కడున్నా జుర్రేసుకోవాలనుకుంటుంది ప్రతిమ.
    
    నెయిల్ పాలిష్ గురించీ, ఆన్ ఫ్రెంచ్ గురించీ చర్చించడం కంటే ఇది వెయ్యిరెట్లు ఇష్టం ఆమెకి.
    
    తొమ్మిధయ్యాక ఆటలోనుంచీ లేచాడు శ్రీరాం.
    
    ఇద్దరూ లాన్ లో కూర్చున్నారు.
    
    పెద్ద చెట్ల వెనకాతల నుంచీ చంద్రుడు తొంగి చూస్తున్నాడు. కొద్దిగా చలి వేస్తూంది.
    
    చిప్సూ, కట్ లెట్సూ, కాఫీ ఆర్డర్ చేశాడు శ్రీరాం.
    
    అవి వచ్చాక ఒక్క చిప్ తీసుకుని అనాసక్తిగా మునిపంటితో కొరుకుతూ ఉండిపోయింది ప్రతిమ.
    
    శ్రీరాం కొంచెం అసహనంగా చూశాడు.
    
    "ప్రతిమా! నువ్వు అదోలా ఉన్నావు."
    
    "ఏం లేదు."
    
    అతని గొంతులో కొంచెం తీవ్రత ధ్వనించింది.
    
    "షిట్! నిన్ను సంతోషపెట్టాలని ఆరాటపడిపోతున్నాను నిన్నటి నుంచీ! నువ్వేమో 'టచ్ మీ నాట్' లాగా ముడుచుకుపోతున్నావు!"
    
    "అది కాదు."
    
    "నువ్వు నా కంపెనీ ఎంజాయ్ చెయ్యటం లేదు. అవునా?"
    
    చటుక్కున అన్నది ప్రతిమ.
    
    "మీ కంపెనీ ఎంజాయ్ చెయ్యకపోవడం కాదు. ఈ రేసెసూ, ఈ క్లబ్బులూ, ఈ వాతావరణం -ఇవన్నీ నాకు నచ్చవు."
    
    "ఇంత పెద్ద చదువు చదువుకున్నావ్. సొసైటీలో తిరగడం నేర్చుకోకపోతే ఎలా? సివిలిజేషన్ ఒంట పట్టించుకోవాలి నువ్వు."    

 

    "సివిలిజేషన్ అంటే ఫ్యాషనబుల్ గా అలంకరించుకోవడం, రేసెస్ కెళ్ళడం,ఖరీదైన రెస్టారెంట్ లో భోజనం చెయ్యడం, క్లబ్బుల కెళ్ళడం, ఇంతేనా? చదువుకోవడం - చదువుని సక్రమంగా ఉపయోగించుకోవడం - అది నాగరికత కాదా?"
    
    మామూలప్పుడు చాలా ముక్తసరిగా మాట్లాడే ప్రతిమ తను నమ్మిన విషయాన్ని చెప్పేటప్పుడూ, లేదా తన సబ్జెక్టుని గురించి చర్చిస్తున్నప్పుడూ చాలా స్పష్టంగా మాట్లాడగలదని అర్ధమయింది శ్రీరాంకి.
    
    అతని కనుబొమలు ముడిపడ్డాయి.
    
    "మళ్ళీ ఉద్యోగం గొడవేనా? ఎవడి చేతికింది నీళ్ళో తాగాలని బాగా పిచ్చిగా ఉంది నీకు! నా భార్యని ఉద్యోగానికి తరమాల్సినంత  దౌర్భాగ్యపు స్థితిలో నేను లేనని చెపితే వినవేం నువ్వు? అంత బికారిగాన్ననుకుంటున్నావా?"
    
    ప్రతిమ నొచ్చుకుంటూ చూసింది.
    
    "సారీ! మీకు అర్ధమయ్యేలా చెప్పలేకపోతున్నాను నేను. డబ్బు సమస్య కాదు ఇక్కడ. చదివిన చదువుకి సార్ధకత లేకపోతూందే అని నేను బాధ..."
    
    చటుక్కున నిలబడ్డాడు శ్రీరాం.
    
    "ఇనఫ్ ఈజ్ ఇనఫ్! ఇంక చాలు! పోదాం పద!"

 

    మౌనంగా లేచింది ప్రతిమ.
    
    కారులో కూర్చున్నారు.

 Previous Page Next Page