Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 31

 

    నా పెళ్లితోనే మా వాళ్ళకి దూరం అయాను నాన్న కూడా పోవటంతో వాళ్ళకి మాకూ పూర్తిగా తెగ తెంపులయింది. మావాళ్ల నుంచి నాకేమి రాలేదు. ఓ చిన్న యిల్లు మాత్రం దక్కింది. అదయినా మా అమ్మమ్మది కాబట్టి మాకొచ్చింది. నాకూ తమ్ముడికి మిగిలింది ఆ చిన్న యిల్లు మాత్రమే. అంటూ ఓ పెద్ద కధ పూర్తి చేసింది. శాంత కధతో పాటు సీతకి జడకట్టడము పూర్తిచేసింది.

 

    "నాన్న మళ్లి పెళ్ళి చేసుకోలేదు. ఈ విషయంలో నే అదృష్టవంతురాలినే" అనుకుంది సీత.

 

    ఇదే మాట రూప అనుకుంది.

 

    "సీతా! నీకు చెప్పే పనిలేదు. కష్టం సుఖం తెలిసి పెరిగినదానివి సుందరం తన విషయమేమో తానేమో ఏది తెలియదు. ఏది పట్టించుకోడు భార్యగా సుఖపెట్టడం కన్నతల్లి లాలింపు ప్రేమా అన్ని వాడికి నువ్వే అందించాలి." అంది సీత.

 


    "ఊ" అంది సీత.

 

    "తల్లి ప్రేమ అక్కకి మాత్రం వుందా? భర్తగా అక్కని సుఖపెట్టి లాలింపు ప్రేమ చుపించోద్దా! కధంతా వినిపించింది దేనికయ్యా అంటే వాళ్ళ తమ్ముడి ఆలనాపాలనా జాగ్రత్తగా చూసుకోమని ఇన్నేళ్ళ జీవితంలో అక్కమాత్రం ఏం సుఖపడ్డది? వన్ సైడునే అలోచిస్తున్నదా?" శాంత గురించి అనుకున్నది రూప.

 

    శాంత ఆ గదిలోంచి బైటికెళ్లింది.

 

    ఈ సమయంలో అక్క సిగ్గుపడటంవల్ల తనూ మూగ మొద్దులా వుండటం బాగుండదని మాట్లాడక...." అనుకుని రూపలేచి సీతదగ్గరకొచ్చింది.

 

    "ఇంత అందమైన పెద్దజడ నీకు తప్ప మరెవరికి నప్పనంత అందంగా వుందక్కా" అంది రూప. సీత వేనుకవేపు చేరి జడలో మాల సవరిస్తూ.

 

    వినిపించి వినిపించనట్లు "ఊ" అంది సీత.

 

    "తన తమ్ముడేమిటి నోట్లో నాలుక పళ్ళు లేని అమాయకపు తాతగారని చెపుతున్నది, బావ గారిని నోరు తెరవమని చుసిరానేమిటి, ఎందుకైనా మంచిది." అంది రూప.

 

    "చీ....పో" అంది సీత.

 

    
                                                   18

 


    నుంచుని నుంచుని సీత కళ్ళు పిక్కు పోతున్నాయి.

 

    సరిగ పావుగంట అయింది సుందరమూర్తి మంచం మీదనుంచి లేచే ప్రయత్నం చేయలేదు. అలా సీతని చూస్తూ బుద్ధ విగ్రహంలా కూచునే వున్నాడు.

 

    నోట్లో నాలుక లేదు. వుత్త అమాయకుడని చెప్పింది భార్యని పలకరించటం చాతగానంత అమాయకుడా? పెళ్ళిలో అలా ఏమి కనిపించలేదే." భర్త గురించి అనుకుంది సీత.

 

    మరి కొద్దిసేపు గడిచింది, పూర్తిగా విసుగు కల్గింది సీతకి. అయినా నుంచున్న చోటు నుంచి అంగుళం ముందుకు జరగలేదు. సీతకి అలా కొన్ని గంటలు నుంచోగల ఓర్పు, శక్తి వున్నాయి. విసుగు తనలోనే దాచుకుని నిరీక్షిస్తూ నుంచుంది.

 


    శాపవిముక్తి అయినట్లు అప్పుడే చైతన్యం వచ్చినట్లు మరో అయిదు నిమిషాల తర్వాత సుందరమూర్తి మంచం మించి కదిలి సీతను సమీపించాడు. సీత భుజం మీద చేయి వేసి "సీత" అని మెల్లిగా పిలిచాడు.

 

    "ఊ" కొట్టటానికి సిగ్గుపడింది సీత.

 

    "మంచి సహనవంతురాలివే. అవునూ ఇది నిజంగా సహనమా? సిగ్గా? అన్నాడు సుందరమూర్తి సీత రెండో భుజం మీద కూడా చెయ్యి వేసి.

 

    "ఇంతలో ఈయనకి నాలో ఏం సహనం కనపడింది! ఓహో దరిదాపు అరగంట నుంచోటమా?" అనుకుంది సీత.

 

    "మాట్లాడవు సిగ్గా? భయమా?"

 

    అప్పటికి వినివినిపించనంత నెమ్మదిగా "ఊ....ఉహూ..." అంది సీత.

 

    "ఎంతసేపు నుంచుంటావు కూచుని మాట్లాడుకుందాం పద....' అంటూ సుందరమూర్తి సీత చెయ్యి పుచ్చుకుని ముందుకు నడిపించాడు.

 

    "కూచో" అనంగానే కూచుంది సీత.

 

    సుందరమూర్తికి బొత్తిగా యిదెం నచ్చలేదు. పురాణ గాధల్లోను కొన్ని కధల్లోనూ సినిమాలలోను ఎన్ని తెలుసుకోలేదు. ఎన్ని చూడలేదు? తొలిరాత్రి ప్రతి భార్యా సిగ్గుపడుతుంది, భయపడుతుంది. భర్త పలకరించగానే మాట్లాడే ధైర్యం చేయకపోయినా, ఇది తన ధర్మం అన్నట్లు కాళ్ళమీద కొరిగి నమస్కరిస్తుంది. అక్కడికి నుంచుని మూడు నాలుగు మాటలు మాట్లాడాడు. సీత నమస్కారం పెట్టటానికి ప్రయత్నమే చేయలేదు. కుచోమని చెప్పినప్పుడయినా కాస్త కాళ్లు పట్టుకోకూడదు? టకీమని కూచుంది. పోనీ పాదాలకి నమస్కారం చెయ్యమంటే? తను చెపితే ఏం బాగుంటుంది?'

 Previous Page Next Page