"మరోసారి వస్తాం బాబాయిగారూ! సమయంగాని సమయంలో వచ్చి మీ పనులు చెడగొట్టాము" అని "పదవే ఏం చూస్తావ్?" అంటూ త్రిలోకసుందరిని గదిమింది వైజయంతి. అంతే ఇరువురూ వేగంగా అక్కడనుంచి ఇవతలికి వచ్చారు.
"బాబాయిగారికి వేపకాయంత వెర్రి. ఆ వెర్రిని వీళ్ళు అంటించుకుంటున్నారు. తింగిరి మింగిరి భాషకూడా అంటించుకున్నారు. విన్నావుగా! సందు దొరికిందే ఓ ఆట ఆడించేదానినే ఆ మగమహారాజులు డ్రాయర్లతోవున్నారు. అందుకే వచ్చేశాను" అంది వైజయంతి.
"ఆడది మగవాడిమీద జాలిపడకూడదు. పడటం మొదలుపెట్టిందీ అంటే పతనం ప్రారంభం అని అర్ధం రచయిత్రిభాషలో చెపుతున్నాను బాగా గుర్తుంచుకో. రచయిత్రులు చాలా మంచి విషయాలు తేలిగ్గా అర్ధమయ్యేలా రాస్తారు. వాళ్ళు ఆచరణలో పెట్టినా పెట్టకపోయినా ఈ విషయంకూడా బాగా గుర్తుంచుకో" గంభీర్యంగా అంది వైజయంతి.
"మనవాళ్ళు రాజులు అయిన కధలకన్నా మంత్రులు కరణాలు, పూజారులు...
"అది కాదే పిల్లా! నే ఆలోచిస్తున్నది ఇళ్ళ పేరుగురించి."
"రాజులేంటి! ఇళ్ళపేరు లేంటీ? రామదూత బాబాయ్ గారు ఏదైనా కొత్తవిషయం చెవినేశారా ఏమిటి?" అంది త్రిలోకసుందరి.
"విషయం ఏమిటంటే అదికాదు. ఇంటిపేరు చివర రాజు అని వుండటం అన్నమాట. గోపరాజు, తిప్పరాజు, కాటంరాజు అలా అన్నమాట...
"ఓ....అదా?"
"ఆ" అదే సరీగ ఇరవై రెండు రాజుల ఇళ్ళపేర్లు గుర్తు వచ్చాయి. నూట ఎనభై దాకా రాజు కలిసినవి వున్నాయని మీరు అనగా ఇప్పుడు గుర్తొచ్చి లెక్కవేస్తున్నాను. మీకేమైనా తెలుసటే పిల్లలూ!" విషయం చెప్పి బామ్మగారు అడిగింది.
"చాలా తెలుసు బామ్మగారూ! నేను చెపుతాను. లెక్కవేసుకోండి. అల్లం రాజువారు..." అంది త్రిలోకసుందరి.
"సరిసరి అల్లంరాజు శేషయ్య మాకు బాగా దగ్గర వాడు. శేషయ్య ఇంటిపేరే మర్చిపోయాను" అంది బామ్మగారు.
అల్లంరాజు ఇంటిపేరు వున్నప్పుడు ఎ మూలో బెల్లం రాజు వాళ్ళుకూడా వుండేవుంటారు అని తలచి "బెల్లంరాజు" అంది వైజయంతి.
"అల్లంరాజు వాళ్ళు వున్నారుగాని బెల్లంరాజువాళ్ళు లేరే పిల్లా!" అంది బామ్మగారు.
"ఆ గుర్తొచ్చింది. బాపు యింటిపేరు సత్తిరాజు వాళ్ళు సింగరాజు వాళ్ళ అమ్మాయి నా ఫ్రెండ్. భూపతిరాజువాళ్ళు పక్కవీధిలో వున్నారు. ప్రగడరాజువాళ్ళు నా మరోఫ్రెండ్ అత్తారింటి పేరు గలవాళ్ళు" గబగబ చెప్పింది వైజయంతి.
"గోపరాజు, అన్నంరాజు, బసవరాజు..."
"శీతంరాజు, శ్రీపతిరాజు, రుద్రరాజు..."
పోటాపోటీగా త్రిలోకసుందరి వైజయంతి ఇంటి పేరులో రాజు కలిసిన ఇళ్ళపేర్లు చాలానే చెప్పారు.
బామ్మగారి ముఖం సంతోషంతో వికసించింది.
"మీరు పిల్లలు కాదే పిల్లలూ! పిడుగులు మీలాంటి వాళ్ళకి మొగలిపువ్వులాంటి మొగుడు ముత్యాల్లాంటి చిచీంద్రీ బిడ్డలు వుండాలి. వుండాలంటే ముందు జరగాల్సింది కళ్యాణం కనుక శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు" అంటూ దీవించారు బామ్మగారు.