"నీ అబద్దాలు తగలెయ్యనోట్లో పురుగులు పట్టిచస్తావు. సీతమ్మలాంటి ఆ పిల్లకి నీవు రంకులు గడుతున్నావు? నీ నోరుపడ ఎంతెంత మాటలంటున్నావు? అభం శుభం తెలియని అమ్మాయిని పట్టుకుని రంకులు సాగించింది నీకోడలా, నీ కొడుకా? చెప్పవే దేవుడి మొహంచూచి చెప్పు ఇంట్లో లక్ష్మిలాంటిపిల్ల నుంచుకుని అడ్డమైన సానికొంపలుతిరిగింది నీ కొడుకా కోడలా చెప్పవే?"
తల్లీకొడుకులు గాభరా పడిపోతున్నారు. కలవరపడుతూ, ఇద్దరూ చెరో రెక్క పుచ్చుకున్నారు "యేమిటండీ మీ మాటలు? మతుందా లేదా?" అంది "నాన్నా పదండి లోపలికి" కొడుకు అన్నాడు. ఆ ముసలాయన ఇద్దర్నీ విదిలించి పారేశాడు. మతి ఉందే ఇంకా ఇంకా మతిపోలేదని విచారిస్తున్నాను. ఈ వేళతో మతిపూర్తిగా పోయింది. నిన్నువాడిని ఈవేళ ఏంచేస్తానో చూద్దురుగాని ఆ పిల్లని ఒకలాగ కాల్చుకుతిన్నారా మీ ఇద్దరూ: ఇన్నాళ్ళూ చంపుకు తిన్నది చాలక రంకులు గూడా అంటగట్టడానికి సిద్దపడ్డ మిమ్మల్ని దేవుడు క్షమించినా నేను క్షమించను.
ఎంతచెప్పినా నోరెరగని ఆ అమ్మాయిని అంతంతమాటలు అనద్దన్నాను యే పాపం ఎరగని ఆ పిల్లని ఇద్దరూ కలిసి ఎన్ని మాటలన్నారు? ఎన్ని కొట్టినా సహించింది. ఆఖరికి తన శీలాన్నే శంకించడం సహించలేకపోయింది. అతి భయంకరమైన చావుకి కూడా సిద్దపడిందంటే ఆ పిల్ల మనసెంత బాధపడిందో ఇప్పటికయినా తెలియలేదంటే"
"మీరు నోరు మూసుకుని లోపలికి పదండి ఏమిటి వాగుతున్నారు?" కళ్ళెర్రచేసి భద్రకాళిలా విరుచుకు పడింది ఆవిడ మొగుడు మీద కొడుకు తండ్రిని లోపలికి లాక్కెళ్ళడానికి ప్రయత్నించాడు.
"ఇన్నాళ్ళూ మూశాను నా నోరు. ఇంకా మూయించడం నీ బాబు తరం కూడాకాదు. నా గుండెలు మండిపోతున్నాయి. చూడు ఆ పిల్ల ఎలాంటి చావు చస్తూందో చూసినా నీకు జాలి కలగటంలేదుటే? నీవు మనిషివిటే రాక్షసివి గానీ: అమ్మా, డాక్టరమ్మ గారూ ఇదిగో ఈ రాక్షసి, ఆ దరిద్రుడు...... నా కడుపున చెడబుట్టిన ఆ వెధవా ఇద్దరూ కలిసే ఈ పిల్లని చంపారు. వీళ్ళమాటలు భరించలేక ఆ పిల్ల చచ్చిపోయింది. ఈ పాపిష్టి వాళ్ళని పోలీసులకి అప్పచెప్పండి" ఉద్రేకంగా అన్నారు ఆచారిగారు.
అరుణ ఆయన వంక సూటిగా చూస్తూ అంది: "ఆచారిగారూ: మీ ఈ ధైర్యం కొన్ని గంటలముందుంటే అ ఆపిల్లచావకుండా కాపాడగలిగేవారు. వాళ్ళని ఎదిరించి ఉంటే, మీ కొడుకుని, భార్యని చెప్పు చేతల్లో పెట్టుకుని ఉంటే ఇలా ఆ అమ్మాయి చావనక్కరలేకపోయేది." సుబ్బులు ఆఖరి శ్వాస ఆగిపోయింది ఆమె గుండెకొట్టుకోవడం ఆగి పోయింది క్షణం క్రితమే ఇప్పుడింక ఎవరు ఏమనుకున్నా ఆ అమ్మాయికి లెక్కలేదు" తలమీదుగా దుప్పటికప్పుతూ గద్గదంగా అంది అరుణ. ఆ అమ్మాయి చచ్చిపోవడమే అరుణకి ఆ క్షణంలో ఆనందం కలిగించింది. అట్టే బాధపడకుండా వెళ్ళిపోయింది. బ్రతికినా నరకం చూసేది ఆ బాధపడలేక తరవాత అయినా వికృత రూపంలో, బ్రతుకు మరింత దుర్భరమవగా చావలేక బ్రతికే బ్రతుకుకన్నా ఇలాచనిపోవడం చాలానయం: అరుణ గొంతు నిండా దుఃఖం అడ్డుపడింది.
ఆచారిగారు అరుణ దుప్పటి కప్పేయడం చూసి గొల్లుమన్నారు. "అమ్మ వెళ్ళిపోయావా తల్లీ" అంటూ ఏడ్చారు" సుఖపడ్డావమ్మా ఈ నరకం నించి విముక్తి దొరికి సుఖపడ్డావు. డాక్టరమ్మగారూ అవునమ్మా నేనుత్తపిరికివాడిని దాని నోటికి చాలలేక చవటలానోరుమూసుకు ఊరుకున్నాను ఇంట్లో. నన్నే గడగడలాడించింది ఇంట్లో అది. కోడలో లెక్కాదానికి? ఒసేవ్ ఇంక సంతోషించు ఇంక నీవు నీ కొడుకు కట్టకట్టుకు గంగంలో దిగండి. ఛస్తే మళ్ళీ మీ మొహంచూడను. ఈ వేళతోటి నాకు, నీకు సంబంధం లేదు, ఆ వేణుగోపాలుడి పాదాల దగ్గిరే ఇంత చోటుచూసుకుని పడుంటాను" మొహం కప్పుకుని ఏడుస్తూ వెళ్ళిపోయారు ఆచారిగారు.
ఇంతసేపూ ఓ వీధి నాటకం చూస్తున్నట్టు నిలుచున్న వాళ్ళందరికి ఒక్కసారిగా ఆవేశం పొంగిపొరలింది" తన్నండిలా పట్టుకుని. ఇద్దర్ని కలిపి నరకండిరా సీతమ్మవారి లాంటిపిల్లని పొట్టనపెట్టుకున్నారు. ఇలాంటోళ్ళని వదిలేయకూడదు" నలుగురయిదుగురు యువకులు ఆవేశంగా ముందు కెళ్ళారు.
తల్లికొడుకులు బిక్కచచ్చిపోయారు. వ్యవహారం ఇంతవరకు వస్తుందని వాళ్ళు అనుకుని ఉండరు.
"అయ్యో ఇదెక్కడి ఖర్మరాదాని చావు అది చస్తే మనం చంపారంటారేమిటి?"
అరుణ నిరసనగా నవ్వింది. "అవును మీరు చంపలేదు మీ అంతట మీరు చంపితే, ఆ నేరం మీ మీదకి వస్తుందని తెలుసు. ఏ ఆయుధంతోమీరు చంపలేదు. కేవలం మాటలతో చంపి ఆ వదిలారు ఆ అమ్మాయిని." అరుణ మాటల్లో ఎంతో కసి ద్వేషం జనించాయి.
"ముందు ముసలిదాన్ని పట్టుకోండిరా" అన్నాడొకడు.
"ఆగండి:" అరుణ అందర్నీ వారిస్తూ అన్నది. "వాళ్ళని శిక్షించడానికి మనకేం హక్కులేదు. పోలీసులని పిలిస్తే వాళ్ళే చూసుకుంటారు ఏం చెయ్యవలసిందీ."అరుణ వాళ్ళని శాంతపరుస్తూ అంది. "మనం ఏమి చెయ్యక్కరలేదు. వాళ్ళే చేస్తారు శాస్తి." కసిగా అంది.
పోలీసులనగానే తల్లీకొడుకులు మొహాలుచూసుకున్నారు. కొడుక్కి పౌరుషం వచ్చినట్టుంది. ముందుకు వచ్చి అరుణ వంక చురచుర చూశాడు. "ఏమిటండీ అందరూ తెగ బెదిరిస్తున్నారు? మేమేం దానికి నిప్పెట్టామా ఏమిటి? మేమేం నేరంచేశామని పోలీసులని పిలుస్తారు? ఊరుకుంటూంటే ఎక్కువవుతూంది మరి వెళ్ళండి, మా ఇంట్లోంచి అందరూ. "ధైర్యం తెచ్చుకుని కోపంగా ధిక్కరించాడు. అరుణ ఒక్కసారి తీక్షణంగా అతనివంక చూసి చూపు మరల్చుకుంది.
"బెదిరింపు కాదు, మీరు నేరం చేశారో, లేదో అదంతా పోలీసులే తేలుస్తారు. అందుకే పోలీసులను పిలవడం "తీక్షణంగా అంది అరుణ రుక్కు వైపు తిరిగి "కాగితం, కలం పట్టుకురా, పోలీసు స్టేషన్ కి ఉత్తరం రాసిఇస్తాను" అంది.
"ఉత్తరం రాసి ఇస్తాను, టౌన్ పోలీస్ స్టేషన్ కి ఎవరైనా ఇచ్చి వస్తారా?" గుంపుని చూసి అడిగింది అరుణ.
"ఓమీరు రాసిస్తే మినిట్టులో పట్టికెళ్ళి ఇస్తాం" అన్నారు నలుగురైదుగురు.
"ఒరే ఆళ్లిద్దర్నీ లోపలెట్టిగొళ్ళెం పెట్టండిరా పారిపోగలరు" హెచ్చరించాడు మరొకడు.
"అయ్యమ్మో మీ చేతులు పడమీ నోళ్ళు పడ మీకేం పొయ్యేకాలంరా అయ్యోదేవుడా ఎలాంటిపనిచేసి పోయావే. తల్లీ అంటూ గోలపెడుతున్న ఆవిడని, చేతకాని పౌరుషంతో పెనుగులాడుతున్న అతన్ని ఓ గదిలోకినెట్టి తలుపులుబిగించారు కొందరు.
అరుణ క్లుప్తంగా జరిగిన సంగతిరాసి సంతకం పెట్టి వెంటనే రమ్మని రాసి, కాగితం ఇచ్చింది. పోలీసులు వచ్చేవరకు ఆ శవం దగ్గిర నలుగురు పెద్దవాళ్ళని ఉండేటట్టు ఏర్పాటు చేసి అరుణ ఇంటికి బయలుదేరింది.
అరుణ మనసంతా ఆ సంఘటనతో కలతపడింది సుబ్బులు: నిన్నటి సుబ్బులు మరి ఈ వేళ లేదు" అబ్బ చచ్చిపోవడానికి కూడా ఇంత ఘోరమైన మార్గం ఎందుకు ఎన్నుకుంటారో? వికృతంగా ఉన్న సుబ్బులు మొహం జ్ఞప్తికి వచ్చి, అరుణ మనసంతా అదోలా అయింది. ఎన్నోచావులు చూసిన అరుణ, ఎందుచేతో ఆ చావుకి తట్టుకోలేకపోయింది. సుబ్బులు నిన్న తన దగ్గిరికి రాకుండా ఉంటే ఈ వేళ ఇలా జరిగేది కాదేమో? ఆ భావం మనసుని దొలుస్తుంటే ఇంటికెళ్ళి పక్కమీద వాలిపోయింది.
మూడు నాలుగు గంటల్లో పోలీసులు వచ్చారు. రాగానే అందరూ చెప్పినమాటలు విన్నారు. అరుణ దగ్గరికి వచ్చారు. అరుణ నిన్న సుబ్బులు తన దగ్గరికి వచ్చినసంగతి నించి తనకి తెలిసిన విషయాలన్నీ చెప్పింది. పోలీసులకి సుబ్బులు కాలిపోయినగదిలో ఓ ఉత్తరం సుబ్బులు రాసింది దొరికిందట. తనను అత్తగారు భర్త పెట్టే బాధలు పడలేక, రోగం బాధ భరించలేక చచ్చిపోతున్నానని రాసిందట అరుణ కాగితంతో పోలీసుల పని సులువయింది. వాళ్ళిద్దర్నీ అరెస్టు చేసి తీసుకెళ్ళారు. సుబ్బులు శరీరాన్ని పోస్టుమార్టమ్ కి తీసుకెళ్ళి, డెత్ సర్టిఫికేట్ తంతు జరిగాక దహన క్రియలకి మామగారికి అప్పచెప్పారు. మర్నాడు నలుగురు పోయి దహనక్రియలు జరిపారు.
ఆ రాత్రి అంత అరుణ కంటికినిద్ర రాలేదు.
* * *
ఏవో సరుకులు తెచ్చుకోవడానికిపట్నం వెళ్ళిన సుబ్బారావు వస్తూనే సంగతి తెలిసి మర్నాడు పొద్దునే అరుణ దగ్గరికి వెళ్ళాడు.
"ఇదేమిటండోయ్? ఊళ్ళో పేషెంట్లకంటే శత్రువులని ఎక్కువపోగు చేస్తున్నారు" అన్నాడు నవ్వుతూ. "బాబూ మీ రెందుకండి ఇలాంటివాటిలో ఇరుక్కుంటారు?"
"చూస్తూ ఎలా ఊరుకోమంటారు ఇలాంటి విషయాలు? ఈవేళ ఈ పిల్ల అయింది. రేపొద్దున్న ఇంకో అమాయకురాలు కావచ్చు ఒకళ్ళిద్దరికి ఈ విధంగాబుద్ది చెప్పితే కాని తక్కిన వాళ్ళకి భయంరాదు అంతదాకా ఎందుకు? ఈ ప్రబుద్దుడు ఏడాది తిరక్కుండా మళ్ళీ పెళ్ళికి తయారవుతాడు ఎలాగు. ఆ వచ్చే పిల్లని కూడా ఇలా బాధలు పెట్టరని ఏముంది? బుద్ది రావాలంటే ఇలా ఓసారి జరగాలి"
"బాగానే ఉంది ఏ ఈ విషయం మీదాకా వచ్చింది గనక ఏదో చేశారు లేకపోతే ఇలాంటివి ఎన్నో? మన మేం చెయ్యగలం.
"నాదాకా వచ్చింది గనకే ఈ విషయం పోనీయలేదు నేను. నా దాకా వచ్చాక కూడా ఓ అమాయకురాలు దారుణమైన చావు చచ్చిపోతే ఏం చెయ్యకుండా వాళ్ళనివదిలెయ్యమంటారా?" "మీరున్నారుకనక ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చింది. లేకపోతే నలుగురూ వింతగా ఓసారి చూసి, 'అయ్యోపాపం' అనుకుని వెళ్ళిపోయిఉండేవారు."
"అదే కూడదంటున్నాను ఎవరికీ వారే మా కెందుకని పట్టించుకాకపోతే ఈ ఘోరాల్ని ఎలా అరికట్టడం?" అరుణ తీవ్రంగా వాదించింది.