Previous Page Next Page 
అరుణ పేజి 31

    ఆ తండ్రి ఆవిడకి దాసుడు. ఏదో ఓలాగ కూతురికి పెళ్ళిచేసి పంపేశాడు...... ఇన్నాళ్ళయింది ఒక్కసారయినా సుబ్బుల్ని తీసుకెళ్ళలేదు మళ్ళీ. అదే ఏడుస్తుంది సుబ్బులు ఎవరితో చెప్పుకోను అంటూ" చేతులు తిప్పుతూ యాక్షన్ చేసింది రుక్కు.   
    ఇంకా ఈ నాడు కూడా ఇలా కోడంట్రికం పెట్టే అత్తలూకాల్చుకుతినే మొగుళ్ళు ఉన్నారన్న మాట ఇలా ఇంకా ఎందరున్నారో? నిట్టూర్చింది అరుణ.    
                                                                * * *    
    మర్నాడు సాయంత్రం ఓ ఘోరం జరిగింది. సాయంత్రం నాలుగుగంటలకి రుక్కు పరుగెత్తుకుంటూ వచ్చింది అరుణ దగ్గరికి. "డాక్టరుగారూ? సుబ్బులు ఒంటిమీద కిరసనాయిలు పోసుకుని నిప్పంటించేసుకుందండీ ఒళ్ళంతా కాలిపోయింది చచ్చిపోయిందంటున్నారు."    
    అరుణ నోట మాట రాక స్థాణువై పోయింది. "నిజం నిజమా చచ్చిపోయిందా? ఎందుకంటింటించుకుంది?" అరుణ మాట తడబడింది. నిన్న ఈ పాటి వేళకి తనతో మాట్లాడిన అమ్మాయి ఇంత ఘోరం ఎందుకుచేసింది? ఇంట్లో ఎవరన్నా ఏదైనా అని ఉంటారు.    
    "నిజం అండీ, ఊరు ఊరంతా అక్కడే ఉన్నారు. నేనూ చూసి మీకు చెపుదామని పరుగెత్తుకు వచ్చాను. బాగా కాలిపోయే వరకు ఎవరూ చూడలేదు. మంటలు పైకి వచ్చాక అప్పుకు చూశారట. ప్రాణం ఉందని కొందరూ లేదని కొందరూ అంటున్నారు."    
    అరుణ వెంటనే లేచింది." పద వెళ్ళి చూద్దాం ఏమైనా చేయగలనేమో నేను చూస్తాను." అవసరం అయిన మందులు బాగ్ లో పెట్టుకుని, గబగబ అరుణ రుక్కు వెంట నడిచింది.
    ఆచారిగారిఇల్లు సుబ్బారావు ఇంటికి నాలుగయిదు ఇళ్ళ తరవాత ఎదురుగా ఉంది. అరుణ వెళ్ళేసరికి ఆచారిగారి ఇంటిముందు మనుష్యులు గుమిగూడి నించున్నారు. అరుణని చూసి, "డాక్టరమ్మగారొచ్చారు అడ్డు లెగండేస్" అనుకుంటూ దారి ఇచ్చారు. అరుణ గుంపులోంచి లోపలికి వెళ్ళింది.    
    వీధి అరుగు మీద సుబ్బుల్ని పడుకోబెట్టాడు. నల్లగా కమిలిన వంకాయలా మాడిపోయి ఉంది సుబ్బులు శరీరం ఒంటి మీద బట్టలు కాలిపోయాయి ఓ దుప్పటి కప్పారు. జుట్టు నెత్తిమీద అంతా మాడిపోయి మాడు కనిపిస్తూంది. కనురెప్పలు, కనుబొమలు సహితం కాలిపోయాయి మొహం ఆనవాలు లేకుండా నల్లగామాడి వికృతంగా ఉంది డాక్టరయిన అరుణకే ఒళ్ళు జలదరించింది ఆ ఆకారం చూడగానే పైకి చూడగానే సుబ్బులు బ్రతకడం కష్టం అని అరుణకి తెలిసిపోయింది.    
    అయినా, గబగబ వెళ్ళి చెయ్యి పట్టుకుని చూసింది. నాడి అందలేదు. శరీరం అంతా సెగలు చిమ్ముతుంది. లోపల మాంసం వేడికి ఉడికి అదో వాసన వస్తుంది. అప్పటికే బొబ్బలెక్కాయి ఒళ్ళంతా. కాస్త ఊపిరి మాత్రం ఆడుతుంది. గుండె చాలా నెమ్మదిగా ఏ క్షణమయినా ఆగిపోవడానికి సిద్దంగా ఉన్నట్టు వినిపించీ వినిపించనట్టు కొట్టుకుంటూంది. అరుణకి గుండె ఆగిపోవడానికి ఇంకెన్నో క్షణాలు పట్టదని అర్ధం అయింది అరుణకి అయినా, డాక్టరుగా తన ఆఖరి ప్రయత్నంగా ఓ ఇంజక్షన్ ఇచ్చింది అందరూ అరుణవంక ఆదుర్దాగా ఆరాటంగా ఏం చెబుతుందోనని చూస్తున్నారు.    
    "ఓనా తల్లీ ఎందుకిలాంటి పని చేశావే అమ్మా: ఎందుకే నా కొడుకు కాపురానికి నిప్పెట్టావు, తల్లీ! ఎందుకింత ఘోరం చేశావే, తల్లీ" అత్తగారు బుడి బుడి దీర్ఘాలు తీస్తూ ఏడుస్తూంది, రాని కన్నీళ్ళని కొంగుతో ఒత్తుకుంటూ.    
    సుబ్బులు మొగుడు కాబోలు మోకాళ్ళ లో తల దూర్చుకుని కూర్చున్నాడు. చుట్టూ ముగ్గురు నలుగురు మగాళ్ళున్నారు.    
    సుబ్బులు మామగారు మాత్రం నిజంగానే ఏడుస్తున్నారు. అరుణ రావడం చూసి, "డాక్టరమ్మ గారూ మా ఇంటిలక్ష్మిని బ్రతికించండమ్మ అభం శుభం తెలియని ఆ పిల్లని బ్రతికించండమ్మా" అని అరుణ చేతులుపట్టుకుని దీనంగా ప్రార్దించారు.    
    అప్పటివరకు రోగిమీదే దృష్టి నిలిపింది అరుణ. "అసలిలాంటి పని ఎందుకు చేసిందీ అమ్మాయి?" నెమ్మదిగా అటు ఇటు తిరుగుతూ అంది అరుణ.    
    "ఏమోనమ్మా తల్లీ దానికేం పాడుబుద్ధిపుట్టిందో తిని కూర్చోలేక ఇంత ఘోరంచేసి నా కొడుకు బ్రతుకులో నీళ్ళు పోసి పోయింది "సుబ్బులు అత్తగారు ముక్కు చీదుతూ అంది. అరుణ ఆవిడ వంక ఏహ్యంగా చూసింది. సుబ్బులు ఇంత ఘోరం చేయడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది.    
    "ఊరికే ఎందుకు చేస్తుంది? రోజూ నీవు పెట్టేబాధలు భరించలేక విసిగి చచ్చిపోయి ఉంటుంది. "ఆ గుంపులోంచి ఎవరో కసిగా అన్నారు.    
    "మాతల్లి బ్రతికినన్నాళ్ళు రాసి రంపాన పెట్టింది. ఇప్పుడు బుడిబుడి ఏడుపులు ఎలా ఏడుస్తూందో ఏం తెలీనట్టు" మరొకళ్ళు అన్నారు.    
    "మాయమ్మ సక్కుబాయిని అత్తగారు ఎట్టినట్టు ఆ పిల్లని నానా బాధలుపెట్టింది. ప్రాణం ఇసిగి ఇంత ఘోరం సేసుంటుంది. మా లచ్మి లాంటిపిల్ల"    
    గబగబ అందరూ తలో మాట సుబ్బులు అత్తగారిని అన్నారు.        కొందరు ఎదురుగానే తిట్టారు. మెటికలు విరిచారు. సుబ్బులు అత్తగారు తెలతెల్లబోతూ భయం భయంగాచూసింది.    
    "ఏం జరిగింది ఈవేళ? ఏకారణం లేకుండా ఇంతపని ఎందుకు చేస్తుంది ఈ అమ్మాయి?" కఠినంగా అంది అరుణ.    
    "ఏమోనమ్మా? నాకేం తెలుస్తుంది ఆ పిల్ల మనసులో ఏం ఉందో?" అత్తగారు గొణిగారు.    
    "అబద్దమాడకమ్మోయ్. పొద్దుటేళ నీవు, నీ కొడుకూ ఆ పిల్లని నిలబెట్టితిట్టలేదూ? నీ కొడుకు ఆ పిల్ల జుట్టట్టుకుని కొట్టలేదూ?" ఆగుంపులోంచి ఒకడు తలపాగా చుట్టుకుంటూ కోపంగా ఆవిడ వంక చూస్తూ అన్నాడు. వాడి వంక మింగేసేటట్టు చూశారు తల్లీ కొడుకులు.    
    "ఒరేయ్ వెధవా మా ఇంటిగోల నీకెందుకురా? నోరుమెదిపావంటే చంపుతా" బెదిరించాడు కొడుకు.    
    "నీవెవరు?" అడిగింది అరుణ. "నేను ఆల్లింటికాడగొడ్లని కాసే వాడినండి. ప్రొద్దుటనే ఎల్లేసరికి ఆయమ్మ తిడుతూందండి. అరుణ బాబు కొడుతున్నాడండి నీ కిదేం పొయ్యేకాలమే? ఇంట్లో ఎవరికీ చెప్పక్కరలేని పెద్దదానివయిపోయావుటే అంటూ ఏందేందో తిడుతున్నారండి.    
    ఈ బాబు ఆవిడని జుట్టుపట్టుకుని గోడకేసి కొడుతున్నారండీ నాకు తెలియకుండా నిన్నెవరు వెళ్ళమన్నారు? అక్కడి కెళ్ళి అంతా చెప్పావా? దొంగముండా, నీవే ఎక్కడో అంటించుకుని ఉంటావు...... నా ద్వారా వచ్చిందని ఎవర్తే అంది' అంటూ కొడుతూంటే ఆ అమ్మాయి పాపం గోలెడుతూ ఏడుస్తుందండి. నాను అప్పుడు సరిగా ఇన్లేదండి ఏదో గోల ఆళ్ళ ఇసయంనా కెందుకని గొడ్లనిప్పుకుని ఎల్లిపోయానండీ" వినయంగా అన్నాడు వాడు.    
    అరుణకి సంగతి అర్ధమయింది రాత్రి సుబ్బులు తన రోగం గురించి మొగుడితో చెప్పి ఉంటుంది, తను చెప్పిన మాటలన్నీ భయపడుతూనే వల్లించి ఉంటుంది మందు తీసుకుందాంరమ్మని ప్రాధేయపడి ఉంటుంది. ఆ మగ మహారాజుకి తన గుట్టు పెళ్ళాంద్వారా బయట పడిందని కోపం ముంచుకువచ్చి ఉంటుంది. తనకిరోగం ఉందని అనడం నామోషీ అనిపించి ఉంటుంది.    తెల్లారగానే తల్లితో చెప్పి ఉంటాడు. తల్లీకొడుకులు ...... ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా డాక్టరు దగ్గరికి వెళ్ళినందుకు నానా తిట్లు తిట్టి ఉంటారు. తనమాటకాదని డాక్టరు దగ్గరికి వెళ్ళిన పెళ్ళాం ధైర్యాన్ని చావుదెబ్బలుకొట్టి అణగగొట్టి ఉంటాడు. అంతేకాక, ప్లేటు ఫిరాయించి పాపం, వీధి మొహం ఎరగని అరుణ పిల్ల శీలాన్నే శంకించినట్టు మాట్లాడి ఆ పాపం ఆ అమ్మాయికే అంటగట్టి మరిన్ని దెబ్బలు కొట్టి ఉంటాడు. దెబ్బలకంటే, తిట్లకంటే శారీరక బాధకంటే ఆ అమ్మాయి తన శీలానికి కళంకం అంటగట్టడం సహించలేక, తన కింక మంచిరోజులుండవని నమ్మి విరక్తి చెంది ఈ ఆత్మహత్యకి పూనుకుని ఉంటుంది. అరుణలో ఆవేశం కట్టలు తెంచుకుంది మనుష్యులా వీళ్ళు? కిరాతకులు " ఇలాంటివాళ్ళని ఏం చేస్తే పాపం ఉంటుంది.    
    "మాయమ్మ మా తల్లిలచ్చిందేవిలాంటిపిల్లని పొట్ట నెట్టుకుంది" తబుక్కున ఉమ్మారుముగ్గురు నలుగురు.    
    తల్లీకొడుకులకి తమగుట్టు బయటపడినందుకు, నలుగురిలో దోషులవుతున్నందుకు ఉక్రోషం ముంచుకొచ్చిందిలా ఉంది. తల్లి గయ్ మని లేచింది. "మీకంతా మాఇంటి సంగతి ఎందుకర్రా? పొండిక్కడనుంచి మాలావుజాలి పడుతున్నారు గాని అది ఎలాంటిదో తెలుసా? నేనుకాబట్టి పరువుపోతుందని కడుపులోపెట్టుకుని దాచుకున్నాను. అది బొంకులు నేర్చింది. ఒంటినిండా రోగాలంటించుకుంది. అలాంటి దాన్ని తిట్టకుండా, కొట్టకుండా ఏమొగుడూరుకుంటాడర్రా? పెద్ద చెప్పొచ్చారు: వెళ్ళండి అందరూ వెధవ పనులు చేసింది దాని పాపం పండింది వెధవ చావుచస్తుంది" మెటికలు విరిచింది ఆవిడ చచ్చిపోవడానికి సిద్దంగా ఉన్న కోడలిని చూస్తూ.
    "రామరామ ఎలాంటి మాటలు పుట్టించిందో:" కొందరుగుసగుసలాడారు. కొందరు నిజమా అని నమ్మలేనట్టు చూశారు.    
    "బ్రతికిఉండి మా పరువు తీసింది చచ్చికూడా తీస్తుంది"    
    "ఆపవే ఆపు నోరెత్తి మరోమాటు ఆ పిల్లని ఏదన్నా అన్నావంటే చంపేస్తాను" ఆచారిగారు శివం ఎత్తినవాడిలా ఆవిడ మీదికి వచ్చారు.

 Previous Page Next Page