"అవును లెండి నా భయం వీళ్ళందరికి మీరు శత్రువులవుతారు. వెధవలు ఆ కోపాలు మనసులో పెట్టుకుని ఏం చేస్తారోనని?" నసిగాడు సుబ్బారావు.
"వీళ్ళా? వీళ్ళు ఓసారి జైలుకెళ్ళొచ్చాక ఇంకా తలఎత్తుతారంటారా? చూడండి మళ్ళీ ఆ తల్లీకొడుకులు మొహంఎత్తుతారేమో? మీ ప్రెసిడెంటులాంటివాడే ఏం చేశాడు? ఏం చేస్తారండీ, ఏదన్నా చేయడం సులువే, తరవాత వచ్చే పరిణామాలని ఎదుర్కొనే ఆ ధైర్యం ఎందరికి ఉంటుంది?"
ప్రెసిడెంటుగారు కూతురు పారిపోయిందగ్గిరనించి గుమ్మం దిగి బయటికిరాలేదట. అవమానంతో ముఖం ఎత్తలేకపోతున్నాడు అనుకునే కంటే తుఫాను ముందు ప్రశాంతిలా దేనికో ఈ నిశ్శబ్దం అని సుబ్బారావు కి మనసులో భయంగానే ఉంది. ఏదో ప్లాను వేస్తూ అవకాశం చూస్తూ ఉండి ఉంటాడని సుబ్బారావు నమ్మకం. కూతుర్ని వెతికించే ప్రయత్నం అన్నా చేయలేదట ఎలాగూ కూతురు వీరన్ని పెళ్ళి చేసుకుని ఉంటుందని. తను వెళ్ళి చేసేదేం ఉండదని తెలిసి గప్ చిప్ గా ఊరుకుని ఉంటాడు.
"అయితే వీళ్ళకి శిక్ష పడుతుందంటారా?"
"ఆపడవచ్చు ఏ ఆర్నెల్లో, ఏడాదో జైల్లో కూర్చోబెట్టి పంపిస్తారు. బుద్ది తెచ్చుకోమని" అరుణ అంది.
"బలేవారు పైకి మెత్తగా కనిపిస్తారు గాని లోపల ఎంత కఠినంగా ఉంటారు. దుష్ట శిక్షణ చేసేవరకు నిద్రపట్టదనుకుంటాను మీకు మీలాంటి శిష్ట రక్షకులు ఊరికి ఒకరన్నా ఉంటే......."
"చాలులెండి పొగడ్తలు నాలాంటివాళ్ళ వెనక అండగా మీలాంటివారందరూ ఉన్నారుగా?" అరుణ చిలిపిగా నవ్వింది. ఆ నవ్వుకి సుబ్బారావు ముగ్ధుడైపోయాడు.
* * *
ముసురుపట్టి మూడు రోజులనించి ఒకటే వర్షం పడుతూంది. అరుణకి ఆ వాతావరణం చాలా చికాకుగా ఉంది.
వర్షాకాలంలో కాని ఆ ఊరి అసలు స్వరూపం తెలిసిరాలేదు అసలే మట్టిరోడ్లు. దానికితోడు గుంటలు, గతుకులు అందులో అరుణ సంవత్సరం వర్షాలు విపరీతంగా పడుతున్నాయేమో రోడ్లన్నీ బురదతో చితచిత లాడుతూ కాలేస్తే దిగబడిపోతూంది. ఎక్కడ గుంటలున్నాయో గోతులున్నాయో పోల్చుకోవడం కష్టంగా ఉంది. రోడ్లన్నింటి లో నీరు నిలిచిపోయింది ఆ బంకమన్ను బురద, దానికి తోడు రోడ్లనిండా పేడా రోడ్డు వారగానే పిల్లల మల మూత్రాలు అన్నీ వాన నీటితో కలిసి యధేచ్చగా పారుతున్నాయి. అలాంటిచోట్ల అత్యంత ప్రీతికరమైన దోమలుస్వైర విహారం చేస్తున్నాయి. ఈగలు సరేసరి ఎక్కడ చూసినాజాంమని ముసురుతున్నాయి.
అరుణకి వర్షాకాలం వచ్చినదగ్గిరనించి పేషెంట్లతో ఎక్కడా ఊపిరి సలపడం లేదు. జలుబు, దగ్గులు, విరోచనాలు, జ్వరాలు, రావలసిన రోగాలకి కాలం ఎక్కువగా వర్షాకాలమే: డాక్టరు నాలుగు డబ్బులు చేసుకునే కాలమూవర్షాకాలమే రెండుగంటల వరకు కూడా పేషెంట్లతో తెమిలేదికాదు అరుణకి ఆ ఊరి వాళ్ళు చుట్టుపక్కల నాలుగైదూళ్ళవాళ్ళు అరుణ దగ్గరికి రావడం ఆరంభించారేమో, ఈ వర్షాకాలంలో అరుణకితీరుబాటు అన్నదిలేకపోయింది. వాతావరణం మార్పు, కొత్త నీరు ......అన్నీ కలిసి ఆ ఊళ్ళో వాళ్ళు జలుబులు, దగ్గులు విరోచనాలు లేనివాళ్ళెవరూ లేకుండా అయ్యారు.
వచ్చే పేషెంట్లందరికి చెప్పేది అరుణ...... అలా కాలవలలో నూతుల్లో నీళ్ళు వర్షాకాలం కాచకుండా, వడబోయకుండా తాగద్దని, మరీమరీ చెప్పేది. వినేవారు వినేవారు లేనివాళ్ళు ముందంతా ఊరుకుని, తరవాత సీరియస్ అయ్యాక వచ్చేవారు. డయేరియాని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం అని చెపుతూ, విరోచనాలు ఆరంభించిన వెంటనే వచ్చి మందులుతీసుకోమని ఎంతగానోచెప్పేది అరుణ. ఎవరు వినేవాళ్ళు? అవేపోతాయిలే అని రెండురోజులు ఊరుకోవడం చూద్దాం అని మరో రోజునసగడం, ఆఖరికి రోగి శరీరం పచ్చపడే వేళకి తీసుకురావడం.
ఈ రోగాలకి తోడు మామిడిపళ్ళు పనసపండ్లు మొక్కజొన్న కండెలు..... అన్నీ పడని వస్తువులు తిని మరిన్ని రోగాలు తెచ్చుకునేవారు. వర్షాలారంభించాక మామిడిపళ్ళు, అలా ఈగలు ముసిరే పనస తొనలు అవి తినవద్దని తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికి మరీమరీ చెప్పేది అరుణ.
ఈ వర్షాకాలంలో కేసులు ఎక్కువవడంతో పొరుగూళ్ళకి వెళ్ళిరావడం చాలా ఇబ్బంది అయ్యేది అరుణకి. వర్షంలో, ఆ బురద రోడ్లలో సైకిలు తొక్కడం అయ్యేపనికాదు. వాళ్ళు పంపే ఏ బండిలోనో పడుతూ లేస్తూ వెళ్ళివచ్చేసరికి ఓ రోజయిపోయేది. బొత్తిగా తీరుబడి అన్నదిలేక నలిగిపోసాగింది అరుణ.
దానికి తోడు రెండు మూడుకలరా కేసులు వచ్చాయి. అందులో ఒక పిల్లవాడు, ఓ ఆడమనిషి చచ్చిపోవడంతో కలరా భయం ఊరంతా పాకింది. గూడెంలో కలరా తగిలిందని కబురు మోసుకొచ్చి అరుణని పిలుచు కెళ్ళారు ఓనాడు. పేషెంటు తెలివి లేకుండా విరోచనాలతో, వాంతులతో పడి ఉన్నాడు కనక తప్పకతనే బయలుదేరింది అరుణ.
గూడెం దగ్గిర అడుగు పెట్టేసరికి అరుణ కాళ్ళు మరి ముందుకికదలలేదు. గూడెంలో గుడిసెలన్నీ ఒకదాన్ని అంటి పెట్టుకుని ఒకటి ఎక్కడా ఖాళీలేకుండా ఉన్నాయి. కొన్నిమరి శిధిలావస్తలో, కొన్ని కాస్త బాగా, మరికొన్ని నాలుగు ఆకులు మాత్రం ఉన్న కప్పులతో వారివారి స్థితికిసరిపోయినట్టే ఉన్నాయి. గూడెంలో రెండుమూడు సందులు, అవిసందులు అక్కడ ఉన్నవిరోడ్లు అనడానికి వీలులేదు. అడుగు వేస్తే మోకాలిలోతు దిగబడే బురదతో, అటు ఇటు చెత్తకుప్పలు, తిని పారేసిన మామిడిటెంకలు, పనసతొక్కలు, చేప పొలుసులు పాతపీలికలు...... ఒకటేమిటి ఆ చెత్తలో లేనివస్తువు లేదు. రోడ్లే పాయిఖానాలు గాబోలు. అవన్నీ వాననీళ్ళకి కొట్టుకొచ్చి రోడ్డుమీద నీళ్ళలోనిలిచాయి. ఆవులు, ఆంబోతులు కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దిసమొలలతో ఆ బురదలోనే పిల్లలు ఆడుతున్నారు. గుడిసెలముందు ఆడవాళ్ళు కూర్చుని తీరుబాటుగా పేలుచూసుకుంటున్నారు మరి కొందరు పిల్లలు. పెద్దలు మామిడిపళ్ళ టెంకలు ఆప్యాయంగా చీకుతున్నారు. ఆ ముసురుతున్న ఈగల మధ్యే మూకుడులు పెట్టుకుని తిండితింటున్నారు మరికొందరు.
అక్కడ అడుగు పెట్టగానే కనిపించిన ఈ దృశ్యాలకి అరుణ చిత్తరువైనిలిచిపోయింది. ఇలాంటి చోటుకాక కలరా మరి ఎక్కడ ఉంటుంది? అబ్బ! వీళ్ళు మనుష్యులా అని అనుకోకుండా ఉండలేకపోయింది. ఇంత అపరిశుభ్రతమధ్య మసిలేది మనుష్యులా? బీదవాళ్ళుకావచ్చు. తిండిలేకపోవచ్చు. రోజుకో చీర కట్టుకోలేకపోవచ్చు. కాని బీదవారయితే రోడ్లు పాయిఖానాలు చేసుకోవాలా? తిండిలేకపోతే ఇంటిముందే చెత్తపోగేసుకోవాలా? బీదవారయితే కంపుకొట్టే బట్టలు తొడుక్కోవాలా? ఆ ఉన్న రెండు బట్టలు ఉతికి ఆరేసుకోవడానికి బీదతనానికి సంబంధం ఏమిటి? అరుణ కి కడుపులో దేవినట్టయింది. ఇదీ మన భారతదేశంవీళ్ళూ మన ప్రజలు నూటికి తొంభైమంది ఇలాంటి బ్రతుకే బ్రతుకుతున్నారు మనదేశంలో అరుణకి కడుపులో కలచింది తలచుకుంటే.
కాళ్ళు కూరుకు పోతుంటే ఏ మలంమీద అడుగు వేయకుండా తప్పించుకుంటూ నడవడం గగనమయింది అరుణకి. నేలనంటే చూరులోంచి ఓ గుడిసెలోకి అడుగు పెట్టేసరికి అక్కడి దుర్గంధానికి ముక్కు బద్దలయి భళ్ళున వాంతి రాబోయి ముక్కుకిరుమాలు అడ్డుపెట్టుకుని గుడిసెలోకి చూసింది అరుణ. కలరా తగిలినపిల్లాడు గుడిసెలో చింకి చాపమీద చింకిగుడ్డల మధ్య తెలివి లేకుండా పడి ఉన్నాడు. ఆ దగ్గిరగా పిల్లాడి తల్లి కాబోలు కూర్చుని చంటిపిల్లకి పాలిస్తుంది. మరో ఇద్దరు పిల్లలు కాస్త దూరంగా కూర్చుని మామిడిపళ్ళు చీకుతున్నారు. ఈగలు ఆ పిల్లల చేతులనిండాజుమ్మని ముసురుతున్నాయి. కలరా తగిలిన పిల్లాడి విరోచనాల, వాంతులగుడ్డలు ఓ మూలకుప్పగా పడి ఉన్నాయి. ఈగలు అక్కడ ఎగురుతున్నాయి. ఆ దుర్గంధం అక్కడనించేనని అరుణ గ్రహించింది.
ఆ క్షణంలో తన డాక్టరుగారికి ఓ నమస్కారం పెట్టేసి పారిపోదామన్నంత జుగుప్స కలిగింది అరుణకి. వృత్తిధర్మంమాట దేవుడేరుగు, మరోక్షణం అక్కడుంటే ఆ కలరా తనకే వస్తుందన్న భయం వేసింది డాక్టరయినా అరుణకి.
కానీ, అరుణ పారిపోలేక పోయింది. పారిపోవడానికా తనుఇక్కడికి వచ్చింది? ఈ ప్రజలని ఉద్దరిస్తానని కదూ తను ఇక్కడికి వచ్చింది? ఇలాంటి సమయంలో పారిపోతేతనెందు కిక్కడ? తన ఆశయం ఏమిటి? తను ఏం చెయ్యడానికి వచ్చింది ఇక్కడికి!? అరుణ వెనక్కి లాగినమనస్సుని నచ్చచెప్పిముందుకు నెట్టింది.
"ఆ పిల్లాడేనా?" అనడిగింది చాపమీద పడుకున్నవాడిని చూపిస్తూ.
"అవునండమ్మగారూ రాత్రికాడనించి విరోచనాలు, వాంతులు పొద్దుటకాడనుంచి మాటపలుకు లేకుండా పడిపోనాదు." అరుణని తీసుకొచ్చిన రాములు అన్నాడు.
"మరి రాత్రినుంచి విరోచనాలు అవుతూంటే ఇప్పుడాపిలవడం?" అరుణకోపంగా అడుగుతూనే గబగబ ఆ పిల్లాడి దగ్గిరకెళ్ళి నాడి చూసింది. నాడి అందలేదు. నాడి లాగేసింది. పిల్లాడుస్మారకం లేకుండా పడిఉన్నాడు. చాలా సీరియస్ గా ఉంది పిల్లాడి పరిస్థితి ఆఖరి క్షణాలు అని అరుణకు అర్ధం అయింది. ఇంక ఆ సమయంలో తను చేయగలిగిందేమీ ఉండదు. అయినా, రోగిని ఊపిరి ఉన్నంతవరకు ప్రయత్నించడంతన విధి. గబగబ సెలైన్ ఇంజక్షన్ ఇచ్చింది అరుణ. సెలైన్ డ్రిప్ కి ఏర్పాటు చేసింది. అరగంటసేపు వివిధ ప్రయత్నాలు చేసినా ప్రయోజనంకనబడలేదు. ఇంక లాభం లేదని సెలైన్ డ్రిప్ తీసి పక్కన పెట్టేసి, ఒక్క నిమిషం ఆ పిల్లాడిలో ఏదన్నా చైతన్యం వస్తుందేమోననిచూస్తూ కూర్చుంది. ఆ పిల్లాడి ఆఖరి శ్వాస ఆగిపోయాక.
"లాభంలేదు చాలా ఆలస్యం అయిపోయింది. వెంటనే పిలిస్తే ఏదన్నా చేయగలిగేదాన్ని"అని రాములుకి చెప్పి 'అంతా అయిపోయింద'ని చెప్పింది అరుణ, దుప్పటిమొహంమీద వేస్తూ అంతవరకు విచిత్రం అరుణ చేస్తున్నవన్నీ చూస్తున్న రాములు జరుగుతున్నది అంతుబట్టనట్టు వెర్రిమొహం వేసుకు చూస్తున్న రాములి పెళ్ళాం ఒక్కసారిగా....." ఓరినాయనో ఓరి కొడకోఓలమ్మో" అంటూ శవంమీదపడి శోకాలు పెడుతూ గుండెలు బాదుకోవడం ఆరంభించారు. ఇరుగు పొరుగు గుడిసెలవాళ్ళు గుడిసె ముందు గుమిగూడారు. అరుణ తన బాగ్ సర్దుకుని. "చూడురాములూ ఇప్పుడింక ఎంతఏడ్చినా ఆ పిల్లాడు తిరిగి రాడు. ఊళ్ళో కలరా ఉంది. విరోచనాలు అవగానే డాక్టరు దగ్గరికి తీసుకురావాలని తెలియలేదా?" అరుణ సాంత్వన వచనాలు పలికింది."నాకేటి తెలుసండమ్మగారూ? ఏటో అనుకున్నాను, ఇంతకొంప ముంచేస్తాడనుకోలేదురోయ్, దేవుడోయ్" గుండెలు కొట్టేసుకుంటూ ఏడుస్తూ అన్నాడు రాములు.