Previous Page Next Page 
మోహిత పేజి 32


    ఆ పేరు వినగానే ఆశ్చర్యపోయింది శిల్ప.

 

    "అంటే హైదరాబాద్ లో ఫార్మాన్యూటికల్ కంపెనీలో పనిచేసే మైత్రేయేనా....."

 

    "అవును..... మీకు తెలుసా?" మరింత ఆశ్చర్యంగా అంది ఇందు.

 

    "తెలుసు....ఒకప్పుడు ఆయన, నేను ఒకే ఆఫీస్ లో కలిసి పనిచేసేవాళ్ళం. జరిగిందేదో జరిగిపోయింది. ఇవాళ మీరు నాతో వుండండి..... ఈ రాత్రి ఏం ప్రయాణం చేస్తారు? ఎక్కడికెళ్ళాలో ఆలోచించుకుని రేపు వెళుదురుగాని. ఓ.కె."

 

    తనతోపాటు ఆటోలో ఎక్కించుకుని మొగల్రాజపురం తీసికెళ్ళింది శిల్ప ఇందును.

 

                                            *    *    *

 

    సరిగ్గా 10.25 నిమిషాలు.....

 

    జస్టిస్ ఆదిత్య కారు, కోర్టు ఆవరణలోకి ప్రవేశించింది. ఆ కారు రాగానే అటెండర్ పరుగు, పరుగున ముందుకెళ్ళి, కారు డోరు తెరిచాడు. లాయర్లు. కోర్టు సిబ్బంది విష్ చేస్తుండగా, నేరుగా తన రూమ్ లోకొచ్చి సోఫాలో కూర్చున్నారాయన.

 

    అటెండర్ డోర్ దగ్గరే ఆగిపోయాడు. ఆయన కోసం ఒక విజిటర్ వచ్చారని చెప్పడం మార్చిపోయాడు అటెండర్.

 

    రెండు నిమిషాల తర్వాత.....

 

    అలవాటు ప్రకారం బాత్ రూమ్ డోరు తెరిచి, ఫేస్ వాష్ కోసం లోనకెళ్ళ బోయిన ఆయన డోర్ పక్కనే నుంచున్న మోహితను చూడగానే భయంతో కేకలు  వేయబోగా-

 

    ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా మోహిత చేతిలో వున్న మత్తుమందును ముఖమ్మీద స్ప్రే చేసింది.

 

    ఉక్కిరి బిక్కిరైపోయారు ఆదిత్య.

 

    ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ, షాక్ వల్ల మాట్లాడలేకపోతున్నాడు.

 

    నైల్ కట్టర్ తీసి, బటన్ ప్రెస్ చేసింది మోహిత. రెండు సెకండ్లలో అందులోంచి పొడవాటి బాకు బయటకు రావడం, ఆ బాకు ఆదిత్య కంఠనాళాల మీదకు వెళ్ళడం-

 

    బాత్ రూమ్ గోడల మీద చివ్వున రక్తం చిమ్మడం, గొంతు పట్టుకుని ఆయన నేలమీద కుప్పకూలిపోవడం, అంతా క్షణాల్లో జరిగిపోయింది.

 

    మూడే మూడు క్షణాల్లో ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసి పోయాయి.

 

    ఒక్కక్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా బాత్ రూమ్ లోంచి బయటికొచ్చి మెయిన్ రూమ్ డోర్ తెరిచింది మోహిత.

 

    అటెండర్ గౌరవంగా లేచి నిలబడ్డాడు.

 

    "సార్...... బాత్ రూమ్ లో వున్నారు....." అటెండర్ తో చెప్పి, ఏమాత్రం కంగారుపడకుండా నెమ్మదిగా కారిడార్లో నడుచుకుంటూ, చెట్టుకిందకొచ్చి కారెక్కింది మోహిత.

 

    "డ్రైవర్..... పోనీ....." వెంటనే కారుని స్టార్ట్ చేశాడు డ్రైవర్.

 

    ఆ కారు కోర్టు మెయిన్ గేటు దాటుతుండగా, ఎదురుగా ఒక కారు కోర్టు ఆవరణలోకి దూసుకొచ్చింది.

 

    అందులోంచి రాజేంద్రకుమార్ దిగి లోనికి పరుగెత్తాడు.

 

    
                                          *    *    *

 

`    అంబాసిడర్ కారు గుంటూరు సిటీ సరిహద్దుల్లోని రైల్వేట్రాక్ దాటింది. అంతవరకూ మైత్రేయ మాట్లాడలేదు.

 

    "ఏమయింది.....?" అతని మనసులో ఎక్కడో భయం.... ఇంకెక్కడో సంకోచం.

 

    మోహిత హేండ్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి చూపించింది.

 

    రక్తసిక్తమయిపోయిన కర్చిఫ్ మడతల మధ్య 'నైట్ కట్టర్!'

 

    ఆ నైల్ కట్టర్ ని చూడగానే ఒక్కక్షణం ఆగి కొట్టుకుంది మైత్రేయ గుండె.

 

    
                                         *    *    *

 

`    నలభై నిమిషాల తర్వాత కారు విజయవాడ సెంట్రల్ బస్ స్టేషన్ ముందు ఆగింది.

 

    "ఈ సమయంలో కారులో వెళ్ళడం మంచిది కాదు. కారుని పంపించేద్దాం....." చెప్పి కారుని వెనక్కి పంపించేసింది.

 

    "బ్రేక్ జర్నీ చేద్దాం..... రాజమండ్రి వెళ్ళే బస్సుకు టిక్కెట్లు తీసుకో. అక్కడినించి యింకో బస్సు..... ఆ తర్వాత మైసూర్ కి!" అంది సాలోచనగా మోహిత.

 

    పావుగంట తర్వాత ఇద్దరూ రాజమండ్రి వెళ్ళే బస్సులో కూర్చున్నారు.

 

    జస్టిస్ ఆదిత్య మర్డర్ న్యూస్ ఒక్క గుంటూరులోనే కాదు...... కొన్ని గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది.

 

    హైదరాబాద్ లోని చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు, హోంమినిష్టర్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల్ని ఎలర్ట్ చేశారు.

 

    "కోర్టులో పట్టపగలు.... ఒక మహిళ, ఒక జడ్జీని చంపడం, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నిదర్శనం.... రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి" ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ లో ఆక్రోశించాడు.

 

    ఈ విషయమై హోంమినిష్టర్ తో సీరియస్ గా చర్చించాడు చీఫ్ మినిష్టర్.

 

    "ఒక ఎమ్మెల్యే...... ఒక కంట్రాక్టర్..... ఒక ఫారెస్ట్ ఆఫీసర్..... ఒక జస్టిస్..... నలుగురు ప్రముఖుల మర్డర్స్..... ఎవరి సహాయం లేకుండా, ఒక లేడీ ఈ మర్డర్స్ చేయడం ఏమిటి? ఇంతమంది పోలీస్ ఫోర్స్ ఏం చేస్తోంది? ఎక్కడి కేసులక్కడ వుండిపోవడానికి కారణం ఏమిటి.....? చట్టానికి దొరక్కుండా ప్లాన్డ్ గా మర్డర్స్ చేసే ఐడియా ఆ లేడీదేనా....? లేక ఆమెవెనక ఏ టెర్రరిస్ట్ గ్రూపు అయినా వుందా? ఈ మర్డర్స్ వెనక వున్నది వ్యక్తిగత కారణాలా....? రాజకీయ కక్షలా? దీనివెనక ప్రతిపక్షాల హస్తం ఎంతవరకు వుంది? రెండు రోజుల్లో నాకు పూర్తి రిపోర్ట్ కావాలి! నిందితుల్ని వెంటనే పట్టుకోవాలి....." చీఫ్ మినిష్టర్  స్పెషల్ ఆర్డర్ తో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు.

 

    ఎయిర్ పోర్టుల్లో, రైల్వేస్టేషన్ లో, బస్టాండుల్లో మఫ్టీ పోలీసుల బందోబస్తు ఏర్పాటైంది నిమిషాల్లో.

 

    
                                           *    *    *

 

    'గుంటూరులో జస్టిస్ ఆదిత్య దారుణ హత్య!' టి.వీ. అనౌన్సర్ చెపుతున్న న్యూస్ వింటూ తలతిప్పి శిల్ప, ఇందువేపు చూసింది.

 

    నిందితుల ఆచూకీ, తెలియజేసిన వారికి అయిదు లక్షల బహుమతి.

 

    మోహిత అనే మహిళ, మైత్రేయ అనే యువకుడు ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

 

    "ఈ మోహిత ఎవరు..... నీకు తెలుసా? మైత్రేయకి ఆమెకు గల సంబంధం ఏంటి?" ప్రశ్నించింది శిల్ప.

 

    "నాకు తెలీదు!" చెప్పింది ఇందు.

 

    'ఎందుకు చేస్తున్నారీ హత్యలు?' తనలో తను అనుకుంది శిల్ప.

 

    "ఈ మర్డర్స్ లో బావ వున్నాడంటే, నాకు నమ్మకం కలగడం లేదు. బావది సున్నితమయిన మనస్తత్వం!" అంది ఇందు.

 

    "నాక్కూడా తెలుసు!"

 

    "బావ పోలీసులకు దొరికిపొతే శిక్ష పడుతుంది కదా?"

 

    "నేరం ఋజువైతే శిక్ష పడుతుంది."

 

    "బావ నాకు దక్కడా...." ఆవేదనగా అంది ఇందు.

 

    "నువ్విప్పుడు ఎక్కడకు వెళతావ్?" ప్రశ్నించింది శిల్ప.

 

    "గాలిలో దీపంలా వుంది నా పరిస్థితి...... ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో తోచడంలేదు" అంది ఇందు.

 

    "నా సలహా వింటావా?"

 

    "చెప్పండి."

 

    "నందిగామ వెళ్ళిపో..... చంద్రప్ప బారినుండి తప్పించుకున్న దానివవుతావు..... ఈ లోపల మైత్రేయ కథ ఒక కొలిక్కి వస్తుంది."

 

    "ఇంటికి ఏ ముఖంతో వెళ్ళను?"

 

    "పిచ్చిపిల్లా..... మైసూర్ లో జరిగిన గొడవంతా మీ పేరెంట్స్ కు నువ్వు చెప్తేనే తెలుస్తుంది..... ఇన్నాళ్ళూ బావదగ్గరే వున్నానని చెప్పు...... ఏ  సమయంలో నయినా నీ బావ నందిగామ వస్తాడని నా నమ్మకం......" ఆ ఆలోచన బాగానే వుందనిపించింది ఇందుకు.

 

    "నందిగామ వెళ్ళిపోతాను" దృఢనిశ్చయంతో అంది ఇందు.

 

    ఆ తర్వాత-

 

    ఇంకో రెండుగంటల తర్వాత, విజయవాడ నుంచి నందిగామ వెళ్ళే బస్సులో వుంది ఇందు.

 

    
                                        *    *    *

 

    హైదరాబాద్.....

 

    హోం మినిష్టర్ జయరాం యింట్లో డ్రాయింగ్ రూంలో వున్నాడు రాజేంద్రకుమార్.

 

    "గుంటూరు మెకానిక్ షెడ్ లో దొరికిన కారు రిజిస్ట్రేషన్ మీ పేరుమీద వుంది..... హంతకులు ఆ కారులోనే తిరగారన్న దానికి శ్రీశైలంలోను, విజయవాడలోను, మైసూర్ లోను సాక్ష్యాలున్నాయి. పైగా నిందితుల్లో ఒకరయినా మోహిత మీ భార్య..... అవునా...?" ప్రశ్నించాడు జయరాం.

 

    హోంమినిష్టర్ జయరాంకి, రాజేంద్రకుమార్ కి చాలాకాలంనుంచి స్నేహం వుంది.

 

    "మోహిత నా భార్యే..... కానీ ఇప్పుడు కాదు!"

 

    "విడిపోయారా?"

 

    "అవును."

 

    "ఆమెతోపాటు వున్న యింకో నిందితుడు ఎవరు.....? ఆమె లవరా?"

 

    "కావచ్చు!"

 

    "మర్డర్స్ కు గురైన వాళ్ళందరూ మీకూ, నాకూ ఫ్రెండ్స్! వాళ్ళనే మీ భార్య ఎందుకు మర్డర్స్ చేస్తోందా తెల్సుకుంటే, కేస్  మిస్టరీ విడిపోతుంది గదా?"

 

    "హోం మినిష్టర్ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రాజేంద్ర కుమార్.

 

    "మోహితకు, మీకు పడకపొతే..... గొడవలు మీ యిద్దరి మధ్యే వుండేవి- వాళ్ళు నలుగురూ ఏం చేశారు?"

 

    "అదే నాకు  అర్థంకావడంలేదు. కానీ నా ప్రాణాలకు కూడా ప్రమాదం వుందని అనిపిస్తోంది..... నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి..... ఆ మోహితను నేనే పట్టుకునీ, పోలీసులకు అప్పగిస్తాను! రెండ్రోజులు నాకు టైమివ్వండి" అన్నాడు రాజేంద్రకుమార్.

 

    "ఎలా పట్టుకుంటారు?'

 

    "నేనెక్కడున్నానో ఆమెకు తెలిస్తే, నాకోసం వస్తుంది. ఈజీగా ట్రాప్ లో ఇరుక్కుంటుంది!"

 

    "ఐడియా బాగానే వుంది కానీ...... ఓ పని చేయండి...... మైసూర్ లో ఏదైనా మీటింగ్ కు మీరెళ్ళండి. అక్కడకు తప్పకుండా మోహిత వస్తుంది. ఏమంటారు? అంతా చాలా క్యాజువల్ గా జరిగిపోవాలి....." చెప్పాడు హోంమినిష్టర్.

 

    ఆలోచిస్తున్నాడు రాజేంద్రకుమార్.

 

                                          *    *    *

 

    తెల్లవారుజూమున మూడుగంటల ప్రాంతంలో రాజమండ్రి బస్ స్టాండ్ లో బస్సాగింది. బస్సు దిగి నేరుగా బుక్ స్టాల్ కెళ్ళి డైలీ పేపర్ తీసుకుంది మోహిత.

 

    మొదటి పేజీలో ఆదిత్య ఫోటో, మర్డర్ కు సంబంధించి వివిధ వ్యక్తుల కథనాలు, చీఫ్ మినిష్టర్ . హోం మినిష్టర్ ల ఉత్తర్వులు, ప్రతిపక్షనాయకుని అక్రోశం..... సగం పేజీనిండా యిదే వార్త.

 

    'నలభై ఎనిమిది గంటల్లో నిందితుల్ని పట్టుకుంటాం....' డి.జి.పి. ప్రకటనను చదివింది మోహిత. 

 Previous Page Next Page