Previous Page Next Page 
మోహిత పేజి 33


    "పరిస్థితి విషమించింది" అన్నాడు మైత్రేయ.

 

    "అయితే ఏమవుతుంది?"

 

    "మనం పట్టుబడితే...."

 

    "రాజేంద్రకుమార్ చావకుండానా?"

 

    "ఈ పరిస్థితుల్లో రాజేంద్రకుమార్ మనకు దొరుకుతాడా?"

 

    "నలభై ఎనిమిది గంటల్లో పోలీసులు నన్ను పట్టుకుంటారట..... కానీ అదే నలభై ఎనిమిది గంటల్లో నేను రాజేంద్రకుమార్ ని చంపుతాను."

 

    "ఆ గొంతులోని తీక్షణత్వాన్ని గుర్తించిన మైత్రేయ మరే ప్రశ్నా వేయలేదు.

 

    
                                           *    *    *

 

`    మరొక అరగంట తర్వాత ఇద్దరూ రాజమండ్రి నుంచి మైసూర్ వైపు వెళ్ళే బస్సులో వున్నారు. మోహిత కళ్ళు మూసుకుని ఆలోచిస్తోంది.

 

    మైత్రేయ ఇందుగురించి ఆలోచిస్తున్నాడు.

 

    'మైసూర్ వెళ్లగానే ఇందుకు ఫోన్ చెయ్యాలి' అనుకున్నాడు మైత్రేయ.

 

        
                                            *    *    *

 

    తెలతెలవారుతోంది. బస్సు అనకాపల్లి దాటింది.

 

    "అటు సెంట్రల్ బస్టాండ్ దగ్గర, పోలీస్  స్టేషన్ దగ్గర  రాజేంద్రకుమార్  మనుషుల్తోపాటు, పోలీసులూ వుండొచ్చు. సో..... మనం గోపాలపట్నం దగ్గర ఈ బస్సు దిగిపోయి వేరే బస్సులో మైసూరువైపు వెళదాం. మైసూరు వెళ్లగానే రాజేంద్రకుమార్ ని గురించి ఎంక్వయిరీ చెయ్యాలి."

 

    "రాజేంద్రకుమార్ ని ట్రేస్ చెయ్యడం ఎలా?"

 

    "రాజేంద్రకుమార్ మనకోసం వెతుకుతాడు..... మనం అతనికోసం వెతుకుదాం..... అతను ఎక్కడో ఒకచోట తారసపడక మానడు."

 

    "రాజేంద్రకుమార్ హత్యతో మన హత్యాకాండ పూర్తవుతుంది కదూ?"  అడిగాడు మైత్రేయ.

 

    జవాబు చెప్పలేదు మోహిత.

 

    
                                             *    *    *

 

    మైసూరు.....

 

    హబ్బెల్లి గెస్ట్ హౌస్ డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు రాజేంద్రకుమార్.

 

    అతనికి సెక్యూరిటీగా ఇద్దరు గన్ మేన్  ల్నిచ్చింది కర్నాటక గవర్నమెంట్. దానికి తోడు మరో అయిదుగురు బలిష్ఠులైన వ్యక్తులు అతనికి కాపలాగా వున్నాడు.

 

    అప్పుడే గెస్ట్ హౌస్ ముందు జీపు ఆగింది. అందులోంచి మరో నలుగురు లోకల్ రౌడీలు దిగి, లోనికొచ్చి-

 

    "బస్టాండ్, రైల్వేస్టేషన్, అన్నీ గాలించాం సార్. మోహిత కన్పించలేదు సార్..... వాళ్ళు గుంటూరు నుంచి ఫోనొచ్చింది. మర్డర్ జరిగిన మరుక్షణం అంబాసిడర్ కారులో ఒక యువతి, ఒక యువకుడు విజయవాడ బస్టాండ్ కి వెళ్ళారు..... వాళ్ళిద్దర్నీ మోహిత, మైత్రేయలుగా పోలీసులు అనుమానిస్తున్నారు..... కారు డ్రైవర్ పోలీసులకు ఈ విషయం చెప్పాడట....."

 

    "విజయవాడ నుంచి వచ్చిన ప్రతి బస్సును చూశాం....."

 

    "మధ్యలో బస్సు దిగిపోయి, టాక్సీలో రావచ్చు గదా..... ఇప్పుడు ఆ మోహిత లాస్ట్ టార్గెట్ ..... నేనే. సో..... సిటీలో హోటల్స్ అన్నింటి దగ్గరా..... మన మనుషులండాలి. లాగే కొంతమంది కొల్లెగాల్ ఫారెస్ట్ టౌన్ కి వెళ్లండి.... ఇరవై నాలుగు గంటల్లోగా దాని శవాన్ని నేను చూడాలి...." నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ అన్నాడు రాజేంద్రకుమార్.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    ఒక మారుతీ కారు గెస్ట్ హౌస్ ముందు ఆగింది. అందులోంచి మైసూరు లోని ఒక కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీ అజ్జంపుర సూరి దిగాడు.

 

    "ఏమిటీ ఫోన్ చేశారు?"

 

    "ఇవాళ గానీ, రేపుగానీ ఏవైనా మీటింగ్స్ వున్నాయా?"

 

    "రేపు సాయంత్రం ఓ మీటింగ్ వుంది. కంఠీరవ ఆడిటోరియంలో అమెరికాలో వుంటున్న మైసూర్ కి చెందిన డాన్సర్ కి సన్మానం చేస్తున్నాం...."

 

    "గుడ్..... ఆ మీటింగ్ కి నేను చీఫ్ గెస్ట్ గా వస్తున్నాను.... ముందుగా పేపర్ లో  అడ్వర్టయిజ్ మెంట్ ఇవ్వు....." అంటూ రెండువేల రూపాయల్ని అతనికిచ్చాడు. కాసేపయ్యాక.....

 

    ఆ డబ్బు తీసుకుని సెక్రటరీ  అజ్జంపుర సూరి వెళ్ళిపోయాడు.

 

    'ఆ మీటింగ్ కు మోహిత వస్తుంది...... నో డౌట్..... తన చేతిలో చస్తుంది....." అనుకున్నాడు రాజేంద్రకుమార్.

        


                                            *    *    *

 

    భయం, భయంగా బితుకు బితుగ్గా ఇంటి మెట్లెక్కుతున్న ఇందును మధ్యగదిలోంచే చూసిన తల్లి సావిత్రమ్మ "అదిగో ఇందు" అంటూ పరుగు పరుగున వచ్చి వాటేసుకుని-

 

    "ఇన్నాళ్ళూ ఎక్కడికెళ్ళిపోయావే....." అంటూ భోరుమంది.

 

    "చెప్పాచెయ్యకుండా, అలా ఇల్లు వదిలి వెళ్ళిపొతే, మేమేమైపోతావనుకున్నావే...... నిన్ను కొట్టానా.....? తిట్టానా.....? ఇన్నాళ్ళు ఎక్కడ వున్నావ్? ఏం  చేశావ్? బావ కలిశాడా? నిన్నటి వరకూ నీకోసం ఏడ్వని రోజంటూ లేదు. నిన్న సరోజ వచ్చి, నువ్వు విజయవాడలో కన్పించావని, సుఖంగా వున్నావని చెప్పేవరకూ నా మనసు, నా మనసులో లేదు. ఎంతపని చేసేవే తల్లీ..... మీ నాన్నగారు...... మొన్నటికి మొన్న మైసూర్ వెళ్ళి, నీ ఆచూకీ తెలియకపోవడంతో మళ్ళీ వచ్చేశారు. రా..... రా..... జరిగిందేదో జరిగిపోయింది....." అంటూ కూతురు చేతుల్లోని సూట్ కేస్ ని అందుకుని లోనికి నడుస్తుండగా-

 

    అప్పుడే స్నానం చేసి, బాత్ రూమ్ లోంచి మధ్యగదిలో కొచ్చిన వెంకటయ్య-

 

    "సావిత్రీ....." బిగ్గరగా అరిచాడు.

 

    ఆ అరుపుకి భయపడ్డారు తల్లీ , కూతుళ్ళిద్దరూ.

 

    "ఆ సూట్ కేస్ దానికిచ్చేయ్....." నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ చెప్పాడు.

 

    "ఏవండీ..... మన ఇందు....."

 

    "ఇప్పుడు మన ఇందు కాదు..... మనింటి పరువును, నడిబజార్లో తీసిన ఇందు..... పెళ్ళి కాకుండానే, ఎవడో పోలీసాఫీసర్ తో  కాపురం పెట్టేసిన  ఇందు......"

 

    రెండోసారి మైసూరు వెళ్ళినప్పుడు ఇందు, చంద్రప్ప విషయం కానిస్టేబుల్స్ ద్వారా వెంకటయ్యకి తెల్సింది. ఈసారి కూడా ఇందు కనిపించలేదని భార్యతో చెప్పాడు తప్ప. చంద్రప్ప గొడవ ఏదీ చెప్పలేదు.

 

    "పోలీసాఫీసర్ ఏంటండీ....?" అయోమయంగా అడిగింది సావిత్రమ్మ.

 

    "ఏమిటో నీ కూతుర్నే అడుగు?" రుసరుసలాడాడు.

 

    "ఏంటే తల్లీ....?"

 

    "ఈ సమయంలో నేనేమీ చెప్పలేనమ్మా....." తండ్రికి చంద్రప్ప విషయం ఎలా తెల్సిందో ఆశ్చర్యంగా వుంది ఇందుకు.

 

    "ఏం చెప్తుంది? ఎలా చెపుతుంది? సాని బతుకు గడుపుతున్నానని చెపుతుందా? నా కూతురు చచ్చిపోయిందని నేనెప్పుడో అనేసుకున్నాను. చెడిపోయిన దానిని ఇంట్లోకి తెచ్చాడనే చెడ్డపేరు నాకొద్దు.... వెళ్ళిపో..... నాకు కూతురు కన్నా, పరువు మర్యాదా ముఖ్యం. ఎక్కడినుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. రెండే రెండు నిమిషాలు టైమిస్తున్నాను."

 

    "ఏవండీ..... ఒక్కగానొక్క కూతురు.... తను చేసింది తప్పే. ఆ తప్పు.... మరెప్పుడూ చెయ్యదు...." సావిత్రమ్మ నచ్చచెప్పబోయింది.

 

    "తను చేసింది మామూలు తప్పుకాదు. ఘోరమయిన తప్పు..... ఆ తప్పు.... మరెప్పుడూ చెయ్యదు...." సావిత్రమ్మ నచ్చచెప్పబోయింది.

 

    "తను చేసింది మామూలు తప్పుకాదు. ఘోరమయిన తప్పు..... ఇటు ఏడు తరాలు...... అటు ఏడు తరాలు నా వంశానికి చెడ్డపేరు తెచ్చే తప్పు..... దానిని వెళ్లిపొమ్మని చెప్పు...... దానిని వదలకపొతే.... నువ్వెళ్ళిపో.... ఇద్దరూ కట్టగట్టుకుని చావండి...." లోపలి గదిలోకి పోయాడాయన.

 

    భర్తకోసం, కుటుంబ మర్యాద కోసం ఆయన ప్రాకులాట ఎలాంటిదో సావిత్రమ్మకి తెలుసు. మొదట ఆయన కోపాన్ని చల్లార్చాలి అని అనుకున్న సావిత్రమ్మ-

 

    "మీ నాన్న కోపం నీకు తెల్సు కదా..... నువ్వు వెంటనే ఏలూరు వెళ్ళి, మీ పిన్ని ఇంట్లో రెండ్రోజులుండి రా...... తర్వాత అంతా అదే సర్దుకుంటుంది."

 

    మారు మాట్లాడకుండా తల్లిముఖంలోకి ఒక్కసారి చూసి వెనక్కి వచ్చేసింది ఇందు.

 

    తండ్రి అనునయించి, ఆదరించి, తన పరిస్థితిని తెల్సుకుని జాలిపడతాడని అనుకుంది. అందుకు విరుద్ధంగా జరగడంతో ఇందు మనసు బాధపడుతోంది.

 

    తల్లి సూచించినట్లుగా, పిన్ని ఇంటికి వెళ్ళాలని మొదట్లో అనుకున్నా తర్వాత తన నిర్ణయాన్ని మార్చేసుకుంది.

 

    ఒక్కొక్కప్పుడు రక్తసంబంధం లేనివాళ్లే మనకు ఆప్తులవుతారు. ఆదరిస్తారు. మన కన్నీళ్ళను తుడుస్తారు.

 

    ఏ సంబంధమూ లేకపొయినా, తనని కూతురులా ఆదరించిన మైసూరులోని శ్రీ మహాలక్ష్మి దగ్గరికే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది.

 

    బస్టాండ్ కెళ్లి విజయవాడ  వెళ్ళే బస్సెక్కింది ఇందు. అక్కడ్నుంచి డైరెక్ట్ మైసూర్ బస్ ఎక్కాలని.....

    
                                          *    *    *

 

`    మైసూరులోని హోటల్ సుధ.....

 

    "వెదకబోయిన తీగ కాలికే తగిలింది" డైలీపేపర్ తిరగేస్తూ ఒకచోట కంఠీరవ ఆడిటోరియంలో జరిగే సన్మాన సభకు చీఫ్ గెస్ట్ గా వస్తున్న రాజేంద్ర కుమార్ ప్రకటనను చూస్తూ అంది మోహిత.

 

    "మీటింగ్ లో రాజేంద్రకుమార్ కు చంపడం సాధ్యమా?" సందేహం వ్యక్తం చేశాడు మైత్రేయ.

 

    "ఏడు గంటలకు మీటింగ్.... కనీసం గంటసేపయినా జరుగుతుంది. మొదట గందరగోళం సృష్టించాలి. తర్వాత..... రాజేంద్రకుమార్ ని మర్డర్ చెయ్యాలి" అందామె.

 

    "కష్టం.... రాజేంద్రకుమార్ ఒక్కడే వస్తాడా? అతని మనుషులతో పాటు పొలేసులు కూడా వుంటారు."

 

    "ఆలోచనలో పడింది మోహిత.

 

    "మొదట మనం ఆడిటోరియంను చూసొస్తే మంచిది. తర్వాత ప్లాన్ వెయ్యొచ్చు" అందామె.

 

    
                                           *    *    *

 

    మరో అరగంట తర్వాత కంఠీరవ ఆడిటోరియంలో వున్నారిద్దరూ.

 

    దాదాపు వెయ్యిమంది ప్రేక్షకులు పట్టే ఆడిటోరియం అది. డయాస్ కి ఎదురుగా సీట్లు..... ఆ వెనక బాల్కనీ .... డయాస్  కి వెనక గ్రీన్ రూమ్...... రెస్ట్  రూమ్..... మైక్ సిస్టమ్ కు సంబంధించిన జనరేటర్.... లైటింగ్ సిస్టమ్ సంబంధించిన కీ బోర్డ్స్.

 

    వీళ్ళు వెళ్ళే సమయానికి, వేదికమీద రాత్రి మీటింగ్ తర్వాత వెయ్యబోయే నాటికకు సంబంధించిన రిహార్సల్. జరుగుతోంది.

 

    డయాస్ వెనకనుంచి  బయటకు రావడానికి డోర్ వున్న విషయం గమనించింది మోహిత. అక్కడ విచిత్రమయిన రీతిలో, ఓపెన్ ఎయిర్ లో పుట్టణ్ణకణగల్ , కాసరవల్లి, గిరీష్ కర్నాడ్ లాంటి మహామేధావులు నిర్మించిన డ్రామా స్టేజీ వుంది. ఎత్తుపల్లాలతో, వంకరదారులతో, పొదలతో, కళాత్మకంగా వుంది. తన పథకానికి అది బాగా పనికివస్తుందని, ఒక్కక్షణం ఆనందించింది.

 

    ఆడిటోరియం నుంచి తిరిగి హోటల్ రూమ్ కి వస్తున్నప్పుడు చెప్పింది మోహిత.

 

    "ఒక కారుని రెంట్ కు తీసుకుందాం."

 

    "మర్డర్ ఇక్కడే జరుగుతుందా?"

 

    అదే ఆలోచిస్తున్నాను" రకరకాలుగా ఆలోచిస్తోంది మోహిత. ఆడిటోరియం మర్డర్ ఎటెమ్ట్ కి అనువుగా వుంది. కానీ తప్పించుకోవడానికి అనువుగా వుందీ, లేనిదీ ఆమెకింకా అర్థం కాలేదు.    

 Previous Page Next Page