Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 32

   

     ఊహించని పరిణామానికి శ్రీరాములు నాయుడితోపాటు నాయుడి అనుచర వర్గం విస్తుపోయారు. దూరం నుంచి మరికొందరు పరుగెత్తుకొస్తున్నారు.
    
    గబుక్కున ముకుంద్ జీపులోంచి కిందకు దిగాడు.
    
    "సార్... వాడు అరక్ కింగ్ అబ్బయ్యనాయుడు కుడిభుజం- మీరు వస్తున్నట్టు తెల్సినట్టుంది" చెవిలో రహస్యంగా చెప్పాడు ముకుంద్.
    
    అబ్బయ్య నాయుడు కుడిభుజం!
    
    "అబ్బయ్య నాయుడయితే.... కుడిభుజం అయితే...ఎందుకొచ్చినట్టు?"
    
    శతృఘ్న ముక్కుపుటాలు కోపంతో అదురుతున్నాయి.
    
    అదే సమయంలో-
    
    కిందపడ్డ శ్రీరాములు నాయుడు, శతృఘ్న వేపు దూసుకొచ్చాడు.
    
    అతని చేతిలో-
    
    పిస్టల్...
    
    "మిస్టర్ డి.సి.పి... మర్యాదగా నాతోరా... వస్తే... మేటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్... కాదన్నావనుకో..... ఫ్యూచర్లో బాధపడతావ్."
    
    శ్రీరాములు నాయుడు మాటల్ని వినలేదు శతృఘ్న.
    
    అతని చేతిలోని పిస్టల్ని చూడగానే శతృఘ్న నరాలు భగ్గున మండి పోయాయి....
    
    "ఆఫ్ట్రాల్ ఒక సారా కాంట్రాక్టర్ తొత్తువి, ప్రభుత్వాధికారిని బెదిరిస్తావురా....ఎన్ని గుండెల్రా నీకు?"
    
    ముందుకెళ్ళి శ్రీరాములు నాయుడు కుడిచేతిని అందుకుని మెలిపెట్టి-
    
    "టేక్ కేర్... మరోమాట మాట్లాడావంటే ఇక్కడే నీ ఎముకలు విరిచేస్తాను- ఫో... వెళ్ళి నీ దిక్కున్నచోట చెప్పుకో" ముందుకు తోసేసి, కోపంగా వెనక్కొచ్చాడు శతృఘ్న.
    
    అప్పటికే శతృఘ్నని శ్రీరాములు నాయుడు మనుషులు చుట్టూ మొహరించి ఉన్నారు.
    
    "కమాన్... కమాన్ ఐసే- ఎవడొస్తాడో రండి- అయామ్ శతృఘ్న- కమాన్" పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ముందుకి నడిచాడు శతృఘ్న.
    
    కిందపడ్డ శ్రీరాములునాయుడు రోషంగా లేచి నిలబడి అనుచరులవేపు ఒకసారి, శతృఘ్న వేపు ఒకసారి చూసాడు.
    
    "ఫైవ్... మినిట్స్... ఫైవ్ మినిట్స్ టైమిస్తున్నాను. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్..." చుట్టూ కలయతిరిగి జీపు దగ్గరకు వచ్చాడు శతృఘ్న.
    
    అదే సమయంలో-
    
    గుంపులోని ఒక వ్యక్తి ముందుకొచ్చి శతృఘ్నని ఫోటో తీయడం ప్రారంభించింది.
    
    అటువేపు గబగబా అడుగులు వేసాడు శతృఘ్న.
    
    "అయామ్... రిపోర్టర్ మధూలి" ఏదో చెప్పబోయింది.
    
    "అయితే.... దిసీజ్ నాట్ ప్లేస్ ఫర్.... ఫోటోస్... అండ్ ఇంటర్వ్యూస్..."
    
    గబుక్కున ఆమె చేతిలోని కెమెరాను లాక్కొని, దూరంగా కోపంగా-
    
    విసరేయబోయి-
    
    ఆ ప్రయత్నాన్ని అంతలోనే విరమించుకుని-
    
    "ఫోటోలు తీసుకునే ముందు యూ మస్ట్ గెట్ మై పర్మిషన్..." కోపంగా అనేసి ఆ కెమేరాను మధూలి చేతిలో పెట్టేసి సర్రున జీపెక్కాడు శతృఘ్న.
    
    జీపు వెంటనే ముందుకు దూసుకుపోయింది.
    
    ఐదు నిమిషాలు గడిచాయి.
    
    జీపు బేగంపేట మెయిన్ రోడ్ మీద పరుగెడుతోంది.
    
    "సర్...శ్రీరాములునాయుడు...వెరీ డేంజరస్ మేన్ సర్" భయంగా అన్నాడు ముకుంద్.
    
    తలతిప్పి చూసాడు ముకుంద్ వేపు శతృఘ్న.
    
    "వాడికి నా గురించి తెలీదు. వెరీ వెరీ డేంజరస్ మేన్ ని నేను" రోడ్ వేపు చూస్తూ అన్నాడు శతృఘ్న.
    
    శతృఘ్న ఆవేశాన్ని స్వయంగా చూసిన శ్రీరాములునాయుడు వెంటనే తడకు ఫోన్ చేసాడు.
    
                                         *    *    *    *    *

    ఆ రోజుకి రెస్ట్ తీసుకొని మరుసటి రోజు సి.ఎం.ని కలవాలనుకున్నాడు శతృఘ్న.
    
    అలా అని ఆ రోజు ఖాళీగా ఉండకుండా ప్రొహిబిషన్ ఫైల్స్ ని, స్టే ఆర్డర్స్ ని, ఎక్సయిజ్ శాఖ ఫైల్స్ ని తిరగేయాలనుకున్నాడు.
    
    అదే విషయాన్నీ ముకుంద్ కి చెప్పాడు శతృఘ్న వెంటనే తగిన ఏర్పాట్లు చేసాడు ముకుంద్.
    
                                         *    *    *    *    *
    
    "ప్రస్తుతానికి దొంగ సరణి అరికట్టే బాధ్యతల్ని శతృఘ్నకు అప్పగించండి. స్టే వెకేట్ కాగానే ప్రొహిబిషన్ సెల్ ని అప్పగిద్దాం" అంది సి.ఎం.
    
    వరదరాజన్ అంగీకారసూచకంగా తలూపాడు.
    
    స్టే వెకేట్ అవ్వటం మీద ఆ ఇద్దరికీ అంతగా నమ్మకం లేదు. అయినా ఏదో ప్రయత్నం చేయాలనే తపన వారిలో బాగా ఉంది.
    
                                         *    *    *    *    *
    
    రాత్రి సరిగ్గా 9-45 నిమిషాలు.
    
    హైదరాబాద్ ను, సికింద్రాబాద్ ను కలిపే వారధి టాంక్ బండ్ మసక వెన్నెల్లో మసగ్గా మెరుస్తోంది.
    
    ఆ టాంక్ బండ్ దిగువ రోడ్డులో కుడిపక్కనున్న అర ఎకరంలో ఉన్న కల్లు కాంపౌండ్ కోలాహలంగా ఉంది.
    
    చుట్టుపక్కలున్న ఫ్యాక్టరీల్లో మిడిల్ షిఫ్ట్ అయిపోయింది. నైట్ షిఫ్టు ప్రారంభమయ్యే సమయం.
    
    మర్నాడు జంట నగరాల్లో బోనాల పండగ.
    
    డ్యూటీ దిగిపోయిన ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు, రోజువారీ కార్మికులు, పట్నంలో బతకడానికి వచ్చిన పాలమూరు లేబరు...
    
    నిషా కుషీ హమేషాగా ఆకాశానికి అంటుతున్న వేళ-
    
    గుంపులు గుంపులుగా ఇసకలో కూర్చున్న వాళ్ళందరి ముందూ బాటిల్స్ ఉన్నాయి.
    
    ఆ బాటిల్స్ లో నాసిరకం సారా ఉంది.
    
    నిషాకి ఆడా, మగా వ్యత్యాసం లేదు.
    
    ఆనందానికి ఆడా, మగా వ్యత్యాసం లేదు.
    
    రోజంతా పడే కష్టానికి పేద జనాలకు కొన్ని గంటలసేపు సేదదీర్చే స్వర్గం అది (నిజానికి కాదు)
    
    కాంపౌండ్ కు అటూ ఇటూ చక్రాల బళ్లమీద మండుతున్న స్టౌల పైన రోస్ట్ చేస్తున్న చేప ముక్కల వాసన.
    
    మరో పక్కన నూనెలో చుయ్ మంటున్న మిర్చీలు హాట్ హాట్ గా అమ్ముడవుతున్నాయి.
    
    కబుర్లు, లోకాభి రామాయణం, బంధుత్వాలు, స్నేహాలు కొత్తగా కలగలసి పోతున్న నిషా క్షణాలు...
    
    వెళ్ళిపోతున్న జనాలు వెళుతున్నారు.
    
    వస్తున్న జనాలు వస్తున్నారు....
    
    అదొక నిషా ప్రవాహం... ఆ ప్రవాహం ఆగదు...
    
    ఆ ప్రవాహంలో-
    
    ఒకచోట ముగ్గురు వ్యక్తులు హుషారుగా మాట్లాడుకుంటున్నారు-
    
    "సిటీ కొచ్చి అయిదేళ్ళయింది.... ఐదువందలు కూడబెట్టిన.... ఆ ఫైసలు నీకే....కానొరే మల్లన్నా....  నా బిడ్డ.... సప్పుడు సెయ్యని బిడ్డరా దాన్నెలా జూసుకుంటావో" యాభయ్ అయిదేళ్ళ యాదయ్య అన్నాడు.
    
    "అదేంటి మావా.... కొత్తగా సెప్తుండావ్.....సెప్పినాను గదా. మణమ్మను ముచ్చటగా సూసుకోనూ! పద మావా....దోస్తులంతా వచ్చేసుంటారు. పంది రెయ్యాల, తోరణాలు కట్టాల అయ్యగోర్ని పిలవాల కాబోయే అల్లుడు మల్లన్న అన్నాడు.

 Previous Page Next Page