గౌను వేసుకుని, ఏటి ఒడ్డున, చేలగట్ల వెంబడి, పరుగెట్టిన జ్ఞాపకాలు-
మామిడితోటలో రహస్యంగా మామిడికాయలు కోసుకున్న మధురమైన జ్ఞాపకం.
రెండు నిమిషాలు మాట్లాడలేకపోయాడు శతృఘ్న.
"పోరాటాన్ని ఆయుధంగా స్వీకరించిన వాడికి శత్రువు- వ్యక్తి కాదు. వ్యవస్థ-" ఆగి తీక్షణంగా శతృఘ్న కళ్ళవేపు చూసాడాయన.
"అంటే! ఏ చీఫ్ మినిస్టర్ కో భయపడి, ఏ మాఫియా ముఠాలకో భయపడి, ఇక్కడ నుంచి వెళ్ళిపొమ్మంటారా సార్? అక్కడ కూడా అదే వ్యవస్థ అక్కడ కూడా అదే పోరాటం" శతృఘ్న గొంతులో ఏదో నిరాశ.
"మొదట్నించీ నన్ను తండ్రిలా అభిమానిస్తున్న వ్యక్తివి నీవు. నిన్నెందుకు అక్కడకు వెళ్ళమంటున్నానో ఒక్కసారి ఆలోచించు. మరి ఎదురు చెప్పలేదు నరేంద్రకు.
"ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రట్రీతో ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను నువ్వెప్పుడు బయలుదేరుతున్నావ్?" లాన్ లోంచి, హాల్లోకి నడుస్తూ అడిగాడాయన.
"మీరెప్పుడు వెళ్ళమంటే అప్పుడు" పెదవుల మీద నవ్వును పులుముకుంటూ అన్నాడు శతృఘ్న.
* * * * *
అకస్మాత్తుగా ఛాంబర్ డోర్ తెరచుకుని లోనికొచ్చిన చీఫ్ సెక్రట్రీ వేపు చూసింది సి.ఎమ్. త్రిభువనేశ్వరీదేవి.
"మేడమ్- బీహార్ చీఫ్ సెక్రట్రీ నరేంద్రకుమార్ ఫోన్ చేసారు మేడమ్ శతృఘ్న ఇక్కడకు రావడానికి అంగీకరించాడట" చెప్పాడు వరదరాజన్.
"ఎప్పుడొస్తున్నారు?" అడిగింది త్రిభువనేశ్వరి మెరుస్తున్న కళ్ళతో.
"రేపు మార్నింగ్ ఫ్లయిట్లో రావచ్చు మేడమ్."
"వెరీగుడ్.... కీప్ దిస్ యాజ్ ఎ సీక్రెట్... అతనొచ్చి, మనకు పని కొస్తాడనుకున్న తర్వాత, ఛార్జ్ తీసుకున్నాక మాత్రమే ఈ న్యూస్ బయటకు తెలియాలి." అంది త్రిభువనేశ్వరీ గంభీరంగా.
* * * * *
చీఫ్ సెక్రట్రీ సి.ఎమ్. ఛాంబర్ లోంచి బయటికొచ్చేసాక- పక్కనున్న ఇండియా టుడేని అందుకుంది సి.ఎమ్. త్రిభువనేశ్వరి- ఆ ఫోటో వేపు నిశితంగా చూసింది.
శతృఘ్న!
అస్పష్టంగా ముసురుకుంటూ అంతలోనే తెగిపోతున్న ఏవో జ్ఞాపకాల మేఘాలు...
అదే సమయంలో పి.ఎ. లోనికి రావడంతో-
సి.ఎమ్. ఆలోచనలకు అడ్డుకట్ట పడింది.
* * * * *
హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్.
లాంజ్ లోకి అడుగుపెట్టిన ఆ వ్యక్తివేపు పరీక్షగా చూసి, చేతిలోని ఇండియా టుడే పైన ఉన్న ఫోటో వేపొకసారి చూసి, నిర్దారించుకుని ముందు కడుగేసాడు ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ముకుంద్.
ఆ వ్యక్తి డి.సి.పి. శతృఘ్న.
ఎదురుగా వెళ్ళి సెల్యూట్ చేసి-
"సర్... అయామ్ ముకుంద్... ఎక్సయిజ్ సూపరింటెండెంట్ చీఫ్ సెక్రట్రీ... మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి పంపించారు."
పరిచయం చేసుకున్నాడు ముకుంద్.
"గ్లాడ్ టు సీయూ" కరచాలనం చేసాడు శతృఘ్న.
"మీరొక్కరే వచ్చారా... ఫామిలీ రాలేదా."
"మా గ్రాండ్ మదర్... వాళ్ళంతా ట్రైన్లో వస్తున్నారు."
"గవర్నమెంటు మీకు క్వార్టర్స్ అలాట్ చేసింది సర్... సెపరేట్ బిల్డింగ్" హుషారుగా చెప్పుకుపోతున్నాడు ముకుంద్.
"మీపేరు విని, మిమ్మల్ని ఎబౌ ఫార్టీ అనుకున్నాను సర్... మీరు బిలో ఫార్టీ" నవ్వుతూ అన్నాడు ముకుంద్.
నవ్వాడు శతృఘ్న.
గ్లాస్ దోర్ తెరిచి పట్టుకున్నాడు ముకుంద్... బైటకొస్తున్నాడు శతృఘ్న.
అదే సమయంలో శతృఘ్నకు ఎదురుగా ఓ వ్యక్తి వచ్చి నిలబడ్డాడు.
ఆ వ్యక్తి తెల్లటి కుర్తా, పైజామా వేసుకొన్నాడు.
"పాట్నా నుంచి వచ్చిన డి.సి.పి. శతృఘ్న?"
తలెత్తి చూసాడు శతృఘ్న.
"అయ్యగారు రమ్మంటున్నారు" దూరంగా పార్క్ చేసి ఉన్న కారువేపు చూపిస్తూ అన్నాడా వ్యక్తి.
ఎవరన్నట్లుగా ముకుంద్ వేపు చూసాడు శతృఘ్న. ముకుంద్ తఃనకేం తెలీదన్నట్టుగా పెదవి విరిచాడు.
"ఎవరు... మీ అయ్యగారు..." సూటిగా ప్రశ్నించాడు ఆ వ్యక్తిని శతృఘ్న.
"ఒకసారి రావయ్యా బాబు... వస్తేనేగదా తెలిసేది" శతృఘ్న చెయ్యి పట్టుకొబోయాడు ఆ వ్యక్తి చనువుగా.
అంతే!
శతృఘ్నకు కోపం నషాళాని కంటింది... వాడిని చూడగానే వాడి తరహా అర్ధమైపోయింది శతృఘ్నకు.
ఎడం చేత్తో వాడ్ని పక్కకు తోసేస్తూ-
"మీ అయ్యగార్నే రమ్మను.... మాట్లాడతాను" గబగబా మెట్లు దిగి జీపు వేపు నడిచాడు శతృఘ్నకు.
ఎడం చేత్తో వాడ్ని పక్కకు తోసేస్తూ-
"మీ అయ్యగార్నే రమ్మను... మాట్లాడతాను" గబగబా మెట్లు దిగి జీపు వేపు నడిచాడు శతృఘ్న...
ఇలాంటి సంఘటనలు శతృఘ్నకు మామూలే.
అప్పటికే ముకుంద్ జీపులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.
జీపు ఎక్కడానికి ముందుకి అడుగేసిన శతృఘ్న-
భుజమ్మీద చెయ్యి పడితే, తల తిప్పి చూసాడు.
ఎదురుగా-
శ్రీరాములు నాయుడు.
"మా వాడు చెప్పిన అయ్యగార్ని నేనే... నా పేరు శ్రీరాములు నాయుడు...గవర్నమెంటు గెస్ట్ హౌసుల్లో ఏవుంటావు గానీ...నీకోసం నెంబర్ వన్ గెస్ట్ హౌస్ ని ఏర్పాటు చేసాం రా."
చనువుగా భుజమ్మీద చెయ్యి వేసాడు శ్రీరాములు నాయుడు.
"ఏయ్ మిస్టర్! హాత్ నికాలో" కోపంగా అన్నాడు శతృఘ్న.
"డి.సి.పి. గారికి అంత కోపం పనికిరాదు" ముఖంమీద ముఖం పెట్టి నవ్వుతూ అన్నాడు శ్రీరాములు నాయుడు.
శతృఘ్న ఆ మాటల్ని విన్పించుకోకుండా, కుడి కాలిని పైకెత్తాడు జీపులోకి ఎక్కడానికి.
కానీ-
తనతో రమ్మన్నట్టుగా శ్రీరాములు నాయుడు శతృఘ్న చెయ్యి పట్టుకుని ముందుకు లాగాడు.
ఒక్కసారిగా కోపంతో తల తిప్పాడు శతృఘ్న.
"ఎవడ్రా నువ్వు... ఎవడు... ఎవడసలు... ఏం కావాలి" తోసేసి ముందు కెక్కుతున్న శతృఘ్నను మరీ పట్టి లాగబోయాడు శ్రీరాములు నాయుడు.
"తక్కువగా అంచనా వేయకు భాయ్... నేనెవరో..."
ఇంకా ఏదో చెప్పబోయాడు శ్రీరాములునాయుడు.
చెప్పనివ్వలేదు శతృఘ్న.
ఎడం చేత్తో శ్రీరాములు నాయుడని తోసేసాడు.. ఆ విసురుకి శ్రీరాములునాయుడు సిమెంటు నేలమీద వెల్లకిలా పడిపోయాడు.