Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 33

 

    "ఒరేయ్ యాదిగా....మల్లన్న ఎవడ్రా మనోడు. మనూరోడు. నీ బిడ్డకు ఫికర్నేదు....పద ..." బాటిల్లోని సారాని పూర్తి చేసేసి బాటిల్ ని పక్కన పడేస్తూ అన్నాడు మూడో వ్యక్తి నలభయ్ ఏళ్ల యాదగిరి.
    
    యాదయ్యకు అపురూపంగా పెంచుకున్న తన కూతురు మణమ్మ గుర్తుకొచ్చింది.
    
    ఆత్మకూరులో బతుకు గడవక పసిగుడ్డును భుజమ్మీద వేసుకొని సిటీకి తీసుకొచ్చిన సంఘటన, దాన్ని ప్రాణప్రదంగా పెంచిన రోజులు దాని కోసమే పడిన కష్టాలన్నీ గుర్తుకొచ్చాయి.... రేపు కూతురి పెళ్ళి....
    
    ఆ ఆనందంతోటే తాగుతున్నాడు యాదయ్య.
    
    అతని నరాలన్నీ నిషాతోను, మనసంతా ఆనందంతోనూ నిండిపోయింది.
    
    ప్రతి పనిశికి వ్యసనం వేరుగా ఉండదు.
    
    తన బలహీనతకు అనువుగా మలచుకునే కారణమే వ్యసనం.
    
    లేవడానికి ప్రయత్నించాడు యాదయ్య. అతిగా తాగడంవల్ల లేవలేక పోయాడు.
    
    కాబోయే అల్లుడు మల్లన్న, దోస్తు యాదగిరి యాదయ్యను రెండు చేతుల్తో పట్టుకుని బయటకు తీసుకువస్తున్నారు.
    
    యాదయ్య దుఃఖం వల్ల, సంతోషంవల్ల ఏడుస్తున్నాడు.
    
    రాత్రి పదకొండు గంటలయింది.
    
    రోడ్డుమీద నడుస్తున్న మల్లన్నకు కళ్ళు తిరిగినట్టయ్యింది. యాదయ్యను వదిలేసాడు...
    
    "మావా..." బాధతో అరుస్తూ కింద కూలిపోయాడు.
    
    యాదయ్యకు పక్కనున్న యాదగిరికి పరిస్థితి అలాగే వుంది.
    
    ఇనపరంపంతో ఎవరో నరాలు కోసేస్తున్న చప్పుడు.
    
    గుండెల్లోంచి రక్తాన్ని పైకి ఎవరో ఎగదోడుతున్న చప్పుడు.
    
    భరించలేని బాధ...
    
    ఏవో రెండు చేతులు బలంగా గుండెను బలవంతంగా నొక్కేస్తున్న మృత్యులయ...
    
    మహానగరం నిద్రపోవడానికి సమాయత్తమౌతున్న వేళ-
    
    వోవర్ టాంక్ బండ్ రోడ్ మీద-
    
    విహ్వలంగా కేకవేస్తూ - ముగ్గురు పడిపోయారు. ఆ ముగ్గురు యాదయ్య, మల్లన్న, యాదగిరి.
    
    కల్లు కాంపౌండును దాటి రోడ్డుమీద కొచ్చిన మిగతా వాళ్ళ పరిస్థితి అలాగే వుంది. అంతా విలయ బీభత్సం.
    
    అరుపులు, కేకలు...ఆర్తనాదాలు.
    
    దారంటా జీవశ్చవాల... బడుగు జీవుల హృదయ రవాలు.
    
    నెత్తురు కక్కుకుని, ఊపిరి ఆగిపోయి కాళ్ళు చచ్చుబడిపోయి....
    
    నిర్మానుష్యమయిన రోడ్ నిండా-
    
    జనం... జనం.... శవజనం...
    
    కల్తీ సారా కాటుకు బలైపోయిన అమాయక జనం...
    
                                           *    *    *    *    *
    
    అదే రోజు రాత్రి-
    
    హైదరాబాద్ లోని వోవర్ టాంక్ బండ్ రోడ్డు పక్కనున్న కల్లు కాంపౌండ్ దగ్గరే కాదు- ఉప్పల్ క్రాస్ రోడ్స్ దగ్గర, నగర శివార్లలోని హయత్ నగర్ దగ్గర-
    
    జీడిమెట్ల మామిడితోపు దగ్గర.... వరసగా...
    
    కల్తీసారా కాటుకు బలైన జనం...
    
    నిద్ర మత్తును పక్కకు తోసేసి, మేల్కొన్న పోలీస్ స్టేషన్లు.... సిటీలోని హాస్పిటల్స్ నుమ్చిఉ పరుగెడుతున్న అంబులెన్సులు, నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసుల వైర్ లెస్ సెట్లు...
    
    సిటీ ఎడిషన్లు ప్రింట్ చేస్తున్న దినపత్రికల ప్రెస్సులు ఒక్కసారిగా ఆగి పోయాయి.
    
    సిటీ రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, తలో దిక్కుకు పరుగెత్తారు.
    
                                          *    *    *    *    *
    
    రాత్రి మూడుగంటలు-
    
    అదే పనిగా టెలిఫోన్ మోగుతుంటే సి.ఎమ్. త్రిభువనేశ్వరీదేవికి మెలుకువచ్చింది.
    
    అది హాట్ లైన్ టెలీఫోన్.
    
    ఆ టెలీఫోన్.... అరుదుగా మోగుతుంది.
    
    సెంటర్ నుంచి పి.ఎమ్. ఫోన్ చేసినప్పుడో, గవర్నర్ ఫోన్ చేసినపుడో తనే స్వయంగా రిసీవర్ అందుకుంది త్రిభువనేశ్వరీ.
    
    "సారీ... ఫర్ ది డిస్టర్బింగ్ యూ... మేడమ్" చీఫ్  సెక్రటరీ వరద రాజన్ గొంతు కంగారుగా ఉంది.
    
    "వాట్ మిస్టర్... వరదరాజన్- వాట్ హేపెండ్" త్రిభువనేశ్వరీ గొంతులో ఏదో ఇతమిత్థంగా లేని గాభరా.
    
    "మేడమ్! ఇప్పుడే డి.ఐ.జి. ఫోన్ చేసారు మేడమ్! సిటీలో వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనల్లో" చెప్తున్నాడు చీఫ్ సెక్రట్రీ.
    
    "కల్తీ సారాకు ఆరువందల మంది బలై పోయారా" షాక్ తింటూ అడిగింది.
    
    "ఎస్ మేడమ్."
    
    "ఒక్క సిటీలోనే కాదు మేడమ్! ఆదిలాబాద్ లో, మెదక్ లో.... విశాఖ పట్నంలో ఒకేరోజు దాదాపు ఒకే సమయంలో."
    
    "మొత్తం ఎంతమంది?"
    
    "అంచనా ప్రకారం వెయ్యికి పైగానే ఉంటారు మేడమ్! ఇంకా వివరాలు అందలేదు. నేను సెక్రటేరియట్ కు వెళుతున్నాను మేడమ్."
    
    త్రిభువనేశ్వరీదేవికి ఈ పరిస్థితి అనూహ్యంగా ఉంది.
    
    ఒక పక్క మధ్యనిషేధానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలు- రెండో పక్క...ఆమె పరిఅప్రి విధాలుగా ఆలోచిస్తోంది.
    
    "మేడమ్! ఎక్సయిజ్ కమీషనర్ మీతో మాట్లాడతారట. ఆయనిప్పుడు ఇక్కడే ఉన్నారు" చెప్పాడు వరదరాజన్.
    
    "ఆస్క్ హిమ్ టు కమ్ టు మై రెసిడెన్స్- అలాగే మీరూ రండి. ఐ.జీ.కి ఫోన్ చెయ్యండి. అరగంటలో కన్ సర్న్ అఫీషియల్స్ నా రెసిడెన్స్ లో ఉండాలి" ఫోన్ పెట్టేసింది త్రిభువనేశ్వరీదేవి.
    
                                          *    *    *    *    *
    
    త్రిభువనేశ్వరీదేవి కళ్ళు నిప్పుల్ని చిమ్ముతున్నట్లుగా ఉన్నాయి. అధికారుల మొఖాన కత్తివేటుకి నెత్తురు చుక్క లేనంతగా పాలిపోయాయి.
    
    "ఈ దారుణ సంఘటన వెనక నాకు అబ్బయ్యనాయుడి శవాలే కనిపిస్తోంది. చట్టాన్ని, అధికారాల్ని మన చేతుల్లో పెట్టుకొని కూడా మనమేం చేయలేకపోవటం అత్యంత హేయమైన విషయం" ఒక్కక్షణం ఆగింది సి.ఎమ్.
    
    అధికారులేం మాట్లాడలేదు.
    
    "దీన్నే అవకాశంగా చూసి మనం స్టేని వెకేట్ చేయించుకోవాలి. అడ్వకేట్ జనరల్ ని కాంటాక్టు చేయండి. రేపే స్టే వెకేట్ అయిపోయి ప్రొహిబిషన్ అమలులోకి రావాలి. మధ్యలో మేం ఏమై పోతామని సారా కాంట్రాక్టర్స్ ఆర్గ్యూ చేస్తే నష్టపరిహారం చెల్లిద్దాం. ఇక నా నిర్ణయానికి తిరుగులేదు. అవసరమైన ఏర్పాట్లు చేయండి. రేపుదయం చీఫ్ జస్టీస్ గారి అపాయింట్ నాకు కావాలి వారికి సెక్యూరిటీ బాగా పెంచండి. వారి కుటుంబ సభ్యులకు కూడా" గడగడా ఆగ్రహావేశాలతో చెప్పుకుపోతున్న సి.ఎమ్. కేసి సూటిగా చూసే ధైర్యం ఆ అధికారులకు లేకపోయింది.
    
    వెంటనే సి.ఎమ్. రెసిడెన్స్ లోని ఫోన్లు బిజీ అయిపోయాయి.
    
                                          *    *    *    *    *

 Previous Page Next Page