"మన మిషన్ లోని ఎయిర్ సకింగ్ సిస్టమ్ దెబ్బతిన్నది. అది మన ఇంజనీర్స్ లోపమేగదా...? మొదటి విడత మన ప్రోడక్టు మార్కెట్ లోకి బాగానే వెళ్ళింది గదా? ఏ ప్రోడక్టనయినా ఒకసారి కొనిపించటానికి పబ్లిసిటీ కేంపైన సహకరిస్తుంది. ఆ తరువాత ప్రోడక్టులో లోపం వుంటే ఎంత గొప్ప కేంపైన అయినా ఏం చేయగలడు? తేలికపాటి బూజును కూడా మన క్లీనింగ్ మెషిన్ సక్ చేయలేక పోయింది.
పోనీ వెంటనే మన ప్రోడక్టులోని లోపాల్ని సరిచేసుకొన్నామా? లేదు?
ఈలోపు టాటాస్ స్వీడన్ కొలాబరేషన్ తో మల్టిపర్ పస్ సూపర్ సక్సెస్ యూరో క్లీన్ మైటీ వెక్సొమ్ ను ప్రవేశపెట్టింది.
టాటాస్ యూరోక్లీన్ కేవలం పబ్లిసిటీ మూలంగానే సక్సెస్ అయిందని మీ అభిప్రాయమా? అదే మీ అభిప్రాయమైతే ఐ యామ్ సారీ. ఫ్లోర్స్ కార్పెట్ వాల్స్ పై వుండే దుమ్ము, ధూళిని సమర్ధవంతంగా యూరోక్లీన్ పీల్చుకొంటుంది.
కారు రేడియేటర్స్ లోని అతి చిన్న పార్టికల్స్ ను కూడా సక్ చేసే విధానం అందులో వుంది.
ఒక్క సక్ససే కాదు.... బ్లోయింగ్ కూడా వుంది అందులో బ్రహ్మాండమైన శక్తితో గాలిని బయటకూ బ్లో చేస్తుంది. అన్నిటికిమించి స్ప్రేగన్ సిస్టమ్ వుంది.
ఒక గోడకు పెయింటింగ్ చేయాలంటే బ్రష్ లు కొనాలి, వర్కర్సుని పెట్టాలి. పన్నెండు వందల చదరపు అడుగుల అపార్ట్ మెంట్ కి పెయింట్ చేయాలంటే నలుగురు వర్కర్స్ కి మూడురోజులు పడుతుంది.
పైగా పెయింటింగ్ సమానంగా రాదు. పేచెస్ పేచెస్ గా వస్తుంది.
యూరోక్లీన్ స్ప్రే పెయింటింగ్ చేసేందుకు వీలుగా కంప్రెషర్ ని అందులో అరేంజ్ చేసారు. ఇష్టమైన పెయింట్ ని కంటైనర్ లో నింపి టర్పెంటాయిల్ మిక్స్ చేసి స్ప్రేచేస్తే ఒక వ్యక్తికి ఒకపూట చాలు. ఇన్ని రకాలుగా అది వుపయోగపడుతుంది గనుకే కన్స్యూమర్స్ యూరోక్లీన్ పట్ల మక్కువ చూపిస్తున్నారు.
Advertising should convince a consumer to try a product or buy a product once.
After that, the best advertising in the world will do no good.
కల్పనా వాళ్ళు మన ప్రోడక్ట్ కి చాలా అద్భుతమైన పబ్లిసిటీ చేశారు నేను ఆ ఫైల్సన్నీ తిరగవేసాను.
Excellent advertising will kill a poor product faster than poor advertising.
It will make more people try the product once and if the product is poor they will not try it twice.
పూర్ ప్రోడక్ట్ కి ఓవర్ పబ్లిసిటీ చాలా డేంజర్.
ఎంత గొప్ప ఎడ్వర్ టైజింగ్ అయినా ఒక వస్తువును ఒకసారి కొనిపించగలదు. అసలు దాని ఉద్దేశ్యం కూడా అదే. ఆ తరువాత ఎంత గొప్ప ఎడ్వర్ టైజింగ్ అయిన ఆ ప్రోడక్ట్ ని ఫుష్ చేయలేదు. దాని నాణ్యత, మన్నికే దానికి సహాయపడాలి. ఆ ప్రోడక్ట్ మంచిది కాకపోతే ఒకసారి కొన్నవాళ్ళు రెండోసారి కొనరు. కొనకపొగా కొనే వాళ్ళకు ఫలానా ప్రోడక్ట్ కొనకండి. అది మంచిదికాదు, మేం కొని నష్టపోయామని చెబుతారు. ఇకప్పుడు ఎంత గొప్ప ఎడ్వర్ టైజింగ్ అయినా ఎం చేయగలదు...?
కనుక మనం కల్పనా ఏజెన్సీని తప్పుపట్టలేం" ఆవేశంగా అంది వీనస్.
ఆమెకు ఎడ్వర్ టైజింగ్ ఫీల్డ్ లో అంత డెప్తు వుందని అంతవరకూ ఊహించని భరద్వాజ విస్తుపోయాడు. "నువ్వు చెప్పింది కరెక్టే అనుకుంటే జె.జె. వ్యాన్స్ పట్ల మన ఏజెన్సీ చేసింది తప్పు కాదుగా?" భరద్వాజ ఆమె వాధను ఆమెకే తిప్పి కొట్టాననుకున్నాడు.
ఆమె నవ్వింది ముందు.
"కరక్టే... కాని మన కేంపైన్ మూలంగా ఫస్ట్ సేల్స్ అన్నా జరగలేదు? ఐ మీన్ ఒక్కసారన్నా కొనిపించలేదుగా? అదే కల్పనా మన వీనస్ క్లీనింగ్ సిస్టమ్స్ ని ఇంట్రడ్యూసింగ్ స్టేజీకి బాగానే తీసుకెళ్ళ గలిగింది గదా...?"
ఆమెతో వాదించి దొరికిపోవటం కన్నా తాను తప్పుకోవటమో, ఆమెను దారి మళ్ళించటమో బెటర్ అనుకున్నాడు భరద్వాజ.
"ఇదెప్పుడూ వుండే గొడవే... ఇంతకీ అతని జాడ ఏమన్నా తెలిసిందా?" భరద్వాజకు తెలుసు... ఆమెను ఎక్కడ దెబ్బకొడితే ఆమెలోని రీజనింగ్ చచ్చిపోతుందో!
ఆమెకు మాధురే కల్పనా ఏజన్సీని తిరిగి ప్రారంభించబోతున్నాడన్న అనుమానం లేకపోలేదు.
కాని కన్ ఫర్మ్ చేసుకోందే ఎందుకు నిర్దారించుకోవాలని ఆగిపోయింది.
* * * * *
వివిధ ప్రాంతాల నుంచి మాధుర్ ప్రకటనను అభినందిస్తూ వ్రాసిన లెటర్స్, టెలిగ్రామ్స్ మాధుర్ అడ్రస్ ను వెతుక్కుంటూ ప్రయాణిస్తున్నాయి.
అవి మరికొన్ని గంటల్లోనో, ఒకటి రెండు రోజుల్లోనో మాధుర్ కి చేరనున్నాయి. అవి చూస్తే ఆ పురాతన భవంతిలో వున్న నలుగురి ఆలోచనలు ఊపిరిపోసుకుంటాయి. నలుగురి కలలు వాస్తవాలవుతాయి. నలుగురి ఆశలు ఆశయసిద్దికై పోరాడతాయి.
కానీలోపు...?
మనిషి తన ప్రయత్నం తాను చేసి ఫలితానికి ఎదురుచూస్తాడు, ఆ ఎదురు చూడడంలోనే కొందరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. మరికొందరు పట్టుదలను పెంచుకుంటారు.
ఎదిరించి చేసినప్పుడున్న ఆత్మవిశ్వాసం, స్థయిర్యం ఎదురుచూసే సంధికాలంలో వీగిపోతుంటాయి.
ఈ సంస్థ పునరుజ్జీవనం పొందుతుందా?
కేవలం తాపత్రయమేనా?
ఇలా ఆలోచిస్తున్నాడు గంగాధరరావు.
కొద్దిగా పుంజకున్నాక తన చెల్లెలి పెళ్ళి ఘనంగా చేయాలి. ముందు సంబంధం కుదుర్చుకొని తరువాత కాదన్న ఆ దుర్మార్గుడికి బుద్ది చెప్పాలి. ఈ సందర్భంలో ఎలాంటి ప్రమాదాలు ఎదురయినా ధైర్యంగా ఎదుర్కోవాలి.
మాధుర్ కి తన పూర్తి అండదండల్ని అందించాలి... భార్గవ యిలా ఆలోచిస్తున్నాడు.
ది గ్రేట్ వదెనమ్మ ఆహ్వానాన్ని చావుదెబ్బ తీయాలి. తనమీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న తన తల్లిదండ్రులకు తను బ్రతగ్గలడు అని నమ్మించగలగాలి. తన తెలివితేటల్ని వుపయోగించుకుని సోకాల్డ్ హిపోక్రాట్స్ కి సరైన సమాధానం చెప్పాలి.
వీటన్నిటికి మించి తన జీవితాశయం మరొకటి వుంది, తన ఆత్మస్థయిర్యాన్ని, ప్రేమను, ఆరాధనను, అభిమానాన్ని పరిహసించిన ఆ వ్యక్తికి సమాధానం చెప్పాలి.
తను కేవలం ఒక్కసారి భరద్వాజకు కనిపిస్తే చాలు... కథ దానంతట అదే చిత్రమైన మలుపు తిరుగుతుంది.
తను కావాలనే మాధుర్ అన్న పేరుతో రిజిష్టర్ లెటర్ రాశాడు.
దానికి అతని రియాక్షన్ ఏమిటన్నది స్పష్టమైపోతుంది.
అక్కడినుంచే తన ఎత్తుగడ ఏమిటన్నది జాగ్రత్తగా రూపొందించుకోవాలి.
ఈ ముగ్గురిలా ఆలోచిస్తుండగా మౌనిక ఆలోచనలు మరోరకంగా వున్నాయి.
తనకు తాతగారిచ్చిన టైమ్ సరిగ్గా ఆరునెలలు. అంటే 183 రోజులు. అందులో అప్పుడే 3 రోజులు గడిచిపోయాయి. ఇంకా కేవలం 170 రోజులు మాత్రమే వున్నాయి.
ఈలోపే తమ గోడౌన్స్ అన్నీ ఖాళీ చేయించాలి. అర్ధబలం, అంగబలం కావలసినంత వుంది.
డిస్ట్రిబ్యూషన్ చానెల్స్ ఖండాంతరంగా వ్యాపించి వున్నాయి. బ్రహ్మాండం బ్రద్దలయ్యేలా నెట్ వర్క్.
వాటికి మాధుర్ మేధస్సును జోడించాలి.
మాధుర్... మధురమైన పేరు... ఎందుకో అతను గుర్తుకొస్తే చాలు తనలో విచిత్రమైన ఉద్విగ్నత! అతని సమక్షంలో వుంటే వినూత్నమైన స్పందన.
చిన్నపిల్లాడి మనస్తత్వం... చిన్న విషయానికి కూడా వెంటనే రియాక్ట్ అయ్యే సున్నితత్వం... ఎదుటి మనిషి చిన్న బాధకు గురైనా చూసి తట్టుకోలేక దయార్ద్ర హృదయం... సరదాగా, సందడిగా వుండే తత్వం... వీటన్నిటి వెనుక కాంకర్డ్ కన్నా దూసుకుపోగల ఆలోచనలు... సూపర్బ్ క్రియేటివ్ నెస్... ప్రతి విషయాన్ని వేరే కోణం నుంచి ఆలోచించే నేర్పు!