భరించలేని బాధ!
ప్రతి జ్ఞాపకం ఒక బాధయిపోయింది.
బాధగా కళ్ళు మూసుకుంది ఆనంది.
మూసుకున్న కళ్ళకి మిట్టమధ్యాహ్నమైన చీకటే!!
ఆ చీకటిలాంటిదే ఆనంది గతం....
* * * * *
వికాస్ ప్రహ్లాదపురంలోని రూమ్ ఖాళీ చేసేశాడు. ఫ్యాక్టరీ వెనక వాచ్ మెన్ కోసం కట్టిన గదిని తన నివాసంగా మార్చుకున్నాడు.
ఫ్యాక్టరీ కెదురుగా టీ కొట్టు వెలిసింది చయనులు సారధ్యంలో.
ఎవరో కుర్రాడ్ని ఎక్కడనుంచో తీసుకొచ్చాడు.
శివానీ మోటార్ కాంప్లెక్స్ కడిగిన అద్దంలా తయారయింది.
అవసరమైన ఫర్నిచర్ వచ్చింది. ఫోన్ కనెక్షన్ వచ్చింది.
వికాస్, శివమూర్తి, జగన్మోహన్ రోజూ గంటల తరబడి చర్చలు.
ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయే ముందు-
"ఎస్.ఎఫ్.సి. లోను ఎంతవరకొచ్చింది....?" అడిగాడు శివమూర్తి.
"రెండు నెలలు పడుతుందట-" చెప్పాడు వికాస్.
మావయ్య దగ్గర తీసుకున్న డబ్బు అప్పుడే అయిపోయింది.
అదే విషయం చెప్పాడు శివమూర్తితో.
"బొంబాయి వెళ్తున్నానన్నావ్.... ఎప్పుడు...?" అడిగాడాయన.
"అనుకున్నదేదీ ఇలా అందినట్టే అంది అలా పోతుంటే.... ఏం చెయ్యాలో తోచడం లేదు..."
"ఇన్నాళ్ళూ లేని నిరాశా... ఇప్పుడొస్తోందా" నవ్వాడు శివమూర్తి.
"డోన్ట్ వర్రీ.... పనులన్నీ జరుగుతాయ్..." చెప్పేసి వెళ్ళిపోయాడాయన.
ఎలా... ఒకటీ రెండూ కాదు.... పదిహేను లక్షలు.
తనకు తెలిసిన ఫ్రెండ్సందరిని గురించీ ఆలోచించాడు.
అక్కడో వెయ్యా, అక్కడో రెండువేలు.... తప్ప లక్షల్లో ఎవడూ ఇచ్చిన వాడు లేడు.
మూడు నెలల గడువులో...
తననుకున్నది చెయ్యగలడా...
చెయ్యగలడా...
ఆలోచన... ఆలోచన...
ఏడుగంటలైంది...
ఆలోచన.... ఆలోచన....
ఎనిమిది గంటలైంది... తొమ్మిది.
సరిగ్గా ఆ టైమ్ లో వికాస్ కో ఆలోచన వచ్చింది.
గబగబా తన రూమ్ లోంచి బయటికొచ్చి, ఆఫీసు గదిలోకెళ్ళాడు.
ఓ ఫోన్ నెంబర్ తిప్పాడు.
65432-
ఎంగేజ్... మళ్ళీ చేశాడు... ఎంగేజ్.
విసురుగా రిసీవర్ పెట్టేశాడు.
అదే సమయంలో ఫోన్ మోగింది.
'ఇంతరాత్రి ఎవరై వుంటారు?'
అనుకుంటూ రిసీవర్ ఎత్తాడు.
"హలో... వికాస్..."
"హలో ... నేనూ... శివమూర్తిని ఎంతసేపట్నించి నీకు ట్రై చేస్తున్నానో తెల్సా?"
"నేనూ మీకే ట్రై చేస్తున్నాను సర్..."
"ఆ... బైదిబై... అక్కడనుంచి కార్లో వస్తున్నప్పుడు... నాకో ఆలోచన వచ్చింది. అదేమిటో తెల్సా...? మన 'సైట్' మీద 'లోన్' తీసుకోవచ్చు కదా.... వెంటనే నాకు తెల్సిన ఫైనాన్షియర్ దగ్గరకెళ్ళాను..."
వికాస్ రోమాలు ఒక్కసారి పులకరించినట్టు పొంగాయి.
ఐదునిమిషాల క్రితం అతనికొచ్చింది కూడా అదే ఐడియా.
"నాలుగు లక్షలిస్తానన్నాడు. నేను ఐదడిగాను.... ఇస్తానన్నాడు...." చెప్తున్నాడు శివమూర్తి.
"థాంక్యూ సర్... మీ హెల్ప్ నేను మరిచిపోలేను సర్."
"ఆ థాంక్స్ విషయం మానేయ్.... నేనూ ఇంత పట్టుదలతోనే దాన్ని ప్రారంభించాను.... నాకు కలిసి రాలేదు. నీక్కలిసొస్తే... అదే చాలు. ఏదయినా మన మంచికే.... రేపు మార్నింగ్ ఆ ఫైనాన్షియర్ దగ్గర పని చూసుకుని వస్తాను.... గుడ్ నైట్."
అయిదు నిమిషాల క్రితం వున్న ఆందోళన వికాస్ లో యిప్పుడు లేదు.
అతనికి సుష్టుగా భోంచేసినట్టయింది.
సరదాగా సిగరెట్ మీద సిగరెట్ కాల్చాడు - టీ కొట్టులో పడుకున్న మేనమామ దగ్గరకెళ్ళి వేడి టీ పెట్టించుకుని తాగి మావయ్యతో ఆ విషయం చెప్పాడు....
ఆఫీసు రూమ్ లోకొచ్చి కూర్చున్నాడు.
జనవరి మొదటివారంలో తన 'స్ట్రీట్ రైడర్' మార్కెట్లో కొస్తుంది.
స్ట్రీట్ రైడర్ 'బ్లూ ప్రింట్'కి నగిషీలు చేస్తూ-
పుస్తకాలు రిఫర్ చేస్తూ-
అలా ఎంతసేపు గడిపాడో తెలీదు.
మర్నాడు-
పన్నెండుగంటలకొచ్చాడు శివమూర్తి.
రాగానే సూట్ కేస్ లోంచి ఐదులక్షలకు డిమాండ్ డ్రాఫ్ట్ ని వికాస్ చేతుల్లో పెట్టాడు.
ఆ సమయంలో వికాస్ కళ్ళు చెమర్చాయి.
"ఇప్పుడు నీ బొంబాయి ప్రయాణం గురించి ఆలోచించు. నువ్వు వచ్చే లోపల మిగతా ఫైనాన్స్ విషయం నేను చూస్తాను..." హామీ ఇచ్చాడు శివమూర్తి.
తను బొంబాయి వెళ్ళి ఏఏ కంపెనీల వాళ్ళని కలవదలుచుకున్నాడో చెప్పాడు వికాస్.
"బొంబాయిలో అరవిందనాయర్ అని ఓ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన డన్ లప్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎడ్రసిస్తాను.... వెళ్ళు.... ముందు ఆయన్ని కలువు... మోటార్ ఇండస్ట్రీలో ఆయన జెమ్... ఆయన ఎడ్వయిజ్ మనకు చాలా ఉపయోగపడుతుంది" చెప్పి అరవింద్ నాయర్ ఎడ్రసిచ్చాడు శివమూర్తి.
అరగంట తర్వాత-
"చూడు జగన్ నేను బాంబే వెళ్తున్నాను.... ఈలోపల నువ్వు చెయ్యాల్సింది.... ప్రధానంగా వున్న మోటార్ డీలర్స్ ఎంత మందో కనుక్కోవాలి. రెండు... వాళ్ళందర్నీ కలవాలి. మనం ఇంట్రడ్యూస్ చేసే కారు... విషయంలో వాళ్ళ సలహాల్ని తీసుకోవాలి. నేనొచ్చేసరికి నాకో రిపోర్టివ్వాలి.... సరేనా....టి.ఏ. క్లయిమ్ చెయ్యొచ్చు..." నవ్వుతూ అన్నాడు వికాస్.
మర్నాడు మధ్యాహ్నం మూడున్నరైంది.
రైల్వేస్టేషన్లో సూట్ కేసుతో నించున్నాడు వికాస్.
ఇంకా ట్రైన్ బయల్దేరడానికి పావుగంట సమయం ఉంది.
"హలో..."
ఆ పిలుపుకి తలతిప్పి చూశాడు వికాస్.
లిఖిత....
ఆకుపచ్చరంగు నగిషీల కుర్తా, పైజామా- గాలి కెగురుతున్న పట్టుకుచ్చులాంటి జుత్తు...
ఆరోజు అలా కంగారు, క్జంగారుగా డాల్ఫిన్ హోటల్ దగ్గ్రర్నించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే కలవడం.
"మీ ఆఫీస్ కి ఫోన్ చేశాను... చెప్పారు.... వచ్చాను..." నవ్వుతూ అంది.
"మీరు వూళ్ళో లేరనుకున్నాను" అన్నాడు వికాస్.
"మళ్ళెప్పుడొస్తున్నారు?" అడిగింది ఆమె.
"పనైపోగానే."
"పనెప్పుడవుతుంది?"
"అది మన చేతుల్లో లేదు."
బైదిబై... వారం రోజుల తర్వాత- నాకేదో చెప్తానన్నట్టున్నారు" మర్చిపోయారా అన్నట్టుగా అడిగింది లిఖిత.
"అదా... చూస్తున్నారుగా.... బిజీ... బిజీ..." బిజీని అభినయించి చూపాడు వికాస్.
"బిజినెస్... అంటేనే అది.... మనిషిని బిజినెస్ తో బిజీగానే వుంచండి.....మనసుకు బిజినెస్ లేదుగా..." నిజంగా ఆలోచించలేదా అన్నట్టుగా అంది ఆమె.
"మనిషీ మనసూ రెండూ బిజీ..."
"అయితేమీరు చెప్పలేదు కాబట్టి, మీరు ఫెయిలైనట్టే... అవునా? ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి."
"ఇప్పుడా..." ఆశ్చర్యంగా అన్నాడు వికాస్.
"ఇప్పుడు కాదండీ బాబు... బొంబాయి నుంచి రాగానే.... ఆరోజు మీతో నేనేమన్నాను.... జ్ఞాపకం వుందా..."