Previous Page Next Page 
మొగలిబాకు పేజి 31

  

        "నీ ఆస్థి మండిపోను ఆస్థి, ఆస్థి అని పట్టుకున్నావేంటయ్యా! ఇక్కడ మనుషులే మారిపోతేనూ..... ఇంతకీ ఆ జానకీ ఎవరి కూతురో చెబుతావా లేదా.....లేకపోతే కానిస్టీబుని పిలవమంటారా?" బెదిరించింది కాంతమ్మ.
   
    "కనిస్టీబంటే వాడెవడు?" అడిగాడు దాదా.
   
    "కనిస్టీబు అంటే కానిస్టేబుల్ అని అర్ధం. ఇప్పుడు ఈవిడ పోలీసుల్ని పిలిస్తే మన బండారాలు బయటపడతాయి. నా అసలురూపం చూపించమంటావా-చెప్పు....." దాదా కోపంగా సరదాపటేల్ చెవిలో అన్నాడు.
   
    "కాసేపు ఓపిక పట్టయ్యా బాబూ......సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు పెద్దలు. చూడు నేనెలా పరిష్కరిస్తానో" అని సరదా పటేల్-
   
    బామ్మ వేపు తిరిగి-
   
    "బామ్మగారూ.....అమ్మాయి ఎవరు కూతురనే విషయం పక్కన పెట్టండి.....ముందు మీకు అమ్మాయి నచ్చిందో లేదొ చెప్పండి" అని అడిగాడు.
   
    "అమ్మాయి ఎవరి కూతురో చెపితేనే నేను నా ఒపీనియన్ ని చెపుతాను_" భీష్మించుకుని కూర్చుంది కాంతమ్మ.
   
    సరదాపటేల్ బ్రెయిన్ లోకి ఓ అయిడియా రాగానే అతగాడు విచిత్రంగా కళ్ళెగరేసి-
   
    "బామ్మగారూ, మీరు పెద్దవారు. ఏదో వెయ్యి అబద్దాలాడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు పెద్దలు సో.....సరదాగా ఒక అబద్దం ఆడాం అంతే. నిజానికి ఈ జానకి అటు కలెక్టర్ గారి కూతురూ కాదు....ఇటు ణ అకూతురుకూడా కాదు...." సడన్ గా బాంబు పేల్చాడు.
   
    "మరెవడి కూతురు....." కళ్ళు మిటకరించి అడిగింది కాంతమ్మ.
   
    "నిజం చెప్పెయ్యమంటారా...." మిగతా సగం పోర్షనూ తను తీసుకుంటూ అన్నాడు దాదా.
   
    "చెప్పుగానీ, ఎక్కువ అబద్దాలు చెప్పకు. అక్కడ నారాయణ రావుకీ దెబ్బ, స్టూడెంట్స్ యూనియన్ కి దెబ్బ...." నెమ్మదిగా రుస రుసలాడాడు సరదాపటేల్.
   
    "నాకా మాత్రం తెలీదా?" అని.
   
    "చూడండి బామ్మగారూ....ఈ అమ్మాయిది కడు విషాదకరమైన జీవితం మేం గోదావరి పుష్కరాలకు వెళ్ళినపుడు మాకు ఉమ్మడిగా దొరికింది. అప్పట్నించీ మేమిద్దరం పెంచుతూ వచ్చాం....అంచేత మా ఇద్దర్నీ ఈ జానకి నాన్నా అని పిలుస్తుంది.....మీకిప్పుడు కన్ ఫ్యూజన్ తొలగిపోయింది కదా....." అని చెప్పాడు దాదా అతి కష్టం మీద.
   
    అనాధలంటే బామ్మకు చాలా ఇష్టమని, ఎక్కడయినా ఈ పాయింట్ ఉపయోగపడితే ఉపయోగించుకోమని నారాయణరావు వైజాగ్ బీచ్ లో చెప్పిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకొని, దానిని సరిగ్గా టైమ్ కి ఉపయోగించినందుకు తనలో తానే సంభ్రమాశ్చర్య కందళితానంద మనస్కుడై పోయాడు దాదా.
   
    అనాధ పిల్ల అనగానే జానకిమీద అపారమైన జాలి పుట్టుకొచ్చింది కాంతమ్మకు.
   
    "ఇంతవరకూ చెప్పారు కాదేమర్రా.....మా నారాయణరావు పెళ్ళాం కావడానికి, ఈ పిల్లకే ఈ భూప్రపంచమ్మీద అర్హత ఉందంతె. గవర్నరూ అర్జంటుగా మా నారాయణరావుకి కబురెట్టు......వాడు నోటివెంటకూడా అర్జంటుగా ఊఁ అనిపించేస్తేపోతుంది" మెట్లమీద కూర్చుని తన పక్కనే కూర్చుండబెట్టుకుంది జానకిని.
   
    జానకికి అదంతా కంపరంగా వుంది.
   
    "ఆస్థి రాయడం కార్యక్రమాన్ని చెడగొట్టడానికొచ్చి, నిశ్చయ తాంబూల కార్యక్రమాన్ని ఫిక్స్ చేసారేంటి....." రుసరుసలాడుతూ సరదాపటేల్ వేపు చూసిందామె.
   
    "డోంట్ వర్రీ....." అని పౌరాణిక సినిమాల్లో శ్రీకృష్ణుడిలా అభయహస్తం ఫోజు పెట్టాడు.
   
    "బామ్మగారూ.....ముందు ఆ ఆస్తి గొడవ....." ఏదో చెప్పబోయాడు దాదా.
   
    "ఆస్తీ గీస్తీ అన్నావంటే అసలు విషయం చెప్పేస్తాను జాగ్రత్త" కళ్ళు మిటకరించాడు సరదాపటేల్.
   
    "ఆ పిల్లను వెంటేసుకుని, నువ్వెందుకొచ్చావసలూ.....వైజాగు లోకి రాగానే, నీ మక్కలు విరిచేయకపోతే నా పేరు దాదాయే కాదు" అన్నాడతను కోపంగా.

    "ఒరేయ్ అబ్బాయిలూ, ముందు నారాయణర్రావుకి కబురెట్టండర్రా" మళ్ళీ అంది కాంతమ్మ.
   
    "పెళ్ళి విషయం తర్వాత మీ ఆస్థి ఎన్ని లక్షలుంటుందో చెప్పండి" అడిగాడు దాదా.
   
    "ఆస్తెవడిక్కావాలయ్యా మనుషులు ముఖ్యంగానీ" ఎదురు జవాబిచ్చాడు సరదాపటేల్.
   
    వీళ్ళ వాదోపవాదాల మధ్య జానకికి పిచ్చెక్కిపోతోంది.
   
    వచ్చింది ఒకదానికయితే, అయింది ఇంకొకటి.
   
    "నారాయణరావుతో నాకు పెళ్ళేవిటి....ఈ పెళ్ళి  గొడవేమిటి..... పనయిపోయిందిగదా .....పదరా పోదాం...." సరదా పటేల్తో అంది జానకి.
   
    "మీ ఆస్థి లెక్కలు చెప్పేస్తే నే వెళతాను...." అన్నాడు దాదా.
   
    "ఆస్తి లెక్కల అవసరం ఇప్పుడు అర్జంటుగా ఏం లేదుగానీ....పనయిపోయింది గదా, మీ ఇద్దరూ వెళ్ళిపోండి. అమ్మాయి నాలుగు రోజులు ఇక్కడ వుండి వస్తుంది. ఈ లోపల అమ్మాయికి వంటావార్పూ మొదలయినవన్నీ నేర్పుతాను" జానకి చెయ్యి గట్టిగా పట్టుకుని అంది కాంతమ్మ.
   
    "నాకు పనుంది బామ్మగారూ, నేనూవెళతాను" నెమ్మదిగా అంది జానకి.
   
    "ఎక్కడికెళతావ్...ఇంతకీ మా నారాయణరావ్ నీకు తెలుసా" బోసినవ్వుతో అడిగిందావిడ.
   
    "ఎందుకు తెలీదు. పిచ్చిమాలోకం....బాగా తెలుసు" అనేసింది జానకి.
   
    "ఆఁ నారాయణరావు నీకుతెలుసా?" మళ్ళీ రెట్టించి ప్రశ్నించింది కాంతమ్మ.
   
    "నాకు తెలీదు" అని అంది జానకి.
   
    "మా నారాయణరావు చూసావూ.....వాడికన్నీ వాడి తాతయ్య బుద్ధులే. తాతయ్యంటే మా ఆయనవే .....ఆ ఠీవి, ఆ వగరూ, ఆ పొగరూ మీ ఇద్దరి పెళ్ళయ్యాక ఆస్తంతా నీ పేరునే రాసిస్తాలే. వాడు పుట్టి దుబారా మనిషి మావాడంటే నీ కిష్టమే కదూ" ఈ ముసిలావిడ దగ్గర కమిటయిపోతే చాలా రిస్క్ లో పడిపోతావని తెలుసుకున్న జానకి-ఏదో చెప్పబోతూ ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి ఆగిపోయింది.
   
    ఆ వ్యక్తి సురభి-ఆ పక్కన నారాయణరావు మేనమామ సత్య నారాయణ కూడా వున్నాడు.
   
    "నాకు తెల్సు ముసిల్దానా.....నువ్వు ఎప్పుడో ఒకప్పుడు రహస్యంగా నారాయణరావుకి పెళ్ళి సంబంధం కుదిర్చే ప్రయత్నాలు చేస్తావనే ఈ వూళ్ళో నీ యింటిచుట్టూ గూఢచారుల్ని పెట్టించాను. సమయానికి వాళ్ళొచ్చి చెప్పబట్టి సరిపోయిందిగానీ, లేకపోతే ఈ పిల్లని నారాయణరావు గాడికిచ్చి కట్టబెట్టెయ్యడానికి నిర్ణయం తీసేసుకుని ఉందువుగదా" నిష్టూరంగా అన్నాడు సత్యనారాయణ.
   
    "మా మనవడు నా యిష్టం. ఇంతకీ ఇప్పటికిప్పుడు.....ఇక్కడి విషయాలు మీ వూరుకి ఎవరు చేరవేసారో నాకు తెల్సు. ఆ నారాయణ రావుగాడి తల్లి, తండ్రీ-వాళ్ళిద్దరే గదా నీ గూఢచారులు. నా ఆస్తిలో ఒక్క ఎర్రని ఏగాణికూడా వాళ్ళిద్దరికీ యివ్వనంతే" కోపంగా అంది కాంతమ్మ.
   
    "ఏగాణులు, కాసుల గురించి నా కనవసరం. ముందు మా సురభి గురించి యిప్పుడే తేల్చాలి" అని కాంతమ్మతో చెప్పేసి కలెక్టర్ గవర్నర్ వేపు తిరిగి__

 Previous Page Next Page