Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 30

    "ఏంటోనమ్మా రోజాతల్లీ! నా పరిస్థితి రోజురోజుకీ ఏదోలా వుంది. మరోసారి గుండెనెప్పి రాకుండా చూసుకోవాలి అన్నాడు డాక్టర్, నీవు ఇంట్లోంచి వెళ్ళినా కూడా మళ్ళి గుండెనెప్పి రాలేదు. లక్షల రూపాయల దూది బేళ్ళు తగలబెట్టామని తెలిసినా పోనీ అనుకున్నాను. నా గుండె రాయి అయింది యింక నెప్పేమి వస్తుంది?

    ఈ మధ్య నీరసంగా అణువణువునా ఆక్రమించుకుంటున్నది. కృష్ణ వస్తే కృష్ణ చేతిలో నిన్ను పెడితే నా భారం తీరిపోతుంది.

    భుజంగరావు మాటలు చాలా జాగ్రత్తగా వింటూ కూర్చుంది అమల.

    ఇంతలో ఏవో కాగితాలు పట్టుకుని సుందరమూర్తి రావటంతో భుజంగరావు మౌనం వహించాడు.

    సుందరమూర్తి భుజంగరావు మాట్లాడుకుంటుంటే అమల లేచి యివతలికి వచ్చింది. తర్వాత సరాసరి తన గదిలోకి వచ్చి లోపల తలుపులు గడియ వేసుకుని అలమర తెరిచింది.

    కొద్దిసేపు శ్రమ పడిం తరువాత సీక్రెట్ అర తెరవటం వచ్చింది అమలకి. ఆ అర చిన్న పలకంత వుంది. దానిలో మూడు చిన్న డైరీలు దొరికాయి. అంతకుమించి ఏమీలేవు.

    భుజంగరావు ఈ యింటి యజమాని ఈ యింటి సీక్రెట్స్ అన్నీ తెలిసినవాడు. సరోజకి సంబంధించినవి తీసేసి వుంటాడు. నగనట్ర లాంటివి, డైరీలు చదువకూడదు కాబట్టి ఈ సీక్రెట్ అరలో పడేసి వుంటారు. మాయమైన రోజా సామానులవలన తనకేమీ తెలియదు. కనీసం ఈ డైరీలవలనైనా తెలిస్తే, ఏ చిన్న క్లూ అయినా చాలు. కొంతలో కొంత తెలుసుకోవచ్చు.

    అమల ఆ డైరీలను చాటుగా జాగ్రత్తగా చదువుకోవాలనుకుంది. యధార్ధస్థానంలో డైరీలను వుంచి అరవేసేసింది. ఆ తర్వాత తలుపులు తీసుకుని బైటికి వచ్చింది.

    అల్లంత దూరాన నాయర్ వేగంగా వెళుతూ కనిపించాడు.

    "ఓహ్, నాయర్, తనని కనిపెట్టటానికి వచ్చి వుంటాడు. తలుపులు లోపల వేసుకోవటంవల్ల సాధ్యంకాక తలుపవతల నిలిచివుంటాడు. లోపల ఏం చేస్తున్నానో వాడికేం తెలుసు? నక్కజిత్తుల నాయరూ! నాపై సి.ఐ.డీ. పనిచేస్తావా? ఇంక దొరుకుతానేమో చూడు. ఇహపై నిన్నో కంట కనిపెడుతూనే వుంటాలే" అనుకుంది అమల.

    ఆ నిముషం నుంచే తాను సి.ఐ.డీ. రూపుదాల్చింది అమల.

    ఆరాత్రి పదకొండు గంటలవేళ అమల కిచన్ కి అటు పక్కనున్న చిన్న కిటికీ అవతల నక్కి నుంచుంది.

    రాత్రి అందరి భోజనాలు అయాయి.

    నాయర్ వంట యిల్లు సర్ది ఏం చేస్తాడో అని చూసింది.

    నాయర్ వంటయిల్లు సర్డాడు.

    రోజు భుజంగరావు గదిలో రెండుగ్లాసులు నీళ్ళు మాత్రమే పెట్టె నాయర్ జగ్ నిండా నీళ్ళుపోసి పెడతారు. వాటర్ ఫిల్టర్ లోంచి వాటర్ జగ్ లోకి నీళ్ళుపోస్తే ఆ జగ్ ని భుజంగరావు గదిలో వుంచుతుంది నర్సమ్మ. వంటగదిలోకి ఆఖరి కార్యక్రమం అది.

    నాయర్ అరలో వున్న సీసాల చాటునుంచి చిన్న సీసా ఒకటి తీశాడు. ఆ సీసాలో ఓమాత్రతీసి నాయర్ జగ్ లో వేసి మళ్ళి ఆ సీసాని హార్లిక్స్ మొదలైన సీసాల చాటున దాచాడు. వాటర్ ఫిల్టర్ లోంచి నీళ్ళు జగ్ నిండా నింపి మూతపెట్టి నర్సమ్మని పిలిచాడు.

    నర్సమ్మ వచ్చి నాయర్ తో రెండు కబుర్లు ఆడి ఆ జగ్ ని తీసుకుని వెళ్ళింది భుజంగరావు గదిలో పెట్టటానికి.

    అమల కళ్ళారా అంతా చూసింది.

    "హారి భగవంతుడా! వీళ్ళు చాలా ముందు అడుగు వేస్తున్నారు. ఈ నాయర్ భగవాన్ గాడి మనిషి. ఆ మాత్ర ఏదో చెరుపు చేసేదే, లైట్ గ విషప్రయోగం లాంటిది అయి వుంటుంది. తను ఇలాంటివి చాలా కధల్లో చదివింది. ఈ రోజునుంచీ భుజంగరావు ఆ నీళ్ళు తాగకుండా చూడాలి. చాటుగా ఆనీళ్ళు పారబోసి వేరేనీళ్ళు జగ్ లో నింపి పెట్టాలి" అనుకున్న అమల అక్కడ నుంచి కదిలి యింట్లోకి వచ్చింది.

    రాత్రి కావటంతో ఎవరూ అమలని అంతగా పట్టించుకోలేదు.   

 Previous Page Next Page