చంద్రరేఖ, ప్రవీణ, చిట్టి వూర్లోకి వచ్చేటప్పటికి వూరికి దక్షిణం నుంచి మంటలు లేస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే పొగ దట్టంగా కమ్ముకోవడం వలన ఎవరి ఇల్లు కాలుతున్నాయో తెలియడంలేదు.
"కూరగాయల రామయ్య ఇల్లనుకుంటా" అన్నాడు చిట్టి.
"ఆఁ అక్కణ్నుంచే మంటలు"
వాళ్ళు ముగ్గురూ పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకున్నారు. వూరి జనమంతా ఇంటిముందు గుమిగూడిపోయారు. ఆ గందరగోళంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు.
కూరగాయల రామయ్య ఇల్లు అప్పటికే బూడిదయిపోయింది పక్కింటికి అంటుకున్న మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
బిందెలకొద్దీ నీళ్ళను కుమ్మరిస్తున్నారు. రామయ్య భార్య అగ్ని దేవుడ్ని, ఆయన వంశాన్ని తిడుతూ శాపనార్ధాలు పెడుతోంది. కట్టుబట్టల్ని తప్ప ఏమీ మిగల్లేదు పాపం! రామయ్య కంట్లోంచి కన్నీరు కారడంకూడా మంటల వెలుగుల్లో స్పష్టంగా కనబడుతోంది.
చంద్రరేఖ, ప్రవీణ దూరంగా నిలబడిపోయి చూస్తున్నారు. ముందుకు వెళ్ళేందుకు ఇక ఏమాత్రం వీలులేదు. గాలి తోలడం ప్రారంభమైతే కష్టం. అందుకే అందరూ వాయుదేవుడ్ని కరుణించమని మనసులోనే ప్రార్ధిస్తున్నారు. ఎట్టకేలకు పక్కిళ్ళు అంటుకోకుండా చూశారు. మంటల్ని అదుపు చేయగలిగారు. అందరూ ఒక్కసారిగా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
"ఇంతకీ ఎలా కాలింది రామయ్య ఇల్లు" చంద్రరేఖ పక్కనున్న ఒకతన్ని అడిగింది.
"అదే తెలియడంలేదు. రామయ్య భార్య కాంతమ్మ వంట అంతా పూర్తిచేసి పొయ్యిని శుభ్రంగా ఆర్పేసిందట. భోజనాలు ముగించుకుని పక్కింట్లో మాటల్లో వుంటే ఒక్కసారిగా మంటలు పైకిలేచాయి.
"కిరసనాయిల్ దీపం ఏమైనా అంటుకుందేమో" చిట్టి అన్నాడు.
ప్రవీణవేపు చూస్తే ఏదో లెక్కపెడుతున్నట్లుగా అనిపించింది చంద్రరేఖకి.
"ఏమిటి లెక్క పెడుతున్నావ్?"
"ఎన్ని బిందెలు నీళ్ళు పోస్తున్నారా అని లెక్కపెడుతున్నాను మనం వచ్చినప్పట్నుంచి యాభై రెండు బిందెలు పోశారు" కళ్ళు తిప్పుతూ చెప్పింది.
"సరే -వెళదాం పద"
ముగ్గురూ బయలుదేరారు.
రెండడుగులు వేశారో లేదో శశి కనిపించింది.
"ఏమక్కా బావున్నావా?" అంటూ చంద్రరేఖను చూసి ముందుకు వచ్చింది.
"ఆఁ" అందేగానీ ఆమెను నిశితంగా గమనిస్తోంది చంద్రరేఖ.
ఆమె వాలకం ఎబ్బెట్టుగా వుంది.
జాకెట్ కు సరిగా హుక్ లు పెట్టుకోలేదు. దాంతో ఒక పక్క ఎద తెల్లగా మబ్బులు చంద్రుడ్ని సగం కమ్మేసి మిగిలిన సగం వదిలేసినట్టు కనిపిస్తోంది. ఆరోగ్యమంతా అక్కడే తిష్టవేసినట్టు ఆ భాగం గుండ్రంగా నునుపుతేలి వుంది.
చీకటంతా వెన్నెలకు భయపడి అక్కడ దాక్కున్నట్టు కొనతేలిన భాగం నల్లగా కనిపిస్తోంది.
చీర కుచ్చిళ్ళు కూడా సరిగాలేవు. దాంతో బొడ్డు నగ్నంగా దర్శనమిస్తోంది. నడుము చీకటి కొనల్ని కలపడానికి వేసిన వెన్నెల వంతెనలా వుంది.
అంతకు ముందెప్పుడూ శశి ఇలా కనిపించలేదు. ఏమయింది ఈమెకు.
చాలా సహజమైన కోర్కెలను అణచుకోవడంవల్లో లేదా అవి తీరకపోవడంవల్లో చాలా రుగ్మతలు వస్తాయి. సమస్యంతా జ్ఞానేంద్రియాల దగ్గరే వుంటుందని తన డాక్టర్ చెప్పిన విషయం సత్యమని చంద్రరేఖ నమ్ముతుంది. శశి సమస్య తెలుసు.
మరి వాసుని బాగుచేయాలంటే ఒక పద్ధతి ప్రకారం చాలా రోజులు చికిత్స చేయాలి.
మరి వాసు ఏమో తనకి కనబడటంలేదు.
"ఏమిటి శశీ! మీ ఆయన ఎక్కడ?" అనడిగింది ఏమీ మాట్లాడకపోతే బాగుండదని.
"నాకు తెలిస్తే కదా నీకు చెప్పేది?" అని చెప్పి అవతలకి ముఖం తిప్పుకుందామె.
భర్త విషయం ఎత్తేసరికి ఆ బాధ కళ్ళల్లో కదిలి కన్నీళ్ళొచ్చాయని చంద్రరేఖకి తెలుసు. అందుకే ఆమె ముఖం కనబడకుండా చాటు చేసుకుంది.