"ఏమైంది" అడిగాడు సేతురాజు.
"అదిగో చూడు_ ఎర్ర సూట్లో నల్లపంది" బ్యాంక్ పక్కనుంచి అప్పుడే రోడ్డుమీదకొచ్చిన ఓ వ్యక్తిని చూపిస్తూ అన్నాడు పోతురాజు.
"వాడి చేతిలో సూట్ కేసు ఎంత పెద్దదో! రెండు లక్షలుంటాయి" ఎగిరి గంతేశాడు సేతురాజు.
"పద బేటా! అంతా టెన్ మినిట్స్ లో జరిగిపోవాలి" ముందు కురుకుతూ అన్నాడు పోతురాజు.
ఎర్రసూట్లో ఉన్న వ్యక్తి బరువైన సూట్ కేసుతో నడుస్తున్నాడు. నడుస్తూనే మధ్య మధ్యలో అటూ, ఇటూ చూస్తున్నాడు. అతన్ని అనుసరిస్తున్నారు ఇద్దరూ ఫర్లాంగు దూరం వెళ్లాక__
నాలుగురోడ్లు కూడలి వచ్చింది. గబగబా అతని ముందుకెళ్ళి నిలబడ్డాడు సేతురాజు.
"గురువుగారూ! మీ దగ్గర బ్రెయిన్ వుందా" కంగారుగా అనేసి, "సారీ మేచ్ బాక్స్ ఉందా" అని అడిగాడు.
"నో....నో....నాకలాంటి అలవాట్లు లేవు" చిరాగ్గా అన్నాడతను.
"పోనీ ఫైవ్ హండ్రెడ్ రుపీస్ చేంజ్ ఉందా?"
"మన దగ్గర తంతే పైసాలేదు. ఫైవ్ హండ్రెడ్ రుపీస్ ఎక్కడిదిరా?" కోపంగా మెల్లగా అన్నాడు పోతురాజు.
"చేంజ్ కావాలా? అడగరేం" అంటూ ఆ ఎర్రసూట్ వాలా సూట్ కేసుని కిందపెట్టి, కోటులోంచి పర్సుతీసి నోట్లను తీస్తున్న సమయంలో సేతురాజు పోతురాజు వేపుచూసి కన్నుగీటాడు.
పోతురాజు చెయ్యి నెమ్మదిగా కిందకు కదిలింది. సూట్ కేసు పట్టుకుని నెమ్మది నెమ్మదిగా వెనక్కివెళ్ళి పక్కనున్న పార్కులోకి వెళ్ళి పోయాడు అమిత వేగంతో.
"తీసుకోండి ఫైవ్ హండ్రెడ్స్" అంటూ సూట్ కేసువాలా చిల్లర ఇవ్వగా, సేతురాజు చిదానంద స్వాముల వారిలా చిత్రంగా నవ్వాడు.
"ఎందుకలా నవ్వుతున్నారు?"
"సారీ గురూ! నా దగ్గరున్న ఫైవ్ హండ్రెడ్ రుపీస్ ని, ఎవరో దొంగనాయాళ్ళూ కొట్టేశారు. వస్తా!" గబగబా పరుగెత్తి వెళ్ళిపోతున్న అతన్ని చూసి__
"పిచ్చివాడిలా ఉన్నాడే!" అంటూ కిందకు చూసుకున్న ఆ సూట్ వాలా కెవ్వుమని, అదో రకంగా అరిచాడు.
"చోర్...చోర్..." అంటూ ముందుకు పరిగెత్తాడు. కానీ లాభం లేకపోయింది.
"వీళ్ళేక్కడకు పోతారు? వీళ్ళని ఎలాగయినా పట్టుకోకపోతే నాపేరు పేరే కాదు-" అనుకున్నాడతను. అతనే హనీఫా!
౦ ౦ ౦
రహస్యంగా ఆ సూట్ కేసును రూమ్ కి తీసుకొచ్చేసరికి ప్రాణాంతకమైంది సేతురాజు, పోతురాజులకు.
అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్నాడు వీర్రాజు.
"ఏంటిది?" ఆశ్చర్యంగా అడిగాడు వీర్రాజు.
"డబ్బు.....లక్షల్లక్షల డబ్బు...."ఉక్కిరి బిక్కిరైపోతూ చెప్పాడు సేతురాజు.
"డబ్బే...ఇంత డబ్బు ఎక్కడిదిరా?" అంటూ మూలనున్న ఇనుపగుండును తెచ్చి, తాళాన్ని బద్దలు కొట్టాడు వీర్రాజు. సూట్ కేసుని ఓపెన్ చేశాడు సేతురాజు.
అందులో తెల్లగా పాల పొడి ప్యాకెట్లు కనబడటంతో "ఉప్పురా- ఉప్పు ప్యాకెట్లు....మోసపోయాంరా- దారుణంగా మోసపోయాం!" అని దిగులుగా అన్నాడు పోతురాజు.
వీర్రాజు ముందుకు వంగి, ఓ ప్యాకెట్ తీసి, పౌడర్ని రుచిచూశాడు.
"వెర్రి వెధవల్లారా....ఇది ఉప్పు కాదు, షుగర్..." అన్నాడు వీర్రాజు. పోతురాజు కూడా వెంటనే రుచి చూశాడు.
"సుగరైతే తియ్యగా వుండాలి కదరా...." అన్నాడు పోతురాజు, అది తియ్యగా లేకపోవడంతో.
"షుగరంటే, ఆ షుగర్ కాదురా.....దీన్ని బ్రౌన్ షుగరంటారు!" చెప్పాడు వీర్రాజు.
"బ్రౌన్ షుగరంటే, ఇదేనా- బిస్కెట్స్ లా ఉంటుందేమోననుకున్నాను. దీన్ని ఏం చేద్దాం?" అడిగాడు సేతురాజు.
"దీన్ని మనం జాగ్రత్తగా ఏ డ్రగ్ డీలర్ కో అమ్మేవనుకో.....లక్షల్లక్షలు డబ్బు వస్తుందిరా!" చెప్పాడు వీర్రాజు ఆనందోద్రేకంతో.
"డ్రగ్ డీలర్స్....ఎక్కడుంటారు?- లకడీకా ఫూల్లో ఉంటారా?" అడిగాడు సేతురాజు అమాయకంగా.
"నీ శ్రాద్ధం, వాడి పాడి, నా పిండాకూడూనూ.....బ్రౌన్ షుగర్ని ఎలా అమ్మాలో తెలీకపోతే మీరేం దొంగ వెధవల్రా! నాతో రండి....ఎక్కడమ్మాలో, ఎవరికీ అమ్మాలో నేను చెప్తాను. వెళ్ళు - రిక్షాను తీసుకురా పో!" అంటూ గసిరాడు వీర్రాజు.
౦ ౦ ౦
సగం దూరం వరకూ, రిక్షాలో తీసుకొచ్చాక, మరీ చిన్న సందు లోకి రిక్షా దూరకపోవడంతో, ఆ సూట్ కేసును వంతుల వారీగా భుజమ్మీద మోస్తున్నారు వీర్రాజు, సేతురాజులు.
"ఈ ఇరుకు, ఇరుకు సందులేంటో- ఈ మనుషులేంటో...నాకేదో భయమేస్తోందిరా!" పోతురాజు రోడ్డు మీద అక్కడక్కడున్న మనుషుల్ని చూస్తూ అన్నాడు.
"నువ్వు సినిమాల్లో డెన్స్ ని చూడలేదా? అలాంటి డేన్ కే మనం వెళ్తున్నాం- భయపడక!" బీడీ వెలిగిస్తూ అన్నాడు వీర్రాజు.
"ఒరేయ్! ఇక్కడ ఇంతమంది పోలీసులున్నారేంట్రా....అందరూ మనవేపే చూస్తున్నారు!" భయం, భయంగా అన్నాడు సేతురాజు.
"నువ్వు నోర్ముయ్! వాళ్ళు పోలీసులనుకుంటున్నావా?- మారువేషంలోనున్న రౌడీలు!"