"అందుకే అర్చనా అనవసరంగా పిల్లని తీసుకొచ్చి నెగ్లెక్ట్ చేసే కంటే ఈ ఏడాదికి వుండనీ. స్కూలుకెళ్ళే పిల్లకి ఎన్ని చూడాలి. టిఫెన్ బాక్స్ యివ్వాలి - బస్సు వరకూ దిగబెట్టాలి. దగ్గిరుండి చదివించాలి. యివన్నీ ఎవరు చేస్తారు. ఉద్యోగం ఒకటి లేకపోతే నేను హెల్ప్ చేసే దాన్ని-యీ పరిస్థితిలో పూజని యీ ఏడాది అక్కడే కంటిన్యూ చేయనీ." సునీత సలహా యిచ్చింది.
"అవునమ్మా అంత విశదంగా మీ వాళ్ళతో మాట్లాడండి, నువ్వు వూరికే అనవసరంగా టెన్షన్ పెట్టుకోకు." మెహతా మందలింపుగా అన్నాడు.
పరీక్షలయ్యాక పూజని తీసుకొద్దామనుకునే లోపల అర్చన నెల తప్పింది. మొదటి రెండు నెలలు మంచినీళ్ళు తాగినా వాంతి అయిపోతూ చిక్కి శల్యమైంది.
మూడో నెల వచ్చిందగ్గరనించి కొత్త కాంప్లికేషన్ పట్టుకుంది. బ్లీడింగు పట్టుకుని ధ్రెటెన్ ఎబార్షన్ ప్రాబ్లమ్ అయింది. డాక్టరు కంప్లీట్ గా పక్కమీదనించి కదలడానికి వీలులేదు అంది. వాంతులు నీరసం బ్లీడింగ్, యివన్నీ చూసి అర్చన పేషంట్ అయిపోయింది. ఇలాంటి స్థితిలో అర్చనను చూసుకోలేక, అటు ఆఫీసుకి ఎక్కువ రోజులు శలవు పెట్టలేక యిబ్బంది పడుతున్న రాజేష్ అవస్థకితోడు పాపని తీసుకొస్తే మరింత అవస్థవుతుందని ఈ ఏడాదికి అక్కడే వుండనీయడం మంచిదని అందరూ నిర్ణయించారు. ఫోనులో పరిస్థితి చెప్పాడు రాజేష్. "అయ్యో. అలాగా అర్చనని జాగ్రత్తగా ఉండమను పూజదేంవుంది. మా దగ్గిర నుంచి అసలు వెళ్ళననే అంటుంది. మేం చూసుకుంటాం దాని విషయం తనకేం బెంగవద్దని చెప్పు. ఇంకో ఏడాది మీ అమ్మాయి మా దగ్గిరుండటం అంటే మాకు మరింత సంతోషం.....డెలివరీ అదీ అన్ని అయి అర్చన మామూలు అయ్యాక తీసుకెళ్లచ్చులేబాబూ" అంది శకుంతలాదేవి.
* * *
అర్చనకి మగపిల్లాడు పుట్టాడు చివరివరకు ఏదో ఒక కాంప్లికేషన్ తో ఆసలు గర్భం నిలుస్తుందా లేదా అన్నట్టు దిన దిన గండంలా అయి ఆఖరికి టైముకు ముందుగానే డెలివరీ అయి బాబు పుట్టాడు. చాలా బలహీనంగా 5 1/2 పౌండ్లు పుట్టిన బిడ్డని నెలా రెండు నెలలు జాగ్రత్తగా చూడాలన్నారు. అర్చన జబ్బుతో చాలా నీరస పడిపోయింది.......పురిటి వేళకి వదినగారు వచ్చి నెలరోజులు ఎలాగో ఉండి వెళ్ళింది. ఆవిడకి పిల్లలు, సంసారం. పక్కన సునీత ఉండి ఎంతో సహాయం చేసి వెళ్ళింది. యింట్లో పనిమనిషి సాయంతో రాజేష్ ఆడపని మగపని అన్నీ చేసుకుంటూ అవస్థ పడ్డాడు.
"ఏమిటో పాప అప్పుడు ఏ ప్రాబ్లెములేదు? యిప్పుడిలా అయింది ఎందుకో అంది అర్చన.
"ఏదో ఆఖరికి అంతా సవ్యంగా అయింది అంతే చాలు యింక చాలు బాబూ, పిల్లలూ వద్దు ఏం వద్దు - నిన్ను ఈ తొమ్మిది నెలలుచూస్తే మళ్ళీ లేస్తావా అని భయమేసింది అసలు. థాంక్ గాడ్. యింక చాలు బాబూ..." అన్నాడు రాజేష్.
"ఆ-శ్మశాన వైరాగ్యం అంటే యిదేలే. మళ్ళీ ఏడాది గడవగానే కూతురు కావాలంటావు అర్చన నవ్వి అంది.
"కూతురిందిగా. ఒక ఆడపిల్ల, మగపిల్లవాడు యిద్దరున్నారుగా యింక చాలు బాబూ "మనస్ఫూర్తిగా అంటున్న రాజేష్ వంక కృతజ్ఞతతో చూసింది అర్చన. పూజని తన స్వంతబిడ్డగానే అంగీకరించి ఒక కూతురుంది చాలు అనగలిగిన అతని మంచితనానికి అర్చన మనస్సులోనే నమస్కరించింది. ఈ తొమ్మిదినెలలు తనని పసిబిడ్డలా సాకిన అతని అనురాగానికి ఆమె మరింత కట్టుబడిపోయింది. ఏ తల్లీ చేయలేనంతగా సేవలు చేసిన అతనికి నేనేంయిచ్చీ రుణం తీర్చుకోను అని పదే పదే అనుకునేది నా అదృష్టం ఇలాంటి భర్త దొరకడం అని మరోసారి అనుకుంది అర్చన.
* * *
"అర్చనా, 'సెంట్ ఏన్స్'తో సీటు యిస్తానని ప్రామిస్ చేసింది ప్రిన్సిపాల్. పరీక్షలవగానే టి.సి. తీసుకొని తీసుకొచ్చేస్తేసరి" అన్నాడు రాజేష్.
"అమ్మయ్య సీటు దొరికిందిగదా! యింకేం ఫరవాలేదులే" అంది అర్చన. బాబుకి ఆరోనెల వచ్చింది. డెలివరీ అయ్యాక మూడు నెలల్లో పూర్తిగా తేరుకుంది అర్చన. ఇంక పూజని అక్కడుంచకుండా తీసుకొచ్చేయడం మంచిది మొన్న అత్తగారు ఫోనుచేస్తూ మాటల్లో తను పూజకి స్కూలు సీటుకోసం ప్రయత్నిస్తున్నానంటే 'పూజ యిక్కడే వుంటానని మారాం చేస్తోంది. ఢిల్లీ వెళ్ళను మామ్మా!' అంటూ అల్లరి పెడుతోంది అర్చనా" అంది ఆవిడ.
"అదేమిటి? ఏం ఎందుకు రానంటుంది. యిప్పటికే ఆలస్యం అయింది. యిన్నాళ్ళు యిలా దానికి దూరంగా వుండడానికి నా మనసు కొట్టుకుంటూంది. వంట్లో బాగుండకతప్పక వుంచాను. కాని నా ప్రాణం అంతా అక్కడే వుంది. ఎందుకు రానంటోంది" అర్చన అనుమానంగా అడిగింది ఫోనులో. ఆవిడ ఒక్కక్షణం మౌనం వహించి "ఏమో ఏమిటో మరి-మా దగ్గర చేరిక అయింది అందుకేనేమో - దానికిక్కడ బాగా ఫ్రెండ్స్ అయ్యారు అందరూ. అందుకేనేమో - దాని మాట ఏమోగాని దాన్ని వదిలి మేం ఎలా వుండాలో అర్ధంగావడం లేదు ఈ నాలుగేళ్ళలో మా కంట్లో పాప అయిపోయిందది" ఆవిడ గొంతులో బాధ సుళ్ళు తిరిగింది. పెంచిన మమకారం అర్చనకి అర్ధం అయినా, కన్నాకూతురిని ఇంకా దూరం చేసుకోవడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. అర్చన మౌనం అర్ధం అయి శకుంతలాదేవే "అఫ్ కోర్సు, అలా అని దాన్ని నీకు దూరం చేసి మా దగ్గరే వుంచుకోలేం అనుకో, తల్లి ప్రేమ ఎరగనిదాన్నికాదు" అంది.
"ఏమిటో ఈ చదువు. వెంటనే పెళ్ళి, బాబు పుట్టడం. యిలా ఏదో ఆటంకాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి దాన్నలా వదిలాను. అదేనేమో నా తప్పు" అర్చన నొచ్చుకుంటూ అంది.