"ఇంక మీడాడి వుండరమ్మా! మన దగ్గిర, యీ కొత్త డాడియే వుంటారు."
"ఎందుకు, మాఫ్రెండ్సుకి ఎవరూ కొత్త డాడీలు లేరు" పూజ కళ్ళు తిప్పుతూ అసంతృప్తిగా అంది.
"మీ డాడి బాడ్-నన్ను తిట్టికొట్టారని నేను కొత్త డాడిని తెచ్చుకున్నాను" అర్చన యింకేం చెప్పాలో తెలియక అంది, పూజ నమ్మనట్టు చూసింది.
"ఏం కాదు. మాడాడి మంచి, ఎప్పుడు వచ్చినా నాకు బొమ్మలు, గౌనులు, పుస్తకాలు తెచ్చిస్తారు."
"పూజా....చూడమ్మా నీవు చిన్నపిల్లవి, నీకు యిప్పుడే చెపితే అర్ధంకాదు. పెద్దయ్యాక నీవు నా అంత పొడుగవుతావు చూడు అప్పుడు చెపుతా కొత్తడాడి ఎందుకు వచ్చారో.....ఏం, బి ఎ గుడ్ గర్ల్ అండ్ స్లీప్ నౌ...' అంది. పూజ తల్లి మొహం చూసి ఏం అనుకుందో యింకేం అడగలేదు. ఓ పావుగంట గడిచాక పూజ నిద్రపోయిందని గుర్తించి నెమ్మదిగా లేచి బయటికి వచ్చింది-అత్తగారు తలుపులన్నీ వేస్తూ.....' పూజ లేస్తే నేను చూసుకుంటానులే, నీవు వెళ్ళు పడుకో, చాలా రాత్రయింది' అంది.
అర్చన రాజేష్ పడుకున్న గదిలోకి వెళ్ళేసరికి రాజేష్ పుస్తకం చదువుతూ అర్చన కోసం ఎదురుచూస్తున్నారు. అర్చన గదిలోకి రాంగానే 'పూజ పడుకుందాం...' అన్నాడు. "పోనీ యీ పూటకి అక్కడే పడుకోపోయావా, రాత్రి లేచి నీ కోసం చూస్తుందేమో" అన్నాడు మళ్ళీ.
"ఫరవాలేదు-అది సాధారణంగా రాత్రి లేవదు. లేచినా బాత్ రూము వెళ్ళి పడుకుంటుంది. వాళ్ళ మామ్మ ఆ గదిలోనే పడుకుంటారు. ఆవిడ దగ్గిర దానికి బాగా అలవాటే' అంది.
"అర్చనా, పూజ బాగా పెద్దదయింది. నన్ను డాడి అంటే అంగీకరించలేదు చూశావా, చిన్న పిల్లయినా నేను వాళ్ళ డాడీని కాను అన్నది తెల్సుకుంది. తరువాతయినా నాతో చనువుగా వుంటుందంటావా-' సాలోచనగా అన్నాడు. అతని గొంతులో కాస్త బాధ తొంగిచూసింది. అర్చన వచ్చి రాజేష్ పక్కన కూర్చుని.... "ఛా....చిన్నపిల్ల దాని మొహం దానికేం తెలుసు. కొత్తగా మొదటి రోజు కనక ఏదో అనుకుంది అర్ధంకాక. నాల్గు రోజులుంటే దానికే అలవాటవుతుంది. అసలు నీవన్నట్టు నేనే పొరపాటు చేశానెమో ననిపిస్తూంది. దాన్ని యిక్కడ వదలడం-చిన్నప్పటి నించి దాని తండ్రి ఎవరో తెలియకపోతే నిన్నే డాడి అంటే నమ్మేసేది. ఇక్కడ వుండడం, వాళ్ళ నాన్న వచ్చి పోతూండడంతో దానికి వాళ్ళ నాన్న ఎవరో తెల్సింది. అందుకే నీవు డాడి అనగానే కాదని అనేసింది. నాల్గు రోజులు పోతే అదే అర్ధం చేసుకుంటుందిలే.' అంది తేలిగ్గా అన్నట్టు రాజేష్ మనసు నొచ్చుకుంటుందేమోనని రాజేష్ నిట్టూర్చి "లెటజ్ హూప్ సో-" అన్నాడు.
రాత్రి వంటిగంటకి బాత్ రూముకని లేచిన పూజ తల్లి తన పక్కన లేకపోవడం చూసింది. రెండో మంచం మీద మామ్మ పడుకుని వుంది. అమ్మేది అనుకుంటూ గదిలోంచి బయటికి వచ్చింది. రెండో బెడ్ రూము లోకి వెళ్ళి చూసింది. అ గదిలో తాతగారు ఒక్కరే కనిపించారు. గెస్టు బెడ్ రూము వైపు వెళ్ళి తలుపు వేసి వుండడం చూసి, కిటికీ దగ్గిరకెళ్ళి కర్టను పక్కకిలాగి చూసింది. గదిలో బెడ్ లైట్ వెలుగులో ఒకే మంచం మీద ఒకరి కౌగిలిలో ఒకరు వదిగి నిద్రపోతున్న అర్చన.....రాజేష్ లని చూడగానే గతుక్కుమంది. ఆ క్షణంలో ఆ అర్దరాత్రి ఆ పసి మనసులో ఏ భావాలు చెలరేగాయో అర్చనకి తెలియదు. ఆ పసి మనసు ఆ దృశ్యం చూసి ఎలా కల్లోల పడిందో ఎవరికీ తెలియదు.
ఉదయం ఊరికి బయలుదేరే ముందు అర్చన పూజతో 'పూజ, శలవులీయగానే మా దగ్గిరికి వచ్చేద్ధువు గాని, పరీక్షలవగానే వచ్చి తీసికెడతాం. ఏం, మరి వెళ్ళి వస్తాం. మామ్మగార్ని, తాతగారిని అల్లరి పెట్టకు' అంది ప్రతిసారి లాంటి అప్పగింత మాటలు చెపుతూ. పూజ ప్రతిసారిలా తల్లికి ముద్దులు యిచ్చి టాటాలు చెప్పకుండా మూతి బిగించి తల్లి వంక మిడుకూ మిడుకూ చూసింది. పూజ మొహంలో హావభావాలు అక్కడున్న ఎవరూ గుర్తించలేదు. పట్టించుకోలేదు-రాజేష్ పూజ దగ్గిరకి వచ్చి భుజం చుట్టూ చెయ్యివేసి ప్రేమగా 'బై పూజా.....పరీక్షలవగానే ఢిల్లీ వచ్చేద్దువుగాని.....ఓకే.....అన్నాడు" పూజ అతని చేతిని భుజం మీద నించి తీసేసి చటుక్కున మామ్మ దగ్గిరకి వెళ్లిపోయింది. ఆ చర్యని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు ఆ రోజు.
6
"ఇప్పుడు నీ హెల్త్ ముఖ్యం అర్చనా.....డాక్టరు బెడ్ రెస్ట్ అన్నప్పుడు వంటా అదీ చేయకుండా పక్కమీద పడుకోవాల్సిన పరిస్థితిలో పాపని కూడా తీసుకొచ్చి యిబ్బంది పడడం, పెట్టడం ఎందుకు. అక్కడ అలవాటేగా వుండనీ. డెలివరీ అదీ అయ్యాక తీసుకురావచ్చు, సునీత అంది.
"కానీ....అత్తగారూ వాళ్ళేం అనుకుంటారో.....పూజ పాపం డిసపాయింట్ అవుతుందేమోనని చూస్తున్నాను..." అర్చన సందిగ్ధంలో పడి అంది.
"అందుకే తీసుకు వచ్చేద్దాం అన్నాను గదా, మనతో పాటే తనూను. ఏదో కొన్నాళ్ళు యిబ్బంది పడాలి మరి..." రాజేష్ అన్నాడు.
"అమ్మని పిలిపిద్దాం అంటే ఆవిడ అసలు ఆయాసంతో పక్కమీద నించి లేవలేకపోతోందిట."