"అబ్బే! దాందేముంది. పిల్లలని ఎవరు చేరదీస్తే వాళ్ళకి చేరిక అయిపోతారు. నాలుగు రోజులు మమ్మల్ని మిస్ అవుతుంది. ఎడ్జస్ట్ అయి పోతుందిలే" వూరడింపుగా అంది ఆవిడ.
"సరే, దాని పరీక్షలు అవగానే వస్తాను. దాన్ని మీరు ఈలోగా మెంటల్ గా ప్రిపేరు చెయ్యండి."
"సరే.....ఆ.....అర్చనా యింకో విషయం. ఈ ఎండాకాలం సెలవుల్లో వాడికి పెళ్ళి. సంబంధం కుదిరింది.'
"ఆహా! అలాగా సంతోషం. ఎవరి పిల్ల" సంతోషంగానే అంది అర్చన.
"మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళులే. పిల్ల ఓమాదిరిగా వుంటుంది. పనీపాటా బాగా వచ్చు. మెట్రిక్ వరకు మాత్రం చదువుకుంది. కాస్త లేనింటి పిల్లే కావాలనుకున్నాను. నే చెప్పానుగా నీకు."
"పోనీలెండి. ఈసారన్నా ఆయన సుఖపడగలిగితే అంతకంటే మనందరికి కావల్సిందేముంది" అర్చన మనస్ఫూర్తిగా అంది.
"అర్చనా! యింకో చిన్నమాట. మొన్న వాడు పెళ్ళి కుదిరాక, పెళ్ళయ్యాక పూజని నాతో తీసికెడతానన్నాడు."
"ఆ.....అదేమిటి....అదేమిటి" అర్చన గాభరాగా అరిచినట్టే అంది. "మీరెలా ఒప్పుకుంటారు?"
"నే ఒప్పుకున్నానని అన్నానా! వాడడిగాడని అన్నానంతే! నా కూతురు, నా హక్కు అదెవర్తి అని ఎగిరాడు కాసేపు. నేనూ ఆయనా వాడిని కేకలేశాం అనుకో.....నడిరాత్రి పిల్లని, పిల్ల తల్లిని వీధిలోకి నెట్టిన వాడికి హక్కు ఏమిటని ఆయన మందలించారు. ఆడపిల్ల తల్లి దగ్గర పెరగాలి. తల్లి వుండగా సవితి తల్లి బాధలు అది పడడానికి మా ప్రాణం ఒప్పదు. ఐనా ఎవరి పాటికివాళ్ళు పెళ్ళిచేసుకున్నప్పుడు ఎవరి పిల్లలని వారు కనడం, పెంచుకోవడం నయం-నీకు దాన్ని తీసుకెళ్ళాలని వున్నా నీ రాబోయే భార్యకిష్టం వుండొద్దూ. అనవసరంగా లేనిపోని గొడవలు తెచ్చుకొని ఈసారీ సంసారం పాడుచేసుకోకు అని నచ్చచెప్పాంలే."
"థాంక్స్....అత్తయ్యా....మీరు నా తరఫున వుండబట్టి నేనీనాడు యిలా వున్నాను. మీకు థాంక్స్ చెప్పాలి. ఏమిటో యిటు రాజేష్, అటు మీరు. మీ అందరి ఆదరణ చూస్తుంటే నాకు నేనెంత అదృష్టవంతురాలిని అనిపిస్తుంది. వుంటా అత్తయ్యా. పాపకి నచ్చచెప్పే బాధ్యత మీదే మరి..." ఫోను పెట్టేస్తూ అంది అర్చన.
"ఏమిటి పాపకి నచ్చచెప్పడం అంటున్నావు..." వింటున్న రాజేష్ అడిగాడు. తమ సంభాషణ అంతా చెప్పింది అర్చన.
"ఏమిటో పూజ వరస చూస్తే మన దగ్గర ఎడ్జస్ట్ అవుతుందా అనిపిస్తూంది. యిన్నాళ్ళు వదిలి చాలా పొరపాటు చేశావు అర్చనా...' మరోసారి అన్నాడు రాజేష్.
ఈసారి 'చిన్నపిల్ల దాని మొహం' అని తేలిగ్గా అనలేకపోయింది అర్చన.
* * *
రాజేష్ ఆఫీసునుంచి వచ్చేసరికి అర్చన దిగులుగా కూర్చుని కనిపించింది. "ఏమయింది అర్చనా, అలా వున్నావేమిటి?" ఆరాటంగా అడిగాడు.
"పాపం శకుంతలా దేవిగార్కి....అదే మా అత్తగార్కి థ్రోట్ కాన్సర్ అన్నారుటండి-ఇంకో ఆరు నెలల కంటే బతికే అవకాశం లేదన్నారుట డాక్టర్లు. మామగారు చాలా వర్రీ అవుతూ ఫోనులో చెప్పారు. పాపం అంత మగాయన ఫోనులో ఏడ్చేశారు."
"అయ్యో...అలాగా...సచ్ ఎనైస్ లేడీ.....ఆవిడకా యీ జబ్బు....డాక్టరయి వుండి యిన్నాళ్ళూ ఎలా తెలుసుకోలేకపోయారు?"
"అసలు కిందటి మాటే చాలా నీరసంగా కనిపించారు. బాగా దగ్గుతూ కనిపిస్తే అడిగితే జలుబు దగ్గు పట్టుకుని వదలడం లేదన్నారు. ఏదో మామూలు అని నిర్లక్ష్యం చేశారుట. నే వెళ్ళి చూసిరానా?"
"తప్పకుండా వెళ్ళు.....వాళ్ళిద్దరూ మనపట్ల అంత అభిమానం, ఆదరణ చూపించారు. తప్పకుండా వెళ్ళాల్సిందే. వెళ్ళి చూసి, ధైర్యం చెప్పిరా. అంతకంటే మనం చెయ్యగల్గింది ఏముంది" నిట్టూర్చి అన్నాడు.
"మీరూ వస్తారా..."
రాజేష్ ఒక్క క్షణం ఆలోచించి "నేను ఎందుకులే. ఒకవేళ ఆ సమయానికి గనక రావే అక్కడ వుంటే ఎంబ్రాసింగ్ గా వుంటుంది. ఐనా నాకు మీటింగులు అవి వున్నాయి. అసలు శలవు దొరకదు కూడానూ."
"నాకూ అదే భయంగా వుంది. ఆయనావేళకి అక్కడుంటే.....ఎదుట పడాలంటే ఏదోలా వుంది" బిడియంగా అంది.
"ఒక్కపూట వెళ్లి చూసి వచ్చేద్దూ. నీవు వెళ్ళేసరికి వుండకపోవచ్చు. ఈపాటికి అపుడే వచ్చి చూసేవుంటారు. కొడుకు కదా ముందే చెప్పి ఉంటారు. వున్నా.....దొంగతనం ఏం కాదుగా పబ్లిక్ డైవోర్సు ఇచ్చి పెళ్లి చేసుకున్నావు. భయపడడానికి ఏముంది" బూట్లు విప్పుకుంటూ ఆగి, "అసలు ఎలాగూ యింకో పదిరోజులలో పూజ కోసం వెళ్ళాలని అనుకుంటున్నావుగదా! యింకో నాలుగైదురోజులు పోయాక బయలుదేరితే పూజ పరీక్షలు అవగానే వెంటపెట్టుకు రావచ్చు. అసలే ఆవిడ ఆరోగ్యం బాగులేదు. యింట్లో పూజని చూసేవాళ్ళెవరూ ఉండరు. వెంటనే నీతో తీసుకొచ్చేయి" అన్నాడు. అర్చన అంగీకారంగా తల ఊపింది.
* * *
ఈ ఏడాదిలో శకుంతలాదేవి ఎంతలా మారిపోయిందో చూసి ఆశ్చర్యపోయింది అర్చన. ఆవిడ గుర్తుపట్టనంతగా నల్లబడి, కళ్ళకింద నల్లటి చారలు, జుట్టంతా పలచబడి, శరీరంలో మాంసం హరించిపోయి నట్టు పుల్లలా శరీరం....రోగం ఆవిడని ఎంతలా పీల్చి పిప్పిచేసిందో ఎవరూ చెప్పకుండానే గ్రహించింది అర్చన. ఆమెని ఆ స్థితిలో చూడగానే అర్చన గుండె గొంతులోకి వచ్చినట్టు దుఃఖం గొంతులోకి తన్ను కొచ్చింది. "ఏమిటి యిలా అయిపోయారు అత్తయ్యా! యింతలా అయ్యేవరకు నాకు చెప్పలేదే-" పట్టుకున్న గొంతుతో అంది.