అతడు ఒక్కక్షణం దోషిలా తలదించుకుని నిలబడ్డాడు. తరువాత శారదముందు భార్య అలా అవమానించడంతో మగ అహం తలెత్తింది. ధైర్యం కూడదీసుకుని "శారదా నీవు వెళ్ళు..." అంటూ తలుపుతీసి ఆమెని పంపించాడు. వెనుదిరిగి వచ్చిన మాధవ్ ని చూసి రాధ గుండె ఆవేశంగా ఎగిరిపడింది. "నా కళ్ళు కప్పి నా యింట్లోనే ఇంత నాటకం ఆడుతున్నారన్నమాట- అభం శుభం తెలియని ఆ శారదే దొరికిందా మీకు, ఆ అమ్మాయిని యిలా చెయ్యడానికి మీకు మనసెలా వప్పింది... హు! ఎవరో బలవంతంగా నామీద అత్యాచారం చేస్తే నేను అపవిత్రం అయ్యానని నన్ను తాకలేదే మీరు... యిప్పుడు మీరు తెలిసీ కావాలని దొంగచాటుగా చేసిన యీ పనిని ఏమంటారు! మీరేంచేసినా మీరు పురుషులు కనక అపవిత్రులవరా? చెప్పండి! నా తప్పు లేకపోయినా నన్ను శిక్షించారు దూరంచేసి. యిప్పుడు తెల్సి మీరు చేసిన ఈ పనికి నేను మిమ్మల్నేం చెయ్యాలి చెప్పండి..." ఆమె అన్నాళ్ళ కసి, ఉక్రోషం అతడిని కడిగేసి జవాబు చెప్పమన్నట్టు చూసింది. జవాబుకి తడుముకున్నాడు మాధవ్.
"ఏం, జవాబు చెప్పలేకపోతున్నారా పాపం... నా కళ్ళుకప్పి నా వెనక యింత నాటకం ఆడుతున్న మీకు ఏ తప్పు అంటదా... యిలా చేశారేం అని అడిగే హక్కు నాకు లేదంటారా?... ఏదో యింకా పాపం సంసార సుఖానికి దూరమయి బాధపడ్తున్నారని జాలిపడ్డాను యిన్నాళ్ళు. మీరింత తెలివిగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ఊహించలేకపోయాను. ఆ అమాయకురాలు శారదని ఎందుకు పాడు చేశారు, యిప్పుడు పిన్నిగారికి నేనేం చెప్పను? ఇంక శారద గతి ఏమవుతుంది... జవాబు చెప్పండి..." క్రోధంగా అడిగింది.
ఆమె నిలేసిన తీరు చూసేసరికి అతని మగ అహం మేల్కొంది.
"నీకు నేను జవాబివ్వవలసిన అవసరంలేదు. నేనూ మనిషిని, మగాడిని. పట్టుమని ముప్ఫైఏళ్ళన్నా లేని ఈ వయసులో ముసలివాడిలా ఎలా వుండగలననుకున్నావు? కోరికలుండవనుకుంటున్నావా... నీకు చెప్పి చేయాలా అన్నీ... నా ఇష్టం, మగవాడిని ఏమన్నా చేస్తాను" బింకంగా అన్నాడు.
"ఓహో... తమరు మగవారు కనక కోరికలుంటాయి. అవి తీర్చుకోవడానికి అడ్డదారి తొక్కినా ఫరవాలేదన్నమాట. నేను ఆడదాన్ని కనక నాకు కోరికలు వుండరాదు. వున్నా తీర్చుకోరాదు. తీర్చుకున్నా మొగుడు దయ చూపితే తీర్చుకోవాలి. అవునా, మీలాగే నేనూ మీరు దగ్గిరికి రావడంలేదని యింకోడి దగ్గిరకి వెళితే వూరుకునేవారా?" వ్యంగ్యంగా అంది.
"ఏం మాట్లాడరేం... నేను చెయ్యని నేరానికే నన్ను శిక్షించారు. యింక మీలా ప్రవర్తిస్తే వూరుకుంటారా? ఏం, నీతి నియమాలు నాకు మాత్రమే కావాలా? శీలం, పవిత్రత అన్నీ నాకేనా, మీకవేం అక్కరలేదా? మీరు యింకో స్త్రీ పొందుకోరినా అపవిత్రులు అవరా?" రాధలో యిన్నాళ్ళు పేరుకున్న క్షోభ, కక్షతో మాటలు తడబడగా ఆవేశంగా అడిగింది.
మాధవ్ ఇంతసేపటికి నిలదొక్కుకున్నాడు. ఎలాగూ తెల్సిందని నిర్లక్ష్యంగా "అయితే ఏమిటంటావు? ఏం చేస్తావు నన్ను?" హేళనగా అడిగాడు.
"నేనేం చేస్తానండి. ఆడదాన్ని... అసహాయురాలిని మిమ్మల్ని నేనేం చేయగలనండి? మీరంటే నానీడ పడకుండా జాగ్రత్తపడి నన్ను దూరం చేశారు. మీ భార్యని, మీ నీడలో మీరు తన్నినా పడుండవలసినదాన్ని. మీరేం చేసినా అదేం అని ప్రశ్నించే అధికారం లేని భార్యని, నేనేం చెయ్యగలను?" రాధ వ్యంగ్యంగా అంది కళ్ళల్లో నీరు చిమ్ముతూంటే.
"ఏం చెయ్యలేవని తెల్సుకనక ఈ గొడవ ఎందుకు? నా దారికి అనవసరంగా అడ్డురాకు... నీ జోలికి నేను రాను, నా జోలికి నీవు రాకు..." నిష్కర్షగా అన్నాడు.
"అంటే, మీరు ఏం చేసినా చూసీ చూడనట్టూరుకోవాలా?"
"అంతే. కాదంటే..."
"కాదంటే, యింట్లోంచి వెళ్ళమంటారు అవునా... వెడతానండీ, ఎంత మీరు నా మొహం చూడడం మానేసినా, మీకింకా భార్యగా చలామణీ అవుతున్నాను. ప్రేమించి పెళ్ళాడారు... నా కళ్ళముందే మీరు ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తానని నిష్కర్షగా చెపుతూంటే చూస్తూ భరించేశక్తి నాకులేదు. కాని మీకు నమస్కారం పెడతాను. ఆ శారదని అలా బతకనీండి. ఆ అమ్మాయి జోలికి వెళితే మాత్రం వూరుకోను. మంచిచెడ్డా తెలియని ఆ పిల్ల జీవితం మాత్రం నాశనం కానీను. అదిమాత్రం గుర్తుంచుకోండి... మీకు కావాలంటే వూర్లో మీకు నచ్చే ఆడవాళ్ళు చాలామందే దొరుకుతారు. వెళ్ళి కోరికలు తీర్చుకోండి. అంతేగాని శారద జోలికిమాత్రం వెళ్ళడానికి వీలులేదు. ఆ అమ్మాయి జీవితం నాశనం కావడానికి వీలులేదు..." నిష్కర్షగా తెగేసి చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రాధ. మాధవ్ కోపంగా పళ్ళు కొరికాడు.
18
శారద జీవితం నాశనం కాకుండా ఏం చెయ్యాలా అని రాత్రంతా ఆలోచించింది రాధ. కాని అప్పటికే శారద నిండా మునిగిందని గుర్తించలేకపోయింది.
ఆ మర్నాడే పార్వతమ్మ గుండెలు బాదుకుంటూ "రాధమ్మా... చూశావమ్మా మీ ఆయన ఎంత ఘోరం చేశాడో... మా పిచ్చిమొద్దు శారదని..." ఆవిడ యింక చెప్పలేనన్నట్టు కింద కూలబడింది.
రాధ నిర్వీణురాలై చూసింది. పార్వతమ్మగారికీ ఈ విషయం తెల్సిపోయిందన్నమాట! శారద చెప్పిందా!... ఎలా తెల్సింది... ఇప్పుడావిడికి ఏమని చెప్పడం... రాధ మొహం పాలిపోయింది. "ఏం జరిగింది పిన్నిగారు..." అని మాత్రం అనగల్గింది.
"ఇంకా ఏ జరగడమేమిటమ్మా తల్లీ... నిలువునా నా కొంప ముంచాడమ్మా మీ ఆయన. ఏదో బుద్ధిమంతుడనుకున్నాను. చెల్లెలులా చూసుకుంటున్నాడనుకున్నాను. మన వెనకే ఇంత చేస్తాడనుకోలేదమ్మా... ఇప్పుడు నాకేం దారి రాధమ్మా... దాన్నేం చెయ్యను, నాకు కాళ్ళుచేతులు ఆడ్డంలేదు..." ఆవిడ ఏడవసాగింది.
రాధ బిత్తరపోయింది. ఆవిడ మాటలకి అర్థం తెలియగానే ఒక్కక్షణం గుండె ఆగినట్లయింది. "పిన్నిగారూ, సరిగా చెప్పండి... ఎవరు చెప్పారు మీకు... ఏం జరిగిందో..."
"ఇంకేం చెప్పాలే అమ్మా... శారద నెల తప్పిందే అమ్మా. నేనో పిచ్చిముండని, నీ పురుడు హడావిడిలో అదీ నెల బయటుండలేదనే గుర్తించలేదే పిచ్చిమొహాన్ని... వారం రోజులనించి శారద తిండి సయించడం లేదు అంటూ లేచిపోతూంది. మొన్న, నిన్న రెండు వాంతులయ్యాయి. పైత్యం చేసిందనుకున్నను. ఇవాళ మళ్ళీ అయ్యాయి. ఎప్పుడూ పక్కమీదపడి నిద్రపోతూంది. దానివాలకం చూసి చటుక్కున అనుమానం వచ్చిందే అమ్మాయి... శారదని అడిగానే..."